Menu Close
SirikonaKavithalu_pagetitle
బురుజు -- రాజేశ్వరి దివాకర్ల

పూల దండల దారానికి
పోగు విడుదల కరువు.
సొగసు విరుల పరిమళాలకు
కవి కంఠ సీమ చేరని వగపు,
ధ్వని ప్రసరణ సాధనాలకు
నిశ్శబ్ద వేదికల కుందు.
బోసి కలల సభా మందిరాలు,
కదలవు మూగ కుర్చీల వరుసలు,
రంగు తరలిన తెరలు.
మూసిన ప్రాంగణాల గాజు కిటికీ
సూది ముల్లు వెలుగులు,
గువ్వ పిట్ట రెక్కల టప టపలు,
అనుకూలమయ్యాయి
గరిక కట్టే గూళ్ళు .
ముఖ్య అతిథుల దర్బారు ఆసనాలు
గట్టి పడుతున్నాయి ధూళికి మెత్తదనాలు.
పనిని కోల్పోయాడు కాపలా దారుడు,
విద్యకు గణక యంత్రం లేక
దిగులు పడ్డారు
బడిలో చేరిన బడుగు పిల్లలు.
చీపురు కట్టను నమ్ముకుంది
ఇన్నాళ్ళూ ఆతని ఆలు.
నడుం వంచి పని చేయడమే తెలిసిన ఇల్లాలు.
కలవర పడుతోందిపుడు
కడుపు నిండమే ఆమెకిపుడు సవాలు,
కళా క్షేత్రంలో కార్యక్రమం అంటే గంపల కెత్తు
సుమ గుచ్ఛాల అమ్మకాలు
లేవిపుడు అసలు బేరాలు
శాలువల మడతల కిపుడు
పాతబడిన గీరలు
అంగడి కాశ్మీరానికిపుడు
ప్రాంతీయ భాషకు సడలిన పలుకు బడులు ,
పెరుగుతున్నాయి
ఆర్థిక మాంద్యాలు,
సిద్ధం కావాలిక ,
జరుగుతాయి నేరాలు ఘోరాలు,
యుగానికిదొక శిక్షాకాలం,
మనుషులందరూ ఇపుడు
తెరి చిన జైలు తలుపుల నుండి
దూకి పారిపోలేక
వెతలు చెందుతున్నారు
మానవత్వ బురుజు కోటల నునుపుకు !!!

అల లేని కొలను -- శేషగిరిరావు

అల లేని కొలనిలో
తెలి దామరల నవ్వు
దరహాసమో – లేక పరిహాసమో

కొదమగాలికి వెదురు
గుబురుతో గుసగుసలు
తొలిపలుకులో – కాక మలిపలుకులో

పోక కన్నెకు కొప్పు
ముడి విడిన వడి స్నేహ
సంరంభమో – శోక సంకేతమో

అల లేని కొలనిలో
తెలి దామరల నవ్వు
నిర్వేదమో – నిశ్చలానందమో

స్వప్న ప్రపంచం -- స్వాతి శ్రీపాద

వెచ్చని గాలి ఊపిరి
కనురెప్పల తలుపులు ఓరవాకలిగా
చేరవేసిన మరునిమిషం
దాగుడుమూతల ఆటలో ఎక్కడెక్కడో
మూల మూలలను౦డీ
దాగిన కలలు పరుగెత్తుకు వస్తాయి

అవి నాచుట్టూ పరిభ్రమిస్తాయో
నేనే ఒక ఉపగ్రహాన్నై
కలలు చుట్టూ తిరుగుతున్నానో
తెలిసీ తెలియని క్షణాలు
అయోమయం పల్చని పొర
అటూ ఇటూ తేల్చనే లేదు
రాసుకుంటూ తోసుకుంటూ
కదిలివచ్చే కలల సైన్య౦.

అపరిచిత పరిచయాల ప్రహసనాలు కొన్ని
పరిచయ జనాల కొత్త రూపాలు మరికొన్ని
అణగదొక్కుకున్న ఆశల చూపులూ
అణగారిన భావోద్వేగాల పరితప్తతా
కళలు కలలుగా సాగుతాయి.

నా చుట్టూ నేను నాటుకున్న
పుప్పొడి వనాలు కొన్ని
ఎక్కడెక్కడి నుండో వలస వచ్చి
నాటుకున్న మొగలి పొదలు కొన్ని
ఎటు చూసినా సముద్రాలు
జలమార్గాలు పరచుకుంటూ
పాదాలకింద పడగలు తొక్కిపెట్టి
సూర్య చంద్రులను గుప్పిట బిగించి
శూన్యాని కొలిచి వచ్చే అడుగులు మరిన్ని
ఎప్పుడో చటుక్కున ఒక
అనూహ్యత
ఓ తోపు తోసి ఇ౦కా
తెల్లవారని వెలుగుల్లోకి
ఈడ్చుకు వెళ్ళే వరకూ
కనురెప్పల వెనక నా మరో ప్రపంచంలో .................

అవ్యయానందమా -- బులుసు వేంకటేశ్వర రావు

అవ్యయానందమా అమృత మాకందమా
రసమూలకందమా రమ్య గాధ
తన్మయ లోకమా దర్శనో త్సేకమా
దీవ్యదాలోకమా తెలుగు తీపి
నిర్వాణ భోగమా నిరుపమ రాగమా
నిశ్చలత్యాగమా నెనరు పలుకు
వల్లకీ స్వనములా వాసంత వనములా
వర్షాభ్ర ఘనములా పద్య తతులు
భక్త గాధాను వర్తిత భావనా ప్ర
భావు పోతన్న రససృష్టి భాగవత ర
సామృతానందలహరి నాదగు భవమ్ము
కరగిపోనిమ్ము స్వామి నీ కరుణ తోడ!!!

“నిగ్రహ పతాకను” -- విశ్వర్షి వాసిలి

మొదటిసారి జోడించిన చేతులు
నా ఓటు అడిగినప్పుడు
నేనే కథానాయకుడిని!!!
****
తొలిసారి
వేలిపై సిరాచుక్క నిలిచినప్పుడు
నాకు నేనే వెన్నెల మరకను!
నా ఓటు గెలిచిన రోజు
నన్ను నేనె గెలిచిన సంబరం
నా పుట్టిన రోజుంత పరవశం!
నా దేశ జెండా రెపరెపల్లో
నా కనురెప్పల కదలికలు
నా కలల త్రివర్ణ శోభలు.
*****
అవును, 
అర్ధశతాబ్దంగా నేను పాతబడినవాడిని
అర్థవంతంగా మధ్యతరగతి పేదరికాన్ని.
*****
ప్రతి అయిదేళ్లకోమారు
నేను పసిమి నవుతుంటాను
నా ఓటు పసిడి దవుతుంటుంది.
ఫలితాల నాటికి
ఓటేసిన నేను నీరస పడుతుంటాను
గెలిచిన ఖాతాకు రాజస మవుతుంటాను
అవును,
నా జీవితానికీ
షష్టిపూర్తి మహోత్సవం
నా రాష్ట్రానికీ
షష్టిపూర్తి మహోత్సవం.
*****
అవునవును,
నేను
గెలిచిన నేత దృష్టిలో
గెలిచిన ఓటును -
గెలవని ఓటరును.
నా వేలి సిరాచుక్క
మూన్నాళ్ల చెరగని శీర్షిక
నా సిరాచుక్క
అక్షర నిగ్రహ పతాక శీర్షిక.
*****

Posted in December 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *