Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఏ)

ఉదయం వేళలలో సూర్యోదయం అయ్యేవరకు గాయత్రి మంత్రాన్ని నిలబడి జపించాలి. సాయంత్రం వేళలలో నక్షత్రములు కనిపించే వరకు కూర్చుని గాయత్రిని జపించాలి. ఉదయం పూట ద్విజుడు నిలుచుని చేసే ప్రాతః సంధ్యా గాయత్రి జపం వలన గత రాత్రి చేసిన పాపాలను పోగొట్టుకుంటాడు. కూర్చునిచేసే సాయం సంధ్యా గాయత్రి జపం వలన అతడు ఆ పగలు చేసిన పాపాలను పోగొట్టుకుంటాడు. ఎవడు ఈ ప్రాతః సంధ్యా, సాయం సంధ్యా గాయత్రి జపాన్ని ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేయడో, ఆ ద్విజుడిని శిష్టులు ఒక శూద్రుడిని బహిష్కరించినట్లే, ఆర్యులు చేసే అన్ని ద్విజకర్మల నుంచి బహిష్కరించాలి.

నేను గతంలో పేర్కొన్నట్లే ఈ పాపపుణ్యాలు, స్వర్గనరకాలు, పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే చేసిన పాపం నశించడం వంటివన్నీ కేవలం కొందరి నమ్మకాలు మాత్రమే. వాటికి ఎలాంటి శాస్త్రీయ పునాది లేదు. స్వర్గనరకాలంటే ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నలకు ప్రపంచవ్యాప్తంగా వాటిని నమ్మేవారిలోనే ఎలాంటి ఏకాభిప్రాయమూ లేదు. ఇక అది పక్కనబెడితే ఈ పాపపుణ్యాల విషయంలోనూ వాటిని నమ్మే సంప్రదాయవాదులలో భిన్నాభిప్రాయం ఉంది. కొందరి దృష్టిలో “పాపం చేసినవాడు పశ్చాత్తాపపడినా చాలు అతడు చేసిన పాపం పరిహారమైపోతుంది.” ఇంకొందరి అభిప్రాయం ప్రకారం “మనం చేసిన పాపం కేవలం పశ్చాత్తాప పడటంతో కాక తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మాత్రమే పరిహరించుకోగలం.” మరి కొందరు సంప్రదాయవాదుల దృష్టిలో “మనం చేసిన పాపం ఏ ప్రాయశ్చిత్తాలు చేసినా నశించదు; పాపం చేసిన ప్రతి వ్యక్తీ తాను చేసిన పాపానికి తగిన ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే.”

