ప్రతి మనిషి మొదటగా జన్మనిచ్చిన అమ్మ గురించి, మాట నేర్చిన అమ్మనుడి గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఎంతో ఉంది. అమ్మ గురించి చెప్పాలంటే, అమ్మ మమతానురాగాలు చవి చూడాలి. అమ్మనుడి గురించి చెప్పాలంటే, ఆ మాతృభాషా సౌందర్యాన్ని, దాని గొప్పదనాన్ని, ఆ నుడి లోని సాహిత్య సంపద గురించి తెలుసుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 కోట్ల తెలుగు వారి భాష తెలుగు. మనదేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే రెండవ భాష మన తెలుగే. ఈ మధ్యన బ్యాంకాంగ్ లోజరిగిన అంతర్జాతీయ లిపుల సదస్సులో కొరియా భాష తర్వాత రెండవ అంతర్జాతీయ లిపిగా తెలుగునే సమర్థించారు. అంత చక్కని అజంత భాష. అమర భావాల అమృత భాష. మన తెలుగు నుడి.
ఇక తెలుగు నడి చరిత్ర గురించి చెప్పుకుంటే, ఇది క్రీస్తుకు ముందు దాదాపు 3000 సంవత్సరాల క్రితమే తొలి అడుగులు వేసిన ద్రావిడ భాష తెలుగు అని చెప్పవచ్చు. అంటే ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుపూర్వమే కొన్ని శతాబ్దాల ముందు ఉన్నది. ప్రపంచంలో అన్ని భాషల కన్నా పాత భాషగా పాత సుమేర్ భాషను ఎక్కువమంది అంగీకరించారు. తరువాత పాత ఈజిప్టు, హిబ్రూ, గ్రీకు, పాతచైనా, కొరియా భాషలు పాతవిగా గుర్తించారు. మన తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషలు ఇండో ఆర్యన్ భాషాకుటుంబానికి చెందినవి. అంటే ఇండో యూరప్ కుటుంబానికి చెందినవి. మరి మన ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తులు, కొడగు, కుడుక్, గోండి, గదబ, ద్రావిడ భాష కుటుంబానికి చెందినవి. ఇక కొందరున్నట్లుగా జనని సంస్కృతంబు సకల భాషలకు అన్న మాటతప్పని ఎందరో సాహితీ వేత్తల వాదన నిజమే. మన తెలుగు, ఇతర ద్రావిడ భాషలకు, సంస్కృతానికి సంబంధమే లేదంటారు. ఇక ఇతర భాషలు చూస్తే హిందీ, సంస్కృతం, ప్రాకృతం, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, అస్సామీ, గుజరాతి, ఒరియా, మరాఠీ, కాశ్మీరీ, కొంకిని, నేపాలి, ఈ భాషలన్నీ ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినవి. ద్రావిడ భాషల్లో మొదటగా విడివడిన భాష తెలుగు. తెలుగు తర్వాత తమిళం, కన్నడం మలయాళం విడిపోయాయి. ప్రపంచంలో దాదాపు 6000 భాషలు ఉన్నాయి. వాటిలో సొంత లిపి కలిగి ఉన్న భాషలు దాదాపు 400 లోపు. అసలు హిందీ, సంస్కృతం, మరాఠీలకు సొంత లిపులు లేవు. అవి దేవ నగరి లిపిని వాడుకుంటున్నాయి. భారతీయ భాషా కుటుంబాల్లో ముఖ్యమైనవి రెండు భాషా కుటుంబాలు. ఒకటి ఇండో ఆర్యన్ భాష కుటుంబం, రెండవది ద్రావిడ భాషా కుటుంబం. ఇండో ఆర్యన్ భాషలకు చెందినవి ఉత్తర భారతీయ భాషలు. వాటిని ఉత్తర భారతీయ ఆర్య భాషలని కూడా అంటారు. ద్రవిడ కుటుంబానికి చెందిన భాషలు దక్షిణ భారతీయ భాషలు వీటిని ద్రావిడ భాషలు అంటారు.
అలాగే ప్రపంచంలో ఉన్న భాషలలో ఎక్కువ ధాతువులు (roots of verbs,) ఉన్న భాష మన తెలుగే. క్రియాధాతువులు తమిళానికి 450, హిందీకి 350, సంస్కృతానికి 1400, మరి మన తెలుగుకి ఎన్నో తెలుసా! 1800 ధాతువులు ఉన్నాయి. అంత గొప్ప భాష మనది. ధాతుక్రియలు అంటే కోయు, మూయు, వ్రాయు, వచ్చు, పోవు, కూరు, వండు,నేయు, తెచ్చు, ఇచ్చు....ఇలా.. ఉదాహరణకు చేయు అనే మూలక్రియనే తీసుకుంటే ఆ మూల ధాతువు నుండి ఎన్ని పదాలు పుట్టించవచ్చునో తెలుసా! అవి చేత, చేనేత, చేయగల, చేసి, చేసిన, చేయుచున్న, చేసినట్టు, చేయలేని, చేసుకున్న, చేసుకుపోతున్న, చేస్తూ, చేస్తూఉన్న, చేయలేక, చేతకాక, చేతనైన ,....ఇలా వేల పదాలు పుట్టించుకోవచ్చు. ఈ సౌలభ్యం ఇంతగా ఇతర నుడులలో లేదు.
అలాగే మన తెలుగు అజంత భాష. అంటే ప్రతి పదము చివర అచ్చు ఉచ్చారణతో మాట అంతమవుతుంది. అందుకే అజంత అన్నారు. ఉదాహరణకు ...తమిళంలో నింగల్, ఊంజల్, పెరుమాళ్ చివరి అక్షరాలు, హల్లు వుచ్చారణ ఉంటాయి. అలాగే ఇంగ్లీషు తీసుకుంటే మదర్, వాటర్, పెన్, టెన్, చివర అక్షరాలు వుచ్చారణ హల్లుతో ఉంటుంది. అలాగే హిందీ తీసుకుంటే ..జంగల్ ,పాగల్, జమీన్ చివరక్షరాలు హల్లు ఉంటాయి. మరి మన తెలుగు మాటల చివర అచ్చు ఉచ్చారణ ఉంటుంది. మచ్చుకు అందరూ దీనిలో చివరి అక్షరం ర్+ ఊ....అమ్మ...మ్మ... మ్+అ..ఏమే...మే...మ్+ఏ.. ఇలాగే అన్ని మాటల చివర అచ్చు ఉచ్చారణతో ఉంటుంది. ఇలాంటి ఉచ్చారణ లాటిన్ ఇటాలియన్ భాషకు కూడా ఉంది, అందుకే లాటిన్ భాష కూడా అజంత భాష కాబట్టి తెలుగును *ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్* అన్నారు. అందుకే తెలుగు వినడానికి, అనడానికి అందమైన ఒంపు సొంపుల భాష. తేట తేనెల భాష. సంగీతానికి అనువైన భాష. అమృత నుడుల పాలధారలో పంచదార కలిసిన భాష. మన అమ్మనుడి తెలుగు నుడి.
మన భాషలో ఏది పలుకుతామో అదే వ్రాస్తాము. కానీ కొన్ని భాషలలో అలా ఉండదు మచ్చుకు ఆంగ్లం తీసుకున్నట్లయితే కామ్(calm) ఇక్కడ L ను పలకము, అలాగే (put) పుట్ అయితే but, బుట్ కావాలి, కానీ బట్ అని పలుకుతారు. కానీ తెలుగులో అలా కాదు, ఎన్ని వ్రాలు పలుకుతామో, అన్ని అక్షరాలే చాలు. మచ్చుకు అమ్మ అనే మాట ఉంటే అ+మ్మ...రెండు అక్కరాలు. అదే ఇంగ్లీషులో మదర్ అంటే మ+ద+ర్=3 వ్రాలు. కానీ mo,the,r ఆరు అక్షరాలు కావాలి. పక్కింటి అమ్మాయి అని తెలుగులో వ్రాయాలంటే ఆరు అక్షరాలు చాలు. అదే తమిళంలో పక్కింటి అమ్మాయి అలాంటి అర్థం వచ్చే మాట రాయాలంటే 13 అక్షరాలు కావాలి. అలాగే ఎదురింటోళ్లు తెలుగులో ఐదు అక్షరాలు చాలు. అదే తమిళంలో వ్రాయాలంటే 20 అక్షరాలు అవసరం. అలాగే హిందీలో ఎ, ఒ అక్షరాలు లేవు ఎ,ఏ లకు ఒకే అక్షరాన్ని వాడాలి. హిందీలో కొండయ్య వ్రాయాలంటే వ్రాయలేము, కోండయ్య అని రాయాలి. అలాగే, మాది గొప్ప భాషని చెప్పుకునే తమిళంలో ఖగఘఛజఠడఢధథఫబభ అక్షరాలు లేవు. వారు గాంధీ అని వ్రాయలేరు. వారు కాంతీ అని వ్రాస్తారు. చూశారా మన తెలుగు గొప్పదనం, సౌందర్యం, సౌలభ్యం. కనుక భాషాపరంగా భారతదేశంలో అన్ని భాషల కన్నా మన తెలుగే గొప్ప.
కాబట్టే కన్నడ ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల వారు *దేశభాషలందు తెలుగు లెస్స అనడం నూటికి నూరుపాళ్ళు నిజం. అలాగే కొన్ని ఏండ్ల క్రితమే బెంగాలీ భాషా వేత్త సునీల్ కుమార్ చటర్జీ గారు మొదట్లో దేశంలో ద్రావిడ భాషలే మాట్లాడే వారిని తర్వాత ఆర్యుల రాకతో సంస్కృతం జనము లోనికి వచ్చిందని చెప్పారు. అలాగే విజయవాడలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన రహంతుల్లా గారు పరిశోధన చేసి తెలుగు దేవ భాషని తెలియజేశారు. ఇంకా చెప్పుకోవాలంటే తమిళ సాహితీవేత్త అప్పయ్య దీక్షల వారు తెలుగు గురించి ఇలా అన్నారు *ఆంధ్రత్వమాంధ్ర భాషాచనాల్పస్య తపనఃఫలమ్*
అంటే ఆంధ్రుడు ఆంధ్ర భాషను పొందడం ఎన్నో తపస్సుల ఫలం అని అన్నారు. అలాగే తమిళ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి వారు తెలుగు గురించి చెబుతూ *కాశ్మీర్ థారు సరస్సులో పడవలో పయనిస్తూ మలయాళం అమ్మాయి తెలుగు పాట పాడుతూ ఉంటే వినాలని ఉంది* అని వారి కోరిక చెప్పారు. చూశారా మన తెలుగు గొప్పతనం ఇతర భాషల వారు ఎంతో గొప్ప తెలుగని చెబుతుంటే, మనం మాత్రం తెలుగు వారమై ఉండి, సిగ్గు లేకుండా, డాలర్ల వ్యామోహంలో పడి పరభాష, పరుల సంస్కృతిలో కూరుకుపోతూ , కనీసం కన్న అమ్మను కూడా అమ్మ అని పిలవడానికి సిగ్గుపడుతూ, అమ్మను మమ్మీ అంటే శవంగా పిలుచుకుంటూ ఆనందిస్తున్నాము. ఇందుకు నవ్వుకోవాలో, ఏడ్వాలో మనమే ఆలోచించుకోవాలి.
అయితే ఇప్పటి ప్రభుత్వాలు కూడా తెలుగును రాజకీయానికి వాడుకొంటున్నాయి. ఓట్ల కోసం తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి, ఇంగ్లీష్ మాధ్యమాన్ని చదువులలోకి తెచ్చారు. అలాగే మన ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వ బడులలో విద్యను నీరసపరుస్తూ, ప్రైవేటు వారికి కొమ్ముకాస్తూ, ఇంగ్లీష్ మీడియంకు వత్తాసు పలుకుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన ప్రభుత్వాలు, పత్రికలు, టీవీ వారు సాహితీవేత్తలు తెలుగు గురించి పట్టించుకోకపోతే, ఐక్యరాజ్యసమితి వారి నివేదిక చెప్పినట్లు, రాబోయే 30 సంవత్సరాలలో మరుగయ్యే భాషలలో తెలుగు ఒకటి అన్నమాట నిజం అవుతుందేమో. నిజమే ఎందుకంటే నేడు తెలుగు వారి పిల్లల్లో 90 శాతము ఇంగ్లీషులో చదువుతున్నారు. వారికి తెలుగు రాయడం, చదవడం రాదు. ఇక తెలుగు అక్షరాలతో పనేముంది, తర్వాత తరాల వారు తెలుగు అక్షరాలను మ్యూజియంలో చూడవలసిన వస్తుందేమోనని సాహితీవేత్తల ఆవేదన.
ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే ఇంగ్లీషు ప్రభావం వలన, క్రిస్టియన్ మత వ్యాప్తి జరిగి దాదాపు 300 భాషలు కనుమరుగైపోయాయని, వందల జాతుల సంస్కృతులు నాశనమయ్యాయని నివేదికలు అందాయి. పరభాష నేరవడం తప్పేమీ కాదు. ముందు మన మాతృభాష తెలుగునుడిని కాపాడుకుంటూ, తెలుగు నుడిలో విద్యాభ్యాసం చేస్తే పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. ఈ మాటను, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ వీరంతా కూడా మాతృభాషలో విద్యా బోధన ఉంటే విద్యార్థికి పాఠం సులభంగా అర్థమవుతుంది, వికాసం ఉంటుంది అని చెప్పారు. అయితే పరాయి భాష నేర్చుకోవడం వలన మనకు తెలియకుండానే ఆ భాషకు చెందిన ఆ భాష వారి సంస్కృతులు, సాంప్రదాయాలు, కట్టుబొట్లు, తిoడి అలవాట్లు మనకు తెలీకుండానే అంటుకుంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి ఇంగ్లీషు భాష భారతదేశానికి రాకముందు మన ప్రజల కట్టుబొట్లు, వస్త్రధారణ ఎలా ఉండేది . తర్వాత ఇంగ్లీష్ వారు ప్రవేశించి వారి భాషను, వారి మతాన్ని మనపై రుద్దడం వలన, మనకు తెలియకుండానే వాళ్ళ సంస్కృతి, వాళ్ల కట్టుబొట్లు, వాళ్ళుతినే తిండి మన జీవనం లో వచ్చి చేరాయి. అన్నీ నేడు మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక భాష నశిస్తే, ఆ భాష తెగవారి సంస్కృతి కూడా నాశనం అవుతుంది. అందుకే ఇంగ్లీష్ ఉద్యోగి మైకేల్ చెప్పినట్లు ఒక జాతి సంస్కృతిని నాశనం చేయాలంటే, మొదటగా వారి మాతృభాషను నాశనం చేస్తే చాలు, అని ఆయన అన్న మాటలు ముమ్మాటికీ నిజమే. అవునంటారా! కాదంటారా.!?
ఇక తెలుగు భాష వివరాలకు వస్తే మొదట్లో మూల ద్రావిడ భాషలో తెలుగు అక్షరాలు 26 అచ్చులు 10 హల్లులు 16 తర్వాత సంస్కృత భాష నుండి తెలుగులోనికి అరువు తెచ్చుకున్న అక్షరాలు 19.
ఇక మనం ప్రస్తుతం వ్రాస్తున్న, మాట్లాడుతున్న మాటలలో ఎక్కువ మాటలు, సంస్కృతానివి తర్వాత ఇంగ్లీష్ తర్వాత హిందీ ఉర్దూ మాటలు ఉన్నాయి. మచ్చుకు ఈ మాటలు చూడండి ఎక్కువగా మనం వాడే తెలుగు మాటలలో దాదాపు ఎక్కువ శాతం సంస్కృత పదాలు ఉన్నాయి. అయితే చాలామంది, ఈ మాటలు తెలుగు మాటలు అనుకుంటారు, కానీ నిజానికి ఇవి సంస్కృత పదాలు అని మనలో చాలామందికి తెలియదు. అవి భాష, వర్షం ,నష్టం, కష్టం, లాభం, ఇష్టం ,ప్రేమ ,బాధ, రక్తం, భోజనం, అన్నం, ఇంధనం, నమస్కారం, సభ, సమాఖ్య ప్రభుత్వం అధికారి, ఉపన్యాసం, వేదిక ,అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, జన్మ, మరణం, విశ్వవిద్యాలయం, కార్యాలయం, కర్షకుడు, విద్య, వైద్యం, దారుణం, హత్య, ఉదయం, రాత్రి, మధ్యాహ్నం, భార్య, భర్త, మాత, పిత, భక్తి, భామ, నూతన, సంవత్సరం, ఆహ్వానం, ద్వాదశ దశ దిశ నవ అర్చన దేవాలయం, కృతజ్ఞత, వందనాలు, కవి, రచయిత, కావ్యం, సాహిత్యం..... ఇలా ఎన్నో నిత్యజీవితంలో వాడే అన్ని తెలుగు మాటలు నిజమైన తెలుగు మాటలు కావు. ఇవన్నీ సంస్కృత సంస్కృత పదాలు. అలాగే మన నిత్య జీవితంలో వాడే హిందీ ఉర్దూ పదాలు చూడండి,.. రోజు, ఖర్చు, జబ్బు, కిమ్మత్తు, కాగితం, సుల్తాను , పద్దు, సర్కారు, స్వారీ, తగాదా,శిస్తూ, జప్తు, వగైరా, గుమస్తా, జమీను, ఆఖరు, హంగామా, చాకిరి, నౌకరు, తాసిల్దార్, సలాం, జిల్లా, జమీందారు, ఖరీదు, దస్తూరి, ఫిర్యాదు, కైదు, కబురు, దివాను, రుమాలు, సాలిన , చౌరస్తా..ఇలా ఎన్నో.... ఇక మనం రోజు వాడే ఇంగ్లీషు మాటల గురించి మీకు చెప్పనవసరం లేదు అన్నీ మీకు తెలిసినవే. మన అచ్చ తెలుగు మాటలు, మన మేలిమి తెలుగు మాటలు, జాను తెలుగు మాటలు చాలా వరకు మరుగవుతున్నాయి. వాటిని కూడా మనం నేర్చుకోవలసిన అవసరం, తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. అయితే మన నిత్య జీవిత వాడక లో పరభాష పదాలు వాడరాదని కాదు మన వాదన. అవకాశం ఉన్నంత వరకు మన తెలుగులోనే పరనుడి మాటలకు, కొత్త పదాలు పుట్టించుకోవాలి. అలా వీలుకానప్పుడు ఆ పదాలే వాడుకోవచ్చు, కొత్త మాటలు పుట్టించుకుంటే, భాష బలపడుతుంది, ఆపై నిలబడుతుంది. ఆ పని తమిళులు, కొరియన్లు, చైనా వారు, జపాన్ వారు చేస్తున్నారు. ఇంగ్లీషులో ఒక కొత్త మాట రాగానే దానికి సరైన పదాన్ని వారి మాతృభాషలోనే సృష్టిస్తున్నారు. అది వారికి భాష పై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది. అలాగే మనం కూడా ఏదైనా కొత్త ఇంగ్లీషు మాట వస్తే, అనుగుణంగా అచ్చ తెలుగు మాటను పుట్టించాలి అలా కాకుండా అందరూ సంస్కృత మాటనే పుట్టిస్తున్నారు. మచ్చుకు చూడండి dredger (డ్రె డ ఙ్ఞర్) అనే ఇంగ్లీష్ పదానికి మన వేల్పు నుడి అనుగరులు తెలుగు మాట పుట్టించకుండా సంస్కృత పదం ఉద్గృహణ జల యంత్రం అని అనువదించారు. ఎంత మోసం, చక్కగా *తవ్వోడ* ఉందిగా. అలాగే క్యాలిక్యులేటర్ కు గణక యంత్రం అని సంస్కృత పేరు పెట్టారు. చక్కగా “ఎంచు+ఇక—ఎంచిక” పెట్ట వచ్చుగా, అలాగే జ్ఞానము అనే దానికన్నా ఎరుక, తెలివిడి ఎంత సులభంగా ఉన్నది, వ్రాయడానికి, పలకడానికి బాగా ఉన్నది. అలాగే కామర్స్ లో self baalancing ledger ను స్వయం సమానికృత ఆవర్జాలు...అని సంస్కృతీ కరణ చేశారు.అదే అసలు తెలుగు లో *తా వెల్లడి నిల్వ లెకట్టు*. అలాగే సిగ్నల్ అనే ఇంగ్లీషు మాటకు సంస్కృతంలో*శకట ఆగమన నిగమన సూచిక* అని సంస్కృత పదాన్ని కనిపెట్టారు. అదే తెలుగులో *బండి రాకపోకల చూపిక* ఎంత బాగుంది. అలాగే మెడికల్ పుస్తకాలను తెలుగులో అనువదిస్తూ అక సేరులు, సకచేరులు అని అనువదించారు. ఇవి ఏ పిల్లలకైనా అర్థమవుతాయా, అందుకే అందరూ ఇంగ్లీష్ మీడియం చదవడానికి ఒక కారణమైంది. అలాగే కిరణ జన్య సంయోగ క్రియ అందరికీ తెలిసిందే ఇది సామాన్య మానవులకు అర్థం అవుతుందా దీనినే అచ్చ తెలుగులో *వేడి నిచ్చు కూరిక పని* లేదా *వేడి నిచ్చు కలగూడు చేయిక* ఇది అందరికీ అర్థం అవుతుంది. అయితే ఈ అచ్చ తెలుగు మాటలు కొన్ని సందర్భాల్లో, ఎబెట్టుగాను, కొత్తగాను, వింతగాను ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నతనం నుండి బడిలో, గుడిలో, పుస్తకాలలో, అన్ని సంస్కృత పదాలు కలిసిన మిశ్రమ తెలుగును చదవడం వలన, వినడం వలన, ఆ పదాలు అందంగా, వినసొంపుగా అనిపిస్తాయి. ఎందుకంటే చిన్ననాటి నుండి ఆ సంస్కృత పదాలకు మనం అలవాటైపోయాము. అలాకాకుండా చిన్నతనం నుండి అచ్చ తెలుగు మాటలే బడిలో, పుస్తకాలలో, చదివి, నేర్చి, మాట్లాడి ఉన్నట్లయితే, ఇప్పుడా మాటలు చాలా అందంగానూ, వినసొంపుగాను ఉండేవి. కాబట్టి ఇకనైనా మనము ఇతర భాషలలోని మాటలకు తెలుగులో అందరికీ తెల్లమయ్యే మన జన వాడుక అచ్చతెలుగు మాటలను పొందిక చేయవచ్చు కదా !? అలా చేయరు, ఎందుకంటే వారికి తెలుగంటే దేశ్య మని, గ్రామ్యమని, హీనభాషని, లేకీ భాషగా భావిస్తారు. అనువాదాలన్నీ సంస్కృత మిళిత ఆంధ్ర భాషనే వాడినారు. అందుకే మేధావులంతా, గత మహానుభావులంతా తెలుగును చిన్నచూపు చూసి, వేల్పునుడికి పెద్ద పీట వేశారు. ఇలా నేను అనడం చాలామంది సంస్కృత వాదులకు నాపై చాలా కోపం వస్తుంది, అయినా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పక తప్పదు. సంస్కృతం మనపై రుద్దడం వలన మన తెలుగుకు ఈ సంకర గతి పట్టింది. ఇది అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన నగ్న సత్యం. ఇది మన తెలుగుకున్న పెద్ద ఇబ్బంది. ఇది ఎంతవరకు సబబు. దేవుడి గుడిలో కూడా ప్రార్థనలు తమిళంలోనూ, సంస్కృతంలోనూ ఉంటాయి, ఎందుకని దేవుళ్లకు ఆ భాషలు అర్థం అయినప్పుడు తెలుగు అర్థం కాదా !? అక్కడ తెలుగులో ప్రార్ధనలు చేయవచ్చు కదా! అలాగే పెళ్లిళ్ల తంతులో కూడా ఆ పెళ్లిళ్ల మంత్రాలు ఏమిటో, ఎవరికి అర్థం కావు. దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒప్పులు ఉన్నాయో, వాటి అర్ధాలు మనకు తెలియకుండానే, మన చేత వల్లివేస్తుంటారు. నాతిచరామి అని అంటే ఎంతమందికి అర్థం అవుతుంది, అలాగే ఎవరినైనా తిట్టాలంటే *గార్ధబపుత్ర** అని అంటే అది తిట్టో, పొగడికో తెల్లము గాదు,అదే *గాడిద కొడకా* అని అంటే బాగా అర్థమవుతుంది గదా. అలాగే వైష్ణవ గుడులలో తమిళ ప్రాశురాలు చదువుతుంటారు .ఇలా చెప్పుకుంటూ పోతే అనేక శ్లోకాలు, ప్రార్థన గీతాలు, మేలుకొలుపులు, సుప్రభాతాలు అన్ని అర్థం కాని సంస్కృతంలోనే ఉంటాయి. ఏ వాటిని ఎందుకు అచ్చ తెలుగులోకి అనువదించి అందరికీ అర్థమయ్యే రీతిలో చేయడం లేదు. ఒకసారి అందరూ ఆలోచించగలరు. అందుకే అసలు తెలుగు కోసం, అచ్చమైన తెలుగు కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు, వారిలో ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి పంతులు వారు, గురజాడ వారు, విరేశలింగం పంతులుగారు, ఆదిభట్ల నారాయణదాసు గారు, చిలుకూరి నారాయణరావు గారు, నారు నాగనార్యులు, శ్రీ పాద కృష్ణమూర్తి గారు, మారే పల్లి రామచంద్ర కవి, కాళోజీ గారులు..ఇలా ఎందరో మహానభావులు గురించి చెప్పుకోవచ్చు.
కనుక ఇకపై తెలుగు అభిమానులందరూ తెలుగులోనే మాట్లాడుదాం తెలుగులోనే ఆలోచించుదాం. తెలుగునుడికై పోరాడుదాం. తెలుగు వాడుక బాసను కాపాడుకుందాం.
జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి -- తెలుగునుడి నెననరి... *రాఘవ మాస్టారు కేదారి*