Menu Close
Adarshamoorthulu
డా. అంగర వేంకట సుబ్బారావు
సిరిమల్లె 'ఆదర్శ మూర్తులు' కి 'చంద్రునికి ఒక నూలు పోగు' లా
-- గుమ్మడిదల వేణుగోపాల్ రావు
Angara Venkata Subba Rao

సాధారణంగా డాక్టరు అంటే వైద్యం వృత్తిగా, ధనార్జనే లక్ష్యంగా, బీదల జోలికి పోకుండా ధనవంతుల్ని చాకచక్యంగా 'నూలు లా వడికి', ధనార్జనకై వాడుకుంటూ ఐశ్వర్యాన్ని పెంచుకుంటూ జీవన యాత్ర సాగించే విద్యావంతుడు. సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకున్న గౌరవనీయుడు. అల్లాంటి వారిని మనం ప్రతి ఊళ్లోనూ చూస్తూనే ఉన్నాము.

నేటి కాలంలో సుఖ జీవితానికి, హోదాని నిలబెట్టుకోవడానికి, ధనార్జనకు వైద్యవృత్తి సరిఅయిన మార్గమే అనిపించినా సామాజిక స్పృహ, మానవత్వం మనసులో పరిమళించిన వేళ, తమ ఆర్ధిక స్థితి గతులని పెద్దగా పెంచుకోలేక, సంసార బాధ్యతలు భరిస్తూ సగటు మధ్యతరగతి కుటుంబీకులు గానే మిగిలిపోయినను, సామాజిక సేవాతత్పరతతో బీదలకు, అనాధలకు వైద్య సేవలనందించి వారిచే దేమునిగా కొలువబడిన మహనీయులు ఎందఱో ఉన్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం, పల్లెటూరైన కొండపల్లి కేంద్రంగా చుట్టూ పక్కల పల్లెలలో, వైద్య సేవాతత్పరతతో కొండపల్లి ప్రజల మనసుల్ని దోచుకున్న మహోన్నత మూర్తి, ఎంతో మందికి ఆదర్శప్రాయుడైన డా. అంగర వేంకట సుబ్బారావు గారు, నేటి మన ఆదర్శమూర్తి.

1901 జూన్ రెండున అంగర సుందరరావు గారికి, కమలాబాయమ్మ గారికి రెండవ సంతానం గా జన్మించిన సుబ్బారావు గారు, హైస్కూల్లో చదువుకుంటుండగానే తండ్రిని పోగొట్టుకున్నదురదృష్టవంతుడు. అక్క, బావల ఆదరణలో బాధ్యతాయుతంగా పెరిగిన ఆయనకి MBBS చదవాలని ఎంతో ఆశ ఉన్నా, ఆర్ధిక స్థోమత తూగక, LMP లో చేరి, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత ప్రభుత్వం వారు చూపిన రెండు స్థానాలలో ఒకటైన కృష్ణాజిల్లా కొండపల్లి ని కేంద్రంగా ఎంచుకుని వైద్య వృత్తిని ప్రారంభించారు.

కృష్ణాజిల్లాలోని విజయవాడ కి 25 కి.మీ దూరంలోఉన్నకొండపల్లి, కొయ్య బొమ్మలకి, కొండపై శ్రీ కృష్ణదేవరాయాలు కాలంలో నిర్మింపబడిన పురాతన కోటకి ప్రసిద్ధి. కొండపై అడవులలో దొరికే మెత్తని కొయ్యని బొమ్మల తయారీకి వాడుతారు అక్కడి శిల్పులు. అవే వారికి జీవనాధారం. అడవులలో లభించే సీతాఫలాలు, పొలాలలో పండించే వరి, మొక్కజొన్న, మామిడి, మెట్టభూములలో పెరిగే పప్పు ధాన్యాలు, అక్కడి జనాలకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. ఆ ఆదాయం కూడా అంతంత మాత్రమే. కనుకనే సాధారణంగా వైద్యం చేయించుకున్న రైతుల చేతిలో డబ్బులు ఎటూ విరివిగా ఆడవు గనుక వైద్యునికి ఇవ్వగలిగేది కూడా వారి పంట ఉత్పత్తులే. అదీ వెంటనే కాదు, పంట చేతికి వచ్చినప్పుడే.  ఆ విషయాన్ని అర్థం చేసుకొన్న సుబ్బారావు గారు రైతులు ఇచ్చే తృణమో, పణమో మాత్రమే తీసుకొని వారికి వైద్యం చేసేవారు. వాటితో ఆయన కుటుంబము కడుపు మాడ్చు కోకుండా రోజు గడపగలిగినా, తమ్ముళ్ల చదువులకి, ఆడపిల్లల పెళ్ళిళ్ళకి చేయి జాచాల్సిన స్థితికి తీసుకెళ్ళేవి. అయినా అయన తమ్ముళ్ళని (ఒక తమ్ముణ్ణి MBBS) చదివించి, పెళ్లిళ్లు జరిపించి వాళ్ళు తమ కాళ్లపై తాము నిలబడేటట్లు చేయగలిగారు.

