Menu Close
దైవనిర్ణయం
-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

"వచ్చే ఏడాది మన పిల్లలిద్దరినీ బళ్ళో వెయ్యాలండీ!", అని సాయంత్రం వేళ తీరుబడిగా ఆరుబయట వాలుకుర్చీలో కూర్చుని ఆ దారిలో వచ్చేపోయేవి చూస్తున్న పశుపతితో అంది అతని భార్య తులసి.

అక్కడే ఆడుకుంటున్న తమ కవల పిల్లలు శశిధర్, గిరిధర్ ల వంక చూస్తూ, "ఊఁ!", అన్నాడు పశుపతి.

పిల్లల చదువు గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న పశుపతికి తన చిన్నప్పుడు తమ ఎదురింటి ముత్తయ్య తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

ముత్తయ్యంటే పశుపతికి ఎనలేని అభిమానం. ముత్తయ్యను పశుపతి తన తండ్రితో సమానంగా భావించేవాడు. వారిరువురివీ ఎదురెదురు ఇళ్ళు కావడంతో పశుపతికి పుట్టినప్పటినుండీ ముత్తయ్యతో అనుబంధం ఉంది. ఆడుకోవడం కోసం పశుపతి చిన్నప్పుడు తరచూ ముత్తయ్య ఇంటికి వెళ్ళేవాడు. పశుపతిని తెగ గారాబం చేసేవాడు ముత్తయ్య. ముత్తయ్య పొలమూ, పశుపతి తండ్రి రంగయ్య పొలమూ పక్కపక్కనే ఉండటంతో ముత్తయ్య, రంగయ్యలకు కూడా మంచి స్నేహం ఉండేది. రంగయ్య కాలం చేశాక పశుపతి బాగోగులన్నీ ముత్తయ్య పెద్ద దిక్కై చూసుకున్నాడు. ముత్తయ్య మాటకు పశుపతి చాలా గౌరవం ఇచ్చేవాడు. ముత్తయ్యకి ఇద్దరు కొడుకులు. ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ వాళ్ళిద్దరినీ పెద్ద చదువులు చదివించాడు ముత్తయ్య. వాళ్ళు పెద్ద ఉద్యోగాలు సంపాదించి పెళ్లిళ్లు చేసుకుని విదేశాలలో స్థిరపడిపోయారు. ముత్తయ్య భార్య చనిపోయిన తరువాత వాళ్ళు ముత్తయ్యను తమతోపాటు విదేశాలకు తీసుకెళ్లిపోదామని అనుకున్నారు. కానీ అందుకు ముత్తయ్య ఎంత మాత్రం ఒప్పుకోలేదు! విదేశాలకు శాశ్వతంగా వెళ్ళిపోతే తన ఇల్లూ, పొలం అమ్మాల్సివస్తుందనీ, తమ సొంత ఊరితో అనుబంధం పూర్తిగా తెంపుకోవాల్సి వస్తుందనీ భయపడిన ముత్తయ్య, ఒంటరి జీవితం అలవాటు చేసేసుకున్నాడు!

ఒక ఏడాది క్రితం ముత్తయ్య అనారోగ్యం పాలయ్యాడు. కనీసం అప్పుడైనా ముత్తయ్య తమ వద్దకు రావడానికి ఒప్పుకుంటాడేమోనని శతవిధాలా ప్రయత్నించారు అతని కుమారులు. కానీ లాభం లేకపోయింది. కాలం గడిచేకొద్దీ ముత్తయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. తను ఇక ఎక్కువకాలం బతకనని తెలుసుకున్న ముత్తయ్యకు తన పిల్లలపై ఒక్కసారిగా బెంగ మొదలైంది. వారిని ఎలాగైనా చూడాలని వారితో కొద్దిరోజులు గడపాలని అనుకున్నాడు ముత్తయ్య. అనారోగ్యంవల్ల తను ఎటూ వెళ్ళలేడు కనుక ముత్తయ్య తన పిల్లలనే తన వద్దకు ఒకసారి వచ్చిపొమ్మన్నాడు. కానీ దేశంలో అంతుపట్టని రోగమేదో ప్రబలడంతో ఇతర దేశాల నుండీ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఆ దేశ ప్రభుత్వంవారు. దాంతో ముత్తయ్య పిల్లలు రాలేని పరిస్థితులలో విదేశాల్లో చిక్కుకుపోయారు. ముత్తయ్యకు శారీరక అనారోగ్యంతోపాటూ ఒంటరివాడినైపోయానన్న మానసిక క్షోభ పెరిగిపోయింది. ఉన్నంతలో అప్పుడప్పుడూ పశుపతి ముత్తయ్య వద్దకు వెళ్లి కొద్దిసేపు కబుర్లు చెప్తూ ధైర్యం చెప్పేవాడు.

ఒకరోజు ముత్తయ్య పశుపతిని తన వద్దకు పిలిచి, "ఇదిగో పశుపతి.. ! నేను చెప్పేది జాగ్రత్తగా విను నాయనా! నీ కొడుకుల్ని పెద్ద చదువులు చదివించేసి విదేశాలకు పంపేసి చివరి రోజులలో నాలా ఒంటరివాడివైపోకు! ముందే జాగ్రత్తపడు!", అన్నాడు.

సరేనన్నాడు పశుపతి. అవి పశుపతితో ముత్తయ్య అన్న ఆఖరి మాటలు! ముత్తయ్య మాటలు పశుపతి మనసులో బలంగా నాటుకుపోయాయి.

కొద్ది సంవత్సరాలు గడిచాక పశుపతికి తులసితో వివాహమై ఇద్దరు మగపిల్లలు ఒకేసారి కలిగారు. వారి జాతకం పరిశీలించిన జ్యోతిష్యుడు ఇద్దరూ విదేశాలకు వెడతారని చెప్పాడు. అది విన్న పశుపతి ముందు కొంత ఆందోళన చెంది ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత తన పిల్లలిద్దరిలో ఒకరిని మాత్రమే చదివించాలని మరొకరిని చదివించకూడదనీ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా చేసినట్లయితే తన కొడుకులిద్దరిలో చదువు లేనివాడు తననొదిలి ఎటో వెళ్లిపోయే అవకాశం ఉండదనీ, వాడు తన వద్దే చివరిదాకా ఉండిపోతాడనీ అనుకున్నాడు పశుపతి. బళ్ళు తెరిచే సమయానికన్నా కొద్దిరోజుల ముందు తన నిర్ణయం తులసితో చెప్పాడు పశుపతి. నివ్వెరపోయింది తులసి. ఎవరు చెప్పినా పశుపతి వినే రకం కాదని తెలిసిన తులసి మౌనంగా ఊరుకుండిపోయింది.

పశుపతి శశిధర్ ని బడిలో వేసి, గిరిధర్ ని పశువుల కాపరిగా చేసి పొలం పనులు నేర్పించడం మొదలుపెట్టాడు. తండ్రి మాటకు ఎదురుచెప్పే స్వభావం లేని గిరిధర్ తండ్రి దగ్గర ఎప్పుడూ బడి ఊసు ఎత్తలేదు!

ప్రతిరోజూ తెల్లవారగానే పుస్తకాలు సద్దుకుని బడికి వెళ్ళేవాడు శశిధర్. గిరిధర్ అదే సమయానికి ఆవులను మేపడానికి ఊరవతల ఉన్న మైదానానికి తీసుకుని వెళ్లేవాడు. శశిధర్ కి సాయంత్రందాకా బడే సరిపోయేది. గిరిధర్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి, భోజనం చేసి, పొలానికి వెళ్లి తండ్రికి పొలం పనులలో సహాయం చేసేవాడు. అలా ఇద్దరూ పెరిగి యుక్త వయసుకు వచ్చారు. శశిధర్ చదువు పూర్తిచేసి పై చదువులకు విదేశాలకు వెళ్ళిపోయాడు. గిరిధర్ పశువులను, పొలాన్ని చూసుకుంటూ తమ ఊరిలోనే ఉండిపోయాడు. పిల్లల విషయంలో తను తీసుకున్న నిర్ణయం అమలు చెయ్యగలిగానని, ఇక తనకు వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదని తృప్తి చెందాడు పశుపతి. కానీ అప్పుడప్పుడూ గిరిధర్ కు తను అన్యాయం చేశానేమోనన్న అనుమానం మాత్రం పశుపతికి కలుగుతూ ఉండేది.

రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం అలవాటు ప్రకారం ఆరుబయట కుర్చీలో కూర్చుని తులసితో ఏవో కబుర్లు చెబుతున్నాడు పశుపతి. అంతలో వారి ఇంటిముందు ఒక ఖరీదైన కార్ వచ్చి ఆగింది. అందులోంచి ప్రపంచ ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు పాండురంగం గారు దిగి తమ వైపు రావడం చూసి ఆశ్చర్యపోయారు పశుపతి దంపతులు. పశుపతి ఇంట్లోకి పరుగున వెళ్లి కుర్చీ తీసుకుని వస్తే తులసి ఆయన కోసం మంచి నీళ్లు పట్టుకుని వచ్చింది. ఇద్దరూ పాండురంగం గారికి మర్యాదలు చేసి వచ్చిన విషయమేమిటని వినయంగా అడిగారు.

అందుకు పాండురంగం గారు, "మీ అబ్బాయి గిరిధర్ ను నేను నా శిష్యుడిగా తీసుకోవాలని అనుకుంటున్నాను. అతడిని పట్నంలో నాతోనే ఉంచుకుని, గురుకుల పద్ధతిలో వేణుగానం నేర్పించాలని నా ఉద్దేశం. అలా చేస్తే అతడు భవిష్యత్తులో తప్పకుండా నాలాంటి గొప్ప విద్వాంసుడు అవుతాడు. మరి ఇందులో మీకేమైనా అభ్యంతరం ఉందా?", అని అడిగారు.

పశుపతి ఆశ్చర్యపోయి తులసి వంక చూసి, "ఒక్క క్షణం అండీ!", అంటూ భార్యను ఇవతలకు పిలిచి, "మన గిరిధర్ కు సంగీతంతో ఏంటి సంబంధం?", అని అడిగాడు.

"ఏమోనండీ! ఆ మధ్య కృష్ణాష్టమినాడు కృష్ణుడికోసం వేణువు కొంటూ ఉంటే నాకూ ఒకటి కావాలని అడిగి తీసుకున్నాడు గిరిధర్. ఇలా జరుగుతుందని ఊహించలేదు!", అంది తులసి.

"మా అమ్మకు సంగీతమంటే ప్రాణం! పాండురంగం గారి దగ్గర శిష్యరికం చెయ్యడానికి ఎందరో అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది ఆయనే మన ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటే ఎలా కాదనగలం?", అని అన్నాడు పశుపతి.

"నిజమేనండీ! మరి మీ ఇష్టం!", అంది తులసి.

పశుపతి కొద్దిగా ఆలోచించి, "గిరిధర్ ను మీతో సంతోషంగా పంపిస్తాం. కానీ వాడికి సంగీతం రాదు.. ! మరీ… ", అని సందేహిస్తూ ఆగిపోయాడు.

"వాడికి సంగీతం రాదన్నమాట మీరనకండి! గిరిధర్ కి సంగీత విద్య పూర్వజన్మ సుకృతంగా వచ్చినట్టుంది. వేణువును అమోఘంగా వాయిస్తూ ఉండగా నేను విన్నాను. అతడి ప్రతిభను కొద్దిగా సానపెడితే తిరుగులేని విద్వాంసుడవుతాడు. నా మాట నమ్మండి!", అన్నారు పాండురంగం గారు.

" సరేనండీ! మంచి రోజు చూసి మీవద్దకు పంపిస్తాం!", అన్నాడు పశుపతి.

ఆరోజు గిరిధర్ ఇంటికి రాగానే పాండురంగం గారి సంగతి చెప్పి, "అసలు నీకు వేణువు వాయించడం ఎవరు నేర్పార్రా?", అని అడిగాడు పశుపతి.

గిరిధర్ నవ్వి, " అదా..! అసలు సంగతి చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు! కొన్నేళ్ల క్రితం ఆవులను మేపడానికి ఊరి బయటకు వెళ్ళినప్పుడు గొర్రెల కాపరి శీను పరిచయమయ్యాడు. వాడు కొబ్బరాకు తో బూరా చేసి ఊదడం మొదలు పెట్టగానే మన ఆవులన్నీ చిత్రంగా చూస్తూ వాడివైపు రావడం గమనించాను. నేను కూడా బూరా తయారు చేసుకుని ఒకటి రెండుసార్లు మన ఆవుల్ని తేలిగ్గా ఒకచోటికి చేర్చగలిగాను. ఈ ఏడు కృష్ణాష్టమికి అమ్మ వేణువు కొంటునప్పుడు ఆ వేణువులను అమ్మేవాడు దాన్ని ఎలా వాయిస్తున్నాడో చాలాసేపు అక్కడే కూర్చుని గమనించాను. అప్పుడు అమ్మనడిగి నేను కొనుక్కున్న వేణువును ఆవులను మేపేందుకు వెళ్ళినప్పుడు వాయించడం మొదలుపెట్టాను. అలా ప్రతిరోజూ ఆవులు గడ్డి తిన్నంత సేపూ నాకు తోచిన విధంగా వేణువును వాయించేవాడిని. అవి నేను వేణుగానం మొదలుపెట్టగానే నా చుట్టూ చేరి ఆనందంగా వింటూ ఉండేవి. ఒకరోజు పాండురంగం గారి కారుకి మన ఆవులు రోడ్డు దాటుతూ ఉండగా అడ్డం వచ్చాయి. అవి గబగబా రోడ్డు దాటి నా దగ్గరకొస్తాయని వేణువు ఊదడం ప్రారంభించాను. పాండురంగం గారు కారు దిగి నేను వాయించేది వింటూ అక్కడే ఉండిపోయారు. ఆయన అంత గొప్ప సంగీత విద్వాంసులని నాకు తెలియదు!", అన్నాడు.

అది విని పశుపతి, తులసి ఆశ్చర్యపోయారు. పాండురంగం గారికి ఇచ్చిన మాట ప్రకారం గిరిధర్ ను పట్నం పంపించేశారు పశుపతి దంపతులు. కొద్ది నెలలు గడిచాయి. గిరిధర్ వేణు గానంలో మెళకువలన్నీ చాలా త్వరగా నేర్చుకుని అతి స్వల్పకాలంలోనే గొప్ప వేణుగాన విద్వాంసుల జాబితాలో చేరిపోయాడు!

ఒకరోజు గిరిధర్ పట్నం నుండి ఇంటికి వచ్చి పశుపతితో, "నాన్నా! నేను మా గురువుగారితో కలిసి విదేశాలకు వెడుతున్నాను. ఆయన అక్కడ ఒక సంగీత పాఠశాలను ఏర్పాటుచేసి దానికి నన్ను అధికారిగా నియమించనున్నారు. అక్కడ ఆసక్తి ఉన్నవారికి వేణుగానంలో శిక్షణను ఇవ్వాలని ఆయన ఉద్దేశం. అందుకు మీ అనుమతి కావాలి!", అని అడిగాడు.

గత కొంతకాలంగా గిరిధర్ కు అన్యాయం చేశానన్న భావనలో ఉన్న పశుపతి, కనీసం ఈ విధంగానైనా గిరిధర్ కు కొంత న్యాయం చేసినవాడినవుతానన్న తృప్తితో గిరిధర్ అడిగిన దానికి వెంటనే ఒప్పుకున్నాడు. గిరిధర్ విదేశాలకు వెళ్ళిపోయాడు. జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం ఇలా ఫలిస్తుందని పశుపతి ఊహించలేదు!

రోజులు గడిచే కొద్దీ పశుపతి మనసులో చివరి రోజుల్లో తను ఒంటరిగా బతకాల్సి వస్తుందేమోనన్న గుబులు మొదలయ్యింది.

అదే విషయం తులసితో చెప్తే, "ఎందుకండీ భయపడతారు? జీవితంలో మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అంతా ఆ దైవనిర్ణయం ప్రకారమే జరుగుతుంది! కాబట్టి ఆ పరమాత్మను నమ్ముకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు! భయపడకండి!", అంది.

ఎప్పుడూ మౌనంగా ఉండే తులసి తనకు ధైర్యం కలిగించేటట్టు మాట్లాడడం పశుపతికి ఆశ్చర్యం కలిగించింది.

అంతలో విదేశాలనుండి శశిధర్ ఫోన్ చేసి, "నాన్నా! నేను వచ్చేనెల మన ఊరికి వచ్చేస్తున్నాను. నా మెడిసిన్ పూర్తి అయ్యింది. మన ఊరిలోనే అన్ని వసతులతో ఒక మంచి ఆసుపత్రి పెట్టుకోవాలని నాకు ఉంది. అలాగైతే ఇక నేను మీతోనే ఉండచ్చు కూడా! ఏమంటారూ?", అని అడిగాడు.

పశుపతికి ఆనందంతో నోట మాట రాలేదు.

"సరేరా..! నీ ఇష్టం! అంతా ఆ దైవనిర్ణయం!!", అన్నాడు పశుపతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ!

**** సమాప్తం ****

Posted in December 2020, కథలు

2 Comments

  1. నరేంద్ర బాబు సింగూరు

    కధ చాలా బాగుంది. ముగింపు… నిజంగా.. దైవ నిర్ణయమే… లా మలచిన రచయిత నిర్ణయానికి…నా..కరతాళ ధ్వనులు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!