Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 99
- వరూధిని
vikshanam-99

వీక్షణం-99 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, ఆద్యంతం ఆసక్తిదాయకంగా నవంబరు 15, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీమతి కొండపల్లి నీహారిణిగారు "ఆధునిక యుగంలో స్త్రీల వచన కవిత్వం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.

నీహారిణిగారు ముందుగా ప్రథమ కవయిత్రులైన కుప్పాంబిక, మొల్ల, గంగాదేవిలను తల్చుకుంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆధునికయుగం ప్రారంభంలో సోమరాజు ఇందుమతీబాయి, ఊటుకూరు లక్ష్మీబాయమ్మ, రుక్మాంపేట రత్నమాంబ వంటి వారి కవిత్వాన్ని విశేషిస్తూ స్త్రీలు వేసే ప్రతీ అడుగు వెనకా ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యే పురుషుల వ్యంగ్యాస్త్రాల పట్ల వ్యక్తమైన నిరసనలకి ప్రతిరూపమైన కొన్ని కవిత్వ వాక్యాల్ని ముఖ్యంగా ప్రస్తావించారు. ఆధునిక వాదాలు, కవిత్వ రూపాలని సంక్షిప్తంగా వివరించి అన్ని ప్రక్రియల్లోనూ స్త్రీలు రచించిన కవిత్వాల్ని పరిచయం చేశారు.

1993లో గొప్ప ఒరవడి సృష్టించిన నీలిమేఘాలతో ప్రారంభించి అందులోని ముఖ్యమైన కవితల్ని వినిపించారు. ఆ తరువాత కాలంలో వచ్చిన శీలా సుభద్రాదేవి గారు సంకలన పరిచిన "ముద్ర" ను కూడా పరిచయం చేశారు.

ఇక కవిత్వ లక్షణాలు ఏవిటి? ప్రారంభం, విషయ నిర్దేశకాలు ఏవిటి? వస్తువు, భాష, శైలి మొ.న విషయాల్ని లోతుగా ప్రస్తావిస్తూ, సోదాహరణంగా ప్రసంగం చేశారు.

తమ ఉపన్యాసంలో భాగంగా విమల, జయప్రభ, నిర్మల, కె.గీత, షాజహానా, జూపాక సుభద్ర, శిలాలోలిత, పాటిబండ్ల రజని, రత్నమాల, జ్వలిత మొ.న వారి కవిత్వాన్ని ఉదహరిస్తూ అత్యంత ఆసక్తిదాయకమైన ప్రసంగాన్ని చేసేరు. నీహారిణి గారి  ప్రసంగాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.

తరువాత జరిగిన చర్చలో శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ లెనిన్, శ్రీఇక్బాల్, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ ప్రసాద్ నల్లమోతు మొ.న వారు పాల్గొన్నారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీధర్ రెడ్డి గారు "ఆక్రందన" అనే కవితను, దాలిరాజుగారు "కుర్చీ పై పేచీ" కవితని, డా. కె.గీత "కాపాడుకో" కవితను, బాలకృష్ణారెడ్డి గారు "మేడే వస్తే ఏంటి? పోతే ఏంటి?", నీహారిణి గారు "నగరం", "నెట్ ఇంట్ల గాదు నట్టింట", దాసరాజు రామారావు గారు "ఉగాది వేళ" కవితల్ని చదివి వినిపించారు.

తరువాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ ఎప్పటిలాగే అందరికీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

చివరిగా వీక్షణం నిర్వాహకురాలు డా|| కె.గీత డిసెంబరు 12 న పెద్ద ఎత్తున జరగనున్న వీక్షణం 100 వ సమావేశం గురించి, ఈ సందర్భంగా వెలువడనున్న ప్రత్యేక సంచికకు రచనలు అందజేయవల్సిన విధానం గురించి వివరాలు తెలియజేసారు.

ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు అనేకులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

Posted in December 2020, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!