కమలవైశిష్ట్యము (స్రవంతి)
చం. కమలమె బ్రహ్మ కాసనము; గాదె యదే నిలయంబు లక్ష్మికిన్? కమలమె నాభి నుద్భవముఁ గాంచెను విష్ణున; కాప్త మయ్యె న ర్యమునకుఁ(1) దానె; ఫుల్ల మయి(2) యాస్యదృగంఘ్రికరాకృతుల్(3) కృతుల్ సమముగఁ దెల్పు పోలికగు; సారసజన్మమె ధన్య మెందునన్(4) (1) సూర్యునకు (2) వికసించి (3) ముఖము, నేత్రములు, పాదములు, హస్తములు - వీని ఆకారములు (4) ఏ లోకములో నైనను భావము - విష్ణుమూర్తి సంకల్పము చేత ఆయన నాభినుండి పుట్టినది, సృష్టిని చక్కగా చేయుటకు బ్రహ్మకు సుఖాసనమై తోడ్పడునది, సిరులతల్లికి నివాస మైనది (సర్వశుభములకు ఆలవాల మైనది), సూర్యదేవునకు ప్రీతిపాత్రమైనది, వికసించిన రూపములో ముఖము, కళ్ళు, పాదాలు, చేతులను కావ్యములలో కవులు సౌందర్యవర్ణన చేయునపుడు ఉపయోగించు ఉపమానమైనది, అయిన పద్మముయొక్క పుట్టుక ఏ లోకములో నైనను ధన్యమే కదా కం. ఘనవైశిష్ట్యము గలిగిన నన(1) సౌందర్యంపురాశి నళినం(2) బగు నే యెన(3)లేని ప్రేమఁ బంచఁగఁ గొనితెచ్చుఁ బ్రభాతవరము కోమలి తానై (1) పుష్పము (2) కమలము (3) సాటి తే.గీ. తరణి(1) కరములఁ(2) దాఁకఁగఁ దరుణ మరసి తనువు పులకించి వికసించు తామరసము సృష్టికర్త రచించిన చిత్ర మిద్ది ప్రకృతిపురుషల కేళియై ప్రమద మొసఁగు (1) సూర్యుడు (2) కిరణములతో/ చేతులతో ఆ.వె. మధువుఁ గ్రోలు నిచ్ఛ(1) మధుమక్షికకె(2) కాని మక్షికకును(3) గలదె? మధురతామ రసరసంబుఁ గోరి ప్రాహ్ణమునను(4) గను విందుసేయు సరఘ(5) విందుఁ గొనుచు (1) రసాస్వాదనాసక్తి (2), (5) తేనెటీగకు (3) ఈగ (4) సూర్యోదయము మొదలు నాలుగు గంటలకాలము కం. తమ్మిదొరదాయ(1) లక్షులు(2) తమ్మియె యిరవైన తల్లి(3) తగు నిల్లాలౌ తమ్మినిఁ గూర్చొనుఁ గొమరుఁడు(4) తమ్మియు నఱకాలి గుఱుతు(5) తరిదాల్పునకున్(6) (1) తమ్మిదొరయైన సూర్యుడు, తమ్మిదాయయైన చంద్రుడు (2) కన్నులు (3) లక్ష్మి (4) బ్రహ్మ (5) పాదము క్రిందివైపు రేఖాచిహ్నములలో నొకటి (6) విష్ణువునకు
చాలా బాగుందండీ! అన్నమాచార్యులవారి కీర్తనలో “కమలాసతీ ముఖకమల కమలహిత…” చరణం గుర్తుకు వచ్చింది.