Menu Close
Page Title
కృతజ్ఞతా కుసుమాలు

ఆరుద్ర వ్రాసిన సమగ్రాంధ సాహిత్యం ఒక ఊట బావి. సాహిత్య పిపాసులకు తియ్యని ఆ ఊటబావి యొక్క అమృతం త్రాగేకొద్ది త్రాగాలనిపిస్తుంది.

అతి విస్తారంగా ఉన్న ఆదిమయుగ విషయాలను నేను స్షాలీపులాక న్యాయంగా చెప్పడం జరిగింది. కారణం – స్థల, సమయ భావాలే. నేను చెప్పకుండా విడిచిపెట్టినవి –‘మతాలూ-కామితాలు’, కుమారస్వామి – తెలుగులు, తెలుగుప్రజలు – కన్నడకావ్యాలు మొదలైనవి. విజ్ఞులైన పాఠకులు ఆరుద్ర వ్రాసిన “సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని చదివి ఆనందించమని నా మనవి.

ఆంధ్ర సాహిత్య చరిత్రను గూర్చే గాక, తనకు వీలైనంతవరకు, ఆంధ్రదేశ చరిత్రను, రాజులను, ఇంకా అనేక ఇతర విషయాలను తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ లో భద్రపరచిన ఆరుద్ర గారికి తెలుగువారమైన మనం ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలము. అందుకే మనస్ఫూర్తిగా నమస్కరించి ఆయన అందించిన విజ్ఞానాన్ని మన సొంతం చేసుకొనే ప్రయత్నం చేద్దాం ఆరుద్ర గారికి, ఆ, రుద్ర గారికి, నమస్సులతో – సి. వసుంధర.

అనివార్య కారణాల వల్ల మున్ముందుగానే ప్రచురించవలసిన ఆరుద్ర గారి జీవిత విశేషాలను గూర్చి ఆదిమయుగం తర్వాత ప్రచురిస్తున్నందులకు విజ్ఞులైన పాఠకులు అన్యదా భావింపవలదని నా ప్రార్థన.

ఆరుద్ర జీవన ప్రస్థానం

ఆరుద్ర తల్లి వెంకట జోగమ్మ. తండ్రి భాగవతుల నరసింహారావు. ఆరుద్రకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సదాశివ శంకర శాస్త్రి. ఇతని నక్షత్రం ఆరుద్ర.శంకర భగవత్పాదుల నక్షత్రం కూడా ఆరుద్ర. అందుకే ‘శంకర’ అన్న పేరు కలిసి వచ్చేటట్లు ఆరుద్రకు పేరు పెట్టారు. కాని, ఆరుద్ర తన పేరును మార్చుకొని తన జన్మ నక్షత్రమైన ‘ఆరుద్ర’ అనే పేరును తన కలం పేరుగా మార్చుకొన్నాడు. ఆరుద్ర జన్మస్థలం విశాఖపట్నం. ఆరుద్ర 1925- ఆగష్టు 31వ తేదీ జన్మించాడు.

విద్య: ఆరుద్ర తొలిగురువు తండ్రి. ప్రాధమిక విద్య శివరామయ్య స్కూలు. AVM కాలేజీ హైస్కూల్ ఫైనల్ దాకా చదివాడు. ఇంగ్లీషు మీడియం లో సంస్కృతం ఇంగ్లీషు మాత్రమే భాషాపరంగా ఉన్న సబ్జెక్టు కావడం వాళ్ళ ఆరుద్ర స్కూల్ ఫైనల్ తర్వాత తెలుగు నేర్చుకొన్నాడు. అయినా తెలుగు భాషాకాశం అంచులు అందుకొన్నాడు.

ఆరుద్రకు మిత్రసంపద ఎక్కువ. ఆరుద్రకు శ్రీ శ్రీ వరుసకు మేనమామ. కాని ఆరుద్రకు శ్రీ శ్రీ సర్వస్వం. ఆరుద్రకు సాహిత్యం పై అభిమానం శ్రీ శ్రీ వల్లనే పెంపొందింది. చాగంటి సోమయాజులు తన రచనల చేత, సహచర్యం చేత ఆరుద్రను కమ్యూనిస్ట్ పార్టీలోకి ప్రవేశం కల్పించాడు. కమ్యూనిస్ట్ పార్టీలో ముమ్మరంగా పనిచేస్తూనే సాహిత్యాధ్యయనాన్ని ఆరుద్ర మరిచిపోకుండా గ్రంధాలయాలనే విద్యాలయాలుగా భావించి తన అధ్యయనాన్ని సాగించాడు. రోణంకి అప్పలస్వామి ఆరుద్రకు ఆంగ్ల సాహిత్యం లోని సొబగుల్ని వివరిస్తే చాగంటి భౌతికవాద సాహిత్య సౌరభాన్ని తినిపించారు.

ఆరుద్ర: సమగ్ర ఆంధ్ర సాహిత్యం (స.అం.సా)– సంపుటం 4. పు. 954-955.

1942 లో ఆరుద్ర చదువు మానేసి సాయుధ వైమానిక దళంలో చేరాడు. ఆ ఉద్యోగం మీదే బొంబాయికి 1944 లో బదిలీ అయిన ఆరుద్ర జి.ఎస్. భార్గవ ద్వారా కొడవగంటి కుటుంబరావును కలిసారు. కుటుంబరావుతో జరిపిన చర్చల ద్వారా, ఆరుద్ర సాహిత్య ప్రతిభ నిగ్గుదేలింది.

ఆరుద్ర వైమానిక దళంలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ నేర్చుకొన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ నేత, ఉన్నత వ్యక్తిత్వం గల పుచ్చలపల్లి సుందరయ్య ప్రజలందరి మనిషిగా పేరుబడ్డాడు. సుందరయ్య మరణించినప్పుడు ఆరుద్ర వ్రాసిన స్మృతి గీతం కమ్యూనిస్ట్ లకు భక్తిగీతం అయ్యింది. వైమానిక దళంలో ఉన్నప్పుడే నానా ఫెడ్రోవా రచించిన ‘ఫ్యామిలీ’ అనే గొప్ప నవలను ఆరుద్ర చదివాడు. నవలా పఠనం ద్వారా ఆరుద్ర రాజకీయ పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం పెంపొందించుకొన్నాడు. రాజకీయాలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ‘మార్కిజం ఒక్కటే మానవాళికి మహత్తర శాస్త్రం’ అనేవారు ఆరుద్ర.

వ్యాకరణాభ్యాసం: రావూరు దొరస్వామి శర్మ కరడుగట్టిన గ్రాంధిక భాషావాది. ఆరుద్ర దొరస్వామి శర్మ వద్ద మూడు సంవత్సరాలు వ్యాకరణాన్ని చెప్పించుకోవడం ద్వారా, వాదోపవాదాల ద్వారా అభ్యసించాడు. చివరకు దొరస్వామి శర్మను తన వాదపటిమతో వ్యవహారిక భాషావాదిగా ఆరుద్ర మార్చాడు. గురువును మించిన శిష్యులుంటారు, కాని గురువును మార్చిన శిష్యుడిగా ఆరుద్ర అరుదైన వ్యక్తిగా పేరుపొందారు.

ఉద్యోగ ప్రయత్నం: ఆరుద్ర వైమానిక దళం నుండి తిరిగి వచ్చిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ఆరుద్రకు శ్రమ విలువ తెలుసు. అందుకే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. ప్రూఫ్ రీడర్ గా రోజుకు ఒక రూపాయి జీతం తీసుకొని పనిచేసారు. ఆ రూపాయతో ఇంగ్లీష్ సినిమా చూచేవారట. ఉద్యోగ ప్రయత్నంలో ఆరుద్రకు శ్రీ శ్రీ తోడైనాడు. మద్రాసులో ఇద్దరూ సంపాయించింది భోజనానికే సరిపోయేది. ఇక ఇల్లెక్కడ! అందుకే పానగల్ పార్క్ పేవ్ మెంట్ ఇళ్ళుగా మారాయి. (స.అం.సా – సంపుటం 4. పు. 957).

ఆరుద్ర తర్వాత చిన్ననాటి స్నేహితుని ద్వారా తిరిగి మదరాసు వచ్చి న్యాపతి నారాయణ మూర్తి ద్వారా రాజరాజేశ్వరి ఫిలిం (సినిమా) కంపెనీలో కధా విభాగంలో చూతు సంపాదించుకొన్నారు. ఇక అది మొదలు ఆరుద్ర తిరిగి చూడలేదు. ఆనాటి సినీ ప్రముఖుల సరసన ఆరుద్ర గొప్ప స్థానాన్ని సంపాదించుకొన్నారు.

సన్మానాలు-బిరుదులు: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ‘డి.లిట్’ తో సన్మానించగా, ఆంధ్రా యూనివర్సిటీ వారు ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు.

ఆరుద్ర విశిష్టత – వితరణ: ఆరుద్రను గూర్చి స.అం.సా – 4వ సంపుట లో ఆరుద్ర సతీమణి రామలక్ష్మి గారు ఒక అనుబంధం చేర్చింది. ఆ అనుబంధం లో ఆరుద్రను గూర్చి వివరించడం జరిగింది. అందులోని కొన్ని ముఖ్య విషయాలు.

“ఆరుద్ర తను రచిస్తున్న ఈ చరిత్రలో తనా గురించి ఏమీ చెప్పలేదు. అది అతని తత్త్వం. అందుకే ఈ చివరి సంపుటిలో ఒక అనుబందం చేర్చాను. ఇది అతని వ్యక్తిగత, కవితా సాహిత్య ప్రస్థానాన్ని టూకీగా వివరిస్తుంది.” (ఆరుద్ర పై వెలువడిన పలువురి రచనల నుండి ఈ అనుబంధం రూపొందింపబడింది. (స.అం.సా, 4 వ సంపుటం, ‘ఈ సంపుటి గురించి’ కె.రామలక్ష్మి – iX.)

4 వ సంపుటిలో అనుబంధంగా చేర్చబడిన దాని నుండి ఆరుద్రను గూర్చి మచ్చుకి కొన్ని అమూల్య విషయాలు-

“తీవ్ర అస్వస్థతతో ఉండి ..ఈ కవి ‘కె.రామలక్ష్మి త్రిశతి’ ఆశువుగా చెప్పాడంటే వారి స్థితప్రజ్ఞతను మనం మెచ్చుకోవాలి.” విశ్వనాథ తర్వాత త్రిశతి చెప్పింది ఆరుద్ర ఒక్కడే.

“సాహిత్యం కోసమే గాక ఇతర చారిత్రిక విషయాల కోసం – ఈ సంపుటాలను పరిశీలిస్తున్నారని విన్నప్పుడు – వారి అభిమానులకు గర్వంగా ఉంటుంది. ఆరుద్ర జీవన ప్రస్థానం ఒక ఇతిహాసమే.” (స.అం.సా, 4 వ సంపుటం, అనుబంధం – పుట 990)

“తెలుగు సాహిత్య ప్రసక్తి వస్తూనన్ని రోజులు ఆరుద్ర జీవించి ఉంటాడు.”- వావిళ్ళ రామస్వామి పంతులు.

“చక్కని వాడుకభాష ఎలా రాయాలన్నది జాతికి తెల్పిన మొదటివాడు; సాహిత్య చరిత్ర ఆ భాషలో రాసి మెప్పించిన వాడు ఆరుద్రే” – జి. కృష్ణ.

(ఈ సంచికతో ఆదిమయుగం విశ్లేషణ పూర్తయింది. జనవరి సంచిక నుండి చాళుక్య యుగం మొదలవుతుంది...సి. వసుంధర)

**** వచ్చే సంచికలో కృతజ్ఞతా కుసుమాలు మరియు ఆరుద్ర జీవన ప్రస్థానం ****

Posted in December 2020, సమీక్షలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!