మన ప్రాచీన సాహిత్యంలో - ముఖ్యంగా గరుడ పురాణంలో - మరణానంతర జీవితాన్ని గురించి, మనం చేసిన పాప పుణ్యాలకు మనకు లభించే ఫలాలను గురించి విస్తృతమైన వివరణలున్నాయి. ఉదాహరణకు జీవులను సరదాకు హింసించే వ్యక్తికి నరకంలో ‘కుంభీ పాకం’ అనేది శిక్షగా వేస్తారట - అంటే సలసల కాగే నూనెలో ఆ వ్యక్తిని వేయిస్తారట. ఒకపక్క మరణానంతరం మన ఆత్మ (మనం చినిగిన వస్త్రాన్ని విడిచి వేరొక వస్త్రం ధరించినట్లే) మరొక శరీరంలో ప్రవేశిస్తుందనీ, ఆత్మకు సుఖదుఃఖాలు ఉండవనీ చెపుతూనే ఈ మరణానంతర శిక్షల్ని కూడా కొందరు నమ్ముతుండడం చిత్రం. ఇందుకోసం ‘ఆత్మతో పాటు శరీరాన్ని వదలి వెళ్లే యాతనా దేహం అనేది వేరొకటి ఉంటుందనీ, మరణానంతరం నరకలోకంలో ఆ వ్యక్తి జీవితకాలంలో చేసిన పాపాలకు శిక్షగా యమ యాతనలు అనుభవించేది ఆ యాతనా దేహమేనని’ మరో సిద్ధాంతం ముందుకు తెచ్చారు. కొందరు స్వర్గనరకాలు, పాపపుణ్యాల మాట అటుంచి ఇలాంటి నమ్మకాలు ఇంకా జనంలో ఉండడం కారణంగానే ప్రపంచంలో పాపకార్యాలు అదుపులో ఉన్నాయనీ, ఇలాంటి నమ్మకాలు ప్రజలలో నేరప్రవృత్తిని అదుపుచేస్తాయనీ వాదిస్తారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎప్పుడూ దైవం, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం వంటి వాటిపై విశ్వాసం కలిగినవారే నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు. అయినా ప్రపంచంలో పాపాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు వంటివి నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏమాత్రం తగ్గడం లేదు. కోట్లకు కోట్లు వెచ్చించి అన్ని మతాల వారూ చేస్తున్న ధర్మప్రచారమూ ఈ పాప రాశులను ఏ మాత్రం ప్రక్షాళన లేక అదుపు చేయలేకపోతున్నది. కనుక మరణానంతరం తాము చేసిన పాపాలకు ఇలాంటి శిక్షలుంటాయని తెలిసినా జనంలో నేరప్రవృత్తి తగ్గకపోగా రోజురోజుకూ పెరగడానికి కారణం ఏమై ఉంటుందో, ఇందుకు సమాజంలో ఎవరిని తప్పుపట్టాలో మనం కొంచెం తాపీగా ఆలోచించాలి. కొందరు ముముక్షువులు మోక్షం కోరి సమాజానికి దూరంగా అడవులలో, గుహలలో ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటున్నారు. సామాజిక జీవనం గడుపుతున్న వారిలోనూ అతి కొద్దిమంది సజ్జనులు మాత్రమే పరోపకారబుద్ధి కలిగి ధార్మిక జీవనం గడుపుతూ ఉంటే, సగటు మనుషులు మాత్రం తమ జీవితకాలంలో తాము కోరుకునే స్వార్థపూరితమైన కోరికలు నెరవేరడానికో, మరణానంతరం తమకు స్వర్గం ప్రాప్తిస్తుందనో అడ్డదారుల కోసం వెదకుతున్నారు. ఈ జన్మలోనూ, గత జన్మలలోనూ (?) తాము చేసిన/చేస్తున్న పాపాల పరిహారం కోసం వారు మతాలనూ, మత పెద్దలనూ నమ్ముకుంటున్నారు. కొందరు ఏవేవో ఆశించి, తమ గొంతెమ్మ కోరికలు తీరడానికి నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మునిగితేలుతుంటే, ఇంకొందరు అమాయకంగా స్వామీజీలు, బాబాల వంటి ‘దైవ ప్రతినిధుల’ ను  ఆశ్రయిస్తున్నారు. ఆశ్రితుల స్వార్థపూరితమైన కోరికలనూ, వారి అమాయకత్వాన్నీ అడ్డుపెట్టుకుని ఈ ‘దైవ ప్రతినిధులు’ తమ ధార్మిక సంస్థల ద్వారా అక్రమ మార్గాలలో కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ, ఒక రకంగా చట్టాలకు అతీతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యాలే నిర్మిస్తున్నారు. అటు ప్రభుత్వాలలో పలుకుబడినీ, ఇటు ప్రజల అమాయకత్వాన్నీ ఆసరాగా చేసుకుని ఈ ‘దైవ ప్రతినిధులు’ చేస్తున్న అక్రమాలు, లీలలు అన్నీ ఇన్నీ కావు. ఒక బాబా లేక స్వామీజీ అక్రమాలు బయటపడితే అతన్ని వదిలి వీరంతా వేరొక బాబాను ఆశ్రయిస్తున్నారే తప్ప అసలీ మార్గం ఏ మేరకు సవ్యమైనదని మాత్రం ఆలోచించడం లేదు. సామాన్యుడిలో కూడా తాను కోరుకున్నవన్నీ జరగాలనే దురాశ, తన జీవితకాలంలో తన కోసం, తన వారి కోసం వీలైనంత సంపద పోగేసుకోవాలనే స్వార్థపూరితమైన కోరిక, నరకం పట్ల, పాపాల పట్ల అతనిలో ఉండే భయం, ఈ ప్రపంచం, ప్రకృతి పట్ల అతడికి ఉండే అవగాహనా రాహిత్యం - ఈ మూడూ కారణం. సామాన్యుడిలో ఉన్న ఈ స్వార్థం, భయం, అజ్ఞానం - వీటిని తొలగించగలిగితే అసలు సమస్యకు పరిష్కారం లభించినట్లే. జనబాహుళ్యానికి ఈ విశ్వాన్ని గురించి, సమాజాన్ని గురించి శాస్త్రీయ దృష్టిని కలిగించగలిగితే వారు ఈ ప్రపంచంలోని పాపాల (అన్యాయాలు, అక్రమాల)కు మూల కారణమేమిటో తెలుసుకుని పాప ప్రక్షాళనకు తాము ఏమి చేయాలో కూడా తెలుసుకోగలుగుతారు. ఇలా అధికసంఖ్యాకులైన సామాన్యులు పాప కార్యాలకు భయపడుతూ, తమ కష్టాలు తొలగించుకొనడానికి భక్తి మార్గాన్ని ఎంచుకోగా, ఇదే సందని కొందరు కుజనులు సైతం తాము చేసే పాపాలు (చెడ్డ పనులు) నిర్భయంగా చేసుకుపోతూనే, తమ అక్రమార్జనలో కొంత భాగాన్ని గుడులు, గోపురాలు కట్టిస్తూ, దేవతా విగ్రహాలకు ఖరీదైన వజ్ర కిరీటాల వంటివి చేయిస్తూ పరమ భాగవతోత్తములుగా లోకానికి పోజులిస్తున్నారు. వారు కర్మఫలదాతగా తాము భావిస్తున్న దైవాన్ని ఎలాగైనా సరే ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడానికి బాగా అలవాటు పడ్డారు. నిజంగా దేవుడే ఉంటే వారు చేసిన పాపాలకూ, దుష్కార్యాలకూ వారికి తగిన శిక్షలు వేయక మానడు. దుష్టుల అక్రమాలను గుర్తించి వారిని శిక్షించలేకపోతే సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తి సమన్వితుడు అని మనం నమ్ముతూ వస్తున్న దేవుడు అసమర్థుడనబడతాడు. విచక్షణతో పాపిష్టివాళ్లు చేసిన అక్రమాలకు వారిని శిక్షించకుండా, వారు తమ ఆలయాలకో, విగ్రహాలకో  విలువైన కానుకలు ఇచ్చారు కదా అని  పాపులను క్షమించి వదిలేస్తే, దేవుడు లంచగొండి అనే అపకీర్తిని మూటగట్టుకుంటాడు. ఇది ఆలోచించాల్సిన విషయం.

అరణ్యంలో, నదీ తీరాలలో కూడా ఏకాగ్రచిత్తంతో, ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకుని, నైత్యక (రోజువారీ చేసే) క్రియ అయినట్టి ప్రాతః మరియు సాయం సంధ్యా గాయత్రి జపం చేయవచ్చు. అయితే విధి ప్రకారము ప్రణవము (ఓంకారము) తోనూ, ‘భూర్భువస్సువః’ అనే వ్యాహృతి త్రయంతోనూ కూడిన గాయత్రినే జపించాలి. కాని శిక్షా మొదలగు వేదాంగములు చదివేటప్పుడు, నిత్యం అనుష్ఠించే బ్రహ్మ యజ్ఞ రూపమగు స్వాధ్యాయము నందు, నిషిద్ధ దినములలోనూ, హోమ మంత్రాలు చదివేటప్పుడు ఈ నియమం పాటించవలసిన అవసరం లేదు.

శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము - ఈ ఆరింటినీ వేదాంగములంటారు. ఇవి వేద మంత్రాల సారాన్ని సవ్యంగా అర్థం చేసుకొనడానికి, వేద మంత్రాలను ఒక క్రమ పద్ధతిలో స్పష్టంగా ఉచ్చరించడానికి, క్రతు కాండలో వేద మంత్రాలను సక్రమంగా వినియోగించుకొనడానికి ఉపకరించే ఉపాంగాలు (Auxiliaries to the Vedas). కొందరు వీటినే ‘షడంగములు’ అని కూడా అంటారు.

శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందసాం చయః |
జ్యోతిషామయనం  చైవ వేదాంగాని షడేవ తు ||

శిక్ష వేదమంత్రాలను ఎలా పలకాలనేది వివరిస్తుంది. ఛందస్సు (Prosody) వేద మంత్రాల రచనా విధానం యొక్క వైశిష్ట్యాన్ని వివరిస్తుంది. వ్యాకరణం వేద మంత్రాలలో పాటించిన వ్యాకరణ సూత్రాలను వివరిస్తుంది. నిరుక్తము కఠినమైన వైదిక శబ్దాల వ్యుత్పత్తి అర్థాన్ని (Etymological meaning) వివరిస్తుంది. జ్యోతిషం ఖగోళ శాస్త్ర (Astronomy) సంబంధిత విషయాలను వివరిస్తుంది. కల్పం యజ్ఞయాగాదుల నిర్వహణలో వేద మంత్రాలను ఎలా ఉపయోగపెట్టుకోవాలో వివరిస్తుంది.

నిత్యమైన వేదాధ్యయనంలో అనధ్యయన దోషం లేదు. అలాంటి నిత్యాధ్యయనమును ‘బ్రహ్మసత్త్రము’ అంటారు. ఇలా రోజూ బ్రహ్మసత్త్రము పేరిట చేసే నిత్యాధ్యయనమునకు నిషిద్ధ దినాలు అంటూ ఏవీ ఉండవు. ఇది పరబ్రహ్మను ఉద్దేశించి నిత్యమూ చేసే ఎప్పటికీ ముగియని జపయజ్ఞం. హోమాగ్నిలో నెయ్యి మొదలైన హోమద్రవ్యాలను వేల్చే క్రియను అనధ్యయనముగా చేసినప్పటికీ - అంటే  వేద మంత్రాలు జపించకుండా చేసినప్పటికీ పుణ్యప్రదమే కానీ, దానికి అనధ్యయన దోషము రాదు.

ఏ ద్విజుడు ఒక సంవత్సర కాలంపాటు జితేంద్రియుడై - అంటే ఇంద్రియములను జయించినవాడై - క్రమం తప్పక నిత్యస్వాధ్యాయం చేస్తాడో, అతడికి ఆ నిత్య స్వాధ్యాయం పయస్సు (పాలు), దధి (పెరుగు), ఘృతం (నెయ్యి), మధు (తేనె) లను సమృద్ధిగా సమకూరుస్తుంది. నిత్యస్వాధ్యాయం చేసే వ్యక్తికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెలకు ఎలాంటి లోటు ఉండదంటే అతడి ఇంట సిరిసంపదలకు ఏ  లోటు ఉండదని భావం. ఇవన్నీ ఆ నిత్యస్వాధ్యాయమే సమకూర్చి పెడుతుందనే మన ప్రాచీనుల నమ్మకం ఒక అశాస్త్రీయమైన విశ్వాసమేననేందుకు మన ప్రాచీన సాహిత్యంలోనే కొన్ని ఉదాహరణలున్నాయి. బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించబడిన శునస్సేఫుడి తండ్రి అజీగర్తుడు నిత్యాగ్నిహోత్రి, నిత్యస్వాధ్యాయి. అయినా కటికి నిరుపేద అయినట్టి ఆయన  తన ఆకలికి, దారిద్య్ర బాధకు తాళలేక తన ముగ్గురు కుమారులలో తనకు అంత్యేష్టి నిర్వహించడానికి పెద్ద కుమారుడిని, తన భార్య కోరిక మేరకు చిన్న కుమారుడిని ఉంచేసుకుని, మధ్యలోని వాడైన శునస్సేఫుడిని వంద గోవులకు వెలకట్టి అమ్మేస్తాడు. భాగవతంలోని శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన సుదాముడు సాందీపుడనే మహర్షి ఆశ్రమంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడితో కలిసి చదువుకున్నవాడు. అతడు కుచేలుడనే మరొక పేరుతో లోకానికి సుపరిచితుడు. అతడు గొప్ప పండితుడు, నిత్య స్వాధ్యాయి అయివుండి కూడా అతడి ఇంట దశాబ్దాలపాటు దరిద్రం తాండవించింది. ఒక సంవత్సరకాలం పాటు నిత్య స్వాధ్యాయం చేస్తేనే అతడి దరిద్రం తొలగిపోయి, అతడు సిరిసంపదలతో తులతూగి ఉండాల్సింది మరి. దశాబ్దాలు పేదరికం అనుభవించి తానుండే సుదామపురి (నేటి గుజరాత్ లోని పోర్బందర్) నుంచి ద్వారకకు వెళ్లి తన మిత్రుడు శ్రీకృష్ణుడికి అటుకులను కానుకగా ఇచ్చి, ఆయన కృపకు పాత్రుడైన కారణంగానే అతడి దరిద్రం తొలగిపోయిందని భాగవత కథనం. కనుక నియమం తప్పకుండా స్వాధ్యాయం చేయడాన్ని ద్విజులకు అలవరచే ఉద్దేశంతోనే మనువు తన స్మృతిలో ఇలా రాసి ఉంటాడని గ్రహించగలం. వేదంలో ‘యదహ్నాత్ కురుతే పాపమ్ | తదహ్నాత్ ప్రతిముచ్యతే’ అని ‘అగ్నిహోత్రం చేయడంవల్ల మనం ఏరోజు చేసిన పాపం ఆరోజే తొలగిపోతుంద’ని పేర్కొనడం కూడా ఇలాంటిదే.

అగ్నీంధనం భైక్షచర్యామధశ్శయ్యాం గురోర్హితమ్ |
ఆ సమావర్తనాత్కుర్యాత్ కృతోపనయనో ద్విజ : || ( 2- 108).

‘కృతోపనయనో ద్విజ:’ అంటే ఉపవీతుడైన ద్విజుడు నిత్యమూ అగ్నీంధనం (అగ్నిహోత్రము), భైక్ష చర్యా (భిక్షాటన), అధశ్శయనం (నేల మీద పడుకొనడం), గురోర్హితం (గురువుకు మేలు చేకూర్చే పనులు చేయడం) అతడు ఆ సమావర్తనాత్ (సమావర్తనం చేసే వరకు - అంటే పవిత్రమైన అధ్యయనాన్ని ముగించుకుని అతడు గురువు ఇంటినుంచి తన స్వగృహానికి తిరిగి వచ్చేసే వరకు) కుర్యాత్ అంటే (పై నాలుగింటినీ నియమం తప్పక) ఆచరించాలి.

