Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

జయరాజు రచించిన "శిలా నీవే.. శిల్పి నీవే.. శిల్పం నీవే సృష్టిలో".. గీతంలో ఒక పాదానికి – "ఇందు గలఁ డందు లేఁ డని" పద్యం కు చిన్న పోలికతో ఈ నెల రచ్చబండ చర్చ ప్రారంభించే సాహసం చేస్తున్నాను! ఓ మధురగీతమా అని మొదలయ్యే ఈ "శిలా నీవే.. శిల్పి నీవే.. శిల్పం నీవే సృష్టిలో" గీతంను ఆలపించింది విజయ్ యేసుదాసు, సంగీతం సమకూర్చినది మోహన్ బల్లేపల్లి. కొద్దిగా సమయం కేటాయించి ఈ గీతం వింటే బాగుంటుంది, ఎందుకంటే దాదాపు 23 నిమిషాల నిడివి ఉన్న పాట ఇది, యూ ట్యూబ్ లో మనకు అందుబాటులో కూడా ఉంది. మనిషి ఎవరి ప్రలోభాలకు లోను కాకూండా, మాయ మాటలు నమ్మకుండా తనే శిలనై, తానే శిల్పియై తన వివేచనతో, తన అనుభవజ్ఞానంతో మానవతామూర్తిగా మారమని ఈ గీతంతో మనకు జయరాజు నివేదిస్తున్నారు. అయితే దీనికి పూర్వం దాదాపు ఇటువంటి భావాన్నే ఆధ్యాత్మిక కోణంలో మనకు అందించిన పద్యం ఒకటి ఉంది, మనకందరికీ తెలిసిన పద్యమే అది!

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

దీని భావం "ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!". అతిమధురమైన ఈ పద్యం పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర అధ్యాయంలోనిది. ఆధునిక కవి జయరాజు శిల-శిల్పి-శిల్పం పోలికతో దాదాపు ఇదే విషయం.. అంటే "అన్నటి యందు ఉండేది నీవే" అని చెప్పాడు. "ఓ మధురగీతమా" ఒక్క పాట విన్నంతనే విశ్వ రహస్యం తెలుసుకున్నట్లుంది నాకు. సృష్టి రహస్యాలను పాట రూపంలో మనకు అందించిన జయరాజు ధన్యుడు కదా! ఈయన సాహిత్య సేవకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని, 2023లో కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. జయరాజు రచించిన "శిలా నీవే.. శిల్పి నీవే.. శిల్పం నీవే సృష్టిలో" - పద ప్రయోగంలో అద్వైత భావన కొంత ఇమిడి ఉంది అని నాకు అనిపిస్తుంది. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం" కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జీవుడు వేరు, బ్రహ్మ వేరు కాదనీ, రెండూ ఒకటేననీ ప్రతిపాదించే తత్త్వం. ఉన్నదంతా ఒకటేననీ, అది బ్రహ్మమనీ సిద్ధాంతం. అవిద్య వల్ల వేర్వేరనే భావన కలుగుతుందని దీని అంతరార్థం.

శిల-శిల్పి- శిల్పం:

అసలు విషయానికొస్తే, రచ్చబండ వద్ద గంటలకొద్దీ చర్చలు.. పొద్దంతా కాలక్షేపం.. ఒక పదం లేదా వాక్యంతో మొదలయ్యే చర్చ ఒక్కోసారి తెగనే తెగదు. మరి సభ్యులు ఉత్సాహంగా చర్చలో పాల్గొని సినిమా, సంగీత, సాహిత్యాల పై ఉత్సాహంగా చర్చలు జరుగుతున్న సందర్భాలలో కరంట్ అఫైర్స్ - అంటే తాజా నేపథ్యంతో కూడిన విషయాలు జత కూడడం సహజం. ఈ నెల చర్చ శిల-శిల్పి-శిల్పం తో మొదలుపెట్టాము, కాబట్టి నేరుగా విషయంలోకి వెళదాం! జనవరి 2024 వార్తాపత్రికలు, మీడియా ను వీక్షించినవారికి అయోధ్య బాల రామయ్య గూర్చి వీడియోలు, వార్తా కథనాలు తెలిసే ఉంటాయి. అయితే ఈ కథనాలు పెద్దగా స్పృశించని విషయాలు అంటే అయోధ్య బాల రామయ్య విగ్రహానికి ఉపయోగించిన "శిల"ను ఎవరు, ఎలా ఎంపిక చేసుకున్నారు?, అసలు ఆ శిలను ఎక్కడ నుండి సేకరించారు? విగ్రహ "శిల్పి" యోగిరాజ్ గూర్చి, ఆయన చెక్కిన బాల రాముడి "శిల్పం" కథ, అందుకు సంబంధించిన కొన్ని మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

ప్రాణ ప్రతిష్ఠ:

ముందుగా ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ గూర్చి తెలుసుకుందాం! హిందూ మత ఆచారాల ప్రకారం.. ఆలయాలను కొత్తగా నిర్మించిన సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణ శక్తిని స్థాపించడం. దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయడమే ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమం ద్వారా ఆ విగ్రహం పూజకు అర్హమైందిగా మారుతుంది. ముందుగా పవిత్ర నదీ జలాలతో విగ్రహానికి స్నానమాచరించి.. తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి, సంప్రదాయబద్ధంగా అలంకరణ చేసిన అనంతరం మంత్రోచ్ఛారణతో ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు. అనంతరం కర్పూర హారతి ఇచ్చి ఆ దైవానికి నైవేద్యం సమర్పిస్తారు. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ అచ్చంగా ఇలాగే చేశారు. రాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12గంటలకు బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

శిల:

బాల రాముడి విగ్రహ నిర్మాణానికి అవసరమైన కృష్ణ శిలను కర్ణాటకలోని హెచ్‌డి కోటే తాలూకా గుజ్జెగౌడనపుర నుంచి తెచ్చారు. ఈ శిల ఉన్న భూమి యజమాని పేరు రామదాసు కావడం మరొక విశేషం. తన పొలంలో దొరికిన శిలతో చెక్కిన శిల్పం తుదకు అయోధ్య గర్భాలయంలో ప్రతిష్టింపబడుతుంది అని తెలుసుకొని, రామదాసు వెంటనే తన స్థలంలో రామాలయం కట్టడానికి నాలుగు కుంటల స్థలాన్ని దానం చేశారు. ఇప్పుడు అక్కడ ఆలయ నిర్మాణానికి ఆయన పునాది కూడా వేశారు. అయోధ్య బాలరాముడి విగ్రహం 'కృష్ణ శిల' వయస్సు 250 కోట్ల సంవత్సరాలు అని ఒక అంచనా. ఇక అయోధ్య బాల రామయ్య విగ్రహానికి కృష్ణశిలను ఎంచుకోవడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అమ్లాలకు ఈ శిల స్పందించదు. ఇక పాలు వంటివాటితో అభిషేకం చేసినా ఎలాంటి మార్పు ఉండదు. ఆ విగ్రహానికి అభిషేకం చేసిన పాలు, నీరు భక్తులు స్వీకరించినా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉండదు. పైగా ఈ విగ్రహం వేల సంవత్సరాలు చెక్కుచెదర కుండా ఉంటుంది. కృష్ణశిలలు కొన్నిచోట్లే దొరుకుతాయి. అదృష్టవశాత్తు రామదాసు పొలంలో ఒకటి దొరకడం ఆయన పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పాలి.

ఎట్టకేలకు అయోధ్య రామాలయంలో రామభక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురుచూసిన బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22, 2024న నిర్విఘ్నంగా, విజయవంతంగా జరిగిపోయింది! ఈ ఘట్టం చరిత్రాత్మకమైతే.. బాల రాముడి విగ్రహం ఎంతో అపురూపం. 51 అంగుళాల ఎత్తు ఉన్న ఆ విగ్రహం బరువు 200 కిలోల దాకా ఉంటుందని అంచనా. రామదాసు అనే వ్యక్తి పొలంలో కొంత భాగం పైకి పొడుచుకు వచ్చినట్టుగా ఉండడంతో ఈ రాతిని తొలగించి, భూమిని చదును చేసేందుకు ఆయన ప్రయత్నించారు. తీరా మట్టి తొలగించడం మొదలుపెడితే.. బ్రహ్మాండమైన కృష్ణ శిల బయటపడింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం అయోధ్య ట్రస్టుకు చేరింది. అలా ఈ శిలను విగ్రహ నిర్మాణానికి ఉపయోగించారు.

అయితే ఈ బాల రాముడి విగ్రహం రంగు నలుపు రంగులోనే ఎందుకుంది.. ఈ ప్రశ్న చాలా మంది మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడు ముదురు రంగులో వర్ణించబడ్డారు. అందుకే శ్రీరాముడు శ్యామల రూపంలో మాత్రమే ఆరాధించబడతాడు. అయితే అయోధ్యలోని రాముని విగ్రహం శ్యామ శిలతో రూపొందించబడింది. ఈ సందర్భంగా బాలరాముని విగ్రహ ప్రత్యేకతలేంటి.. ఈ విగ్రహం నలుపు రంగులో ఎందుకు ఉందనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రామ మందిరంలోని రాముని విగ్రహం నల్లరాతితో చెక్కబడింది. ఇది చూడటానికి నల్లరాయిలా కనిపించినా, దీని రంగు చాలా ముదురుగా ఉంటుంది. ఇది కృష్ణ శిలే.. దీన్నే శ్యామ శిల అని కూడా అంటారు. మూడు బిలియన్ సంవత్సరాల పురాతన శిల ఇది. బాల రాముడి విగ్రహం పూర్తిగా ఒకే రాతితో తయారు చేయబడింది. శ్రీరాముని వర్ణం మేఘంలా నల్లగా ఉంది. అంటే ఈ విగ్రహం నల్లటి మేఘాలను పోలి ఉంది. వేల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండడం ఈ కృష్ణ శిల ప్రత్యేకత. ఈ విగ్రహానికి పాలు, నీరు, గంధం, కుంకుమ ఎన్ని పూసినప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. అంతేకాదు వాటర్ ప్రూఫ్ కారణంగా ఈ విగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ విగ్రహం అంతే బలంగా ఉంటుంది. అందుకే వేల సంవత్సరాలు తరువాత కూడా ఈ విగ్రహం భద్రంగా ఉంటుంది.

శిల్పి:

అయోధ్య రాముడిని చెక్కిన శిల్పి కథేంటో తెలిస్తే మనకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఈ చర్చ సమయానికి అరుణ్‌‌యోగిరాజ్ వయసు 38 ఏళ్లే అయినా శిల్పిగా, అందునా దేవతామూర్తుల శిల్పిగా ఆయన చూపిన ప్రతిభ ఘనమైనది, సాధించిన విజయాలు అద్భుతం. కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ ప్రతిష్టించిన 12 అడుగుల ఆదిశంకరాచార్యుల అద్భుత ప్రతిమ అరుణ్‌‌చెక్కినదే. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఆవిష్కరించిన సుభాశ్‌చంద్ర బోస్‌‌విగ్రహం కూడా ఆయన చెక్కినదే.

ఇదే సమయంలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని శ్రీ రామ జన్మభూమి తీర్థం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. బాలరాముని విగ్రహం తయారు చేసే సమయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని.. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని.. ఆఖరికి మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని చంపత్ రాయ్ తెలిపారు.

అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టతో అయోధ్య నిత్యం మీడియా వార్తల్లో నిలుస్తోంది. అయోధ్యకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక రామాలయం గురించి రోజుకో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా బాలరాముడి విగ్రహం చెక్కిన విధానం బయటకు వచ్చింది. ముఖ్యంగా బాలరాముడి కళ్లు తేజోమయంగా.. అందంగా కనిపించడం వెనుక పెద్ద కారణమే ఉంది అన్నది ఈ కథనాల సారాంశం. శిల్పి యోగిరాజ్ బాల రాముడి విగ్రహం కళ్లను ప్రత్యేక శ్రద్ధలతో చెక్కారు. విగ్రహం చెక్కడానికి ఉపయోగించిన వెండి సుత్తి, బంగారు ఉలి పరికరాల ఫోటోలను యోగిరాజ్ పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో పంచుకున్నారు. జనవరి 24న అయోధ్య నుండి తిరిగి తన స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించడం విశేషం. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వేలాది మంది ప్రజలు యోగిరాజ్ ను పూలమాలలతో ముంచెత్తారు. శిల - శిల్పి - శిల్పం మూడు ఆ ప్రాంతానికి తెచ్చిన గౌరవంగా వారంతా భావించారు.

ఎం.బీ.యే చదివిన అరుణ్‌‌యోగిరాజ్ కొద్దికాలం ఉద్యోగం కూడా చేశారు. కానీ ఆయన వారసత్వం ఆ ఉద్యోగంలో ఉండనీయలేదు. కేవలం ఆరు మాసాలకే ఉద్యోగం కు స్వస్తి చెప్పి మైసూరు వచ్చి ఉలి పట్టారు. ఆయన కళాతృష్ణకు, సృజనాత్మకతకు ఎల్లలు లేవని రుజువైంది. మైసూరుకు చెందిన ఆయన కుటుంబం 250 సంవత్సరాలుగా శిల్పాలు మలిచే పనిలోనే ఉండనే ఉంది. అరున్‌11‌వ ఏటనే తండ్రి యోగిరాజ్‌కు శిల్ప నిర్మాణంలో సహకరించేవారు. శిల్పకళలో అరుణ్‌కు తండ్రే గురువు. ఉద్యోగం వదిలి పెట్టి మళ్లీ శిల్పిగా జీవితం గడపాలన్న ఆయన నిర్ణయాన్ని తండ్రి వెంటనే స్వాగతించారు. కానీ తల్లి మాత్రం కొంతకాలం పాటు సర్దుకోలేకపోయారు. 2014లో కుమారుడికి దక్షిణ భారత యువ ప్రతిభా పురస్కారం వచ్చిన తరువాత మాత్రమే ఆమె అరుణ్‌అభీష్టాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నారు. అరుణ్‌‌తాతగారి పేరు బి.బసవన్న శిల్పి. మైసూరు సంస్థానంలో ఆయన శిల్పాచార్యుడు. సంస్థానంలోనే ఉన్న మరో ఉద్దండ శిల్పి సిద్ధాంతి సిద్ధలింగ వద్ద ఆయన శిల్ప కళను నేర్చుకున్నారు. మైసూరు రాజప్రాసాదం దగ్గర నిర్మించిన గాయత్రి ఆలయానికి 11 మాసాలలో 64 విగ్రహాలను చెక్కి అందించిన చరిత్ర బసవన్న శిల్పికి ఉంది. ఇప్పుడు ఆయన మనుమడు అరుణ్‌యోగిరాజ్ 15 ‌మంది బృందంతో కలసి శిల్పాలు చెక్కుతున్నారు. ఆయన నెలకొల్పిన సంస్థ పేరు బ్రహ్మర్షి కాశ్యప శిల్పకళాశాల ట్రస్ట్. ఈ కళాశాల ‌మైసూరులోనే ఉంది. కొద్ది మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వీరికి ఉచితంగానే శిల్ప విద్య ను యోగిరాజ్ నేర్పుతారు. అమెరికా, మలేసియాల నుంచి కూడా విగ్రహాల కోసం ఆయనకు వర్తమానాలు వచ్చాయి. అయోధ్యలో బాల రాముడి విగ్రహం శిల్పిగా ఇప్పుడు ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాపితం అయింది.

అయోధ్యలో బాలక్‌రామ్‌‌ప్రతిమను చెక్కడానికి, మొదట ట్రస్ట్ ‌వారు చెప్పిన ఊహకు ఆకృతిని ఇవ్వడానికి తాను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని అరుణ్‌‌యోగిరాజ్ చెప్పారు. అయితే తాను చెక్కిన ప్రతిమ గుడిలోకి చేరడంతో అవన్నీ మరచిపోయానని ఆయన అన్నారు. ట్రస్ట్ ‌తన ముందు ఉంచిన బాలక్‌రామ్‌ఊహకు ప్రాథమికంగా ఆకృతిని ఇవ్వడానికి అనేక ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అక్కడ కాపు వేసుకొని యోగిరాజ్ 5 ఏండ్ల బాలురను చూస్తూ గడిపేవారు. ప్రతిమ కోసం యోగిరాజ్ ఎం‌త తపన పడినది, తపస్సు చేసినది ఆయన భార్య విజేత కూడా చెప్పారు. శిల్పం చెక్కే క్రమంలో ఒకసారి శిలనుండి ఒక చిన్న శకలం వచ్చి కంటిలో చొచ్చుకుపోయింది. ట్రస్ట్ ‌వారే కంటి శస్త్ర చికిత్స చేయించారు. అయితే ఆ సమయంలోను పని ఆపకుండా యోగిరాజ్ ఒక్క కంటి సాయంతోనే దాదాపు రెండు వారాలపాటు శిల్పం చెక్కారు. దీన్ని బట్టి యోగిరాజ్ నిబద్దత ఎంత చిత్తశుద్దితో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు.

శిల-శిల్పి గూర్చి ఈ సంచికలో కొంత అర్ధవంతమైన చర్చ జరిగిందనే అనుకొంటున్నాను, అయితే శిల్పం పై చర్చ పూర్తి అయితేనే ఈ ప్రయత్నం కు శుభం కార్డు పడేది. కాబట్టి వచ్చే నెల సంచికలో అయోధ్య బాల రామయ్య శిల్పం గూర్చి, ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చిద్దాం! అంతవరకు ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...ఎప్పటిలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో ఆసక్తికరమైన "శిల్పం" రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in March 2024, వ్యాసాలు

2 Comments

  1. చంద్ర

    వెంకట్ గారు,

    మీ రచ్చ బండ వ్యాసం “శిల శిల్పి శిల్పం” ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

    “ప్రాథమికంగా ఆకృతిని ఇవ్వడానికి అనేక ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అక్కడ కాపు వేసుకొని యోగిరాజ్ 5 ఏండ్ల బాలురను చూస్తూ గడిపేవారు” ఎంతో ముఖ్యమైనదని అనిపించింది. బాలక్ రాముని విగ్రహంలోనీ అపూర్వమైన బాల తేజస్సు ఆయన పరిశీలన, పరిశోధన ఆయన మేధస్సుకి తోడై ఆయన ఉలినుండి వచ్చిందని అనిపిస్తుంది.

    ఎట్టికేలకు అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ 500 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. శుభం!

    “మనిషి ఎవరి ప్రలోభాలకు లోను కాకూండా, మాయ మాటలు నమ్మకుండా తనే శిలనై, తానే శిల్పియై తన వివేచనతో, తన అనుభవజ్ఞానంతో మానవతామూర్తిగా మారమని ఈ గీతంతో …” మనకు జయరాజు నివేదిస్తున్నారు.

    శిల్పం గురించి మీ యొక్క విశ్లేషణ కొరకు వచ్చే సంచిక వరకు వేచి చూస్తు…

  2. మధు బుడమగుంట

    వెంకట్ గారు రచ్చబండ అనే పదానికి సార్ధకత కల్పిస్తూ మీరు వ్రాస్తున్న వ్యాసాలు ఎంతో విలువైన విశ్లేషనాత్మక వివరాలతో ఆద్యంతం ఆసక్తి కలిగిస్తూ వస్తున్నాయి. నేటి సంచిక శిల,శిల్పి,శిల్పం అనే కేవలం మూడు పదాలతో సంగ్రహంగా మొదలుపెట్టి వివరణలతో మీరు అందించిన విషయ పరిజ్ఞానం అద్భుతం. శుభాభినందనలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!