పద్మాంజలి
ఉ. పద్మసర స్సనంగ గృహప్రాంగణకూమక(1)మధ్య మందునన్
పద్మము వేణుమాధవుని పావనకోమలపాదసన్నిధిన్
సద్మముగా జనించి, వికచంబయి, పత్రకరాలు(2) సాచి యా
పద్మహితప్రభాతకర(3)పాలితమై తనుసేవ(4) సేయుఁగా
(1) చిన్ని కొలను (2) రేకులు అనే చేతులు
(3) ఉదయకిరణాలు (4) శరీరముతో సేవ
భావము -
పద్మసరోవరమా అనిపించే ఇంటిముందుభాగములోని చిన్ని కొలను మధ్యలో ఈ కనబడే కమలము, వేణువు ధరించిన శ్రీహరి (శ్రీకృష్ణుని) యొక్క పవిత్రమైన, కోమలమైన పాదముల దగ్గర ఉన్న స్థలమే పుట్టింటిగా పుట్టి, విచ్చుకొని, రేకులు అనే చేతులు చాచి, కమలములకు స్నేహితుడగు సూర్యుని ఉదయకిరణములచే పాలింపబడినదై, తన శరీరమంతటితో (రేకులు, కేసరాలు, మొదలగు వానితో) సేవ చేస్తోంది. (పద్మసరోవర మంటే తిరుచానూరు పద్మావతీ అమ్మవారు స్వర్ణకమలములో ఉద్భవించిన కొలను).
సస్యలాస్యము
ఉ. దండిగఁ బండినట్టి వరిధాన్యపుకంకుల చెల్మి సేయఁగా
మెండుగ, వాతపోతములు మెల్లన వీవఁగ స్వాగతంబుతో
నిండిన గుండెలన్ బఱచి నిర్మలమైత్రితరంగవేదికన్
పండుగఁ జేసికొందమని పల్కరె సస్యసఖీజనం బహో!
భావము -
బాగా పండిన వరిచేనులో ధాన్యపు గింజల బరువుతో వంగి ఉన్న కంకులతో చక్కగా స్నేహము చేస్తూ, పిల్లగాలులు మెల్లగా వీస్తూ ఉండగా, ఆ గాలికి కంకుల కదలికల వలన ఏర్పడిన స్వచ్ఛమైన స్నేహమనే తరంగాల వేదిక మీద స్వాగతము పలికే భావాలతో పరిపూర్ణమైన హృదయాలను పఱచి, “అందఱము కలిసి పండుగ చేసికొందాము రండి” అని పైరు చెలికాండ్రు పిలుస్తున్నారు అదిగో.
శ్రీనృసింహజయంతి
మ.కో. జంతురూపము వీడి మానవసౌష్ఠవవాకృతిఁ దాల్చు ముం
దెంతొ దుష్టనిశాచరేంద్రుని హింస లంతము సేసి వే
దాంతరక్షణఁ గూర్ప మిశ్రమధామధారిగ(1) సత్వరం
బంతపాదిక(2) చీల వెల్వడినట్టి శ్రీనరసింహునిన్
స్వాంతమందునఁ దజ్జయంతిదినానఁ(3) గొల్తు శుభాప్తికై
(1) రెండు (జంతు + నర) రూపములు కలిసిన
శరీరమును ధరించినవాడై
(2) సమీపమున ఉన్న స్తంభము
(3) తత్ = ఆ/ప్రసిద్ధికెక్కిన, పుట్టినరోజున
భావము -
మత్స్య, కూర్మ, వరాహావతారములలోని జంతు రూపమును విడిచి పెట్టి చక్కని మానవాకారములతోడి అవతారములు (వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణాది అవతారములు) ధరించే ముందు మిశ్రమశరీరము కలిగిన నరసింహుని రూపము ధరించి, ఎంతో దుష్టప్రవర్తన కలిగిన రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు పెట్టే హింసలను అంతమొందించి వేగముగా దాంతజనులను రక్షించడానికి, సమీపములో ఉన్న స్తంభము వ్రయ్యలు కాగా బయల్పడిన నరసింహుని యొక్క/ప్రసిద్దికెక్కిన పుట్టినరోజునాడు శుభ ప్రాప్తి కొఱకు స్వామిని ప్రార్థిస్తున్నాను.