రోగులపై చూపే ఆదరణ, చిత్త శుద్ధి, మారుతున్న రోగి పరిస్థితిపై నిలిపే సునిశిత దృష్టి, ఎప్పటికప్పుడు తాజాగా లభిస్తున్న వైద్య విజ్ఞానం ఆసరాగా వైద్యవృత్తిలో ఔన్నత్యాన్ని సంపాదించడం, ఇత్యాది ధర్మాలు ఆయనని ఆవూళ్ళోనే కాకుండా చుట్టూ పక్క గ్రామాల్లో కూడా మంచి వైద్యునిగా, ఆయన హస్తవాసి మంచిదన్న ఖ్యాతినీ విస్తరించి పెట్టాయి.  అప్పటి పద్దతి ప్రకారం తలిదండ్రులు 17వ ఏటనే 7 ఏళ్ల వయస్సుగల కమలాబాయి తో ఆయనకు పెళ్లి జరిపించారు. సంసారంలోను, వృత్తిపరంగాను ఎన్నో ఎదురుదెబ్బలు తింటున్నా వెరవక అసామాన్యమైన ధైర్యంతో నిలదొక్కుకున్నారు సుబ్బారావు గారు. ఆయన వైద్య విద్యా సముపార్జనకై చూపే ఉత్సుకత, రోగ నిర్ణయంలో సమయస్ఫూర్తి, మందుల వాడుకలో నైపుణ్యం, ఆ ప్రాంతాల్లోనే కాక అనేక ప్రముఖ వైద్యులుగల విజయవాడలో కూడా ఆయన పేరు వినికిడి పెంచింది. వారందరు కూడా అప్పుడప్పుడు సుబ్బారావు గారిని సంప్రదించేవారట.

Venu Gopala Rao Familyనేను సుబ్బారావు గారిని మొదట సారి విజయవాడలో మా బాబాయి గారి ఇంటికి తన మనుమరాలిని నాకిచ్చి పెండ్లి చేసే విషయమే మాట్లాడ వచ్చినప్పుడు చూశాను. మల్లె పువ్వులాంటి తెల్లని పంచ కట్టు, తెల్లని షర్ట్ తో, కళ్లజోడు పెట్టుకుని కొంచం పక్కలకి వంగి నడుస్తున్న ఆయనని చూడగానే గౌరవంగా నమస్కరించ బుద్ధిపుడుతుంది. ఆ తరువాత చాలా సార్లు పండగలికి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూసినా, ఆయనను పరిశీలనా దృష్టితో చూడగలిగినది మాత్రం నేను సెలవులలో తీరుబడిగా కలిసినప్పుడే. తన వైద్య వృత్తిపైగల అకుంఠిత విశ్వాసం, శ్రద్ధ, దేశభక్తి, స్వతంత్రసమర యోధులైన నాయకులందు గౌరవం, గురువులపై గల భక్తి భావం నాకు అయనపై వినమ్ర భక్తి భావాన్ని పెంపొందించాయి. ఆయన ప్రార్ధనా మందిరంలో గల చిన్న గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలు తెలుగు, ఆంగ్ల సాహిత్యాలలో మేలిమి వజ్రాలు, తత్వ విజ్ఞానం లో మచ్చుతునకలు, వైద్యశాస్త్ర పరిశోధనలో ఎనలేని సంపదలు. రాత్రి అనక పగలు అనక వచ్చే రోగుల బాధలని పరిష్కరించడంతో సతమవుతూ, తన సంసార సమస్యలని సాధించుకుంటూ ఎన్నడూ తీరికలేక ఉన్న ఆయనకి వాటిని సునిశితంగా పరిశీలించే వీలు ఎప్పుడు కలుగుతుందో అర్ధమవదు. ఆ పుస్తకాలలో అక్కడక్కడ వ్రాసియున్న చిన్ని వ్యాఖ్యలు, ముఖ్య వాక్యాలకు క్రింద గుర్తింపు గా గీసిన గీతలు వాటిని అయన చదివి ఆకళింపు చేసుకున్న పధ్ధతిని సూచిస్తూ నన్నుఆశ్చర్యంలో ముంచెత్తాయి. పూజ్యులైన రామకృష్ణ పరమహంస, అరవిందుల వారు, శారద మాత, రమణ మహర్షి, కంచి పరమాచార్యుల పఠాల ఎదురు నిలిచి వారిని తలుస్తూ ఆయన ప్రతిరోజూ ప్రార్ధన చేసేవారు. ఆయన ప్రార్ధన వివరణ లేకుండా అర్ధమవని సంస్కృత శ్లోకాల రూపంలోకాదు. తనకి అర్ధమై, ఇతరులకి ఎరుకపరచగల ఆంగ్లభాషలో చదివేవారు. ఒక రోజు నేను విన్న ప్రార్ధనలో ఒక భాగం యొక్క సారాంశం:

