అభివాదం చేసే విధానం
విప్రుడు ఎప్పుడూ తనకంటే పెద్దవారికి అభివాదం చేసి ‘అభివాదయే’ అని చెప్పిన తరువాత, తన పేరు, కులగోత్రాదులను చెప్పాలి. ఎవరికైతే ప్రత్యభివాదానికి అర్థం తెలియదో అలాంటి వారికి అతడు తన పేరును మాత్రమే చెప్పాలి. స్త్రీలందరికీ కూడా ఇలాగే అభివాదం చేయాలి. వందనం చేసి తన పేరు చెప్పేటప్పుడు పేరుకు చివర ‘భోః’ అనే శబ్దాన్ని తప్పక చేర్చాలి. ఉదాహరణకు విష్ణుశర్మ అనే వ్యక్తి తనకు ఎదురైన ఒక పెద్దకు ‘విష్ణుశర్మాహమస్మి భోః’ అని చెప్పాలి. బదులుగా ఆ పెద్ద అతడికి ‘ఆయుష్మాన్ భవ సౌమ్య’ అని అంటూ ప్రత్యభివాదం చేయాలి.
ఇక్కడ సౌమ్య శబ్దం సుమం (పువ్వు) లాగా మెత్తగా, మృదువుగా ఉండడాన్ని సూచిస్తుంది. ఈ శబ్దానికి ‘సోమ (చంద్ర) సంబంధమైన వాడు’ అనే అర్థాన్నీ చెప్పుకోవచ్చు. సౌమ్య అంటే చంద్రునిలా చల్లగా ఉండి, ఆహ్లాదం కలిగించే వాడనీ అర్థం. అందుకే ఒక బ్రాహ్మణుడిని ఎప్పుడూ ‘సౌమ్య’ అనే సంబోధించాలట. సౌమ్య అంటే ఉదుంబర (మేడి) వృక్షమనీ, సోమలత అనీ కూడా అర్థాలు. కుడి చేతి కంటే మృదువుగా ఉంటుంది కనుక ఎడమచేతిని ‘సౌమ్య’ అనీ అంటారు. ఇష్టంగా సోమరసపానం చేస్తాడు కనుక బ్రాహ్మణునికి ‘సౌమ్యుడు’ అని కూడా పేరు. చంద్రుని కుమారుడైన బుధుని(Mercury)కి కూడా ‘సౌమ్యుడు’ అని పేరు. ‘సౌమ్య వారము’ లేక ‘సౌమ్య వాసరము’ అంటే బుధవారము( Wednesday). జ్యోతిష శాస్త్రంలో శుభప్రదమైన బుధ, గురు, శుక్ర, చంద్ర గ్రహాలను సౌమ్య గ్రహాలంటారు. మెత్తని మృదుస్వభావంతో, చంద్రునిలా అందరికీ ఆహ్లాదం కలిగించే గుణం కలిగి ఉండడమే కాక సోమరసపానాన్ని ఇష్టపడే కారణంగా బ్రాహ్మణునికి ‘సౌమ్య’ అనేది సార్థకనామమని కొందరి భావన. అయితే బ్రహ్మమానసపుత్రుడనీ, దేవతలనందరినీ శపించినట్టివాడనీ పేరొందిన భృగు మహర్షి మాత్రమే కాక అత్రి మహర్షి, అనసూయల తనయుడైన (శకుంతలను శపించిన) దుర్వాస ముని, ఇంకా రేణుకాదేవి, జమదగ్నిల కుమారుడైన పరశురాముని వంటి కొందరు కోపిష్టి బ్రాహ్మణులను మాత్రం ఈ ‘సౌమ్య’ శబ్దాన్నుంచి మినహాయించాల్సి ఉంటుంది.
ప్రత్యభివాదం చేయటం తెలియనివాడు - అతడు బ్రాహ్మణుడే అయినా సరే విజ్ఞులు అతడికి విధిప్రకారం అభివాదం చేయరాదు. అలాంటి వాడు శూద్రునితో సమానుడు.
దీనినిబట్టి మనకు అర్థమయ్యేదేమంటే ఒక విప్రుడు తనకంటే పెద్దవాడు లేక పండితుడు అయిన ఒక శూద్రుడు ఎదురొస్తే మాత్రం అభివాదం చేయకూడదని. అయితే ఇక్కడ ఒక విషయం గమనార్హం. పుట్టుకతో శూద్రులైన వాల్మీకి, వ్యాసుడు, ధర్మవ్యాధుడు, విదురుడు, కపిలుడు వంటి వారెవరూ జన్మరీత్యా బ్రాహ్మణులు కారు. కానీ వారంతా తమ కాలంలో అందరిచేత గొప్ప జ్ఞానులుగా గౌరవించబడిన జ్ఞాన బ్రాహ్మణులు. శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’ లో ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః’ అంటే నాలుగు వర్ణాలు మొదట్లో ఆ యా వ్యక్తుల గుణాలు, వారు చేసే కర్మల(పనుల)ను బట్టి తనచేతనే ఏర్పరచబడ్డాయని చెప్పాడు. కనుక వీరంతా వర్ణం వారసత్వంగా సంక్రమించని ఆ ప్రాచీన కాలంలో తమ జ్ఞానం కారణంగా బ్రాహ్మణులుగానే పరిగణింపబడ్డారు. అయితే మనం గతంలోనే చెప్పుకున్నట్లు ‘మనుస్మృతి’ రచనాకాలానికి సమాజం ఘనీభవించింది. వ్యక్తిగత ఆస్తులు పెరిగిపోయి, వారసత్వానికి విలువ ఎక్కువయింది. ప్రతివారికీ తమ కుటుంబ శ్రేయస్సే ప్రధానం అయిపోయింది. తన జీవనోపాధికి, సామాజికార్థిక ఉన్నతికి మూలమైన తన విద్వత్తు తన తరువాత కేవలం తన వారసులకు మాత్రమే దక్కాలనే ఆలోచన ప్రతివారిలోనూ ప్రబలింది. ఈ ధర్మశాస్త్రాన్ని రచించడం ద్వారా వర్ణ సంకరం కారణంగా ఏర్పడిన పలు కులాలకు ప్రవర్తనా నియమావళిని రూపొందించిన మనువు, పనిలో పనిగా సమాజంలో శూద్రవర్ణం మీద పై మూడు వర్ణాల పెత్తనాన్ని మరింతగా వ్యవస్థీకృతం చేశాడు. అప్పటికే క్రమంగా ఒక కులంగా రూపొందుతున్న బ్రాహ్మణ వర్ణానికి మొత్తం సమాజం మీద తిరుగులేని ఆధిపత్యం కల్పించాడు. ఆ క్రమంలోనే ఒక విద్వత్సంపన్నుడూ, పెద్దవాడు అయినట్టి శూద్రుడు తనకు ఎదురొచ్చినా అతడికి ఒక బ్రాహ్మణుడు అభివాదం చేయరాదనే నియమాల వంటివి ఏర్పరచబడ్డాయి.
కుశల పరామర్శ
బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ క్షత్రబంధుమనామయమ్ |
వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రమారోగ్యమేవ చ || (2- 127)
ప్రతివారూ తమ వద్దకు వచ్చి అభివాదం చేసిన వానిని - చిన్నవాడైనా పెద్దవాడైనా - అతడు బ్రాహ్మణుడైతే అతనిని ‘కుశలమా?’ అని పరామర్శించాలి. క్షత్రియుడైతే అతడిని ‘అనామయమా?’ (ఆమయము అంటే జబ్బు. అనామయం అంటే రోగరహితంగా ఉండడం), వైశ్యుడిని ‘క్షేమమా?’ అనీ, శూద్రుడిని ‘ఆరోగ్యమా?’ అనీ పరామర్శించాలి. ఇలా కుశల పరామర్శ కూడా ఒక్కొక్క వర్ణానికి సంబంధించిన వ్యక్తిని ఒక్కొక్క తీరుగా చేయాలనే నియమం విధించడంలో మనువు ఉద్దేశ్యం ఏమిటో మరి? యాగ దీక్షలో ఉన్న వ్యక్తి చిన్నవాడే అయినప్పటికీ ధర్మం తెలిసినవారు అతడిని పేరు పెట్టి పిలవకూడదు. ‘భోః’, ‘భవత్’ అనే పదాలు చేర్చి గౌరవంగా సంబోధించాలి.
స్త్రీలను గౌరవించడం
తన అక్కచెల్లెళ్ళు మినహా మిగిలిన స్త్రీలనందరినీ కూడా ‘సుభగే’ (అమ్మాయీ! అంటూ చెల్లెల్ని పిలిచినట్లే), ‘భగినీ’ (అక్కా! అంటూ తనకంటే పెద్ద స్త్రీని పిలిచినట్లే) గౌరవప్రదంగా సంబోధించాలి.
మాతులః (మేనమామ), పితృవ్యః (పినతండ్రి), శ్వశురా (భార్య తండ్రి), ఋత్విజుడు, గురువు వంటి వారు వచ్చినప్పుడు, వారు తనకంటే వయస్సులో చిన్నవారైనట్లైతే, వారికి ఎదురేగి, తన పేరు మాత్రమే చెప్పి వారిని ఇంట్లోకి తీసుకురావాలి. వారికి అభివాదం మాత్రం చేయరాదు.
మాతృష్వసా (పినతల్లి లేక పెద్దమ్మ), మాతులానీ (మేనమామ భార్య), శ్వశ్రూః (భార్య తల్లి), పితృ ష్వసా (మేనత్త) - వీరందరూ గురుపత్నితో సమానం. కనుక వీరిలో ఎవరు వచ్చినా గురుపత్ని వచ్చినట్లే భావించి, ఎదురేగి అభివాదం చేసి స్వాగతం పలకాలి. సజాతిలో వివాహం చేసుకున్న తన అన్న భార్య (వదిన) కు ప్రతిరోజూ పాదాభివందనం చెయ్యాలి. (అన్న భార్యే అయినా ఇక్కడ బయటి వర్ణంలో పుట్టిన స్త్రీకి సజాతి స్త్రీకి ఇచ్చే గౌరవం ఇవ్వకూడదనే మనువు నిబంధన వర్ణాంతర వివాహాలను కట్టడి చేసేందుకే ఉద్దేశించింది. అన్న ఒకవేళ సజాతి స్త్రీని కాక బయటి స్త్రీని పెళ్లి చేసుకుంటే, ఆమె తనకు వదినే అయినప్పటికీ పాదాభివందనం చేయనవసరం లేదన్నమాట.) ఇక తండ్రి వైపు వారైన పెదతండ్రి భార్య, పినతండ్రి భార్య, తల్లి వంక వారైన మేనమామ భార్య, అలాగే తనకు పిల్లను ఇచ్చిన అత్తగారు వంటి వారికి వారు ఎక్కడినుంచైనా ప్రయాణం చేసి వచ్చినప్పుడు తప్ప ప్రతిరోజూ పాద నమస్కారం చేయనవసరం లేదు. కేవలం నమస్కరిస్తే సరిపోతుంది.
పితుర్భగిని (తండ్రి తోడబుట్టినది -మేనత్త), మాతుః (తల్లి అక్క, పెద్దమ్మ), వంటి జ్యాయసుల (పెద్దవారైన స్త్రీల) తోనూ, స్వసా (తన తోడబుట్టిన అక్క) వంటి వారితోనూ తన తల్లితో వ్యవహరించినట్లే గౌరవప్రదంగా వ్యవహరించాలి. అయితే వీరందరిలోనూ తల్లి మరింత గౌరవనీయురాలు.
స్నేహం ఎవరితో చేయాలి?
ఒకరు ఒకే ఊరిలో తనతో పాటు నివసిస్తున్న వ్యక్తితో అయినట్లయితే తనకన్నా పదేళ్ల పెద్దవానితో స్నేహం చేసినా తప్పులేదు. సంగీతము మొదలైన కళలలో నైపుణ్యం ఉన్న వ్యక్తితో అయితే తనకన్నా ఐదేళ్లు పెద్దవానితోనూ, శ్రోత్రియునితోనైతే (వేదాధ్యయనము చేసిన వ్యక్తితోనైతే) మూడేళ్లు పెద్దవాడితో నైనా చెలిమి చేయవచ్చు. స్వయోనిషులు (రక్తసంబంధికులు) అయినట్లయితే వయస్సులో తేడా కొద్దిగానే అయినా స్నేహం చేయవచ్చు.
నూరేళ్ళ క్షత్రియుడైనా పదేళ్ల బ్రాహ్మణ బాలుడిని తండ్రిగా భావించి గౌరవించాలి. డబ్బు, బంధుత్వము, వయస్సు, కర్మానుష్ఠానము, చదువు - ఇవి పూజించదగినవి. డబ్బు కంటే బంధుత్వము, బంధుత్వము కంటే పెద్దరికము, పెద్దరికం కంటే కర్మానుష్ఠానము, దానికంటే విద్యను మనం ఎక్కువగా గౌరవించాలి.
పై మూడు వర్ణాలలో ఈ ఐదు గుణాలలోనూ ఎక్కువ గుణాలు (రాశిలోనూ, వాశిలోనూ) కలిగినట్టి వ్యక్తి అందరిలోకీ పూజనీయుడు. అతడు పదవ దశకంలో ఉన్న శూద్రునికీ పూజనీయుడే.
మనం పక్కకి తొలగి దారి ఎవరికి ఇవ్వాలి?
చక్రిణో దశమీస్థస్య రోగిణో భారిణః స్త్రియా : |
స్నాతకశ్చ చ రాజ్ఞశ్చ పంథా దేయో వరస్య చ || ( 2- 138)
చక్రి (బండిలో ప్రయాణించేవాడి) కి, తొంభై ఏళ్ళు నిండి తన పదవ దశకంలో అడుగుపెట్టిన వృద్ధునికి, రోగికి, భారం మోసుకుని పోతున్న వ్యక్తికి, స్త్రీలకు, స్నాతకుడికి, రాజుకి, వరునికి (పెళ్లికొడుకుకి) మనం తప్పనిసరిగా తప్పుకుని పంథా (దారి) ఇవ్వాలి.
ఎవరైనా వ్యక్తులు బండిలో ప్రయాణం చేస్తున్నారంటే వారేదో అత్యవసరమైన కార్యం మీద వెళుతున్నారని అర్థం. అలాంటి వారికి అడ్డు నిలిచి వారి పనికి అంతరాయం కలిగించడం ధర్మం కాదు. తొంభై సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎప్పుడేమౌతారో చెప్పలేం. కనుక వారు వీలైనంత త్వరగా వారి గమ్యస్థలాలు చేరుకొనడంలో అందరూ సహకరించాలి. వయస్సుతో నిమిత్తం లేకుండా రోగులందరికీ అత్యవసర వైద్య సహాయం అవసరమే. అంచేత రోగులకు దారి వదలాలి. బరువు మోసేవాడికే తెలుస్తుంది దానిలోని కష్టం. కనుక రహదారి మీద బరువులు మోసుకుని పోతున్నవారిని అడ్డుకోకుండా మనం దారి ఇచ్చి పక్కకి తప్పుకోవాలి. స్త్రీలు ఎవరైనా సరే వారికి తప్పుకుని దారి ఇవ్వడం, వారిని సురక్షితంగా తమ గమ్యస్థలాలకు చేరుకునేటట్లు చూడడం ఆదర్శ ధర్మంగా భావించి ఆచరించారు మన ప్రాచీనులు. బ్రహ్మచర్య దీక్ష పరిసమాప్తికి సూచనగా పవిత్ర స్నానం చేసినవాడు స్నాతకుడు. బాటసారులు బాటన వెళ్ళేటప్పుడు తాము పక్కకి తప్పుకుని, రాజుకీ, స్నాతకునికీ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. వరుడు (పెళ్ళికొడుకు) వివాహానికి నిశ్చయించిన ముహూర్తం లోపు వధువు ఇంటికి (వివాహ స్థలికి) చేరుకోకపోతే వివాహం ఆగిపోతుంది. అందుకని వరుడికి తప్పనిసరిగా అందరూ దారి ఇవ్వాలి. ఆధునిక యుగంలో ఒక్క అత్యవసర రోగులను తీసుకువెళ్లే యాంబులెన్స్ మినహా ఏ వాహనాలకూ/ఎవరికీ దారి వదలడం గురించిన కనీస యోచన లేకుండా పోయింది. ఈరోజుల్లో బంద్ లు, రాస్తారోకోల సందర్భంగా, రహదారి తనిఖీల సందర్భంగా వృద్ధులు, అత్యవసర రోగులు, గర్భిణులు మొదలైనవారు పడుతున్న పాట్లకు అంతేలేదు. నేటి రాజులైన మంత్రులు, ఇతర విఐపి లు ఒక మార్గం గుండా వెళుతుంటే దానికి ముందు పోలీసులు ఆ మార్గంలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సులు, కార్లు మొదలైన వాహనాలను సైతం ఆపి విచక్షణారహితంగా చేస్తున్న తనిఖీలు మరీ మితిమీరుతూ ఒక్కోసారి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒక్కోసారి వారు గర్భిణులను, అత్యవసర రోగులను చికిత్స నిమిత్తం తీసుకువెళ్తున్న యాంబులెన్స్ లను కూడా అటకాయించడం మరీ దారుణం.
ఒకవేళ వీరంతా ఒక చోట కలిస్తే అందరూ వీరిలో రాజుకు, స్నాతకుడికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి గౌరవించాలి. ఆ ఇరువురిలో రాజు స్నాతకుడి పట్ల గౌరవంతో అతడిని సత్కరించాలి.
ఆచార్య, ఉపాధ్యాయ, గురు, ఋత్విజ శబ్దాలు
ఏ బ్రాహ్మణుడు స్వయంగా తానే శిష్యుడికి ఉపనయనం చేసి, వేదములను కల్ప సూత్రములలోని అర్థాలు, ఉపనిషత్తులలోని రహస్యాలతో సహా అధ్యయనం చేయిస్తాడో, అతడే ఆచార్యుడు అని పిలువబడతాడు.
‘మంత్రవ్యాఖ్యా కృదాచార్యః’ అని అమరకోశం ‘ఆచార్య’ శబ్దాన్ని నిర్వచించింది. అంటే వేదమంత్రార్థాలను కల్పసూత్రాలలో చెప్పబడిన అర్థాలతో సహా వివరించేవాడని అర్థం.
‘ఆచారం గ్రాహయతీతి ఆచార్యః’ అని ఆచార్య శబ్దానికి మరో నిర్వచనం కూడా ఉంది. సంప్రదాయమును గ్రహింపజేసేవాడు ఆచార్యుడు అని దాని అర్థం.
వేదములో కొంత భాగాన్ని కానీ, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనే ఆరు వేదాంగాలను కానీ, వాటిలో కొన్నింటినిగానీ తన జీవనోపాధికోసం ఎవరు అధ్యయనం చేయిస్తాడో అతడిని ఉపాధ్యాయుడు అంటారు.
ఏ బ్రాహ్మణుడు నిషేకము (గర్భాధానము) మొదలైన సంస్కారములను విధి ప్రకారము తనతో చేయిస్తాడో, ఎవడు తనకు అన్నం పెట్టి తనను పోషిస్తాడో ఆయనను గురువు అంటారు.
అగ్న్యాధేయము మొదలైన పాక యజ్ఞములు, అగ్నిష్టోమాది మఖములు (శ్రౌత యజ్ఞములు) దగ్గరుండి చేయించేవాడు ఋత్విజుడు అని పిలువబడతాడు.
ఎవరైతే ఒక విద్యార్థి రెండు చెవులనూ సత్యస్వరూపమైన వేదంతో నింపుతాడో అతడే ఆ విద్యార్థికి తల్లి, తండ్రి. అట్టివానికి ఆ విద్యార్థి ఏ పరిస్థితులలోనూ ద్రోహం తలపెట్టరాదు.
వంద మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, నూర్గురు ఆచార్యుల కంటే ఒక తండ్రి, వందమంది తండ్రులకంటే ఒక తల్లి ఎక్కువ గౌరవించదగినవారు.
ఇలా చెప్పిన మనువే ఆ తరువాత శ్లోకం (2-146) లో విప్రుడికి ఉపనయనం చేసి, అతడికి రెండవ జన్మ ఇచ్చి, అతడికి వేదశాస్త్ర మర్మములను బోధించే ఆచార్యుడు తండ్రి కంటే కూడా శ్రేష్ఠుడని అంటాడు. కేవలం ఇహలోకమునకు సంబంధించిన మొదటి జన్మను ఇచ్చిన తండ్రి కంటే ఇహపరములు రెంటినీ సాధించేందుకు ఉద్దేశించిన రెండవ జన్మను ఇచ్చిన తండ్రి మరింత శ్రేష్ఠుడు అవుతాడని మనువు అభిప్రాయం.
తల్లిదండ్రుల కామం కారణంగా పశువులు మొదలైన ఇతర జంతువుల వలెనే ఒక శిశువు తన తల్లి గర్భమున జన్మిస్తున్నాడు. అప్పుడతడికి లభించే జన్మ కేవలం జంతుప్రాయమైనట్టిది. వేదసారము తెలిసిన ఆచార్యుడు ఈ మానవుడికి గాయత్రి (సావిత్రి) మంత్రోపదేశంతో ఉపనయనం జరిపించి, ఏ జన్మను ఇస్తున్నాడో, ఆ జన్మ మాత్రమే బ్రహ్మప్రాప్తికి హేతువు. అది శాశ్వతమైనది. దానికి ముదిమి, చావులు లేవు. కనుక అలాంటి ఉన్నతమైన జన్మను ప్రసాదించిన ఆచార్యుడు తండ్రికంటే గొప్పవాడు.
తాను వేదసారమును తెలుసుకొనుటకు ఏ వ్యక్తి కొద్దిగానైనా లేక గొప్పగానైనా ఉపకరిస్తాడో, అతడు వేదోపకారకమగు కార్యం చేసినవాడైన కారణంగా అతడిని ఆ విద్యార్థి తన గురువుగా ఎంచాలి. అలా ఒక విద్యార్థికి ఉపనయనం ద్వారా రెండవ జన్మనిచ్చి, వేద విధులను అతడికి ఉపదేశించిన గురువు ఎవరో అతడే ఆ విద్యార్థికి ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి అవుతాడు - విద్యార్థికంటే వయసులో చిన్నవాడే అయినా సరే. ఇందుకు ఒక ఉదాహరణ - అంగిరసుడి కుమారుడు ఆంగిరసుడు జ్ఞాన వృద్ధుడైన కారణంగా తన కంటే వయసులో పెద్దవారైన తన పిన తండ్రిని, అతడి కుమారులను తన శిష్యులుగా భావించి, వారికి వేదవిద్యలు ఉపదేశిస్తూ, వారిని ‘పుత్రులారా!’ అని సంబోధించాడట. దాంతో వారు తమకంటే వయస్సులో బాగా చిన్నవాడైన అతడు తమను పుత్రులారా అనడం పట్ల కోపించి తమకు జరిగిన అవమానాన్ని దేవతల దృష్టికి తెచ్చారట. దానికి దేవతలు ‘ఆ బాలుడు మిమ్మల్ని అలా సంబోధించడం సవ్యమే’ నని తెలిపారట. ఆ సందర్భంగా వారు ఇలా వివరించారట - జ్ఞాన శూన్యుడు బాలుడు. వేద మంత్రాలు, వాటి అర్థాలు ఉపదేశించేవాడు తండ్రి. హాయనము అంటే సంవత్సరము. హాయనమును బట్టి అంటే ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరములు? అనే దానినిబట్టి అతడికి గౌరవము రాదు. పలిత కేశముల (నెరసిన వెంట్రుకల) కారణంగానో, ధనము చేతనో లేక బంధుమిత్రుల కారణంగానో అతడికి గౌరవం చేకూరదు. సాంగ వేదాధ్యాపకుడు ఎవరో అతడు ఎంత చిన్న వయస్సు వాడైనప్పటికీ అతడే గొప్పవాడని ఋషులు నిర్ణయించారు. విప్రుడికి జ్ఞానం కారణంగా, క్షత్రియుడికి వీర్యం (బలం) కారణంగా, వైశ్యులకు ధన దాన్యాదులవలన, శూద్రుడికి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికం, గౌరవం లభిస్తాయి. తల నెరయుట చేత విప్రుడు వృద్ధుడు కాడు. ఎవడు చిన్నవాడే అయినప్పటికీ వేదాధ్యయనం చేస్తాడో - వాడే వృద్ధుడు - అని దేవతలు వివరించారు.