Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

వైదీశ్వరన్ కోయిల్

వైదీశ్వరన్ కోయిల్

చిదంబరం నుండి తిరువారూరు వెడదామనుకుని బయలుదేరాము కానీ, ముందర ఇంకొక ముఖ్యమైన ప్రదేశం చూద్దామని నిశ్చయించాము. అదే జ్యోతిర్లింగక్షేత్రమైన వైదీశ్వరన్ కోయిల్, లేక వైద్యనాథాలయం. ఇది కూడా చాలా పెద్ద కోవెల. ఈయన్నే ఉత్తర భారతంలో 'బైద్యనాథ్' అంటారు. కింద పొందుపరిచిన వీడియోలో చూపినట్లు ఈ గుడికి మూడు ప్రాకారాలున్నాయి. మేము ఇక్కడికి చేరేటప్పటికి పొద్దున్న 11, 11.30 గంటలు అయింది. చెప్పడం మరిచాను. అవి రోహిణీకార్తె ఎండలు చెరిగే రోజులు. ప్రతి గుడిలోనూ రాతిబండలు నిప్పులలాగా మండుతున్నాయి. అసలు కాలు కింద పెట్టేటట్లు లేదు. అలాంటిది చెప్పులు మొదటి ప్రాకారం వద్ద వదిలిపెట్టి, మూడు ప్రాకారాల మధ్య ఉన్న గుడిలోకి వెళ్లాలంటే ప్రాణం తోక్కొచ్చింది. అన్ని ఈశ్వర ఆలయాల్లాగే ఇక్కడకూడా ఎడమచేతివైపు తిరిగి, ముందుకి వెళ్లి, అక్కడనించి ఆలయ ప్రవేశం చెయ్యాలి. ప్రధాన గోపురంపై 9 కలశాలున్నాయి. మిగతా తమిళ నాడు ఆలయాల్లాగా కాకుండా, ఈ ఆలయ గోపురంకి రంగులేమీ వెయ్యలేదు. అందుకని నాకు చాలా సుందరంగా కనిపించింది.

ఈ స్థల విశేషమేమంటే, ఇక్కడే అన్ని నాడీ  జ్యోతిష గ్రంథాలు పొందుపరచబడ్డాయి.  అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి జాతకాలు అవిచూసి చెప్పెయ్యచ్చన్నమాట. (ఈ అనుభవం మాకు కాలేదు; మేము ప్రయత్నించను కూడా లేదు. కాకపోతే అవి చూశామన్న స్నేహితులు చెప్పారు.) ఈశ్వరుడే 'ప్రథమో దైవ్యో భిషక్' (నమక ప్రశ్న) కదా! ఇక్కడ శివుడు రకరకాల వ్యాధులు నయం చేస్తాడని నమ్ముతారు. శివలింగానికి అద్భుతమైన, హోమగుండం లోంచి వచ్చిన విభూతి అభిషేకం చేస్తారు. అదే ప్రసాదంగా ఇస్తారు. ఈ విభూతిని 'తిరుచంద ఉరుండల్' అంటారు. గుడి ఆవరణ చాలా పెద్దది. కానీ ఎక్కడపడితే అక్కడ భక్తులు విభూతి రాసేసుకుని, పడెయ్యడం మూలాన చూడగానే అశుభ్రంగా ఉన్నట్లనిపించినా, అంత కష్టం అనిపించదు, ఇది చాలా పెద్ద గుడి. ఒకే కప్పు కింద శివాలయం, అమ్మవారి ఆలయం ఉంటాయి. శివాలయంలోకి ప్రవేశించి శివలింగం కోసం పరిశీలిస్తే. ఇక్కడ శివలింగం ముందు ఒక డాలు వంటిది ఉంటుంది. గబుక్కున చూస్తే మీకు లింగం కనిపించదు. పక్కగా నిలుచుని కొద్దిగా ఒంగి చూస్తే చక్కగా కనబడుతుంది. పెద్ద లింగం. పూర్తిగా విభూతితో కప్పబడి, అలంకరించబడి ఉంటుంది. నాకు కనబడిన విశేషం ఏమిటంటే గ్రామస్థులు, పూర్తి నమ్మకంతో తమ వ్యాధులు నయమయిపోతాయని ఇక్కడకి శివ దర్శనానికి వస్తారు.

ఇక్కడ విభూతి ప్రసాదంగా ఇస్తారు కానీ, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూసాము. అక్కడ ఈశ్వరుడికి నైవేద్యంగా ఫలాలూ, పుష్పాలు ఇవ్వరు. వచ్చిన భక్తులంతా అక్కడే అమ్మే రాతి ఉప్పు, మిరియాలు, ఆ పక్కన బెల్లం - ఇవి తీసుకుని, దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ విశేషమేమిటి? అని మేము అక్కడ ఉన్నవారిని అడిగితే, ఈ ప్రసాదం ఈశ్వరుడికి సమర్పించి, తిన్న వాళ్లకి, పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయి - అని నమ్మకం-ట. సరేనని మేము కూడా ఉప్పు, మిరియాలు, బెల్లం దేముడికి సమర్పించి, భక్తిగా రెండు మిరియం గింజలు, రెండు రాతి ఉప్పు కణికెలు నోట్లో వేసుకున్నాము. ఆశ్చర్యంగా ఆ మిరియపు గింజలు మామూలు మిరియాల్లాగా కాకుండా చాలా మృదువుగా ఉండి, చటుక్కున నమలబడేగా ఉన్నాయి. అంతే కాదు, నేను మాటల్లో చెప్పలేని ఒక సువాసనతో ఉన్నాయి. మిరియానికి సహజమైన ఘాటు కంటే, ఆస్వాదించదగ్గ రుచి ఎదో ఉన్నది. అలాగే ఆ ఉప్పుకూడా మరీ ఉప్పగా కాకుండా, ఈ మిరియానికి తగ్గట్టుగా ఉండి, అనుపానమైంది. అరవంలో మిరియాలని 'మిళగు' అంటారు. దీన్ని ఇంతకంటే వర్ణించలేను, ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే! అయితే ఇక్కడ ఒక విషయం - అందరికీ మామూలుగా తెలియదు - మిరపకాయలు మన దేశంకి సొంతవి కాదు. అంటే వాటిని దేశవాళీ అనలేము. మిరపలేనప్పుడు వంటలో కారం కావాలంటే మిరియాలు మాత్రమే వాడేవారు. నే చెప్పే మాటకి మంత్రశాస్త్రంలో కూడా రుజువున్నది.

వైదీశ్వరన్ కోయిల్శివాలయం ఎడమచేతి పక్కగా విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు ఉన్నారు. ఇక్కడ అంగారకుడి గుడి కూడా ఉన్నది. శివుడి కొడుకైన అంగారకుడు, శివుడి చెమట చుక్క నేలమీద పడగా పుట్టినవాడికి - చర్మ వ్యాధి వచ్చిందని, శివుడు ఆ వ్యాధి నయంచేసి అంగారకుడి చర్మానికి ఎరుపు రంగు వచ్చేటట్లు చేసాడని, నమ్ముతారు. అందుకే లోపలే కాక, బయటకూడా అంగారకుడికి ఆలయం ఉన్నది. ఈ కథ చూపించే చెక్కడాలు రెండో ప్రాకారం గోపురం వద్ద ఉన్నాయి. అందుకే శివుడిని ఇక్కడ 'వైదీశ్వరన్' - అంటే వైద్యుడైన శివుడు - అంటారు. ప్రధాన శివ ఆలయం బయటికి రాగానే (ఇదంతా పైకప్పు లోపలే) ధ్వజ స్థంభంకి ఎడమ చేతి వైపు అమ్మవారి ఆలయం ఉన్నది. అమ్మవారిని 'తయ్యలనాయకి అమ్బాల్ ' అని పిలుస్తారు. ఆ రోజు చాలా విశేషంగా అమ్మవారి పూజ జరుగుతున్నది. ఎవరో ఒక పెద్ద గుంపు భక్తులు వచ్చి కళ్యాణం చేయించుకుంటున్నారు. అమ్మవారిని అంబాళ్ అని వ్యవహరిస్తారు. అమ్మవారు కరుణతో నిండిన చూపులతో మనల్ని అనుగ్రహిస్తున్నట్లు వెంటనే అర్థమవుతుంది. ఇక్కడ జాతీయులు (Locals) ఈ ఆలయాన్ని చాలా నమ్ముతారనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడితే. అయ్యవారిని చూసే వారికంటే పెద్ద గుంపు కళ్యాణం చూస్తున్నారు. చాలా బాగుంది.

అక్కడనించి అంత  విశేషమైన పుష్కరిణి చూడాలని వెళ్ళాము. ఆలయం లోపల ఫోటోలు తీసే అవకాశంలేదు కనక, పుష్కరిణి దగ్గిర తీసుకున్నాము. నిజంగా తిరుపతిలో కూడా ఇంత పెద్ద పుష్కరిణి లేదనిపించింది. చూడదగ్గదేంటంటే పుష్కరిణి చుట్టూతా ఒక స్తంభాలతో కట్టడం ఉన్నది. (Covered corridor). ఫొటోలో చూడవచ్చు. ఇక్కడ స్నానాలు చెయ్యడానికి తాళ్లు కట్టి ఉన్నాయి కానీ, మేము స్నానాలు చెయ్యలేదు.

ఇలా ఈ జ్యోతిర్లింగ క్షేత్రదర్శనం అయ్యాక, మా యాత్రల్లో అన్నిటికన్నా రుచికరమైన, అందమైన, చారిత్రకమైన, జన సామాన్యానికి మామూలుగా తెలియని, క్షేత్రానికి బయలుదేరాము. దాని గురించి వచ్చే సంచికలో.

### సశేషం ###

Posted in December 2020, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!