Menu Close
SirikonaKavithalu_pagetitle

జ్ఞాపకం --- గంగిశెట్టి ల.నా.

తనేం మనిషో!!
కదిలిపోయే జ్ఞాపకాల ప్రవాహం
తనేం మనిషి?
ఒక్క జ్ఞాపకం ఊసూ లేదు
తనూ మనిషి!
తనకూ జ్ఞాపకాలున్నాయి...

జ్ఞాపకం మనిషికి నిర్వచనం
జ్ఞాపకం మనిషికి నిలువుటద్దం

జ్ఞాపకం ―
మనిషితనానికి మరోరూపం!
జ్ఞాపకం –
మనసుబలానికి నికషోపలం!

జ్ఞాపకం
ఓ శరతల్పం
జ్ఞాపకం
ఓ పూల నికుంజం

లోకమిచ్చే ద్వంద్వాల కలబోత
లోలోపలి ద్వంద్వాల వడబోత

జ్ఞాపకం
నేటి నా చిరునామా
జ్ఞాపకం
రేపటి నా పంచనామా

అంతమయ్యే జ్ఞాపకం జీవితం
అంతంలేని అనుభవం జ్ఞాపకం!!

(చివరి వాక్యాలు పూర్వమే ఎందులోనైనా పెట్టి ఉండి, రిపీట్ అయివుంటే క్షంతవ్యుణ్ణి!)

చందాకోసము --- డా. వజ్జలరంగాచార్య

చందాకోసము వచ్చుభక్తజన విశ్వా
సమ్ములేమేరకో
చందాయివ్వక తప్పదన్న జులుమున్
సంధింతు రిక్కాలమున్
విందుల్ నాట్యవినోదగానసభలున్
వెచ్చించి పైకమ్ముతో
కందోయిన్ గనలేనిదృశ్యములతో
కాన్పింత్రు, సద్భక్తిదే?

ఒకటే దోషము వాదులిద్దరనరే
యొప్పంచు ,తప్పంచు నా
సకలంబున్ విని ప్రాడ్వివాకుడట
సారమ్మంచు తీర్పీయగా
వికలుండైన పరాజితుండు మరలన్
పెన్కోర్టు కేగంగ, మా
రక శిక్షల్ వడి మారు, గెల్చినదియే
రాణించు న్యాయమ్ముగా

నువ్వేలేకుంటే...... --- రాయదుర్గం విజయలక్ష్మి

నిన్ను చేతుల్లోకి తీసుకోగానే
మనసంతా నిండిపోతావు...
క్షణంలో లోకాన్ని మరిపిస్తావు
దేశాలన్నీ తిప్పి తీసుకువస్తావు
ఎన్నెన్నో విభిన్నాంశాలను ఒక్కసారే బోధిస్తావు
ఏడేడు పధ్నాలుగు లోకాలను
ఒక్కక్షణంలో కళ్ళముందుకు తెచ్చేస్తావు
కిటికీలు  మూసిన గదిలోనైనా మలయానిలంలా సేదతీరుస్తావు
ఎడారిలోనైనా రంగురంగుల పూలను పూయిస్తావు
కనులమీదికి కలత నిదురను చేరనీయవు
పెదవులపై చిరునగవును చెదరనీయవు
ఏపని చేస్తున్నా మదినుండి చెదరిపోవు
లౌకికజీవనంలోనే పారలౌకికానుభూతిని కలిగిస్తావు
లాలించే అమ్మపాటలా,
ధైర్యాన్నిచ్చే నాన్నమాటలా,
జీవితాన్ని ఉత్సాహంతోనింపేస్తావు
అంతరంగాలను వెలిగించే అక్షరమా!
నాలో చైతన్యాన్ని జాగృతం చేసిన శారదా రూపమా!!
నువ్వేలేకుంటే ఈ లోకం ఎంత నిస్సారంగా ఉండేదో!
లోకాలను ప్రకాశింపజేస్తునావు !
శూన్యాలను భర్తీ చేస్తున్నావు !!

అరుగు --- లలితా భాస్కర దేవ్

ఒకప్పటి పెంకుటిళ్లకు మకుటం అరుగు
మధ్యతరగతి కుటుంబాలకు ముచ్చటైన మచ్చుతునక అరుగు
మమతల కొలువైనది.. కనుమరుగై జ్ఞాపకాలలో మిగిలింది..
చిన్నఅరుగే.. వినిపించనంత దూరమయి..
కనిపించక వరుగై అంతస్తుల భవనాలలో కెగిరి ఒదిగి పోయింది.

అరుగే ఎరుగని నేటి తరానికి
పుస్తకాల్లో చిత్తరువు అయింది.

అరుగులపైన ఆడిన ఆటలు.. మరెన్నో మరపురాని మరవలేని
చిన్ననాటి వూసులు....
స్మృతుల దొంతర్లు పదేపదే పలకరిస్తూ విప్పిచూపుతున్నాయి...
పొద్దస్తమానూ ఒక్క క్షణం తీరిక లేక అరక్షణం ఖాళీలేక అలపెరుగని
అరుగు..ఆనాటి ఓ అరుగు
పొద్దుపొద్దున్నే కళ్ళాపి తోపాటు కడిగే అరుగు....
ఇంటి ముందున్న అరుగు...... కూరలమ్మి బేరాలతో మొదలై నానమ్మ కామర్ల మంత్రం కోసం ఎదరుచూసే జనాలతో నిండిన అరుగు.......
ఆఖరి శ్వాస వరకూ తోడైన అరుగు..

నాన్న ట్యూషన్ పిల్లతో కళ కళలాడిన అరుగు.....
మిత్రులతో బాతఖానికి మరో కొలువు....
ముంగిట అరుగు వచ్చిపోయే వారితో  వెలుగుతూ చేసే వ్యవహారాలు ఎన్నో .......
పండుగలలో బంధువులతో నెలవై
వేసవిలో పడకలకు అనువై
అన్నీ వేళల్లో పిల్లల ఆటవిడుపులకు వీలై
మరెంతో మేలైన ముంగిటి అరుగు...
ఇంటి వెనక వున్న అరుగో మరి...
ఆత్మీయుతకు నెలవు...
కడిగిన గిన్నెలకు అరుగు కాయగూరల తరుగుటకు అరుగు
పిండార పోతలకు అనువు..
పిల్లల తలంట్ల నూనెలకు భలే వీలైన అరుగు...

బాలభానుని అరుణోదయ కాంతులకు నెలవై సంధ్యావందనాలకు సానుకూలంమయ్యే అరుగు
అమ్మ చెప్పేపద్యాల వల్లింపులకు అనువైనది...
మరెన్నో కతలకు కొలువైనది......
ఆడపడుచు అలకలకు.. తోడికోడళ్ళ ముచ్చట్లుకు
అత్తగారి అదలింపులకు
కోడలి మూతిముడుపులకు
పరోక్ష నేస్తం, ప్రత్యక్ష సాక్ష్యం అరుగే.

ఇంటింటి కతలకు నెలవైన అరుగు
కరువై కనుమరుగై నా స్మృతులలో కథైంది.....

ఎదలో విరిసిన ... --- స్వర్ణ శైలజ

ఇసుక రేణువులమీద
తీరం లిఖించినఆహ్వానపత్రాలు అందుకుని
అలలు ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టు
చివరి చినుకుతో పుడమికి అభిషేకం చేసి
పరవశంతో మేఘమాలికలు మనోజ్ఞ సీమకు పయనమైనట్టు
వేలి కొసలమీద
పురివిప్పిన మయూరంలా
ఆ పాట...
ఏ జ్ఞాపక సిరి చందనమో.

కురిసే చినుకుల జలతారు జిలుగులకింద

తడిసిన సిగ్గుల ఆకుల సింగారాలు
తొలి కిరణ తాకిడికి
పూరేకుల మధ్య ఒదిగిన నీహారికా వర్ణ విభూషణాలు
ఎదలో ఎలరారు ఆమని సోయగంలా
ఆపాట
ఏ ఆనుభూతి పొరలలో విరిసిన మొగలిపూవో

నేటికి ఆవలగట్టు నుంచి
రెక్కలు కట్టుకుని ఈ ముంగిట వాలి
పరవశ పరిమళమై
పెదాల మీద చిరునగవుల స్వరబాంధవిలా
అనుభూతుల చంపకమాలలా
ఆ పాట
పదే పదే పల్లవించే
నా మౌన మధుకలశం.

Posted in September 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!