Menu Close
Page Title

కొన్ని ప్రసిద్ధ జైన దేవాలయాలు

jainism‘జైన మతం’, ‘బౌద్ధ మతం’ వలెనే సనాతన ధర్మం నుంచి వేరయి, సనాతన ధర్మము వలె కాకుండా దైవ విగ్రహ ఆరాధన లేనిదై, గురువే కేంద్రమైన మతంగా, ఆకులూ, రెమ్మలు, కొమ్మలతో విస్తరించి క్రీ. పూ. 6వ శతాబ్దంలోనే మహావృక్షంగా నిలిచింది. అది ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ శాంతి కాముక మతంగా ఖ్యాతి గడించింది. వారి ఉన్నత గురువులైన ‘తీర్థంకరులు’ సర్వసంగ పరిత్యాగులుగా జీవిస్తూ ఉండేవారు. వీరిలో కొందరు శరీరాన్ని అంటుకుని ఉన్న కంటికి కనబడని క్రిమికీటకాలు వస్త్రధారణ వల్ల (వస్త్రానికి, శరీరానికి మధ్య రాపిడి వల్ల) మరణిస్తాయన్న భయంతో దిగంబరులుగా జీవిస్తూ, వారు నడిచే మార్గాల్లో ఉండే క్రిమికీటకాలు పాదాలక్రిందపడి మరణిస్తాయన్న భయంతో దారినంత శుభ్రపరచుకుంటూ నడవడం, మనం శ్వాసించినప్పుడు గాలిలో తేలుతుండే సూక్ష్మజీవులు ఉపిరితిత్తులలోకి వెళ్లి మరణిస్తాయనే భయంతో ముక్కుకి గుడ్డ కట్టుకోవడం, శుభ్ర పరచి వండిన శాకాహారాన్ని మాత్రమే భుజించడం వంటి జాగ్రత్తలతో ఏ ప్రాణికి హాని కలిగించని విధంగా అహింసాచరణతో జీవించారు. వీరు దిగంబర జైనులని పిలువబడగా, తెల్లని బట్టలనే ధరిస్తూ, స్వచ్ఛమైన నిర్మల జీవితాన్ని ధ్యానంలో గడిపేవారు శ్వేతాంబర జైనులని పిలువబడతారు. మహావీరుడు, ఋషభుడు మాత్రం దిగంబర జైనులయ్యారు. మహాబలి తీర్థంకరుడు కాకపోయినా దిగంబరుడుగా జీవించి ఖ్యాతికెక్కాడు. ‘జీన’ అనగా ‘అనాదిగా, అనంతమై నిగూఢంగా ఉండి జీవస్రవంతిని అనుసంధించి ఉన్నఆత్మ’ దానిని పుట్టు-గిట్టుకలనుండి విముక్తి కలిగించుటకై, జైనులు అయిదు తత్వార్ధసూత్రాలు నియమించి వాటిని కఠినంగా పాటిస్తారు.

అవి: 1. అహింసాచరణ, 2. సత్యభాషణ, 3. అస్త్రేయం (చౌర్యం పట్ల విముఖత్వం), 4. బ్రహ్మచర్యం, 5. అపరిగ్రహం (నిస్సంగత్వం, అనగా దేనిపైనా అపేక్ష, అనురాగం లేకపోవడం). స్వీయ క్రమశిక్షణతో ఈ సూత్రాలను పాటిస్తే సాధారణ మనిషిని కూడా తీర్థంకరుని చేస్తాయని జైనుల నమ్మకం.

అప్పటి ఛాందస సనాతన ధర్మాచరణలో వెర్రితలలు వేస్తున్న పరిస్థితిలో మూఢాచారాలను పాటిస్తున్న పెద్దల "విపరీత ఆచార విధులతో" తో విసిగిపోయి అవే కాక వేరే మోక్షసాధనాలు కూడా ఉన్నాయన్నభావన భావన అందరిలో కలిగింది. అన్నింటికంటే ఉన్నతము, ఉత్తమము అయినవి అహింసా సిద్ధాంతాలే అన్న నమ్మకంతో వాటి నిష్టాచరణతో, జన్మాంతర సంస్కారం కలిగి మోక్ష ప్రాప్తి గలుగుతుందన్నది జైన సిద్ధాంతం. ఎటువంటి దైవ ప్రార్ధనలు లేని జైనమతం అహింసాచరణనే ఉన్నత సాధనగా స్పష్టీకరిస్తుంది. అహింసాతత్త్వ ఆచరణతో మానవ ఉద్రేకాలు, కోరికలు నియంత్రించుకోవడం కూడా సాధ్యమని గట్టిగా బోధిస్తుంది. సత్యాధార సూత్రాలపై ఆ మతం ఆధారపడి ఉంది; అనగా సమ్యక్ నమ్మకం, సమ్యక్ విద్య, సమ్యక్ ప్రవర్తన. ఈ మూడు మానవ ఔన్నత్యసిద్ధికి మూల స్థంభాలని జైనులు నమ్ముతారు.

'తీర్థంకరులు' సాధారణ మానవ స్థితి నించి సాధన, తపస్సు ద్వారా స్వచ్ఛమైన 'అనంత జ్ఞానం' పొంది, దాని ద్వారా 'జీవన్ముక్తి'ని సాధించే అర్హత సాధించి సిద్ధపురుషులు అవుతారని జైనం తెలియచెబుతోంది. వారిలో ఎక్కువగా ఆరాధింపబడే 24 తీర్థంకరులు- ఆదినాథ (ఋషభనాథుడు), అజితుడు, సంభవుడు, అభినందనుడు, సుమతి, పద్మప్రభ, సుపార్శ్వ, చంద్రప్రభ, సువిది, శీతల్, శ్రేయాంశ, వసుపూజ్య, విమల, అనంత, ధర్మ, శాంతి, కుంతు, అరా, మల్లి, ముని, సువ్రత, నేమి, పార్శ్వ, మహావీరులు. ఈ 24 గురు తీర్థంకర జైనుల్లో 23 గ్గురు పురుషులు, 19వ జిన మల్లి మాత్రం స్త్రీ. వారు 'దర్శనము', 'దేశనము' (ఆదేశము)ల ద్వారా భక్త జనావళికి 'కేవల జ్ఞానం' పెంపొందించి, చివరగా 'మోక్ష ప్రాప్తి'ని కలగచేస్తారు. పరమ గురువులైన 24 తీర్థంకరులలో రిషభనాథుడు 'ఆదినాధ భగవానుడు' గా పూజింపబడుతున్నాడు. 23 వ తీర్థంకరుడైన పార్శ్వనాధుడు కూడా ప్రముఖుడు. ఆఖరి వాడైన వర్ధమానుడు (మహావీరుడు-క్రీ.పూ. 599-527) అంతకు ముందు తీర్థంకరులు ప్రస్ఫుటించిన ముఖ్య జైన సూత్రాలని క్రోడీకరించి, విశ్లేషించడం వల్ల అత్యంత ఉన్నత గురువుగా కీర్తింపబడి పూజింపబడుతున్నాడు.

పండుగలు: జైనులు మహావీర్ జయంతి, పర్యూషణ పర్వ (ఉగాది), దీపావళి, మౌన ఆగియారా (మార్గశిర ఏకాదశి నాడుచేసే మౌనధ్యాన ఉపవాస దీక్ష), రోత్ తీజ్ (భాద్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే ఈ పండుగనాడు ఒక రకమైన ధాన్యాన్నే తింటారు- ధనం, శారీరక సుఖాలు విసర్జిస్తేనే అసలైన ఆనందం లభిస్తుందని తెలియచెప్పేది).

జైన మందిరాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేకం ఉన్నా, అతి సున్నితమైన చలువరాతి చెక్కడాలతో సుప్రసిద్ధమైన పురాతన జైనమందిరాలు భారత దేశం లోనే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన మందిరాలను గురించి ఇక్కడ వివరిస్తాను.

రణక్పూర్ జైన మందిరము

Ranakpur Jain Temple'చతుర్ముఖ ధారణ విహార' మని పిలువబడే ఇందులో ఇక్ష్వాకు వంశీయులైన నాభి, మరుదేవిల పుత్రుడై, అయోధ్యలోజన్మించిన రిషభనాథుడు ఆదినాధుడు గా కొలువబడుతున్న మొదటి ఆరాధ్య తీర్థంకరుడు. మూడు అంతస్తుల లో 48,000 చదరపుఅడుగుల్లో 1444 పాలరాతి స్తంభాలపై నిర్మింపబడిన ఈ అతి పెద్ద జైన్ మందిరం పాలి జిల్లా, రాజస్థాన్ లో ఉంది. ఈ అద్భుత కట్టడంలో విశిష్టత ఏమనగా ఏస్తంభము ఒకదాని పోలి మరొకటి ఉండదు. మరో విశేష మేమిటంటే స్తంభాలు ఉదయ సాయంకాలాల మధ్య సూర్య గతిని బట్టి రంగులు మారుతుంటాయట. దానిని 1389 లో మార్వారు రాజు కుంభ రానా కాలంలో 'దీపక్' అనే రూపశిల్పి ఆధ్వర్యంలో ప్రారంభించి, 1458 లో పూర్తి చేయడం జరిగింది. 24 వసారాలు, ఎనభై శిఖరాలు, క్రింద 84 రహస్య గదులతో (ముస్లిం దాడులనుంచి జైన గురువుల విగ్రహాలని రక్షించుటకు) నిర్మించిన ఈ విస్తృత నిర్మాణంలో 2785 కూలీలు / శిల్పులు పాల్గొన్నట్లు ఇక్కడ లభించిన రాగిరేకుల ఆధారంగా తెలుస్తున్నది. ఈ ఆలయంలో ఏకశిలా శిల్పిత పార్శ్వనాధుని చలువరాతి ఫలకం సుప్రసిద్ధం. దీనిలో 1008 నాగులు రక్షిస్తుండగా, యక్ష యక్షిణులు పల్లకి మోస్తుండగా, రెండు ఏనుగులు పార్శ్వనాధునికి పవిత్ర స్నానమాచరిస్తున్నట్లు చిత్రీకరణం జరిగింది, దీనిని పై పటంలో చూడవచ్చు. ఆదినాధుని విగ్రహం పై వరుసలో చివరన చూడవచ్చు. మచ్చుకు ఒకదానితో మరొకటి పోలికలేని స్తంభాల వరుస ఫోటో కూడా చూపబడింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే చౌముఖ మందిరం, సూర్య మందిరం, స్పర్శవనాథ మందిరం, అంబ మందిరం కూడా ఉన్నాయి. కుంభ రానా పేరున ఆ వూరు రణక్పూర్ గా పిలువబడుతోంది. ఈ మందిరం 'సద్రి' వద్ద రాజస్థాన్ లో వుంది. జోధ్ పూర్ నుండి వంద మైళ్ళ దూరంలోను, ఉదయపూర్ కి 60 మైళ్ళ దూరంలోను ఉన్న ఈ మందిరం ఒక అద్భుతనిర్మాణం. ఈ మహాకట్టడం నిర్మాణ స్ఫూర్తితో దిల్వారా మందిరం, పలితానా మందిర సమూహం నిర్మించారని చెబుతారు.

దిల్వారా జైన మందిరం

Dilwara Templeఈ జైన మందిరం కూడా రాజస్థాన్ లోనే 'మౌంట్ అబూ' లో ఉంది. ఇది కూడా అతిసుందరంగా, నిర్మాణ పరంగా అత్యున్నత స్థాయిలో వివరణాత్మక చెక్కడాలతో పచ్చని కొండల మధ్య అద్భుతంగా మలచబడిన పాలరాతి శ్వేతాంబర మందిర కూటం. ఎటువంటి రవాణా సౌకర్యం లేని 11వ శతాబ్దం నుంచి 15 వ శతాబ్దం వరకు అంబాజీ వద్దనున్న ‘అరసురి’ పర్వతాలలోని పాల రాతి గనుల నుంచి పెద్ద పెద్ద దిమ్మలని 3000 అడుగుల ఎత్తున ఉన్న ‘మౌంట్ ఆబు’కి ఏనుగులపై రవాణా చేశారట. దీనిలో ఐదుగురు తీర్థంకరుల మందిరాలు ఉన్నాయి. అవి శ్రీ మహావీరుడు, శ్రీ ఆదినాధుడు, శ్రీ పార్శ్వనాథుడు, శ్రీ రిషభదవోజి, శ్రీ నేమినాథుడు మందిరాలు. ఈ ఆలయాలను రోజూ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంచుతారు.

'పలితానా' జైన మందిర సముదాయం

Palitana Templeశత్రుంజయ పర్వత శ్రేణులలో ఉన్న ఈ శిఖరాల పై గల మందిర సముదాయం గుజరాత్లోని భావనగర్ జిల్లాలో ఉంది. పెద్ద, చిన్న కలిసి ఉన్న దాదాపు 3000 మందిరాలలో 863 చలువరాతి పవిత్ర తీర్థంకరుల విగ్రహాలు, మరికొంత మంది జైన గురువులు కూడా ఇక్కడ మూర్తీభవించి ఉన్నారు. అందువల్లనే బహుశా ఈ కొండ అతి పవిత్రమై జైనులకు జీవితంలో ఒక్కసారైనా దర్శించి మొక్కడం తప్పనిసరి, మోక్ష కారకమని చాలామంది నమ్ముతారు. సుమారు 4000  మెట్లు ఎక్కితేనే గాని చేరుకోలేని అచ్చటికి తెలవారకుండానే బయలుదేరి ఎండ పెరగకుండా పది గంటలలోపుగానే చేరుకుంటారు భక్తులు. ఆ కొండపై మంచినీళ్లు తప్ప తినేందుకు ఏది దొరకదు. ఎక్కడినుంచో చలువరాళ్లని మోసుకుని తెచ్చి అక్కడ నిర్మించడానికి చూపించిన నిబద్ధత, పడిన శ్రమ, చూపిన ఓర్పు, పట్టుదల లకి శిరస్సు వంచి మొక్కాలనిపిస్తుంది. ఆ చల్లని ప్రదేశంలో చలువరాతి మందిరాల మధ్యన తిరగడం, తీర్థంకరుల దర్శనం ఒక వింత అనుభూతి. వాటన్నిటిలో ఆదినాధుని మందిరం అతి సుందరంగా విరాజిల్లుతుంటుంది. పైనున్న ఫోటో లో ఎత్తైన శిఖరమున్నదే ఆదినాధుని ఆలయం, దానినే  వివరంగా క్రింది పటంలో చూపడం జరిగింది. మెట్లు దిగి వస్తుంటే ఒక భక్తుడు ప్రక్కనే నిలబడి దిగేవారిని ఒక చిన్న ఫలహారశాల వైపు వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. అక్కడ ఒక జైన కుటుంబం, తీర్ధంకరుల దర్శనం చేసుకొని వచ్చేవారికి సుసంపన్న (బాదం, పిస్తా, మంచి నెయ్యి తో కూడిన) గుజరాతి ఉపాహారాన్నిఇస్తుంది. అది పూర్తి విందు భోజనం తో సమానం. దానిని అక్కడే భుజించాలి, పారవేయకూడదు, తీసుకుని వెళ్ళకూడదు. మేము వెళ్లిన 1996  వ సంవత్సరంలోనే ఆ పూట అందరికి అందించిన ఉపాహారం ఖరీదు రెండు లక్షలట. దానిని శ్రద్ధగా ఆ ఒక్క  కుటుంబంలోని వారే మరీ మరీ అడిగి వడ్డిస్తారు. బంధువులు, స్నేహితులని, సేవకులని ఈ సేవకి వినియోగించుకోకూడదు. అల్లాగ ఇవ్వడానికి సిద్ధపడి రెండు ఏళ్ళనుంచి శ్రద్ధాళులై వేచియుండే ఒక జైన కుటుంబం ఆరోజున సేవ చేయగలిగారట, చాల కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకున్నారు.

గోమఠేశ్వర జైన మందిర్

Gomateshwara Templeకర్ణాటకలోని హాసన్ జిల్లా, శ్రావణబెళగొళ వద్ద వింధ్యగిరి పైన 30 కి.మీ. దూరము నుంచి కూడా చూడగలిగే బాహుబలి (గోమఠేశ్వర) జైన్ మందిర్ చాలా ప్రసిద్ధమైనది. ఆ మహోన్నత శిల్పం శాంతి, అహింస, త్యాగనిరతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈయన ఆదినాధుడైన రిషభనాథుని పుత్రుడు, తీర్థంకరుడు కాకపోయినా జైనులలో చాల ప్రసిద్దుడు. సామ్రాజ్యాధిపత్యంకోసం అన్నతో జరిగిన యుద్ధంలో గెలిచిన పిమ్మట జీవితం పైన, భవబంధాలపై విరక్తి కలిగి రాజ్యాన్ని అన్నకే వదలి ఒక ఏడాది పాటు అచలంగా దిగంబరునిగానే నిలబడి ధ్యాన దీక్షలోనే ఉండగా శరీరమంతా తీగలు లతలు, చుట్టుకు పోయినవట. పాములు శరీరంపై పాకుతుండేవట. అయినా స్పృహ లేకుండా దీక్ష సాగిస్తుంటే అన్న భరత్ వచ్చి బ్రతిమలాడితే విరమించాడట. తదనంతరం కూడా ధ్యానాన్ని సాగించి సిద్ధుడై మోక్ష ప్రాప్తి చెందాడని జైన మత గ్రంధాలు వివరిస్తున్నాయి. ఈ 57 అడుగుల స్వేచ్ఛగా నిలబడిన ఏకశిలా విగ్రహం క్రీ.శ.981లో నిర్మింపడి ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేరుగాంచినది. ఈ గోమఠేశ్వరుని శిలావిగ్రహానికి ప్రతి 12 ఏళ్ళకి జైనులు మహా మస్తాభిషేక పూజలు జరుపుతారు.

హాథీసింగ్ జైన మందిరం, అహమ్మదాబాద్, గుజరాత్

Hatheesingh Templeఈ మందిరం 15 వ తీర్థంకరుడైన ధర్మనాథునిది. ఆయనకే అంకితంచేయబడిన ఈ రెండు అంతస్థుల మందిరాన్ని సేథ్ హాథీసింగ్ ప్రారంభించినా ఆయన 49 వ ఏటనే పరమపదించడంతో ఆయన భార్య ‘శేతని హారకున్వర్’ పూర్తిచేయించింది. ఆ సమయంలో గుజరాత్ కి క్షామము వచ్చి ఆర్ధిక దుస్థితిలో ఉండగా, ఈ నిర్మాణం అక్కడి బీద ప్రజలకి, శిల్పాలు చెక్కే చేతిపనివారికి చేయూత అయ్యిందిట. 12 సుందర శిల్ప మయ స్థంభాలు ఈ మందిరానికి మరింత శోభను చేకూరుస్తున్నాయి.

శ్రీ మహావీర్ శ్వేతాంబర జైన్ మందిరం, ఓసియాన్, జోధపూర్, రాజస్థాన్

Sri Mahavir Swethambara Templeఇది పడమటి తీరాన్నగల జైన మందిరాలలో అతి పురాతన (క్రీ.శ. 783 ) జైన మందిరంగా అచటి 956 నాటి రాతి ఫలకంబట్టి తెలుస్తోంది. ఇది గుజరాత్ ప్రతిహర శైలిలో వత్సరాజుచే నిర్మించినట్లు శిల్పాధారాల బట్టి తెలుస్తోంది. ముస్లిం దోపిడీదారుల దాడులకు గురియై చాల భాగం ధ్వంసం కాగా జార్జ్ మిచెల్ కథనము ప్రకారం ఇది 1015 ప్రాంతాలలో పునర్నిర్మింపబడింది. ఇందులో 12 మంది తీర్థంకరులు పద్మాసనంలోనూ, 4గురు తీర్థంకరులు కయోత్సర్గాసనం లోను శిల్పీకరించబడ్డారు. స్తంభాలన్నీ 'మహామారు' పద్ధతిలో నిర్మింపబడ్డాయట. తూర్పు భాగంలో మహావీరుడు, పార్శ్వనాథుల శిలామూర్తులు ప్రతిష్టింపబడ్డాయి. గర్భగుడులపైని శిఖరాలు ఆమలక కలశాలతో నిర్మించబడ్డాయి. ఉత్తర, దక్షిణ, పశ్చిమ గోడలపై నేమినాథుని జన్మ, యుద్ధ, సన్యాస చరిత్రలు శిల్పీకరించబడ్డాయి.

కొల్పాక్ జి మందిర్, కొలనుపాక

Kolanupaka Temple2000 ఏళ్ళక్రితం నిర్మించిన ఈ శ్వేతాంబర జైన మందిరం వరంగల్ జిల్లా, తెలంగాణలో ఉంది. ఒకప్పుడు కొలనులు ప్రక్కనే పాకలు ఉండడంతో ఇది 'కొలనుపాక' గా పేరొందిందని వినికిడి. రిషభనాధ, నేమినాధ, మహావీరుల విగ్రహాలు పూజింపడే ఈ ఆలయంలో 20 వరకు లభించిన ప్రాచీన శిలా శాసనాలద్వారా ఇది చాల విశిష్ట జైన ఆలయం గా తెలుస్తోంది. ఇక్కడే ఆదినాథ భగవానుడు కొంతకాలం నివసించాడట. దీనిని ఆయన కుమారుడైన భరత్ చక్రవర్తి నిర్మించినట్లు కూడా విదితమౌతోంది. ఇందున్న మహావీరుని విగ్రహం అతివిలువైన మరకతముతో చేయబడినదిట. ఈ ఆలయంలోని అంతర్భాగం కొంత చలువరాతితోను, మరికొంత భాగం ఎరుపు ఇసుకరాయి తోనూ చేయబడ్డాయి.

ఇంకా అనేక సుందర శిల్ప శిలాసౌందర్యమయ జైన ఆలయాలు ఉన్నా అన్నిటిని స్థలాభావంవల్ల పేర్కొనడం సాధ్యం కాలేదు.

-o0o-

Posted in December 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *