"మొండి గురువు - బండ శిష్యుడు" ఒక సరదా సామెత. బండ శిష్యుల గూర్చి మనం తెలుసుకోవాలంటే తెలుగు సాహిత్యంలో పరమానందయ్య ఏడుగురు శిష్యుల కథ ఉండనే ఉంది. ఆమాట కొస్తే పరమానందయ్య శిష్యులు కథ సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశం గురించి చెప్పుకోవాలి. తన ఇంటికి అతిధిగా వచ్చిన మరో గురువుకి కాస్త మర్యాద చెయ్యమని పరమానందయ్య తన శిష్యులను పురమాయిస్తాడు. సుష్టిగా భోజనం చేసి, హాయిగా పరుపుపై విశ్రమిస్తున్న అతిధి కాళ్ళు పట్టే క్రమంలో వాదులాట జరిగి పరమానందయ్య శిష్యులు పంతానికి పోయి, అతిధి కాళ్ళు విరగ్గొట్టడానికి అప్పటికప్పుడు రెండు పచ్చటి బండలు పట్టుకొస్తారు. ప్రాణ భయంతో కేకలు వేసిన అతిధి అరుపులు విని పరమానందయ్య భార్య సీన్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చి పరిస్థితి ని అదుపులోకి తెస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పచ్చటి బండలు కలిగిఉన్న "బండ శిష్యులు" ఎంత ప్రమాదకరమో పాఠకులకు తెలియజేయడానికి. కథ తెలిసిన వాళ్లకు పునః పరిచయం అనుకోండి. కథ విషయానికి వస్తే ఏకంగా ఏడుగురు బండ శిష్యులతో విద్యా బోధన నిమిత్తం కుస్తీలు పట్టిన పరమానందయ్య ను మొండి గురువని మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే! రోజారమణి - బాల ప్రహ్లాద పాత్ర పోషించిన "భక్త ప్రహ్లాద" సినిమాలో కూడా మనకు ఇద్దరు మొండి గురువులు (రేలంగి, పద్మనాభం) - అనేకమంది బండ శిష్యులు కనిపిస్తారు. ఇదంతా సరదాకే, అసలు విషయానికి వస్తే ఉద్దండులైన మరో ఇద్దరు గురువుల గురించి, వారికి తగిన శిష్యుల గూర్చి ఆసక్తికరయిన విషయం చెప్పుకుందాం!
"బ్రహ్మం గారు వంటి గురువు ఉంటే సిద్ధయ్యవంటి శిష్యుడు ఉండనే ఉంటాడు" - ప్రాచుర్యంలో ఉన్న మరో తెలుగు సామెత ఇది. తెలుగు నేలపై జన్మించిన బ్రహ్మం గారు, ఆయన శిష్యుడు సిద్దయ్య 1600 శతాబ్దంకు చెందినవారు. దూదేకుల సిద్ధయ్యగా ఖ్యాతిగాంచిన సిద్ధయ్య (సిద్దీఖ్) పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుల్లో ప్రముఖుడు. గురువుకి తగిన (లేదా మించిన) శిష్యుడు అని చెప్పే సందర్భంలో పుట్టిన తెలుగు సామెత ఇది. ఆధునిక భారతంలో ఇటువంటి ఆధ్యాత్మిక గురు శిష్య జంట మరొకటి ఉంది - వారు మరెవరో కాదు - "రామకృష్ణ పరమహంస - స్వామి వివేకానంద" నే. గత నెల రచ్చబండలో శిష్యుడు "స్వామి వివేకానంద" గూర్చి కొంత చర్చించాం, ఈ నెల రచ్చబండ చర్చ ఆయన గురువు "రామకృష్ణ పరమహంస" మీదనే!
ఉపోద్ఘాతం అయింది కాబట్టి, అసలు విషయానికి వద్దాం. ఖుదిరామ్ ఛటోపాధ్యాయ మరియు చంద్రమణీ దేవిలకు జన్మించిన స్వామి రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ. ఇతని జన్మదిన వార్షికోత్సవాన్ని హిందూ కాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్ల పక్షము సందర్భంగా విదియ తిథి నాడు జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పుట్టిన తేదీ ఫిబ్రవరి 18, 1836.
గదాధర్ - రామకృష్ణ ఎలా అయ్యాడో, ఆయన అసలు కాళీ మాత గుడి పూజారి ఎలా అయ్యాడో కూడా తెలుసుకుందాం. 1855లో కలకత్తాలోని జాన్‌బజార్‌లోని ప్రముఖ పరోపకారి రాణి రాష్మోని దక్షిణేశ్వర్‌లోని కాళీ ఆలయాన్ని స్థాపించారు. రాణి రాష్మోని అల్లుడు, మాథుర్‌బాబు కలకత్తాలో గదాధర్ అన్నయ్య రామ్‌కుమార్‌ను కలుసుకుని, ఆలయ ప్రధాన పూజారి పదవిని తీసుకోమని ఆహ్వానించాడు. రామ్‌కుమార్ తన తమ్ముడు గదాధర్‌ని తన రోజువారీ పూజలలో సహాయం చేయడానికి దక్షిణేశ్వర్‌లో చేరమని పంపాడు. గదాధర్ దక్షిణేశ్వర్ చేరుకున్నాడు మరియు కాళీ దేవతను అలంకరించే బాధ్యతను ఆయన చేపట్టాడు. 1856లో రామ్‌కుమార్ మరణించడంతో గదాధర్ ఆలయ ప్రధాన పూజారి పదవిని చేపట్టాడు. గదాధర్ యొక్క దైవభక్తి మరియు కొన్ని అతీంద్రియ సంఘటనలను చూసిన రాణి రాష్మోని అల్లుడు మాథుర్‌బాబు యువ గదాధర్‌కు “రామకృష్ణ” అని పేరు పెట్టాడని చెబుతారు. క్రమంగా ఆలయ దేవత అయిన మహాకాళీని విశ్వమాతగా రామకృష్ణ పరిగణించాడు. రామకృష్ణ 1861-1863 సమయంలో భైరవి బ్రాహ్మణి అనే మహిళా ఋషి నుండి ‘తంత్ర సాధన’, తాంత్రిక మార్గాల సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఆమె మార్గదర్శకత్వంలో రామకృష్ణ తంత్రాల యొక్క మొత్తం 64 సాధనలను పూర్తి చేసారు. భైరవి దగ్గర కుండలినీ యోగా కూడా ఆయన నేర్చుకున్నాడు.
స్వామి రామకృష్ణ పరమ హంస భార్య శారదామణి ముఖోపాధ్యాయ కూడా ఆయన శిష్యురాలిగా మారి "శారదా మాత" గా పేరొందింది. తాను ఉన్నత బ్రాహ్మణ కులానికి చెందినవాడిని అనే ఆలోచనను వదిలించుకోవడానికి, శూద్రులు లేదా నిమ్న కులాలచే వండిన ఆహారాన్ని రామకృష్ణ తినడం ప్రారంభించాడు. రామకృష్ణ సన్యాసి గా లాంఛనప్రాయ జీవితాన్ని 1865లో గురువు సన్యాసి తోతాపురి నుండి ప్రారంభించాడు. రామకృష్ణ శిష్యులలో ప్రముఖుడు నరేంద్రనాథ్ దత్తా - నరేంద్రుడు. ఇది స్వామి వివేకానంద సన్యాసం స్వీకరించడానికి ముందున్నపేరు. నరేంద్రుడి మనస్సులో దేవుని ఉనికికి సంబంధించిన తాత్విక ప్రశ్నలకు అనేక గురువులనుండి సమాధానం లేదు. ఈ ఆధ్యాత్మిక సంక్షోభం సమయంలో, నరేంద్రుడు స్కాటిష్ చర్చి కళాశాల ప్రిన్సిపాల్ విలియం హస్టీ నుండి రామకృష్ణుని గురించి మొదట విన్నాడు. అంతకుముందు, భగవంతుని దర్శనం కోసం తన మేధో తపనను సంతృప్తి పరచడానికి, నరేంద్రనాథ్ అనేక మతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక నాయకులను సందర్శించి, “మీరు దేవుడిని చూశారా?” అని ఒకే ప్రశ్న అడిగేవాడు. ప్రతిసారీ వారి వద్దనుండి తృప్తికరమైన సమాధానం లేకుండానే వారి వద్దనుండి అసంతృప్తిగా బయటికి వచ్చేవాడు.
ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో వారంతా మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి. పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృదు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాద్యాత్మత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా, రామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు. "అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు?" అన్నాడాయన.
ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనికేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరికి గురు శిష్య బంధం బలపడసాగింది. గురు పాద స్పర్శ ఎంతో గొప్పది కదా! ఆ అదృష్టం నరేంద్రుడికి లభించింది.
1885 మధ్యలో, గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న గురువు రామకృష్ణ ఆరోగ్యం క్షీణించింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. 1886 ఆగస్టు 16న శ్రీరామకృష్ణులు తన చివరి రోజున నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు – “నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. ఈ శిష్యులంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే” అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు.
రామకృష్ణులవారు చనిపోయిన తరువాత నరేంద్రుడు శిష్యులందరూ కలిసి బరనగూర్‌లో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడి నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే ఆయన రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం, ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు, రామకృష్ణ మఠానికి నాయకుడయ్యాడు. అక్కడ ఉన్న ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. వారు ఉపవాసం ఉన్నపుడు కూడా తమ ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి తన గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశ విదేశాలలో ఆయన పర్యటించాడు. అమెరికా పర్యటన ముగించుకుని భారతదేశం తిరిగొచ్చిన స్వామి వివేకానంద ఇక్కడి ప్రజల్లో నెలకొంటున్న అలసత్వం, క్రమశిక్షణారాహిత్యాన్ని గమనించి వారి కోసం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో మే 1, 1897న కలకత్తా సమీపంలోని బేలూరు మఠంలో రామకృష్ణ మిషన్‌ను స్థాపించాడు స్వామి వివేకానంద. అంతకుముందు నాలుగేళ్లపాటు దేశ వ్యాప్తంగా పర్యటించిన స్వామి వివేకానంద భారతీయుల్లో ఉన్న దేశభక్తి, సామర్ధ్యాలను గుర్తించారు. వాటిని జాగృతం చేసేలా రామకృష్ణ మిషన్ ను ఏర్పాటు చేశారు. తన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస బోధనలు, తన ఆశయాలను సాధనకు ఏర్పాటు చేసిన ఈ మిషన్ కు తన గురువు పేరే పెట్టి గురుభక్తిని చాటుకున్నారు స్వామి వివేకానంద. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది స్వామి వివేకానంద మంత్రముగా మారింది. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడు. స్వామి వివేకానంద తాను ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించేవారు.
నేడు దేశ వ్యాప్తంగా 275 రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో సన్యాసం స్వీకరించిన శిష్యులు, గురువులు కలిపి 2 వేల మంది వరకూ ఉన్నారు. దాదాపు వెయ్యి మంది శిక్షకులు ధ్యానం, సమాజసేవ తదితర విభాగాలలో యువతకు ఆధ్యాత్మిక అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ యువకులలోనే ఎంతోమంది ఆధునిక వివేకానందులు వస్తున్నారు. ఒక్కరి పుట్టుక ఎంతోమంది జీవితాలను ఉన్నతంగా మార్చగలదు అన్నదానికి ఉత్తమ ఉదాహరణ రామకృష్ణ పరమహంస. ఫిబ్రవరి 18న ఈ భూమి మీదకు వచ్చిన రామకృష్ణ పరమహంస గారికి శతకోటి జన్మదిన శుభాకాంక్షలు.
కోల్ కతా లోని రామకృష్ణ ఆశ్రమం తరువాత విశాఖపట్నం లోని రామకృష్ణ ఆశ్రమం కూడా చాలా ప్రాముఖ్యమైంది. రామకృష్ణ పరమహంసకు స్వయంగా శిష్యుడైన స్వామి శివానంద 1924 లో విశాఖపట్నం సందర్శించి కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ కూడా ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉండాలని ప్రస్తుతం ఉన్న రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేశారు. తరువాతి కాలంలో బీచ్ ను రామకృష్ణ బీచ్ అని పిలవటం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా మిగిలిన అన్ని ఆశ్రమాలలాగే ఉదయం నుండి పూజా కార్యక్రమాలు ఒకవైపు, లైబ్రరీ నిర్వహణ, యోగా, సంస్కృత భాషా శిక్షణ వంటివి మరోవైపు నిర్వహిస్తారు. రాను రాను రామకృష్ణ బీచ్ కాస్తా వాడకంలో "RK బీచ్" గా మారిపోయింది. ఇప్పటి విశాఖపట్నం యువతరం వారిని "RK బీచ్" లో RK అంటే ఎవరు అని ప్రశ్నిస్తే వారు బిక్కమొహం వేసినా మనం ఒకింత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదది. ఏలినవారు గాంధీ రోడ్ కి "మహాత్మ" తగిలించి "మహాత్మా గాంధీ రోడ్" అని ఘనంగా పేరుపెడతారు, ఆనక రాను రాను "మహాత్మా గాంధీ రోడ్" పూర్తి పేరు పోయి "MG రోడ్" గా స్థిరపడిపోతుంది, దాని బదులు "గాంధీ రోడ్" అంటేనే బాగుంటుందేమో? బెంగుళూరు లో ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఈ లెక్కన ఈ పేర్లు కుదించే వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే "స్వామి వివేకానంద" కు వారు ఇంకా షార్ట్ ఫామ్ కనుగొనలేదు.
రామకృష్ణ పరమ హంస గూర్చి గమ్మత్తైన విషయం మీతో పంచుకోవాలి. నేను చదివిన కాలేజీలో కొత్త బ్యాచ్ కుర్రాళ్ళు వచ్చినప్పుడు, సీనియర్లు వారిని ఒక కొంటె ప్రశ్న అడిగే వారు. "రామకృష్ణ పరమ హంస ఉన్నాడా, పోయాడా" అని, వారు చిన్న నవ్వు నవ్వి "ఆయన ఎప్పుడో పోయాడని" చెప్పేవారు! అయితే వారికి దిమ్మ తిరిగేలా పక్కనే కాలేజీ ప్రిన్సిపాల్ రూమ్ కు ఉన్న నేమ్ ప్లేట్ చదవమని సీనియర్లు వారిని ఆదేశించేవారు. ఆ నేమ్ ప్లేట్ చదివిన కొత్త బ్యాచ్ కుర్రాళ్ళ ముఖం మాడిపోయేది... ఎందుకంటే అప్పటి మా కాలేజీ ప్రిన్సిపాల్ పేరు కూడా "రామకృష్ణ పరమ హంస" నే. ఆ తరువాత సీనియర్లు వారితో వాదనకు దిగేవారు - బాబులు ఫ్రెష్ గా కాలేజీలో దిగారు, సంతోషం, మేఘాల్లో విహరిస్తున్న మీరు క్రిందకి దిగి ముందు మీరున్న కాలేజీ ప్రిన్సిపాల్ పేరు తెలుసుకోండి, తరువాత అసలు "రామకృష్ణ పరమ హంస" గురించి అని....
రామకృష్ణ పరమహంస గురించి ఔత్సాహికులు ఎవరైనా అధ్యయనము చేసేముందు ఆయన తన శిష్యులకు చెప్పిన కథల గురించి ముందు అధ్యయనము చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆయన చెప్పిన చిన్న కథలు వింటే అనేక సంక్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను తన కథలలో ఉన్న సాధారణ పాత్రలతో - లోతైన కథా సారాంశం తో ఆయన అనుసంధానం చేసిన ప్రక్రియ విస్మయం కలిగిస్తుంది. రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక చిన్న కథ తో ఈ చర్చను ఈ సంచికకు ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక ఊరిలో యజమాని కింద కొంతమంది పనివాళ్ళు ఉండేవారు. ఒకరోజు యజమాని ఒక పనివాడిని పిలిచి, నేను వేరే ఊరుకు వెళ్తున్నాను, ఆరు నెలల వరకు తిరిగి రాను, ఈలోగా నేను ఉంటున్న ఈ భవంతిని నీదిగా భావించు, నా ఇంట్లోనే చక్కగా భోజనం చెయ్యి, నా పరుపును నీదిగా భావించి దాని మీద చక్కగా విశ్రమించు, ఇక్కడే ఉండు, కానీ ఈ భవంతిలో వెనుక ఉన్న చిన్న కొలనులో ఉన్న చేపల జోలికి వెళ్ళవద్దు అని చెప్పి చక్కా పోయాడు. ఆ క్షణంనుండి పనివాడు తనని యజమానిగా భావించుకొని ఆ భవనంలోనే ఉంటూ చక్కగా అన్ని సౌకర్యాలు అనుభవించసాగాడు. రోజులు గడిచేకొద్ది ఆ పనివాడికి కొలనులో ఉన్న ఒక చేపను తినాలనే కోరిక బలపడింది. ఒక్క చేపను పట్టి వండుకొని తింటే పోలా, యజమాని ఎప్పుడొస్తాడో ఏంటో, ఒక వేళ వచ్చినా కొలనులో చేపలను లెక్కపెట్టుకుంటాడా ఏంటీ, ఒక చేప చచ్చిపోతే నేనే బయట పారేసాను అని బొంకితే పోలా! అనుకున్నాడు, అనుకోవడమే తరువాయి, ఒక గాలం బిగించి కొలనులో విసిరాడు. చేప సంగతి తరువాత, అకస్మాత్తుగా యజమాని ఎక్కడినుండో ఊడి పడ్డాడు. "ఒరే! చేపలు మినహా మిగిలినవన్నీ నిన్ను అనుభవించమన్నాను, నువ్వు చేపల జోలికి వచ్చి మాట తప్పావు, నీకిక్కడ ఒక్క క్షణం కూడా స్థానం లేదు" అని గాలంతో సహా పనివాడిని భవంతి నుండి బయటకు విసిరి పారవేసాడు. కథ ఇంకా కొద్దిగ ఉంది. ఈ కథలో యజమానిని "ఈశ్వరుడి" గా, పనివాడిని "జీవుడి" గా ఊహించుకోమని రామకృష్ణ పరమహంస తన శిష్యులకు చెబుతాడు. ఈశ్వరుడు జీవుడిని సృష్టించినప్పుడు కొన్ని నియమాలను ఏర్పరిచాడని, వాటిని అతిక్రమిస్తే సమయం వచ్చినప్పుడు జీవుడి కర్మలకు జీవుడే బాధ్యత వహించాలని - రామకృష్ణ పరమహంస ఈ కథ ద్వారా తన శిష్యులకు బోధించాడు అని మనకు అర్థం అవుతుంది. స్ఫూర్తి కలిగించే ఇటువంటి మరిన్ని రామకృష్ణ పరమహంస కథలకు "ఓం గూగులాయన నమః" అంటే చాలు మీ లాప్ టాప్ తెరపై సదరు కథలు ప్రత్యక్షం అవుతాయి, కదా? మీదే ఆలస్యం మరి!
చివరిగా, మన ఆధ్యాత్మిక జ్ఞానం మన వారసత్వం కు ప్రతీక అయిన స్వామీ వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే అని మన విజ్ఞుల ఉవాచ. అసలు వివేకానంద అంటేనే “వివేచనాత్మక జ్ఞానం యొక్క ఆనందం”. నా విషయానికి వస్తే …"ఎక్కడో పాతాళంలో ఉన్న నా జ్ఞానం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కాస్త పైకి తేలుతుందని" నా అనుమానం, కాబట్టి "జ్ఞానం" ను బోధించడానికి నేను గురువును కానేకాదు, కానీ శ్రీరామకృష్ణుల వారి జయంతి సందర్భంగా ఈ చర్చను ఆసాంతం చదివిన వారికి కాసింత "ఆనందం", మరికొంత "ఆసక్తి" కలిగితే నాకదే చాలు. ఫిబ్రవరి 18, 2023 న శ్రీరామకృష్ణుల వారి జయంతి సందర్భంగా సిరిమల్లె పాఠకులకు ఆధ్యాత్మిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం, ఈలోపు మీ స్పందను కింది కామెంట్ బాక్స్ లో రాయడం మరచిపోవద్దు సుమా!
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం