Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
మెరుపులు(నూతన లఘు కవితా ప్రక్రియ)

బాలసాహిత్యంలో గేయం ఒక ముఖ్యమైన ప్రక్రియ. గేయరీతులలో అంత్యప్రాస, ఆదిప్రాసలకు స్థానం ఉంది. అంత్యప్రాసలలో 1,2 పాదాలకు మరియు 3,4 పాదాలకు అంత్యప్రాస ఒక రీతి. మరొక రీతి 1,3 పాదాలకు, 2,4 పాదాలకు ఉంటుంది. ఈ ప్రాస నియమాలన్నీ ప్రాచీన గేయరీతులలో ఇమడ్చబడి నేటికీ కొనసాగుతున్నవే. బాలసాహిత్యం మాత్రమే కాక జానపద గేయాలు ఇతర గేయాలకు కూడా ఈ అంత్యప్రాస వలన ఒక చక్కని లయ, శబ్దసౌందర్యం చేకూరుతుంది.

కేవలం నాలుగు పాదాలతో పాదానికి రెండేసి పదాలతో అంటే కేవలం ఎనిమిది పదాలతో ఒక భావాన్ని మెరుపులా తళుక్కుమనిపిస్తే .. అదీ 1,3 మరియు 2,4 పాదాలకు అంత్యప్రాసతో సాగితే..ఎంత బాగుంటుందీ? ఈ ఆలోచనే చేశారు శ్రీ తాండ్ర చిరంజీవి గారు. వీరు ఖిలావరంగల్, పడమరకోట, వరంగల్ జిల్లా వాసి.

తెలుగుభాషను బతికించుకుని కొందరిచేతనైనా హృదయంలోని పదసంపదను వెలికితీయించేలా రచనలు చేయించాలనే ఆశయం నుండి పుట్టినదే "మెరుపులు" ప్రక్రియ అంటారు చిరంజీవి గారు. కవిత్వం కష్టం అనే భావనతో ఉన్న ఔత్సాహిక అభ్యుదయ రచయితలలో ఉత్సాహం నింపి పురాణాలు మొదలు, సామాజిక అంశాలదాకా దేనినైనా అందంగా చెప్పించే ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు చిరంజీవి గారు.

ప్రక్రియ ఏదైనా దానిలో కవిత్వం ఇమడ్చగలిగి పాఠకుల హృదయానికి చేరువైనదే కాలానికి నిలబడుతుంది. ఈ సత్యం జగద్విదితమే. అయినప్పటికీ కవులలో ఉత్సాహం పెంచి ప్రోత్సహించే ఆలోచనతో వివిధ పత్రికల మెయిల్ ఐడి లు ఇస్తూ, వివిధ ఇ-సంకలనాల, కవిసమ్మేళనాల సమాచారాన్ని వాట్స అప్ గ్రూప్ ద్వారా మెరుపులు రాసే కవులకు చేర్చుతూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు చిరంజీవి. వీరి ఉత్సాహానికి తగినట్లే 88 మంది పైగా కవులు చక్కని మెరుపులు మెరిపిస్తూ వివిధ దినవార పత్రికలలో తళుక్కుమంటుంటారు. కవిసమ్మేళనాలలో మెరుపులు ప్రక్రియను ఎంచుకుని తమ గళం వినిపిస్తుంటారు. మెరుపులలో ప్రస్తుతం 3780 పైగా రాసి అక్కి నర్సింహులు గౌడ్ దూసుకుపోతున్నారు.

కవులను మరింతగా ఉత్సాహపరచడానికి చిరంజీవి గారు సంఖ్య ఆధారంగా కొన్ని బిరుదులను ప్రకటించారు. రాశి కన్న వాశి ఖచ్చితంగా ముఖ్యమే అయినప్పటికీ ఇటువంటి ప్రోత్సాహకాలు కవులలో ఉన్న స్తబ్ధతను పోగొట్టి కవితా వస్తు అన్వేషణకై వారికి ఉత్తేజమివ్వగలవు.

మెరుపుల సంఖ్య    బిరుదు
100 - మెరుపు మిత్ర; 200 - మెరుపు రత్న; 500 - మెరుపు ప్రకాశరత్న; 1000 – మెరుపు మణిరత్న; 2500 - మెరుపు భూషణ రత్న.

మెరుపులు చాలా సరళమైన అందమైన ప్రక్రియ. నేను ఆనందవేదిక పీరియడ్ సమయంలో పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులచే రాయించి వారిలో ఆనందం చూశాను. పెద్దలనుండి పిల్లల వరకు రచించి/చదివి ఆనందింపదగిన ఈ ప్రక్రియ నియమాలను ఒకసారి చూద్దాం.

మెరుపులు కవితా ప్రక్రియ నియమాలు:

  1. ఇందులో 4 పాదాలు ఉంటాయి.
  2. 1,3 పాదాలలో రెండేసిపదాలు ఉండాలి.2,4 పాదాలలో రెండు లేదా ఒక పదం ఉండొచ్చు.
  3. 1,3 మరియు 2,4 పాదాలకు అంత్యప్రాస ఉండాలి.
  4. 1,2 పాదాలలోని మొదటి పదాలు జంటపదాలుగా ఉంటే బాగుంటుంది. లేకపోయినా ఫర్వాలేదు.

మెరుపులు ప్రక్రియ రూపకర్త తాండ్ర చిరంజీవి గారి ఉదాహరణ:

కడవ నీటిలో
పడవ నడవదు
కంటి నీటిలో
కల్మషం ఉండదు.

పాఠకుల అవగాహన కోసం నేను రాసిన మెరుపులలో కొన్ని:

పూజారి చేతిలో
పువ్వులందం
శిల్పి చేతిలో
రాళ్ళందం

సూర్యుని చుట్టూ
భూప్రదక్షిణం
స్వార్థం చుట్టూ
మనిషి ప్రతిక్షణం

మెరుపు మెరిస్తే
గొడుగుకు పని
భావాలు విరిస్తే
కలానికి పని

ఒకేసారి పుట్టిననూ
ముందుగ మెరుపొస్తుంది
ఉరుము వెనుకబడిననూ
ఉనికి చాటి తీరుతుంది

మండే ఎండలు
మే నెలలో
వానల ఊహలు
మనసులలో

మబ్బులు ఢీకొని
పిడుగులు రాలును
కలహము వద్దని
పాఠము నేర్పును.

***సశేషం***

Posted in December 2020, సాహిత్యం

4 Comments

  1. తాండ్ర చిరంజీవి

    సిరిమల్లె మాసపత్రికకు ” మెరుపులు ” నూతన ప్రక్రియను పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ . సాహితి లోకానికి మీరు చేసే సేవ వర్ణానాతీతం మేడమ్ . నాకెందుకులే అనుకునే లోకం ఇది . అలాంటిది ఒక్కొక్క నూతన ప్రక్రియను పరిచయం చేస్తూ ఆ ప్రక్రియలకు ప్రాణం పోస్తున్నారు. మీ సేవ కు ఏమిచ్చిన ఋణం తీరదు.మీ వలే మేము ఎదగాలని కోరుకుంటున్నా మేడమ్ . ధన్యవాదాలు.

  2. బి. కిరణ్ గౌడ్

    మేడం ఒక చిన్న కోరిక మణిపూసల ప్రక్రియను కూడా వర్నించండి

  3. గోదావరి రచయితల సంఘం

    చాలా బాగుందండి. మీరు ఇలా ఒక్కొక్క ప్రక్రియ కోసం ఇలా సమీక్ష చేస్తుంటే మరి కొంత మంది రచనలు చేయడానికి సులువుగా నియమాలు అర్ధం అవుతాయి…చక్కని ఆలోచన. సిరిమల్లె నిర్వాహకులకు, ఈ శీర్షిక నిర్వాహకులుగా ఉన్న గుడిపూడి రాధికారాణి గారికి నమస్సులు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!