అవధాన్లు గారు పురాణం చదువుతున్నారు గుళ్ళో. కధ దాదాపు అందరికీ తెల్సినదే. తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినందుకు హిరణ్యకశిపుడు బ్రహ్మకోసం తపస్సు చేసాడు. అతి దారుణమైన తపస్సు పూర్తయ్యి శరీరం శిధిలమైపోయే రోజుకి బ్రహ్మ కనిపించి ఏమి కావాలో కోరుకో అంటే హిరణ్యకశిపుడు అడిగాడు, “నీటిలో, భూమిమీద, గాలిలో, ఇంట్లో గానీ, బయట గానీ, దేవ, దానవ, గంధర్వ మానవుల్లో ఎవరిచేతా గానీ, ఏ ఆయుధంతో గానీ చావు రాకూడదు. బ్రహ్మదేవుడికి ఈ కోరిక ఇవ్వక తప్పలేదు – ఏం కావాలో కోరుకో అన్నాడు కనక. అలా హిరణ్యకశిపుడు దాదాపు అజేయుడయ్యేసరికి ప్రపంచం విలవిల్లాడటం మొదలైంది. అందరూ కలిసి శేషతల్పం మీద విశ్రమించే పెద్దాయన దగ్గిరకెళ్ళేసరికి ఆయన చెప్పాడు, “ఏమీ కంగారు లేదు, మీ పనుల్లో మీరు ఉండండి, నేను వీడి సంగతి చూస్తాను.” తర్వాత హిరణ్యకశిపుడు ఎలా చావకూడదనుకున్నాడో అలాగే పోయాడు.
అవధానులు గారు చెప్పడం సాగించారు, “చూసారు కదా, భగవంతుడి ముందు మన బుధ్ధి పనికిరాదు. ఇంతకీ హిరణ్యకశిపుడు అడిగినది తన చావు ఎలా రావాలనా? రాకూడదనా? ఫలానా ఫలానా వాళ్లతో చావు రాకూడదు అని హిరణ్యకశిపుడు కోరుకుంటే, భగవంతుడు దాన్ని ‘వీడికి చావు ఎలాకావాలో’ కోరుకున్నట్టూ అన్వయించి వాడు అడిగినట్టూ నరశింహావతారంలో వచ్చి అంతమొందించాడు. అందువల్ల కోరుకునేటప్పుడు జాగ్రత్త అవసరం సుమా అంటారు. ఎందుకంటే మనం కోరుకునేది మనకి మంచిదేనా కాదా అనేది మనకే తెలియదు.”
పురాణం వింటున్న ముఫ్ఫై ఏళ్ళ వీర్రాజు ఆ రోజు మనసులో బాగా నిశ్చయించుకున్నాడు. తాను ముందు ముందు కాబోయేది రాజకీయనాయకుడు. అందులో శతృవులు ఎక్కువ. ఎవరినీ నమ్మరాదు. బాగా పైకి రావడానికి, బలంగా కుదురుకోవాలంటే హిరణ్యకశిపుడి కోరికలాంటిది తనకి అండగా ఉండాలి. అయితే తాను అతి ఘోరమైన తపస్సు చేయలేడు. ఏదో ఒకటి చేయాలి మరోదార్లో.
**** **** **** **** ****
ఆలోచించగా ఆలోచించగా ఉపాయం తట్టింది. ఊర్లో ఉన్న పంతులుగార్ని పట్టుకుని అడిగాడు ఏం చేయాలో ఈ కోరిక తీరాలంటే. పంతులుగారికీ మధ్య ఆదాయం తగ్గింది, వీర్రాజు వస్తూంటే ఆయనకి తెల్సిపోయింది ఏం చేయాలో డబ్బులు గుంజడానికి. వీర్రాజు వస్తూనే చెప్పేడు, “ఇదిగో ఇదీ పరిస్థితి. తపస్సు చేసే మనసూ, సమయం అవీ లేవు, మీరే బమ్మిని తిమ్మిని చేసి ఏ వ్రతమో, క్రతువో చేసి ఈ కోరిక తీర్చాలి.”
పంతులు ఆలోచించాడు పది నిముషాలు. క్రతువు అంటే మరో పదిమందిని కలుపుకోవాలి. అప్పుడు తనకొచ్చే ఆదాయం పదోవంతు దాకా తగ్గుతుంది. వ్రతం అయితే తానొక్కడు చేయించగలడు. ప్రసాదం, పళ్ళూ అవీ వీర్రాజు పెట్టుకుంటాడు. కానీ బాగా చవక బేరం అయితే కోరిక తీరదని చెప్తే వీర్రాజు నమ్మకపోవచ్చు. అసలు ముందు వీడి కోరిక ఏవిటో తెలియకుండా బేరసారాలు ఏవిటి? అందువల్ల అడిగాడు, “దాపరికం లేకుండా చెప్పండి, ఎందుకీ వ్రతం లేదా క్రతువు చేద్దామనుకుంటున్నారు?”
“ప్రజా సంక్షేమం కోసమే,” అతి సులువుగా అబద్ధం చెప్పగల వీర్రాజులో రాజకీయనాయకుడు చెప్పేడు.
పంతులుగారు నవ్వేడు, “వీర్రాజు గారు, దేవుడి దగ్గిర అబద్ధం పనికిరాదు. పిచ్చిపిచ్చివేషాలు వేస్తే పళ్ళు రాలగొడతాడు ఆయన. నా దగ్గిర దాపరికం ఎందుకు? ఎందుకీ వ్రతం?”
పంతులు ఎవరికీ చెప్పనని విఘ్నేశ్వరుడి పటం మీద చేయి పెట్టి ప్రమాణం చేసాక వీర్రాజు చెప్పాడు, పురాణం లో విన్న హిరణ్యకశిపుడి కధా, తాను కోరుకోబోయే కోరికాను. దాని ప్రకారం వ్రతం చేసాక వీర్రాజు అడిగే కోరిక – ప్రస్తుత కలి యుగం ప్రకారం, కాస్త అటూ ఇటూగా హిరణ్యకశిపుడి కోరికనే మార్చాడు - ఇంట్లోగానీ హాస్పిటల్లో గానీ, గాలిలోకానీ, నీట్లో కానీ, భూమి మీద కానీ ఆకాశంలో గానీ, కత్తిపోట్లతో, తుపాకులతో, దేవ దానవ గంధర్వులతో మానవులతో, పాములతో, మిగతా జంతువులవల్లా, పక్షులవల్లా, బాంబు దాడిలో, విమానంలో, రైళ్ళలో, కారుమీద, నడుస్తూ, ఆఖరికి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు గానీ ఎటువంటి ఆయుధంవల్లా కూడా చావు రాకూడదు.
ఎన్నో ఏళ్ళ తరబడీ ప్రజలు దేవుణ్ణి అడిగే వింత వింత కోరికలు విన్న పంతులు కూడా ఆశ్చర్యపోయేడు ఈ కోరిక విని. ఆ రోజుల్లో హిరణ్యకశిపుడు అడిగాడంటే అది వేరు, కానీ ఆ కోరికని కలియుగానికి సరిపడా మార్చేసి అడగడం చూస్తే ఈ వీర్రాజు గొప్పతనం అర్ధమౌతోంది కదా? ఆశ్చర్యంలోంచి తేరుకుని, తన పని గుర్తొచ్చి చెప్పాడు పంతులు, “ఈ కోరిక కాయితం మీద రాసి మీ దగ్గిరే ఉంచుకోండి. ఆఖరికి మీ కుటుంబంతో సహా ఎవరికీ చెప్పవద్దు. నేను అన్ని కోరికలూ ఈడేర్చే “గృధ్యాభీష్టాదేవి వ్రతం,” చేయిస్తాను మీ చేత. ఈ వ్రతం అయ్యాక మీరు కోరిక రాసిన ఆ కాయితం ఒక కవర్ లో పెట్టి పసుపూ, కుంకుమ అద్ది పూజలో పెట్టండి. ఆ తర్వాత దాన్ని ఇనప్పెట్టిలో ఎవరికీ తెలియకుండా దాచండి. దాని సంగతి మరోసారి నాతో సహా ఎవరి వద్దా అనవద్దు. మనం సరిగ్గా ఆచరిస్తే మీ కోరిక తప్పకుండా ఈడేరుతుంది.”
“మరి దీనికయ్యే ఖర్చు?” వీర్రాజు అడిగేడు.
“ఎంతోనా? తైలం, పప్పు, ఉప్పూ, పూవులూ పళ్ళూ ఇలాంటివీ పసుపూ కుంకుమా పూజ సరంజామా అంతా పదివేలు. నా ఫీజు ఇరవై. ముప్ఫైవేలలో సర్దేర్దాం. పూజ తర్వాత భోజనాలు పెట్టుకోవచ్చు కానీ అది మీ ఇష్టం. పూజా ద్రవ్యాలు మీరే కొంటానంటే మీ ఇష్టం. నన్ను తెమ్మన్నాసరే.”
అసలే తాను అడిగేది అసామాన్య కోరిక. ఇలా చిన్న చిన్న ఖర్చులకి చూసుకుంటే వ్రతం చెడవచ్చు. కాసేపు ఆలోచించి చెప్పాడు వీర్రాజు, ”సరే అన్నీ మీరే చూడండి. ముప్ఫైవేలు మీకిచ్చేస్తాను. భోజనాలకి మేము ఇంట్లో మా తంటాలు మేము పడతాం.”
పంతులు శాకాహారి, మిగతావాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడు కనక ఆయనకి మరో అయిదువందలతో స్వయం పాకం ఇచ్చేటట్టూ, వ్రతం, పూజ రాబోయే పౌర్ణమి నాడు చేయించేటట్టూ నిర్ణయించాక వీర్రాజు లేచాడు ఇంటికెళ్లడానికి.
వీర్రాజు వెళ్లిపోయాక ఇప్పుడిప్పుడే పౌరోహిత్యం తండ్రి దగ్గిర్నుంచి అందిపుచ్చుకునే పంతులి కుర్రాడు అడిగేడు, “నాన్నగారూ, ఇదేం వ్రతం? ముందెప్పుడూ పేరు విన్నట్టులేదే?”
“తెలుగులో గృధ్యం అన్నా అభీష్టం అన్నా కోరిక అనే అర్ధం ఉంది. ఆ రెండింటినీ కలిపి ఈ వీర్రాజు లాంటివాళ్లకి అర్ధం కాకుండా ఉండడం కోసం నేను ఈ “గృధ్యాభీష్టాదేవి” పేరు కల్పించానురా. మనం ప్రధమ గణపతి పూజా, మిగతా మామూలు పూజా చేసి దేవీ అష్టోత్తరం, మంత్రపుష్పం చెప్పి పూజ ముగిస్తాం. వాళ్ల కోరికలు వాళ్ళు కోరుకుంటారు. మన డబ్బులు మనకొస్తాయి. లౌక్యం నేర్చుకో, బాగుపడతావు,” తండ్రి నవ్వుతూ చెప్పేడు.
తండ్రీ కొడుకులు నవ్వుకున్నారు మనసారా.
**** **** **** **** ****
అనుకున్న పౌర్ణమినాడు పూజ పూర్తి అయ్యేక వీర్రాజు పంతులు చెప్పినట్టూ తనకోరిక ఒకటికి రెండుసార్లు చూసుకుని అచ్చుతప్పులు లేకుండా రాసుకుని కవర్లో పెట్టి పంతులికి ఇచ్చాడు. వ్రతం చూడవచ్చినవాళ్ళు ఆ కవర్లో పంతులి ఫీజు ఉందనుకున్నారు. దానికి పసుపుబొట్టు పెట్టి దేవుడి దగ్గిరపెట్టినా ఎవరికీ పట్టలేదు. అవన్నీ ఎవరిక్కావాలి అయినా? వ్రతం అయ్యాక భోజనాలు చేసి అందరూ వీర్రాజు గొప్పతనాన్ని పొగిడారు, ఈ కాలంలో కూడా “ప్రజా సంక్షేమం” కోసం పాటుపడే వీర్రాజులాంటి రాజకీయనాయకుడు ఉన్నందుకు. ఊర్లో ప్రజలకి కూడా తెల్సింది ఈ సంగతి. అయితే ఊరంతా భోజనాలు పెట్టాలంటే కష్టం కనక దగ్గిరవాళ్లకి భోజనాలు పెట్టి, వ్రతం చూడవచ్చిన ఊర్లో వాళ్లకి ఇంటి బయట షామియానావేసి అక్కడ చిన్న చిన్న లడ్డూలు చేతిలో పెట్టారు ప్రసాదంగా. వ్రతం నిర్విఘ్నంగా పూర్తైంది. కోరిక ఉన్న కవర్ జాగ్రత్తగా వీర్రాజు ఇనప్పెట్లో పెట్టాడు పట్టుబట్టలతో మడిగా. పంతులు చెప్పినట్టూ అది ఎన్నడూ మరోసారి వీర్రాజే కాదు ఇంట్లో ఎవరూకూడా విప్పి చూడకూడదు.
పంతులు డబ్బులు తీసుకుని వీర్రాజు కుటుంబం అందరికీ పేరుపేరునా తీర్ధం ఇచ్చి అక్షింతలు జల్లి ఆశీర్వచనం చెప్పాడు మనసారా. పంతులి కొడుకు తండ్రి పక్కనే ఉండి ఇదంతా నేర్చుకున్నాడు సులభంగా. ఆ కుర్రాడికిదంతా మంచి ట్రైనింగ్ రాబోయే రోజులకి. సర్వేజనా సుఖిఃనో భవంతు.
ఈ కవర్ విషయం, వ్రతం విషయం అన్నీ అందరూ పూర్తిగా మర్చిపోయేరు తొందర్లోనే.
**** **** **** **** ****
ఆ తర్వాత వ్రతం ఫలమో మరోటో గానీ వీర్రాజు జీవితం బృహస్పతి గడి తిరిగినట్టూ పుంజుకుంది. మొదట్లో ఎమ్మెల్యే, ఆ తర్వాత చిన్నపాటి మినిష్టర్ అయ్యి పదేళ్ళు గడిచాయి. రాజకీయనాయకుడైన ప్రతీ ఒక్కరికీ జరిగినట్టే వీర్రాజుక్కూడా భజనవర్గం ప్రత్యర్ధులూ మొదలయ్యేరు. ఈ పదేళ్ళలో వీర్రాజుకి రెండు కష్టాలు దాపురించి జీవితం అంత సజావుగా జరగలేదు కూడా. మొదటిది వీర్రాజు ఓ రోజు పొలంలో పైర్లు చూడ్డానికి వెళ్తుంటే తాచుపాము ఎక్కడ్నుంచి వచ్చిందో కానీ ఛర్రున లేచి కాటేసింది కాలుమీద. వెంఠనే కార్లో దగ్గిర్లో ఉన్న హాస్పిటల్లో జేర్పించారు. అదృష్టం కొద్దీ హాస్పిటల్లో విషానికి విరుగుడు మందూ, డాక్టర్ అందుబాట్లో ఉన్నందువల్ల ప్రాణం పోలేదు. మరో రెండు వారాల తర్వాత మామూలుగా తిరగ్గలిగేడు.
రెండో కష్టం ఏమిటంటే, ఓ రోజు కార్లో వెళ్తున్నప్పుడు ముందు వచ్చే లారీ వచ్చి గుద్దేసింది. కారు వెనకసీట్లో ఉన్న వీర్రాజుకి ఓ కాలూ చెయ్యి విరిగి బయటపడ్డాడు కానీ డ్రైవరూ, మిగతావాళ్ళకీ అంత అదృష్టం లేదు. మళ్ళీ నాలుగువారాల్లో మృత్యుంజయుడిగా వీర్రాజు ఆఫీసులో మంత్రి భాధ్యతలు నిర్వహించగలిగేడు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదగడానికీ, ఎదుగుతున్నప్పుడూ వీర్రాజు కొంతమందిని చంపించాడనీ, మరి కొంతమందిని మోసం చేసాడనీ, కొంతమంది అమ్మాయిలతో, మహిళల్తో అసభ్యంగా ప్రవర్తించాడనీ, లంచాలూ అవీ తిని బాగా కోట్లు సంపాదించాడనీ ఏవో అవాకులూ చవాకులూ పేల్తారు జనం కానీ అవన్నీ మనం పట్టించుకుంటామా?
ప్రతీసారీ వీర్రాజు కష్టాల్లోంచి బయటపడగానే పంతులి దగ్గిరకెళ్లడం, ఆయన కి సంభావన ఇచ్చి ఆశీస్సులు పుచ్చుకోవడం జరుగుతూనే ఉంది. ఏడాదిలో ఉండే మిగతా వ్రతాలూ, పూజలూ అన్నీ పంతులు చూస్తున్నాడు కూడా. ఇటు వీర్రాజూ, అటు పంతులూ బాగుపడుతున్నారు. సమస్త సన్మంగళాని భవంతు.
వీర్రాజు పనితీరు నచ్చి ఉత్తరోత్తరా అధిష్టానం వారు ఢిల్లీ పిల్చారు. బేరసారాలు అయ్యాక వీర్రాజు పార్లమెంట్ కి పోటీ చేసాడు. ఈ సారి మళ్ళీ వ్రతం చేసాడు పంతులితో, ఎన్నికల్లో నెగ్గడానికి. వీర్రాజు కధ అంతా ఎప్పటికప్పుడు పేపర్లలో పడుతుండడంతో ప్రజలకి తెల్సినవాడే కనక సులువుగా నెగ్గాడు. పంతులి ప్రకారం వ్రతం ఫలితం వచ్చింది.
ముందు అనుకున్న అధిష్టానంతో బేరం ప్రకారం వీర్రాజు ఇప్పుడు రైల్వే మంత్రి. ఓ పదేళ్ళు అలా పనిచేసాక నిచ్చెన మెట్లు ఎక్కి ఇంకా పైకి పాకుతూ డిఫెన్స్ మినిష్టర్ అయ్యేడు. ఈ లోపుల వీర్రాజుకి అరవై ఏళ్ళొచ్చాయ్. ఊళ్ళో తన కుర్రాణ్ణి ఎమ్మెల్యేగా, నించోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నై. వీర్రాజు ఓ చేయి వేస్తాడు దానికోసం. అదేం అంత కష్టమైన పని కాదు.
జూన్ 2020 సంవత్సరం తిరిగేసరికి చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ దేశం లో విజృంభించడం ప్రారంభమైంది. అప్పుడే వీర్రాజు ముఖ్యంగా ఫ్రాన్స్ గవర్నమెంట్ నుంచి దేశానికి ఆయుధాలు కొంటూ ఫ్రెంచ్ వారైన ఒక పెద్దాయన్ని కల్సుకోవాల్సి వచ్చింది. అంతా రొటీన్ పని. వచ్చినవాళ్లని పలకరించడం, కూడా ఫలహారం, కరచాలనాలు, కాయితాల మీద సంతకాలు, ఫోటోలు దిగడం వగైరా అయ్యాక ‘దేశం పైపైకి లేస్తూ తారాజువ్వలా వెలిగిపోతుంది, ఈ ఆయుధాలతో మనం ఏ దేశాన్నైనా మట్టికరిపించగలం’ అనే స్టేట్ మెంట్లూ అవీ ఇచ్చాడు. ఇదంతా ప్రముఖంగా పేపర్లలో అచ్చు దిగింది. ఇంటర్నెట్లో, వాట్సాప్ మీదా, ట్విట్టర్లో జామ్ జామ్మంటూ ఇదంతా ఓ వెలుగు వెలిగింది.
వెంఠనే అందరూ అనుకున్నట్టుగానే పొరుగు దేశం “మేము ఇదంతా చూస్తూ ఊరుకోం, కాశ్మీర్ మీద ప్రయోగించడానికేనా ఈ ఆయుధాలన్నీ? అమెరికా, రష్యా, భారద్దేశం ఏం చేస్తోందో చూస్తున్నారా?” అంటూ దుయ్యబట్టింది రెండురోజులు. కరోనా కాలంలో ఎవరి కష్టాలు వాళ్లకి ఉన్నాయి కనక ఎవరూ పట్టించుకోలేదు. అరిచి అరిచి నోరు నెప్పెట్టి పొరుగుదేశం నోరు మూసుకుంది కొన్నాళ్ళకి.
కొంపదీసి కరోనా …….తో… పదిలంగా వ్రాసుకున్న చీటీ ని ముడిపెట్టారా???.
కధ చాలా బాగుంది.
Very interesting, can’t wait to read the next episode. Please publish fast.
కథ ఆసక్తి గా ఉంది
great effort great achievement – a suggestion; give an intro of the writer, poet, contributor
and if allowed the phone numer and address