Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

కాగితం పూలు

Bougainvillea

బోగన్ విలియాను తెలుగులో కాయితం పూలు అంటారు. ఇవి చాలా తేలిగ్గా ఉండి, ఎక్కువరోజులు వాడిపోకుండా, తాజాగా ఉంటాయి. అలా ఉండే పువ్వు ఇదొక్కటే అనడం సత్య దూరం కాదు.

కాగితంపూలను ఆంగ్లములో బోగాన్‌విల్లియా అంటారు. ఈ మొక్క ఆకులు పూలు పూయటాన్ని బట్టి పరిమాణంలో కొంత మార్పు కలిగి ఉంటాయి. వీటిలో అనేక రంగులపూలు ఉన్నాయి. ఇది దక్షిణ అమెరికా దేశానికి చెందినది. దీనిలో ఇంచుమించు 18 జాతులున్నట్టు గుర్తించారు.

Bougainvillea

దీనికీపేరు ఎలావచ్చిందీ అంటే, ఫ్రెంచి నావికాదళ అధికారి బోగన్ విల్లె దీన్ని బ్రెజిల్ దేశంలో 1768 లో మొట్టమొదటిసారి చూశాడుట. బహుశా దీన్ని కనుగొన్న ఆయన పేరు మీదే ఈ పూవుకు ఈ పేరు వచ్చి ఉంటుంది. అందమైన కెంపు, ఎరుపు, పసుపు, తెలుపు, లేత ఆకుపచ్చతో కూడిన పూలగుఛ్ఛాలు చూడను చాలా బాగుంటాయి. గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతుంటాయి. ఇళ్ళముందు, బాల్కనీ పైన అలంకారంకోసంవీటిని పెంచుతుంటారు. అంతేకాదు ఎక్కువగా పార్కుల్లో ఈ పూల చెట్లను చూస్తాం. వీటికి కొద్దిగ ముళ్ళుకూడా ఉంటాయి. మొక్కలు ముదిరేకొద్దీ ముళ్ళపదును, సైజూ కూడా పెరుగుతుంది. ఈ ముళ్ళే అగులానీ ముళ్ళలా వీటికి రక్ష.

ఇవి తీగలాగా ఎగబ్రాకుతాయి. పొదలు,పొదలు గా కూడా ఉంటాయి. వీటిని కత్తిరించి నేలపైనే గుట్టలుగా పెరిగేలా చేస్తారు కూడా.

Bougainvillea

ఇంచుమించు గుండ్రంగా ఉండే ఆకులతో ఉంటుంది ఈ మొక్క. ఎక్కువగా ఈ మొక్కలను ఇంటి లేక స్థలం, సరిహద్దులకు పెంచుతారు. ముళ్ళుండటాన పశువులు సైతం వీటికి హానిచేయవు.

ఈ మొక్కలను కొన్ని ప్రాంతాల్లో రహదారులకు రెండు వైపులా పెంచడం వలన నడిచి, లేక వాహనాల్లో వెళ్ళే వారికి ఈ రంగు రంగుల పూలు ఎంతో కనువిందు చేస్తాయి. కొన్ని గుత్తులుగా పూస్తే, మరికొన్ని ఒక్కో పువ్వూ విడిగానూ పూస్తాయి.

Bougainvillea

ముఖ్యంగా పార్కుల్లోనూ, ఆట  స్థలాల్లోనూ, కళాశాలలూ, పాఠశాలలకు సరిహద్దుగానూ, వివిధ రంగుల పూలు  పూసే ఈ బోగన్ విలియా మొక్కలను పెంచడం చూస్తుంటాం. రంగుకాయితాల్లా పూలు ఉండటాన వీటికి కాయితం పూలనే పేరు వచ్చి ఉండవచ్చు.

Bougainvillea

తెల్ల పూలు పూసే మొక్కల ఆకులు కొన్ని విధాల వైద్యానికి ముఖ్యంగా షుగర్ వ్యాధికి ఉపశమనంగా వాడతారు. ఐతే వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలి. స్వంత వైద్యం చేయరాదు. ఒకమారు మొక్క బ్రతికితే సంవత్సరాల తరబడి ఉంటుంది. కొందరు ఈ పూలగుచ్చాలనూ అలంకారంగా బొత్తులు బొత్తులుగా ఫ్లవర్ వేజుల్లో అందంగా అలంకరిస్తారు కూడా. వాసన లేకపోతేనేం, మనోల్లాసం కలిగించే ఈ కాయితం పూలలా కలకాలం అందమైన మనస్సులతో అందరికీ ఆనందం కలిగించేలా జీవిద్దామా!

Posted in December 2020, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!