"వాళ్ళకి అసలుకైతే ఏడుగురు సంతానం. మా అమ్మమ్మ చివరామె. తల్లిదండ్రులిద్దరూ పోయాక ఇరవైలలో ఉన్నప్పుడు కెనడా వచ్చింది అమ్మమ్మ తన పెద్దక్కా, బావ లతో కలిసి. అప్పటికి మిగిలిన సంతానం తాను, వాళ్ళ పెద్దక్కా మాత్రమే."
"ఓహ్. బాధాకరమైన విషయం. ఆ కాలంలో వైద్యం అదీ అందుబాటులో లేక ఇండియాలో కూడా చాలా మంది కి ఇలా అయ్యేదని నేను విన్నాను."
"వైద్యం ఒక్కటే కాదు. కటిక పేదరికమే అసలు సమస్య.
"ఊ, ఆ అక్కగారు ఇంకా ఉన్నారా?"
"లేదు. పెద్దమ్మమ్మ పోయి నాలుగైదేళ్ళవుతోంది. వాళ్ళ కుటుంబం కూడా అంతా ఈ దగ్గరి ఊళ్ళలోనే ఉంటారు."
"ఓహ్.."
"బతికున్నన్నాళ్ళూ పెద్దమ్మమ్మ వాళ్ళ బాల్యంలో అనుభవించిన పేదరికం గురించి కథలు కథలు గా చెప్పేది. పైగా తన కళ్ళముందే పోయిన తన చెల్లెళ్ళనీ, తమ్ముళ్ళనీ తల్చుకుని ఎంతో ఏడ్చేది. వీళ్ళ మధ్య ఉన్న ఐదుగురిలో మా అమ్మమ్మ చూసింది ఒక్కరిని మాత్రమే!"
"అయ్యో!"
"అసలు అవన్నీ మనం ఊహించనుకూడా ఊహించలేము లే. ఒకసారైతే ఏడాది పిల్లవాడు చనిపోతే వీళ్ళ దగ్గర అంత్యక్రియలకి కూడా డబ్బుల్లేక ఆ పిల్లవాడి శవాన్ని రోజంతా ఇంట్లోనే పెట్టి అప్పుకోసం తిరిగారంట."
"....."
"మరొకసారి వైద్యానికి డబ్బుల్లేక కవల పిల్లలు ఇద్దరూ మూడేళ్ళ వయసులో ఏదో వైరల్ ఫీవర్ లాంటిది వికటించి పోయారంట. అపుడు కూడా మందుల కోసం ఈ పెద్దమ్మమ్మా, మా ముత్తవ్వా రోడ్ల వెంబడి తిరిగారంట ఎవరన్నా సాయం చేస్తారా?" అని.
"అప్పుడంతా మీ ముత్తాత లేడా?"
"ఉన్నాడున్నాడు. కానీ చెప్పాను కదా... ఆయనకి వీళ్ళందరిమీదా ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా లక్ష్యం మీద అంతకంటే ఎక్కువ ఇష్టం. అందుకనే ఇన్ని కష్టాల మధ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా రాసుకుంటూ పోయాడు" - అదొక రకం నిర్లిప్తతతో చెప్పింది లియోనా.
"బాబోయ్. ఏం అనాలో కూడా తోచట్లేదు నాకు."
"ఈ చావులూ, పేదరికం, ఇవన్నీ అయ్యాక లాస్టుకి ఆమె క్యాన్సర్ తో చాలా ఏళ్ళు బాధపడి, చివరికి అలా వెళ్ళిపోయింది. మధ్యలో వీళ్ళ జీవితాల్లో ఇతర విషాదాలు ఇంకా చాలా ఉన్నాయనుకో. " - లియోనా నిట్టూర్చింది.
"తల్లీ, ఇంక ఆపేయి, నేను వినలేను ఈ కష్టాలు. వింటూంటేనే కడుపు తరుక్కుపోతోంది. మీ ముత్తవ్వ గారికి ఒక నమస్కారం. మీ ముత్తాత వీటన్నింటి మధ్య అవన్నీ రాశాడంటే అసలు మాటలు రావడంలేదు." - నొచ్చుకుంటుందేమో అనిపించినా తనతో ఉన్న దగ్గరి స్నేహం వల్ల అలా గబుక్కున అనేయగలిగాను.
********* ********* *********
ఇంతలో అమ్మమ్మ గారు మళ్ళీ వచ్చారు. విన్నారా? అని అనుమానం వచ్చింది కానీ ఏం అనాలో తోచక ఊరుకున్నాను.
"ఫేటర్చెన్ ప్రపంచంలో ఇద్దరినే మేధస్సులో తనకి సమ ఉజ్జీలుగా భావించేవాడు. ఒకరు ఆయన చిరకాల సహచరుడు, సహ-రచయితా అయినా వోల్ఫ్గాంగ్ డెంకె, రెండో వ్యక్తి మా ముట్టీ" అందావిడ నేను అన్నది పట్టించుకోలేదో, పట్టించుకున్నా నొచ్చుకోలేదో అర్థం కాలేదు. కానీ ఈ మాటలతో ఆమె గురించి కుతూహలం కలిగింది నాకు.
"మరి ఆవిడేం స్వతంత్ర రచనలో, వీళ్ళతో కలిసి పని చేయడమో చేయలేదా?"
"ఆరోజుల్లో ఇప్పట్లా కాదు కదమ్మా - ప్రేమలూ దోమలూ అని మొదలయ్యాక ఇక ఆ మనిషిని అంటిపెట్టుకుని, అతని వృత్తి, ప్రవృత్తులకి అనుగుణంగా మసలుకుంటూ, అతని ఆశయ సాధనకి అడ్డుపడకుండా అతన్ని, ఇంటిని కనిపెట్టుకు చూసుకోవడమే ఆడదాని పరమావధి" - అంటూ తొంభై ఏళ్ళ వయసులో కూడా స్పష్టంగా మాట్లాడుతూ అన్నది లియోనా వాళ్ళ అమ్మమ్మ.
"అదేమిటి, మీలో కూడా అంతేనా?" నేను పైకే ఆశ్చర్యపోయాను.
"ఇప్పటికీ మనలో కూడా అంతే కదా... నిజంగా అంత మార్పొచ్చిందంటావా? ఉద్యోగాలు చేసుకుంటున్నాం కానీ ఎవరో ఒకరిదే ప్రధానం అంటే ఎవరిదవుతుంది ఈ కాలంలోనైనా?" లియోనా సందేహం వెలిబుచ్చింది.
"అయినా ఒకళ్ళు ఊరిని ఉద్దరించడానికి తిరుగుతూంటే మరి పిల్లల్ని చూసుకోడానికి, వండి వార్చడానికి, ఇంటిని చక్కబెట్టడానికి, ఎవరో ఒకరు ఉండొద్దా? అలా ముట్టీ ఇంటికి అంకితమైపోయింది" అమ్మమ్మ గారు నిట్టూర్చారు.
“ఆమెతో పెళ్ళయ్యాకే ఆయనలోని మేధస్సు కూడా బైటికొచ్చింది అనేవాళ్ళంట వాళ్ళిద్దరూ తెలిసిన స్నేహితులు అమ్మమ్మ చిన్నప్పుడు" తనకి తెలిసినది జోడించింది లియోనా.
“అసలు, ఆమె లేకుండా తాను లేనని ఆమె పోయినపుడు సంతాప సభలో కూడా ఫేటర్చెన్ ఏడ్చేశాడు. ఇన్ని కష్టాల మధ్య కూడా జీవితాంతం ఆయనకి ఆమె మీద, ఆమె మేధ మీద ఉన్న గౌరవం ఇసుమంతైనా తగ్గలేదు. ముట్టీకి కూడా ఆయన మీద ప్రేమా, ఆయన మేధస్సు మీద గౌరవం చివరి దాకా అలాగే ఉండేవి.” అమ్మమ్మ గారు మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా అన్నారు.
"అబ్బ, ఎంత మంచి అనుబంధం వారిది. పేదరికంలోనూ, అన్ని మరణాల మధ్య కూడా చివరికంటా ఒకరంటే ఒకరికి అంత ప్రేమా, గౌరవం ఉండడం గొప్ప విషయం కదా!" నేను అదొక రకం భక్తిభావంతో అన్నాను.
"ఆవిడ పురిటికని పుట్టింటికి పోతే, ఇంకొకామెతో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కనేంత ప్రేమ ముత్తాత గారికి" అన్నది లియోనా.
"వాట్?" అరిచినంత పనిచేశాను నేను.
"అవునమ్మా, అదీ అయ్యింది. నేను పుట్టకముందు. మా పెద్దక్క చెప్పేది. అయినా అదేమిటో, అసలు దీన్ని గురించి ముట్టీ ఏమనుకునేదో... అలాంటి దాంపత్యద్రోహాన్నిఎలా క్షమించిందో... ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం" - అమ్మమ్మ గారు కొనసాగించారు లియోనా మొదలుపెట్టిన విషయాన్ని.
ఉవె డింకెల్ గురించి నేనేదో ఊహించుకున్నాను. ఇంచు మించు గుండెల్లో గుడి కట్టి పూజించినట్లే. ఆయన్ని గురించి ఇదంతా వింటూ ఉంటే ఎలా స్పందించాలో కూడా తోచడం లేదు. అందుకని మౌనంగా ఉండిపోయాను.
****** ********* *********
"నువ్వు ఇదంతా వినేసి ఆయనని ద్వేషించకమ్మాయి. ఆయన గొప్పాయనే, ఆయన చేసిన కృషి గొప్పదే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన ప్రపంచ గతిని మార్చిన వారిలో ఒకరని చరిత్ర ఎంచింది. దానిలో ఏ మాత్రం అబద్ధం లేదు" - నా మౌనాన్ని ఛేదిస్తూ అమ్మమ్మగారు అన్నారు.
"లేదండి. నాకర్థమయింది. ఆ పార్శ్వం వేరు. ఈ పార్శ్వం వేరు. దేనికదే. ఆయనా వ్యక్తిగత జీవితంలో మనందరిలాంటి మనిషే అని మీతో మాట్లాడాక తెలుసుకున్నాను." అంటూ నాకు నేను సమాధానపడుతూ తేరుకున్నాను నేను.
"ఆయన కీర్తి అజరామరం. ఒక శతాబ్ద కాలంలో ఎందరో సామాన్యులని, సమ్మాన్యులని, నేతలని, నియంతలని ప్రభావితం చేసాడు. కానీ, ముట్టీ ఆయన్ని ప్రభావితం చేసింది. ఆమె లేనిది ఆయన లేడు." - ఆ అమ్మమ్మ గారి కంఠం గద్గదికమైంది.
మేమిద్దరం ఏం మాట్లాడాలో తోచక ఒకరినొకరం చూసుకున్నాము. లియోనా వెళ్ళి అమ్మమ్మ గారి పక్కగా నిలబడింది. అంతకంటే దగ్గరగా పోలేకపోయింది. నేను ముత్తవ్వ గారి మొగుడు గారి ఫొటోని చూస్తూ ఉండిపోయాను.
"ఆయన భక్తులకి ఆయన వ్యక్తిగత జీవితం ప్రస్తావన నచ్చేది కాదు. అది బయటకొస్తే వ్యక్తిగా ఆయనలోని లోపాలని అంగీకరించాలి కదా? అందుకని మమ్మల్ని దూరం పెట్టేశారు. జర్నలిస్టులూ, విమర్శకులూ వాళ్ళ వాదోపవాదాలన్నీ వ్యక్తిగతాల వైపుకి రాలేదు. అలా ఎవరూ పట్టించుకోలేదు అప్పట్లో. ఏదో కాలం కలిసొచ్చి ఇలా యురోపు దాటి కెనడా తీరం చేరి, కొత్త జీవితం ప్రారంభించాము." అమ్మమ్మ అందుకున్నారు.
"అలా చరిత్రలో మాయమైపోయి మామూలుగా ఇక్కడ తేలి నన్ను బ్రతికించారు." లియోనా నవ్వేసింది, వాతావరణాన్ని తేలికపరుస్తూ.
“మాకందరికీ ఆమె గొప్పామె. ఆయన ఆమె భర్త. అంతే. కానీ ప్రపంచానికి ఆయన గొప్పాయన. ఆమెని గుర్తిస్తే ఆమె గొప్పాయన భార్య.” అన్నది లియోనా వాళ్ళ అమ్మమ్మగారు కూడా నవ్వేస్తూ.
మొన్నామధ్య ఒక స్నేహితురాలి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటే గాంధీ గురించి ఏదో వచ్చింది. వాళ్ళ రెండేళ్ళ పాప అక్కడే ఉంటే తనకి టీవీ చూపిస్తూ "ఇది గాంధీ తాత" అన్నది వాళ్ళమ్మ. "మరి అవ్వేదీ?" అన్నది ఆ పాప టక్కుమని.
అన్నీ చూసిన జ్ఞానం ఆ అమ్మమ్మగారిది. ఏమీ చూడని జ్ఞానం ఈ పసి పాపది. మధ్యలో ఉన్న మనదే తెలిసీ తెలియని జ్ఞానం కాబోలు అనిపించింది. ఉవె, ఆయన భార్యా ఉన్న చిత్రాన్ని ఫొటో తీసుకుని, దండం పెట్టుకున్నాను. లియోనా వాళ్ళతో మరి కాసేపుండి, సెలవు తీసుకుని, బైటకి వచ్చేశాను. .
నా మాట: ఫేటర్చెన్ (Väterchen), ముట్టి (Mutti) - నాన్న, అమ్మ ని జర్మన్ భాషలో కొన్ని ప్రాంతాల వారు ముద్దుగా అలా పిలుచుకుంటారు. Uwe Dinkel, Wolfgang Denke - ఈ పేర్లు గలవారెవరూ లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళెవరో, వాళ్ళేమన్నా రాశారో లేదో నాకు తెలియదు. చారిత్రక వ్యక్తులని తల్చుకుంటూనే రాసినా, ఈ కథ పూర్తిగా కల్పితం.