Menu Close
నిన్ను నీవు తెలుసుకో
(ఆధ్యాత్మిక వ్యాసం)
- రాఘవ మాష్టారు కేదారి -

మానవ జీవితంలో ప్రస్తుతం జనులంతా భౌతిక సంపదపై వ్యామోహం పెంచుకొని, అత్యాశపు కోరికలు పెంచుకొని, నిరతము సతతమవుతున్న మనుషులకు నాదో చిన్న మాట. మనిషికి శాంతి, తృప్తి కేవలం డబ్బులో మాత్రమే ఉండదు. మనసు సంతృప్తిగా ఉన్నప్పుడు, మనసులో అలజడులు లేనప్పుడు, జీవితం సుఖమయంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి మనమంతా, మనం ఎవరు? మన జీవిత సత్యం ఏమిటి? ఒక్కసారి ఆలోచిద్దామా!

.......

భౌతిక జ్ఞానపు నాస్తికుడిగా అలజడులతో ఉన్నప్పటికన్నా, ఆత్మజ్ఞానం కోసం తపించే ఆస్తికుడిగా ఉన్న అనుభూతి ఎడారిలో నీటి మడుగు చూసినట్లు మనసు ఆనందిస్తుంది.

రామాయణ భారత గాథ లను,  ఆయా పాత్రలను హేతువాద దృష్టితో అవి మిథ్య, అసత్యమనే వాదనల కన్నా, ఆ పాత్రలలోని మంచిని, వాటి మనో ఔచిత్యాలను మన జీవితాలకు ఆపాదించు కుంటూ,,,,, నిజంంగా ఆచరిస్తే ఎంత బాగుంటుందో..

కోట్ల కోట్ల దీపాలతో దేవుణ్ణి ఆరాధించడం కాదు, నీలో ఒక్క ఆత్మ జ్యోతి వెలిగించుకో, ఆ వెలుగులో నీకు పరమాత్మ, జీవిత పరమార్ధం రెండూ తెలుస్తాయి.

గుడులు, గోపురాలు, నదీనదాలు, చెట్లు చేమలు, రాళ్ళు రప్పల చుట్టూ తిరగడం కన్నా నీ చుట్టూ నీవు తిరిగితే, నిత్య సత్యాలు తెలుస్తాయి. నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్లే, నిజానికి దేవుడు మనం కల్పించుకొన్న ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవాలంటే, నేను అనే అహాన్ని తొలగించుకొని నేనెవరు, నీవెవరు అని పరిశీలించు. అప్పుడే, దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని తెలుసుకోగలవు. అప్పుడు నీ మనసు ఆనందమే కాదు, మహానందం, పరమానందాన్ని పొందుతుంది. ఏ అలజడులు నీ మనసులోకి రానే రావు. ప్రశాంత జీవితానికి ఆధ్యాత్మికత పునాది అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మనము పురాణాలలోని పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తాము కానీ వాటిలోని పరమార్ధాన్ని వదిలి వేస్తున్నాము. ఉదాహరణకు ఏ ప్రాంతంలోనైనా ఆంజనేయుడు తపస్సు చేసుకున్నాడంటే, ఇక ఆ ప్రాంతానికి మహిమ ఉందని, గుంపులు గుంపులుగా, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతం గాను, మహిమాన్విత ప్రాంతంగా చేసి, అక్కడ పూజా పునస్కారాలు చేస్తుంటారు. నిజానికి అక్కడ ఆ ప్రాంతంలోని రాతి బొమ్మలకు, స్థలాలకు విలువనిస్తున్నాం, కానీ అసలు ఆ ప్రాంతంలో తపస్సు చేసిన ఆంజనేయ స్వామి యొక్క లక్షణాలు, అతని కార్యదీక్ష, అతని స్వామి భక్తి అలాంటివి పరిశీలించం, ఆచరించo, అంటే పదార్థాలకు విలువ ఇస్తున్నాం కానీ పరమార్ధాన్ని వదిలివేస్తున్నాం. నిజమా కాదా!?

జీవుడు వ్యష్టి, దేవుడు సమిష్టి, వ్యక్తి పవిత్రంగా, ఆనందంగా ఉంటే సమాజం కూడా పవిత్రంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. కనుక వ్యక్తి అహం వీడి, స్వార్థం వీడి తాను బ్రతుకుతూ, పదిమందిని బ్రతికిస్తూ ఉంటే సమాజం కూడా ప్రగతి పథంలో వికసిస్తుంది.

మనిషి ప్రశాంతంగా మనుగడ సాగించాలంటే ముఖ్యంగా మనలోని రెండు కారాలను తగ్గించుకోవాలి. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండూ తగ్గినప్పుడు ఎలాంటి సమస్య అయినా అనుకోకుండా పరిష్కరించ బడుతుంది. ముందు నీవు మారు, నిన్ను నీవు సంస్కరించుకో, అప్పుడు ప్రపంచాన్ని గురించి ఆలోచించు. శాంతికి-అశాంతికి, సుఖానికి-దుఃఖానికి, స్వర్గానికి-నరకానికి, మంచికి-చెడుకి, ఆశకు-నిరాశకి, ధైర్యానికి-భయానికి, అన్నిటికీ మూలము మనసు. కాబట్టి మనసును అదుపులో పెట్టుకోగలిగితే దానికి మించిన ధ్యానం, యోగం, భక్తి, ముక్తి మరేదీ లేదు. కనుక మనసుని తృప్తి పరుచుకుంటే, జీవితమంతా సంతృప్తితో హాయిగా బ్రతకవచ్చు. అందుకే మన వేదాలలో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఒకటి *ప్రజ్ఞానం బ్రహ్మ*అంటే జ్ఞానమే బ్రహ్మ, నిన్ను నువ్వు తెలుసుకోవడమే ప్రపంచం, నిన్ను నువ్వు తెలుసుకోవడమే దేవుడు. రెండవది *తత్వ మసి* అంటే అది నీవే, నీలోనే అన్నీ ఉన్నాయి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే వేదతత్వం. మరొక వాక్యం *అహం బ్రహ్మాస్మి* అంటే నేనే బ్రహ్మని, నేనే అణువును, నేనే పరమాణువును, నేనే బ్రహ్మాండాన్ని, నేనే సూక్ష్మాన్ని, నేనే స్థూలాన్ని. అప్పుడు ఆత్మ జీవాత్మ ఒకటేనని తెలుస్తుంది. అలాగే మరొక వాక్యం *త్వమే వాహo* అంటే నీవే నేను, నేనే నీవు, ఇది తెలుసుకున్న తర్వాత  మరొక వాక్యం *అయ మాత్మ బ్రహ్మ* అంటే సకల జీవులలో ఉన్న ఆత్మని నేనే అన్ని జీవులలోనున్న పరమాత్మని నేనే అని అందుకు నేనే సాక్షి అని తెలుసుకోగలుగుతావు. వీటిని తెలుసుకున్న వాడే జ్ఞాని, మహాజ్ఞాని, ముని ,మహాముని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః

Posted in May 2023, ఆధ్యాత్మికము, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!