ఆచార్య పుత్రుడు (తనకు విద్య నేర్పిన గురువు కుమారుడు), తనకు శుశ్రూషలు చేసేవాడు, జ్ఞానదుడు (తన దగ్గర నేర్చుకున్న విద్యకు ప్రతిగా తనకు మరొక విద్య నేర్పేవాడు), ధార్మికుడు (ధర్మం తప్పనివాడు), శుచి : (బాహ్య, అంతరంగ శౌచములు పాటించే పరిశుద్ధుడు), ఆప్తుడు (బంధువు), శక్తుడు (గురువు చెప్పింది విని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకోగలిగే సమర్థుడు), అర్థదుడు (తనకు డబ్బు ఇవ్వగలవాడు), సాధువు (గురువు మేలు కోరే నిజాయతీపరుడు), జ్ఞాతి (తండ్రి తరఫు బంధువు) - ఈ పది మందికి దక్షిణ ఏమీ తీసుకోకుండా వేద విద్యను బోధించాలి.

ఈ (2-109) శ్లోకంలో చెప్పబడిన పది మందిలో ‘ఆప్తుడు’ అంటే బంధువు అనీ, జ్ఞాతి అంటే తండ్రి తరఫు బంధువు అనీ పేర్కొన్న సరస్వతి వేంకట సుబ్బరామ శాస్త్రి గారి వ్యాఖ్యానం సమంజసంగా లేదు. మరి బంధు సముదాయంలో తండ్రి తరఫు బంధువులు కూడా లెక్కకు వస్తారు కదా! ఇదే శ్లోకానికి బ్యూలర్ (Buhler) యొక్క ఆంగ్ల వ్యాఖ్యానంలో ‘ఆప్త’ అనే శబ్దానికి ‘A person connected by marriage or friendship’ (గురువు యొక్క భార్య తరఫు బంధువు లేక స్నేహితుడు) అని అర్థం చెప్పబడింది. మొదటి వ్యాఖ్యానం లోని వివరణ కంటే ఇది కొంచెం సమంజసంగా ఉంది. అలాగే వేద విద్యలను ఈ పది రకాల విద్యార్థులకు దక్షిణ ఏమీ తీసుకోకుండా ఉచితంగా బోధించాలని ఒక పక్క చెపుతూనే, అర్ధదుడు (తనకు ద్రవ్యం ఇవ్వగలవాడు) అనే తరహా విద్యార్థినీ ఈ పది మందిలో చేర్చడంలో మనువు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా లేదు.

తనను అడగకుండా గురువు ఎవరికీ ఏమీ చెప్పరాదు. అలాగే తన పట్ల భక్తిశ్రద్ధలు లేకుండా అడిగేవాడికి కూడా గురువు ఏమీ బదులు చెప్పకూడదు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో తనకు తెలిసిన మేధావి  కూడా లోకం దృష్టిలో జడునిలా (ఏమీ తెలియని మూగవానిగా) మౌనంగా ఉండిపోవాలి. ఏ విషయాన్ని గురించైనా అధర్మంగా సమాధానం చెప్పినవాడు లేక అధర్మంగా ప్రశ్నించిన వాడు - వీరిరువురిలో దోషము చేసినవాడు మరణిస్తాడు. లేదా రెండవవాడికి విరోధి అవుతాడు.

ఎవరికి అధ్యాపనము (విద్యాబోధన) చేయడం వల్ల ధర్మము (పుణ్యము), అర్థము(డబ్బు) లభించదో, లేక కనీసం శుశ్రూష అయినా లభించదో అలాంటి వాడికి ఎట్టి పరిస్థితులలోనూ విద్య నేర్పరాదు. అలాంటి శిష్యుడికి విద్య గరపడం అంటే చవిటి చేలో విత్తనం విత్తినట్లే వ్యర్థమౌతుంది. యోగ్యుడైన శిష్యుడు లభించనప్పుడు గురువు అయోగ్యునికి బోధించుట కంటే మరణించడం మేలు. ధనం ఆశించి అయోగ్యుడికి విద్యను బోధిస్తే ఇరిణము (చవిటి పర్ర)లో నాటిన విత్తనంలా వృథా అయినట్లే. అది అపాత్రునికి చేసే విద్యాదానమే అవుతుంది. అందుకే గురువుకు ఎంత ఘోరమైన ఆపద వచ్చినా అయోగ్యునికి విద్యాబోధన చేయరాదు.