"నీ అనేక కోట్ల ఆవాసాలలో నా ఈ దేహం కూడా ఒకటై నీవే అందున నిలిచి నన్ను దయతో పాలిస్తూ, దానిలో సూర్యునివలె ప్రకాశిస్తూ, నా శరీర భాగాలని, నన్ను ప్రభావితం చేస్తున్న ఓ ప్రభూ; నా ఆలోచనలని, నా కదలికల్ని, నా హృదయావేశాలని, నా స్పృహలని, నాశరీర కదలికల్ని, శరీరంలోని ప్రతి అణువుని, ప్రతి రక్త బిందువుని, అవి అన్నీ నీవే అయినా వాటిని తిరిగి నీకే నైవేద్యంగా అర్పిస్తున్నాను. నీవు నాకై ఏది నిర్ణయిస్తే దానిని- ప్రాణమైనా, మృత్యువైనా, సంతోషమైనా, భాదైనా, నీ దివ్య కానుక గా ఆనందంతో స్వీకరిస్తాను, తల్లీ!."

పై వాక్యాలు సుబ్బారావు గారి ఆలోచనాత్మక వ్యక్తిత్వానికి అద్దం పడుతాయి.

శ్రీ సుబ్బారావు గారిని బంధు వర్గంలో అందరు "కొండపల్లి డాక్టర్ గారు" అని ఆప్యాయంగా సంబోధించేవారు. ఎవరికి వైద్య పరంగా ఏ అవసరం వచ్చినా ఆయన ముందు వాలి ఆ బాధని నయంచేసుకుని వెళ్లేవారు, నయమయ్యేవరకూ వాళ్లింట్లోనే మకాం. ఆవిధంగా వచ్చే బంధువుల తాకిడిని భరించేది పాపం ఆయన సహధర్మచారిణి కమలాబాయి గారు. బీద రోగులు నలిగిపోయి సగం చిరిగి ఇచ్చిన రూపాయి నోట్లు లెక్క పెట్టుకుంటూ, అనుకోని ఖర్చులు భరిస్తూ గుట్టుగా గడిపేది ఆఇల్లాలు సంసారాన్ని. చిన్న పల్లెలో పుట్టి ఎటువంటి లాంఛనప్రాయంగా స్కూలు చదువులు చదవక పోయినా సాంస్కృతికంగా, భాషాపరంగా, ఆధునిక దృక్పధంలో ఆమె ఈనాటి విద్యావంతులకు ఏవిధంగానూ తీసిపోదు. రోజూ వార్తాపత్రికలను చదివి దేశ రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితిగతుల గురించి సమర్ధవంతంగా వాదించగల దిట్ట.

Angara Venkata Subba Raoఆయన బీద రోగులు ఎంతయివ్వగలిగితే అంత తీసుకున్నా వైద్యం మాత్రం తన పూర్తి సామర్థ్యంతో శ్రద్ధగా చేసేవారు. ఒకప్పుడు ఏమీ ఇవ్వలేకపోతే “ఫరవాలేదు, నయమయ్యాక ఇటువైపు వస్తే కనబడు" అనేవారు సుబ్బారావు గారు. ఒక్కోసారి వారి బాధ తగ్గక అక్కడే ఉండాల్సి వస్తే, ఆయన క్లినిక్ లోనే అటువంటి వారికోసం వేరుగా ఏర్పాటు చేసిన గదిలో ఉండమని ఇంటినుంచి భోజనం పంపించేవారు. పిల్లలు అతిసారంతో బాధపడుతుంటే ఇంటినుంచి చిట్టిఉడుకునీళ్ళు, మజ్జిగ తెప్పించి, మందులిచ్చి నయంచేసి పంపేవారు. వారి శ్రీమతి అప్పుడప్పుడు నవ్వుతూ "ఎక్కడైనా డాక్టర్లు వైద్యంచేస్తారు గాని, ఉండడానికి చోటు చూపించి పథ్యపానాలు కూడా ఇస్తారా?" అని హాస్యం చేసేవారు. వారి ఆప్యాయతతో కూడిన ఆవిధమైన చికిత్సే అక్కడి ప్రజలలో ఆయనని దేముడిని చేసింది. ఒక్కోసారి ఆస్పత్రులలో డబ్బుయిచ్చుకుని 'క్యాటరాక్టు' శస్త్ర చికిత్స చేయించుకోలేని బీదలకు ఇంట్లోనే అన్ని జాగ్రత్తలతో శస్త్ర చికిత్స చేసేవారట. అల్లాగే తన తల్లికి, చెల్లికి కూడా చేశారట. ఆ రోజుల్లో కొండపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో ‘పెద్ద డాక్టర్ గారి హాస్పిటల్’ అన్న పేరు తెలియవని వారు లేరు. అంతగా ఆయన ప్రజలకు వైద్య సేవలు అందించేవారు.

Sri Kanooru Shiva Rao Schoolఅర్ధరాత్రి తలుపు తట్టేది రోగులేకాదు, అప్పుడప్పుడు పోలీసులు, దోపిడీదొంగల దగ్గరి బంధువులుకూడా. రాత్రిళ్ళు కొండమీది అడవుల్లో దొంగల్ని వేటాడుతూ గాయపడ్డ పోలీసులు, పోలీసుల తుపాకీగుండుకి గాయపడిన దొంగలకి చికిత్సకోసం చేతిలో లాంతరుతో అడవులలోకి ప్రాధమిక చికిత్సకై వాడే మందుల పెట్టెతో ఆయన వెడుతుంటే ఇంట్లో అందరు బిక్కు బిక్కు మంటూ ఆయన తిరిగి వచ్చేవరకు నిద్రపోకుండా వేచియుండేవారట. ఆ వూళ్ళో హైస్కూలు లేకపోవడంతో హైస్కూలుకి వచ్చిన పిల్లందరూ విజయవాడ వెళ్లి చదువుకోవలసి వచ్చేది. హైస్కూలు ప్రారంభించడానికి ఆయన తన పలుకుబడితో చందాలు వసూలు చేసి, ఎక్కువ చందా ఇచ్చిన శ్రీ కానూరు శివరావు గారిపేర స్కూల్ తెరిపించి అక్కడి పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు.

ఒకసారి 1945 ప్రాంతాలలో ప్లేగు వ్యాధి తో ఊరిలో చాలా మంది ఊరిని వదిలి వేరే ఊళ్ళకి తరలిపోతే, అయన మాత్రం తన తల్లీ, చెల్లి, భార్య, పిల్లలిని విజయవాడ దూరపుబంధువు దగ్గరకు పంపించి, కొండపల్లి, రవాణా సౌకర్యాలు లేని ఆరోజుల్లో ఆ చుట్టు పక్కల గ్రామాలలో ఇంటిఇంటికి వెళ్లి రోగగ్రస్తులైన వారిని గుర్తించి ఉచిత వైద్యం చేస్తూ, ఆరోగ్య సంస్థ ఉద్యోగులకి మార్గదర్శకత్వం వహిస్తూ గడిపారు. ఆయన వృత్తి నిబద్ధతకు ఇంతకన్నా మంచి ఉదాహరణ వేరే అవసరం లేదు.

ఆయన దయార్ద్రహ్రదయం ఎవరికి ఏకష్ట మొచ్చినా సహాయంచేయ్యడానికి వెనుకాడేదికాదు. ఒక్కోసారి, తన శక్తిని మించి కూడా దగ్గరి బంధువులకి, స్నేహితులకి సహాయం చేస్తూండేవారు. అనేకసార్లు సహాయం అవసరమైన వారి సంసార బాధ్యతలు కూడా సంవత్సరాల తరబడి మోయాల్సి వచ్చేదట. అయినా ఎవరికీ తన గోడు వెళ్లబోసుకునే వారు కాదట. అటువంటి గొప్పమనీషి సుబ్బారావు గారు.

అయనకి రాజకీయ నాయకుల పరిచయాలు ఎన్నోవున్నా కూడా ప్రతిఫలాపేక్షతో ఎవరినీ ఆశ్రయించేవారు కాదు. డా. కె ఎల్. రావు గారు కేంద్రంలో విద్యుద్ శాఖామాత్యులుగాను, డా. ఏ.బి.నాగేశ్వర రావు గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖా మాత్యులుగాను ఉన్నరోజులలో కొండపల్లికి వేరే పని పై వచ్చినప్పుడు ఆయనలోని సేవాతత్పరతని, మానవతా మూర్తిని గుర్తించి గౌరవభావంతో ఆయనని చూసి ఆయన సత్కారాన్ని స్వీకరించి వెళ్లేవారట.

1974 లో ఒకసారి ఆయన తీవ్ర హృద్ర్యోగంతో విజయవాడలోని డాక్టర్ మిత్రుడైన శ్రీ పిన్నమనే వెంకటేశ్వర రావు గారి ఆసుపత్రి లో చేరిన సంగతి, ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని తెలిసి, ఆ ఊళ్ళోనే పనిచేస్తున్న నేను ఆసుపత్రికి చేరేసరికే ఆయన ఆప్తులు, ఊరిప్రజలు అందరిని శోక సాగరంలో ముంచి దివంగతులయ్యారు. ఆ చైతన్య విహీన శరీరాన్ని తీసుకుని కొండపల్లిలో అసహాయంగా నిరీక్షిస్తున్న ఆయన ఆప్తుల వద్దకు తీసుకువెల్తుంటే దారిపొడవునా లేచి నిల్చుని నమస్కరిస్తూ ఆ వూరి ప్రజలు, తమ ఆప్త బంధువు, శ్రేయోభిలాషి పార్థివ దేహానికి నివాళులర్పిస్తుంటే చూసి నాకు కన్నీరాగలేదు. ఆ రోజు 25 జూలై 1974. ఆయన ప్రార్ధనలనాలకించి జగన్మాత తన అక్కున చేర్చుకున్న రోజు, ఆ ఊరి చరిత్రలో మరపురానిరోజు. అందుకే కొండపల్లి పురపాలక సమితి ఆయన పేర ఒక వీధిని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. కానీ, కారణాంతరాలవల్ల అది అసంపూర్తి గానే మిగిలిపోయింది. ప్రజల మనసులలో సజీవమైన ఆ మహానుభావుని పేరుకు మరలా ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు.

Posted in December 2020, వ్యాసాలు

2 Comments

 1. prasuna

  Very nice article. Thank you so much for putting this article together with all
  details. Very inspirational. He is a role model for all younger generations and really ‘ఆదర్శ మూర్తి’.

 2. Koti satyagnanirao

  I am highly thankful to mr Venugopala rao Garu for his biographical
  Sketch of the life of dr subbarao Garu in a very lucid & sweet language
  And I am privileged to be one of the members of that highly venerated
  Family of dr subbarao Garu, my hearty congratulations to mr Venugopala rao on his efforts in bringing out this biographical sketch,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *