ఓ రసాలమా! ఎంత విశాలమే నీ మనసు.
కుశలమా నీకు?
అశనిపాతమ్మువోలే
వచ్చెడి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని,
ఎటులో ఇటకు చేరితివి.
కామ వల్లరీ! ఓ పికరాగమా! మాకందమా!
మా మామిడి తోపుకే అందమా!
నీ ఒడినిండా పుట్టెడు సంతతి, పెరిగి పెద్దయి
పసుపు ఛాయ మించి, కన్నులకే కాదు
రసనకున్, నోరూరించేను.
తియ్యని రసమేకాదు
కడు రమ్యము నీ రూపము
రసాల ఫలమా ఓ మామిడి ఫలమా!
కిశలయములు మెక్కి
సంగీత సామ్రాజ్యవైభవ రాణి యై
సరిగమలలో 'ప' పై పట్టు సాధించి
ప్రస్తుతులందుకొంటున్న
గాన కోకిల నీ నెచ్చెలేగదా!
మీ సంతతి బహు విస్తృత్తి.
బంగినిపల్లి, రసాలు, అంటుమామిడి,
మల్గూబా, నాటు పండ్లు
అబ్బో తినగలిగిన వారికి అన్నమే వద్దు.
మామిడమ్మా! డబ్బులున్నను తినలేని జబ్బులవారు,
తినగలిగినా డబ్బులు లేక కొనలేనివారు
అదిగో ఆబగా నీ వంక చూస్తున్నారు చూడు
వారిని ఏమని ఓదార్చాలి!!
వచ్చే జన్మలో నీకు నేను దక్కుతాను అంటున్నావా
తియ్యని నీ రుచితో ఈ ఎండలను కూడా
మరిచిపోతున్నారు నీ రుచి మరిగిన ఈ పిచ్చి ప్రజలు
ప్రతి ఇంటా శుభములు కురియంగా
ఈ వసుంధర లోనే కాదు
చతుర్లోకాలలోని ఉమాదులు కూడా
సకుటుంబ సమేతముగా జుర్రుచున్నారు
చూడు చొద్యముగాదే నీ రుచుల మహిమ.
నీ మధుర తేనియల ఫల రసాల రుచులు
మనుజులందరికీ మనోల్లాస ఆహ్లాదకర పండగే పండగ !!