విద్యాధిదేవత ఒక అధ్యాపకుడైన బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి “నేను నీ సంపదను. నన్ను నీవే  రక్షించుకో. అసూయ మొదలైన దోషములున్నవాడికి నన్ను ధారపోయవద్దు. నన్ను అయోగ్యుని పాలుగావించకుండా నీ దగ్గరే ఉంచుకుంటే నేను మరింత వీర్యవంతం(శక్తిమంతం) గా అవుతాను,” అంటుందట. “పరిశుద్ధుడు, ఇంద్రియములను జయించిన బ్రహ్మచారి, విద్యానిధిని కాపాడగలవాడు, జాగరూకుడు అయినట్టి విప్రునికే నీవు నన్ను అప్పగించాలి (విద్యాబోధన చేయాలి).”

ఎవడైతే అభ్యాసం నిమిత్తం వేదాన్ని బిగ్గరగా వల్లెవేస్తున్న వ్యక్తి నుంచి అతడికి తెలియకుండా వినిగానీ, ఒక గురువు వేరొకరికి చెప్పే పాఠం ఆ గురువుకు తెలియకుండా వినిగానీ అభ్యసిస్తాడో, అతడు వేదచౌర్యం (వేదాన్ని దొంగిలించడం) అనే పాతకం చుట్టుకుని నరకానికి వెళతాడు.

ఒక విద్యార్థి తనకు అర్థశాస్త్రము మొదలైన లౌకిక జ్ఞానాన్ని బోధించే గురువు, వేదార్థాల పరిజ్ఞానాన్ని బోధించే గురువు, బ్రహ్మజ్ఞానాన్ని బోధించే గురువు- ఈ ముగ్గురూ ఒకే చోట ఉన్నప్పుడు ముందుగా బ్రహ్మజ్ఞానదాతకు, తరువాత వేదార్థ జ్ఞానదాతకు, ఆ తరువాత లౌకిక జ్ఞానదాతకు నమస్కరించాలి.

యంత్రితుడైన (శాస్త్రానికి కట్టుబడి ఉండే) బ్రాహ్మణుడు కేవలం గాయత్రి మంత్రం మాత్రమే వచ్చినవాడే అయినా సరే యోగ్యుడే. అలా యంత్రితుడు కాని (శాస్త్రానికి కట్టుబడనట్టివాడు) మరియు సర్వాశి (నిషిద్ధమైన వాటితో సహా అన్ని రకాల ఆహారాలను భుజించేవాడు), సర్వవిక్రయీ (నిషిద్ధ వస్తువులతో సహా అన్ని వస్తువులనూ విక్రయించేవాడు) అయినట్టి బ్రాహ్మణుడు - అతడు త్రివేది (మూడు వేదములనూ ఆపోసన పట్టినవాడు) అయినాసరే అయోగ్యుడే (హీనుడే).

తాను శయ్య (పక్క మీద) లేక ఏదైనా ఆసనం మీద కూర్చుని ఉన్నప్పుడు తనకంటే యోగ్యుడు లేక గురువు అక్కడికి వస్తే, తాను కూర్చున్న చోటినుంచి గౌరవసూచకంగా ప్రత్యుత్థానం చేసి (లేచి నిలబడి), ఆయనకు అభివాదం (నమస్కారం) చేయాలి.

ఊర్ధ్వం ప్రాణాహ్యుత్క్రమంతి  యూనః స్థవిర ఆయతి |
ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే ||

తనకంటే వయస్సులోనూ, జ్ఞానంలోనూ వృద్ధుడైన వ్యక్తి (స్థవిరుడు) తనను సమీపిస్తుంటే ఒక యువకుడి ప్రాణాలు నిలువునా పైకి ఎగసి, ఉత్క్రమణం చేయడానికి (అతడి శరీరాన్ని వదిలి వెళ్లడానికి) గమకిస్తాయి (ప్రయత్నిస్తాయి). అప్పుడా యువకుడు ప్రత్యుత్థానం చేసి (లేచి నిలబడి), ఆ వచ్చిన పెద్దకి అభివాదం (నమస్కారం) చేయడం ద్వారా తిరిగి తన ప్రాణాలను యథాస్థానంలో నిలుపుకుంటాడు. (ప్రతిపద్ అనే పదానికి తిరిగి యథాస్థానంలో నిలపడం - To Restore or Bring Back అని అర్థం). అలా పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడి, వారికి అభివాదం చేసే వ్యక్తికి ఆయుష్షు, విద్య, యశస్సు, బలం - అనే నాలుగు వృద్ధిపొందుతాయి.

జ్ఞానులు, వృద్ధులు, అనుభవజ్ఞులు మనల్ని సమీపిస్తే వారి అనుభవాన్నీ, జ్ఞానాన్నీ చూసి మనం సాధారణంగా ఉత్తేజం, స్ఫూర్తి పొందుతాం. ఆ పెద్దలలాగే తాను కూడా గొప్పవ్యక్తి కావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే ఇక్కడ మనువు చెప్పింది అందుకు భిన్నంగా ఉంది. మనం శయ్య మీదనో, ఏదైనా ఆసనం మీదనో కూర్చుని ఉండగా ఎవరైనా వయో వృద్ధులో, జ్ఞాన వృద్ధుల్లో మనల్ని సమీపించినప్పటికీ  మనం అలాగే కూర్చుని ఉంటే అది సహజంగానే వారికి అవమానకరంగా ఉంటుంది. అందుకే మనువు మనకంటే పెద్దలు రాగానే శయ్య / ఆసనం నుంచి లేచి వారికి అభివాదం చెయ్యాలని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ పెద్దలు మన సామీప్యానికి వచ్చినప్పుడు కూడా మనం వారిని పట్టించుకోకుండా అలా కూర్చునే ఉంటే, మన ప్రాణాలు పైకి లేచి, శరీరాన్ని వదలి బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమౌతాయని చెప్పడానికి మాత్రం శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలూ లేవు. ఇది బహుశా అప్పటి యువతరంలో పెద్దల యెడల భయం, భక్తి, గౌరవం కల్పించడం కోసం చెప్పినదై ఉండవచ్చు. అలాగే శాస్త్రీయంగా చూస్తే పెద్దలు తమను సమీపించినప్పుడు పిన్నలు లేచి నిలబడి అభివాదం చేస్తే, వారికి ఆయుష్షు, విద్య, కీర్తి, బలం అనే నాలుగూ వృద్ధిపొందుతాయని చెప్పడం కూడా ఆధారసహితం కాదు. అలాగే ఎవడు మూడు సంవత్సరాలపాటు నిష్ఠగా గాయత్రి మంత్ర జపం చేస్తాడో అతడు వాయువువలె కామచారి (కోరుకున్న చోటికి వెళ్లగలిగేవాడు) అయి బ్రహ్మపదం పొందుతాడని చెప్పడం కూడా కేవలం నమ్మకమే తప్ప దానికి ఎలాంటి శాస్త్రీయ పునాది లేదు. ఇవన్నీ పెద్దలను పిన్నలు తగు రీతిలో గౌరవించడం కోసం, గాయత్రి జపం, అగ్నిహోత్రం మొదలైన వాటిని నియమం తప్పకుండా పాటించేటట్లు ద్విజులను ప్రోత్సహించడం కోసం కల్పించబడిన సూత్రీకరణలే తప్ప వేరొకటి కాదు.

***సశేషం***

Posted in December 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *