Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
సాయంతో సంతోషం

పుట్టడం చావడం కొరకే, పెరుగుట విరుగుట కొరకే

లక్ష్మీపురం అనే వూళ్లో ఓబయ్య అనే ఓ ధనవంతుడు వుండేవాడు. ఆయనకు వందెకరాల మంచి మాగాణి భూమి, తోటలు ఉండేవి. ఆయనకు ముగ్గురు కొడుకులు. ముగ్గుర్నీ పదో క్లాసు వరకు ఆ ఊర్లోనే వున్న స్కూల్లో చదివించి ఆ తర్వాత ముగ్గురికీ వ్యాపార రహస్యాలు నేర్పించాడు. తానేవిధంగా తండ్రి ఇచ్చి పోయిన 50 ఎకరాలను వంద ఎకరాలుగా పెంచాడో చెప్పి పదిమందితో ఎట్లా మాట్లాడాలో, కోపం, రోషం పక్కన పెట్టి వ్యాపారాలు పెంచుకోను అందరితో ఎలా వ్యవహరించాలో నేర్పించాడు.

అందరూ ఓబయ్యను 'ఇంత ధనవంతుడివి పిల్లల్ని చదివించక పదో క్లాసుతో మాన్పిస్తావా?’ అని అడగ్గా 'చదివి, ఇంకొకరికి తలవంచి ఉద్యోగాలు చేయాల్సిన ఖర్మ నా పిల్లలకేంటి? నేను నేర్పించే వ్యాపార మెళకువలు పెద్ద చదువులు చదివినా రావు. నేను నేర్పే నా ఎంబిఎ డిగ్రీ చాలు వారికి’ అని చెప్పేవాడు.

పెద్ద కొడుకు కుమార్ చేత పట్టణంలో బట్టల కొట్టు పెట్టించాడు. రెండో కొడుకు రాము చేత కిరాణా షాపు తెరిపించాడు. మూడో కొడుకు మురళిని తనవద్దే వుంచుకుని తన పొలంపనులు, తోటల వ్యవహారాలు చూసుకోమని పురమాయించాడు. ఓబయ్య తీరుబడిగా వడ్డీ వ్యాపారం చేయసాగాడు.

ఊరివారే కాక, వ్యాపారాల్లో డబ్బు అవసరమైన వారంతా వడ్డీ ఎక్కువైనా సమయానికి ఆదుకుంటాడని ఓబయ్య వద్దకు అప్పుకువచ్చి ఆయన కోరిన విధంగా తమ ఆస్తులు తనఖాపెట్టి అవసరసమైన సొమ్ము అప్పుగా పుచ్చుకు వెళ్లేవారు. ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లించలేనివారి ఆస్తి ఓబయ్య స్వంతమయ్యేది. తండ్రి వద్దే వుంటూ లావాదేవీలు చూస్తున్న మురళికి తండ్రి వైఖరి నచ్చేదికాదు. ఇదే విషయం ఓ రోజు మురళి తండ్రితో అన్నాడు.

"వాళ్లను నేనేం రమ్మనలేదే? వారి అవసరానికి వస్తున్నారు. కావాల్సినది తీసుకువెడుతున్నారు. మనం ఉదారంగా వుంటే మన డబ్బే మనకు తిరిగిరాదు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిట్టు నాకేం చెప్పక్కర్లేదు. వ్యాపారం నేర్చుకో చాలు" అని కోప్పడ్డాడు ఓబయ్య.

ఊరి గుళ్లో జరిగే తిరునాళ్లకు, ఉత్సవాలకు ఓవందో, వెయ్యో ఇచ్చేవాడు. చుట్టుపక్కల వంద ఊర్లకు ధనవంతుడైనా చిన్న రైతులు, వ్యాపారులు స్వామివారికి సమర్పించుకున్నంత కూడా ఓబయ్య ఇచ్చేవాడు కాదు. మురళికి తండ్రి వ్యవహారం నచ్చేది కాదు.

ఓబయ్య ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు చేశాడు. ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటూ స్థిరపడ్డారు. ఓబయ్య పెద్దవాడై పోయాడు. ఓరోజు గుండె నొప్పి, ఆయాసం రాగా మురళి పట్నంనుండి డాక్టర్ను పిలిపించి పరీక్ష చేయించాడు. వైద్యుడు పరీక్షించి ‘కాస్త విశ్రాంతిగా వుండాలి. 70 సంవత్సరాలు దాటాయి గనక వేళకు తిండి, నిద్ర అవసరం’ అని చెప్పి ప్రతినెలా వచ్చి పరీక్షిస్తానని చెప్పివెళ్లాడు.

మురళి వైద్యుని సంప్రదించాడు. ఇంటికి ఆధునిక సదుపాయాలైన ఫోన్ పెట్టించాడు. తండ్రికి కాలక్షేపం కోసం టీవీ తెచ్చిపెట్టాడు. ఇల్లంతా కరెంటు దీపాలు, తండ్రి గదికి ఏసీ చేయించాడు. ఓబయ్య నసుగుతునే వున్నాడు ‘వృధా వ్యయం’ అని.

ఆ ఊరి ఉపాధ్యాయులు వచ్చి ఓ రోజు ఓబయ్యతో ‘అయ్యా! మన ఊరిబడి భవనం బాగా పాతదై వర్షాకాలం కురుస్తున్నది. నాల్గు గదులు కట్టిస్తే ఆ బ్లాకుకు మీ పేరుపెడతాం’ అని విన్నవించారు. ‘ప్రస్తుతం ఖర్చుల్లో వున్నాను. తర్వాత చూస్తా’నని వారిని పంపించాడు ఓబయ్య.

ఊరి ఆలయం పూజారి వచ్చి ‘అయ్యా! ఆలయ ప్రహరీ పడిపోయేట్టుంది. ఊరిని రక్షించే దేవుని గుడి భద్రంగా వుంటే మీలాంటి పెద్దలందరూ బాగుంటారు. కాస్త పెద్ద మనసు చేసుకునిన గుడి ప్రహరీ కట్టించండి’ అని కోరగా, ‘ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేదు తర్వాత చూస్తా!' అని పంపేశాడు. ప్రజలు ‘పీనాసి ఓబయ్య కట్టుకుపోతాడా!’ అనడం కర్ణాకర్ణిగా విన్నాడు.

ఆ నెల పట్నం వైద్యుడు వచ్చి పరీక్షించి, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు తెచ్చి ఇచ్చి 'ఇవి చదవండి మనసు బాగుంటుంది. దాంతో శరీరం బాగుంటుంది 'అని చెప్పాడు.

‘యథైధాంశి సమిద్ధోగ్నిః భస్మసాత్‌ కురుతేర్జున
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్‌ కురుతే తథా’

అగ్ని ఏ విధంగా కట్టెలను దగ్ధం చేస్తుందో ఆవిధంగానే  జ్ఞానమనే అగ్ని మన జీవితంలోని కర్మలన్నింటిని భస్మం చేస్తుంది. కర్మలన్నింటినీ తీసివేసినపుఁడు ‘జ్ఞానస్వరూపం’ మాత్రమే మిగిలిఉంటుంది. జ్ఞానాగ్ని రగులుతున్నప్పుడు ఎటువంటి అనుభవాల్ని అయినా అది భస్మం చేసి ఎల్లప్పుడూ నిన్ను నిర్మలంగా ఉంచగలుగుతుంది. జ్ఞానమనేది ఒక దీపం వంటిది. జీవితంలో ఎదురయ్యే విషాద పరిస్థితులను పనికిరాని స్వల్ప ఘర్షణలను, అంధకారమును చక్కగా తొలగించి వెలుగును ప్రసాదించి జీవితపు చరమావస్థ  మార్గమును చూపుతుంది.

‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్సయం యోగసంసిద్ధః కాలేనాత్మనివిద్దతి’

ప్రపంచంలో జ్ఞానం కన్నా పవిత్రమైనది మరేదీ లేదు. ఈ పద్ధతిలో సాగుతున్న కొద్దీ అగ్ని రగులుతుంది. ఆ అగ్నే జ్ఞానాగ్ని జ్వాలలుగా రగులుతుంది. ఆత్మనే నిజమైన స్థితి అని తెలుస్తుంది. జీవితాన్ని అర్థవంతంగా నడపగలిగిన శక్తి తెలుస్తుంది. దీనివలన మనస్సు స్థిరముగా ఉంటుంది.

‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్పరస్సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్యాపరాంశాంతిం అచిరేణాధిగచ్ఛతి’

శ్రద్ధ వున్నవానికే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ లేకుండా ఆత్మ జ్ఞానం కలగదు. ఇందుకు ఇంద్రియ వ్యవస్థను అదుపులో పెట్టుకోవాలి. అదుపులో ఉంచిన శక్తిని ఉన్నతమైన శక్తిగా మార్చుకోవాలి. అప్పుడే వ్యక్తి గొప్పగుణాలలో ప్రవేశిస్తాడు. ఇటువంటి జ్ఞానం ప్రాప్తించిన వెంటనే శాంతి లభిస్తుంది. ‘వ్యక్తి ఆంతరంగిక స్థితి నుండి వచ్చినదే శాంతి. అంతరాత్మ నుండి వచ్చినదే శాంతి. ఈ శాంతి అనుభూతి అయినప్పుడు నీవు శాంతిమయుడవుతావు’.

మనతో వచ్చేది ఏమీ లేదు. మనం చేసిన పాపపుణ్యాలు తప్ప. ధనం ఒక్క రూపాయ కూడా నీ వెంటరాదు. పుణ్యం వద్దన్నా వస్తుంది. పరోపకారం చేసిన వారి పేరు శాశ్వతంగా భూమి మీద నిలుస్తుంది. భూలోకంలో చేసిన మంచి పనుల వలన స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది.

ఇలాంటి ప్రభోదాత్మక గ్రంధాలను చదివిన తర్వాత ఓబయ్య బాగా తన కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగాడు.

ఆ పుస్తకాలు చదివిన తరువాత ఓబయ్యలో మార్పు వచ్చింది. సంపాదించడమే కాదు. త్యాగబుద్ధి నేర్చుకోవాలి. శక్తికొద్దీ త్యాగం చేసి, దీనులను, దిక్కులేని వారిని ఆదుకోవాలి. ఆలయాలు, విద్యాలయాలు సక్రమంగా వుంటే జనులంతా ప్రయోజనం పొందుతారు. గొంతులో ప్రాణం వున్నప్పుడే పవిత్ర కార్యాలు చేయాలి. ప్రాణం పోయిన తరువాత లక్షలున్నా, కోట్లున్నా ఎత్తుకుపోరు. ఇదీ అతను ఆ ఆధ్యాత్మిక పుస్తక పఠనం ద్వారాతెలుసుకున్నది.

వెంటనే ఓబయ్య మురళిని పిలిచి "ఆ ఊరి ఆలయ ప్రహరీ కట్టించమనీ, ఊరి పాఠశాలకు పదిదులు కట్టించమనీ, పేద విద్యార్థులను చదివించమని అవసరమైన చర్యలు చేపట్టమని" ఆదేశించాడు.

ఓబయ్య ఆరోగ్యం కుదుటపడింది. ఊరంతా కలసి ఏర్పాటు చేసిన సన్మాన సభలో అందరూ పుట్టడం చావడం కొరకే, పెరుగుట విరుగుట కొరకే. ఎవరికైనా చావక తప్పదు. మరలా పుట్టేప్పుడు ఈ ధనధాన్యాలేవీ వెంట రావు అని తెల్సుకుని ఇలా దానధర్మాలు చేస్తున్న ఓబయ్య పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. మహానుభావుడు. ఇలాంటి వారు ఊరికొకరున్నా దేశం బాగుపడిపోతుంది అని అంతా పొగుడుతుంటే ఓబయ్య ‘ఆహా! త్యాగం చేయడంవల్ల ఇంత ఆనందం కలుగుతుందా! ఇంతమందికి సాయంచేసి వారిసంతోషం చూస్తుంటే కలిగే తృప్తి, నోట్లు లెక్కించుకోడంలో లేదని' తెలుసుకున్నాడు.

అందుకే అన్నారు సద్గ్రంధపఠనం సన్మార్గంలోకి మళ్ళిస్తుందని.

Posted in December 2020, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *