Menu Close
గోదావరి (పెద్ద కథ)
-- వెంపటి హేమ --

గత సంచిక తరువాయి »

అది శ్రావణమాసమేమో పోటెత్తి ప్రవహిస్తోంది గోదావరి. అది వానాకాలం కావడంతో ఆకాశంలో వాన మేఘాలు పరుగులు తీస్తున్నాయి. అడుగడుగునా మేఘాలు అడ్డురావడంవల్ల చూస్తూండగా సూర్యుని ప్రతాపం తగ్గిపోయింది. అస్తమిస్తున్న సూర్యుని కాంతి పడి నీలిమేఘాల వంచలు, బంగారు తీగలతో సరిగ పనిచేసిన నీలిపట్టు చీర తాలూకు సరిగంచుల్లా ధగధగా మెరుస్తున్నాయి. సాయం సమయం సమీపించింది, ఇక గూటికి పోదాము పదండి - అని ఒకదానికొకటి హెచ్చరికలు చెప్పుకుంటూన్న వాటిలా చెట్టుకొమ్మల పైన వాలివున్న పిట్టలు కువకువలాడుతూ హడావుడిగా ఎగిరిపోతున్నాయి. గోధూళి వేళ అవ్వడంతో, గడ్డి మైదానాల్లో మేతకు విడిచిన పశువులను ఇళ్ళకు మళ్ళేస్తున్నారు పాలేర్లు.

కోనసీమలో గోదావరి ఒడ్డునున్న ఒక పల్లెటూరు శంకరవల్లి. ఆ గడ్డపైనున్న సంపన్నులైన భూకామందుల్లో రమాపతి గారు ఒకరు. తన కమతంలో పెద్దపాలేరైన రంగడిని వెంటతీసుకుని గోదారి ఒడ్డుకు బయలుదేరాడు ఆయన, వరద ఏపాటిగా ఉందో చూసిరావడానికి. పడవలరేవుకి పక్కనే గోదావరిలోకంతా పావంచాలు ఉన్నాయి. పుణ్య తిధుల్లో గోదావరిలో స్నానాలు చెయ్యడానికి వీలుగా ఉంటుందని, రమాపతి గారి తండ్రి, ఊరందరి సౌకర్యంకోసం వాటిని కట్టించారు. ఎండాకాలంలో నీరు తక్కువగాఉన్న సమయంలో గారసున్నం, ఎర్రగా కాల్చిన ఇటుకలు, నాపరాళ్ళు వాడి, నీటిలోకంతా దిగీలా కట్టించిన పావంచాలవి.

అక్కడ గోదావరి తూరుపు పడమరలుగా ప్రవహిస్తుంది. గోదావరి నీటిపై ఉభయ సంధ్యలా సూర్యకిరణాల విన్యాసం అక్కడ చూడముచ్చటగా, నిత్య నూతనమై ఉంటుంది. రమాపతిగారు, రంగడు పావంచాలదగ్గరకి వచ్చేసరికి సూరీడు అస్తాద్రికి చేరుకున్నాడు. సంధ్యాసమయం కావడంతో పడమటిదిక్కు రాగరంజిత మయ్యింది. ఆ సింధూర వర్ణపు కాంతి పడి వరదనీరు కరిగించి పోసిన బంగారంలా తళతళా మెరుస్తోంది. ఒండుమట్టితో కూడిన చిక్కని ఆ నీటిలో తేలుతూ ఏవేవో వస్తువులు ప్రవాహం సాగుతున్న వైపుగా, సముద్రంలోకి వడి వడిగా కొట్టుకుపోతున్నాయి.

అంతలో రంగడు, “అయ్యగోరండీ! అల్లదిగో అటు సూడండి” అంటూ వేలెత్తి చూపిస్తూ "కెవ్వు" మన్నట్లు కేకపెట్టాడు. అటువైపు చూసిన రమాపతి కూడా ఆశ్చర్యంతో గుండెలపై చెయ్యుంచుకుని, “రామ, రామ” అంటూ దేవుణ్ణి తలుచుకున్నాడు. వాళ్లకు కనిపించిన ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంది. నడి గోదారిలో గుడిసె ఒకటి నీటిలో తేలుతూ ప్రవాహంలో చిక్కి సముద్రం వైపు వేగంగా కొట్టుకుపోతోంది. దాని మీద ఒక ముసలమ్మ, కోడిపెట్ట నొకదాన్ని గట్టిగా చేతులమధ్య పట్టుకుని, భయంతో  బిక్కచూపులు చూస్తూ కూర్చుని ఉంది.

దిగులుగా నిట్టూర్చి, “రంగా! నీటి వడి చాలా ఎక్కువగావుంది. మనమేమీ చెయ్యలేని పరిస్థితిరా ఇది. నీటివడి చూసి పడవలు కూడా తిరగడం మానేశాయి. ఆ అమ్మిని ఇక ఆ దేవదేవుడే రక్షించాలి” అన్నాడు రమాపతి.

“ఆయ్” అన్నాడు రంగడు ఏడుపు గొంతుకతో.

ఇంకా ఏవేవో రకరకాల వస్తువులు, చెట్లుకొమ్మలు, గడ్డిమేట్లు, చెత్తా, చెదారం - అన్నిటినీ తన వెంట తీసుకుని సముద్రుని చేరడానికి వేగంగా వెళ్ళిపోతోంది గోదావరి. మధ్యమధ్య నీటి వేగానికి వేళ్ళతో సహా పెకలించబడిన పెద్దపెద్ద చెట్లుకూడా ఆ నీటిలో పడి, ప్రవాహవేగానికి వడివడిగా సముద్రం వైపుకి కొట్టుకుపోతూ కనిపిస్తున్నాయి.

రంగడు చురుగ్గా పావంచాలు దిగి, నీటి దరికి చేరాడు. పై మెట్టు మీద నిలబడి, “ఏరా రంగా! ఏపాటిగావుందంటావు వరద” అంటూ పాలేరుని అడిగాడు రమాపతి.

రంగడు బుర్ర గోక్కున్నాడు. “పొద్దుగాల గోదారి పదారో మెట్టుకాడ ఉన్నాదండి, ఆయ్! మరిగంటే ఇప్పుడది ఆరో మెట్టుకాడికి వచ్చేసినాదండి!"

"అంటే దానర్థం అతి శీఘ్రంగా పెరుగుతోందనేకదురా" అంటూ ఒక మెట్టు దిగాడు రమాపతి.

“ఆయ్! వరద శానా ఏగంగా పెరుగుతోందండి” అన్నాడు రంగడు.

“ఇక్కడితో ఈ వరద ఆగుతుందంటావా, ఇంకా పైకి ఎక్కి వస్తుందంటావా?” యధాలాపంగా అడిగాడు రంగడిని రమాపతి.

“ఏమోనండయ్యా! గంగ ఎర్రి (వెర్రి), గాలి ఎర్రి మనకు అర్దంగావంటారండి శాత్తులుగోరు. ఇగ నా కేటి తెలుస్తదండి” అంటూ రంగడు మళ్ళీ బుర్ర గోక్కున్నాడు.

రంగడి చిన్నతనంలోనే తల్లితండ్రులు ఇద్దరూ చనిపోయారు. కానుపు కష్టమై రంగడి తల్లి చనిపోగా, పొలంలో పాముకాటుకు గురియై తండ్రి మరణించాడు. రంగడి తండ్రి చివరి దశలో కొడుకుని యజమానియైన రమాపతికి అప్పగించి మరీ చనిపోయాడు. అప్పటినుండి రంగడు రమాపతిగారి ఇంటిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. రమాపతి, రంగడికి పెళ్ళీ పేరంటం చేయించి, ఒక ఇంటివాడిని చేసి, రంగడి తండ్రికి ఇచ్చినమాట అక్షరాలా నిలబెట్టుకున్నాడు. రమాపతిగారి విశాలమైన పెరటిలో ఉన్న పాకింట్లో, భార్యా బిడ్డలతో  కాపురముంటున్నాడు రంగడు. ఆనాడు తండ్రి ఐతే, ఈ నాడు కొడుకైన రంగడు, యజమానియైన రమాపతిగారికి నమ్మిన బంటుగా ఉన్నాడు. యువకుడైన రంగడి భార్య తాయారు. వాళ్లకి ఒక నెలల వయసున్న బాబు ఉన్నాడు.

రేవుకి ఎదురుగా, ఒక మైలు దూరంలో గోదావరికి మధ్యలో ఒక లంక  ఉంది. ఆ లంకలో మొక్కజొన్న, ఆకు కూరలు, కాయగూరలు మొదలైనవి పండించుతారు. వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలు, కరబూజాలు ఆ లంక నుండే తెచ్చి సంతల్లో అమ్ముతారు. మృగశిర కార్తె రాగానే లంకలో సందడి మొదలౌతుంది. ఆ సంవత్సరం అదునుచూసి, నేలను పదునుచేసి, లంకలో చాలావరకూ మొక్కజొన్న విత్తారు. అది ఏపుగా పెరిగిందని మురిసిపోయారు అంతా. నిలువెత్తున పెరిగిన ఆ మొక్కలు, సరిగా పొత్తులు విడిచే సమయంలో సాంతం నీట మునిగిపోయాయి. ఇప్పుడు మచ్చుకైనా అవి నీటిపైకి కనిపించడం లేదు. ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది.

లంక ఉండే వంక చూస్తూ అడిగాడు రంగడు, “అయ్యగోరూ, అటు సూడండి, లంక పూటుగా నీటిలో మునిగిపోయిందయ్యా! మొక్కజొన్నసేను ఏపుగా వచ్చింది, ఇక జోరుగా పొత్తులు ఇడుస్తాది - అనుకున్నారు అందరూ. ఇప్పుడు సూత్తే  ఒక్క మొక్క కూడా ఆపడటం లేదండి. ఈ వరద తగ్గి, అయి లేగిసేది ఎప్పుడో!” ఆశా భంగంతో దిగులు ముంచుకురాగా నిట్టూర్చాడు రంగడు.

కొడుకు పుట్టినా ఇంకా రంగడికి పసితనం పోలేదని తనలో తాను మురిపెంగా నవ్వుకున్నాడు రమాపతి.

ఈ మాటు వచ్చిన వరద తీవ్రతను అంచనావేస్తూ రమాపతి మరో రెండు మెట్లు క్రిందకు దిగాడు. గోదావరి వైపుకు చూస్తూ పరాకుగా నాలుగవ మెట్టుకు దిగి, నిలబడివున్న రమాపతికి అరికాళ్ళల్లో ఎవరో గిలిగింతలు పెట్టినట్లై వంగి కాళ్ళవైపు చూసుకున్నాడు. వాళ్ళు మాటాడుకుంటూండగానే వరదనీరు ఆరు నిండి, ఐదెక్కి, ఆపై నెమ్మదిగా నాలుగో మెట్టుకి చేరి, అక్కడ నిలబడ్డ రమాపతి అరికాళ్ళలో మెదిలి, కితకితలు పెట్టి, గోదారి పొంగుతున్న వేగాన్ని ఆయనకు తెలియజేసింది. గోదావరి ఊరును ముంచబోతోందని రమాపతికి అర్థమైపోయింది. మరీ ఇంత వేగమా! రమాపతి గుండెల్లో చూస్తూండగా గుబులుపుట్టి, పెరగసాగినది.

“అయ్యగోరండీ! ఈ ముంపు తీసేతలికి ఓ వారం పైనే పట్టుద్దనిపిస్తావుందండి, ఆయ్! ఆ తరువోతగ్గాని మొక్క జొన్నసేను బయటకు రాదు గందా... అప్పుడది బతుకుద్దంటారా?”

రమాపతి గుండె గుబులు తెలియని రంగడు తనదారిని తాను మాట్లాడుకుంటూ పోతున్నాడు.

అన్యమనస్కంగానే జవాబు చెప్పాడు రమాపతి, “అన్నాళ్ళు నానితే బతక్కపోవచ్చు. అయినా, కొంచెం ఎక్కువో తక్కువో - ఇది మనకు ఏటా ఉన్న ముచ్చటేగదురా! ఒద్దంటే పోయీది కాదు, కావాలనుకోక పోయినా వచ్చేదే! దీన్ని భరించక తప్పదు మనకు!”

యజమాని గొంతులో ధ్వనించిన దైన్యానికి విస్తుపోయి, ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాడు రంగడు.

రమాపతి రంగడితో అన్నాడు, “ఈ నీటి ఉరవడి చూస్తూంటే ఈ సంవత్సరం వరద చాలా ఉధృతంగా ఉండేలా ఉంది. రాత్రి అందరూ మంచి నిద్రల్లో ఉండగా గోదారి ఊరుమీద విరుచుకు పడుతుందని తోస్తోంది. ఇంత వేగాన్ని మట్టికట్ట ఆపలేదు, ఏ క్షణం లోనైనా కట్ట తెగిపోవచ్చు. కట్టతెగితే ఉన్నబడంగా ఊళ్ళో నడుములోతుకి వస్తాయి నీళ్లు. నువ్వెళ్ళి ఊరిలో నలుగురికీ  నా మాటగా చెప్పిరా - ఏ క్షణం లోనైనా గోదావరి ఊరిపై విరుచుకు పడనుందనీ, ముందుగానే అందరూ జాగ్రత్త పడవలసి ఉందనీ చెప్పు. మనం కూడా సిద్ధంగా ఉండాలి, ఎప్పుడే మౌతుందో ఎవరి  కెరుక.”

“సరేనండయ్యా! బేగెల్లి ఊర్లో అందరికీ ఈ ఊసు సెప్పేసి, సిటికలో లగెత్తుకు వచ్చేత్తా నండి, ఆయ్” అంటూ రంగడు ఊరివైపుకి పరుగెత్తాడు.

రమాపతి వేగంగా ప్రవహిస్తున్న వరద నీటినే చూస్తూ అక్కడే ఒక్క క్షణం నిలబడిపోయాడు. ఆ తరవాత ఉసూరుమని నిట్టూర్చి ఇంటిదారి పట్టాడు.

ఎవరిగోడూ పట్టని గోదావరి తనదారిని తాను సుడులు తిరుగుతూ, అంతకంతకీ వేగం పెంచుకుంటూ, మహావేగంతో సముద్రం వైపుగా ఉరకలువేస్తూ పరుగులు పెడుతోంది. తనలో ఎంత నీరున్నా ఏమాత్రం తనివితీరదు ఆ అఖండ జలనిధికి. ఎన్ని ఏరులు పొంగి పొరలి తనను చేరవచ్చినా సంకోచమన్నది లేకుండా, అలల చేతులు చాపి అందుకుని తనలో ఐక్యం చేసుకుని కూడా, ఏమాత్రం తన గాంభీర్యాన్ని కోల్పోకుండా, ఏమీ ఎరగనట్లు ఎప్పటిలాగే రొదపెడుతూ, ఎగసెగసి పడుతూ ఉండిపోగలడు సముద్రుడు.

***********

భర్త ఇంటికి రావడం చూసి దుర్గమ్మ తప్పేలా(ఇత్తడి రేకుతో చేసిన పెద్ద చెంబు) నిండా గోరువెచ్చని నీళ్ళు, తుండుగుడ్డ పట్టుకుని వచ్చింది. ఆ నీరందుకుని కాళ్ళూ, చేతులూ, మొహం కడుక్కుని, తుండుతో శుభ్రంగా తుడుచుకుని, అంతవరకు అక్కడే నిలబడివున్న భార్యతో అన్నాడు రమాపతి, “జలప్రళయం రాబోతోంది. వేగంగా పెరుగుతున్న వరదనీటి వాలకం చూస్తే ఈ రాత్రికి గోదావరి ఊరుని ముంచుతుందనిపిస్తోంది. ఈ మాటు ఊరుకి పెద్ద ముప్పే రావచ్చు.“

దుర్గమ్మ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంది, “అదేమి చోద్యమండీ! పొద్దున్నేకదా మేము గోదారి దగ్గరకు వెళ్లి, కొత్తనీటికి పసుపు కుంకాలతో, పూలతో పూజచేసి, కొబ్బరికాయలు కొట్టి, పూలూ పళ్ళు సమర్పించుకుని వచ్చాము! అప్పుడది ఉన్నది పదహారో మెట్టుదగ్గర కదండీ!”

“అవ్వొచ్చు. ఐనా నువ్వు మెట్లు లెక్కెట్టగలవా ఏమైనానా! పదహారవ మెట్టని నువ్వెలా చెప్పగలవు?”

“చదువువస్తేకదా నాకు లెక్కెట్టడం వచ్చేది! నేను చదువుకుంటానని ఏడిస్తే, మా బామ్మ, బడికి వెడితే నిలువునా చీరేస్తానని, మళ్ళీ ఇంటి గడప తొక్కనీననీ కళ్లెర్రజేసి మరీ భయపెట్టింది. నేనుకాదు లెక్కెట్టినది, మీ ముద్దుల మనుమడు, మీ పేరుగలవాడు లెక్కేశాడులెండి.”

“ఐతే సరే! ఇది విను, నేనక్కడుండగానే నీరు నాలుగో మెట్టుకి చేరింది. ఈ సరికి నాలుగోమెట్టు కూడా దాటి ఉంటుంది. చాలా వేగంగా పెరుగుతోంది వరద. జనం జాగ్రత్తగా ఉండడం మంచిది. వంటయ్యిందా? అవ్వగానే అందరికీ భోజనాలు పెట్టెయ్యి. మనం ఇక్కడినుండి మెరక ప్రాంతానికి వెళ్లిపోవాలి తొందరగా. ఇంకా ఇక్కడే ఉండడం క్షేమం కాదు, ఇల్లు పాతది!“

“నా ఆలస్యం ఏమీ లేదు, వంట ఎప్పుడో అయ్యింది. అత్తయ్యగారికి జావ తాగించడమూ అయ్యింది. పిల్లల భోజనాలు కూడా అయిపోయాయి. మీరు, మీ అబ్బాయీ తొందరగా పట్టు పంచలు కట్టుకుని రండి. మీరు తిని లేచాక, వెంటనే ఆడవాళ్ళం కూడా వడ్డించుకుంటాము.”

ప్రమిదల్లో ఆముదంపోసి, ఒత్తివేసి వెలిగించి, దీపపు సేమ్మేలపై ఉంచిన దీపాలే ఆ నాడు రాత్రులందు వెలుగునిచ్చే దివ్వెలు కావడంతో, అప్పటి వాళ్లకు ఇంకా వెలుగుండగానే భోజనాలు ముగించడం, రాత్రి పెందలకడనే నిద్రపోవడం అలవాటు. మళ్ళీ వెలుగు వస్తూండగానే లేచి దినచర్యలో పాల్గొనేవారు అప్పటి వాళ్ళు .

“ఆలస్యం వద్దు, అందరికీ ఒకేసారి వడ్డించెయ్యి. మీనమేషాలు లెక్కించే వ్యవధి ఉన్నట్లు అనిపించడం లేదు. ఏరు మహావేగంతో పొంగుతోంది. ఏటిగట్టు నిలువరించగలదనిపించడం లేదు. తొందరపడాలి” అంటూ మడిబట్ట కట్టుకొని రావడానికి వెళ్ళాడు రమాపతి.

"ఏరు పొంగిందంటే జనం ఎన్నెన్ని కష్టాలు పడాల్సొస్తుందో ఏమో! ఈ గండం గడిచి జనం బయటపడితే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయిస్తా! స్వామీ, ఈ జనాలని రక్షించు తండ్రీ!” దుర్గమ్మకు గుండెల్లో బండ పడింది. ఈ ఆపద గడిచి గట్టెక్కడం కోసం, రక్షించమంటూ దేవరపెట్టిముందు నిలబడి ఆమె దైవాన్ని శరణు వేడింది.

దీపం వెలిగించి, ప్రమిదను ఎత్తుగా ఉన్న ఇత్తడి సెమ్మే పైన ఉంచి, సెమ్మాను గోడమూల, గాలి తగలని చోట పెట్టి, దీపానికి నమస్కరించి, మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంది ఆ ఇంటి కోడలు మహాలక్ష్మి. అందరికీ ఒకేసారి భోజనాలకి ఏర్పాటు చెయ్యమని కోడలికి పురమాయించి, తనుకూడా సంధ్యాదీపానికి నమస్కరించి, పుస్తెలు కళ్ళకి అద్దుకుని, ఆపై తొందరగా వంటగదిలోకి పరుగెత్తింది దుర్గమ్మ.

అందరికీ ఒకేసారి వడ్డించేసింది దుర్గమ్మ. ముద్దకలిపి నోటిలో పెట్టుకోబోతూ ఆగి, ఆడిగింది, “ఏమిటి వదినా! ఎందుకీ కంగారు” అని దుర్గమ్మని, చిన్నతనంలోనే ఇల్లుపట్టిన విధవాడపడుచు సీతమ్మ, రమాపతి చిన్న చెల్లెలు.

“ఆ! ఏముంది! ఏమీలేదులే, కబుర్లాపి, ముందు నువ్వు అన్నంతిను” అంది దుర్గమ్మ.

రమాపతి జవాబు చెప్పాడు సీతమ్మకి, “ప్రత్యేకం చెప్పాల్సిన కొత్తవింత ఏమీ లేదు, ఏటా ఉన్నదే! ఈ మాటు ఇంకొంచెం ఎక్కువ, అంతే! గోదారి మహావేగంతో పొంగుతోంది. ఇల్లు పాతది, మనం ఇల్లు విడిచి, మెరక ప్రాంతానికి ఈ రాత్రికి రాత్తిరి తరలి వెళ్ళాలి.”

విషయం తెలియగానే అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు.

“సీతమ్మా! నువ్వు తొందరగా తిని లేచి, అమ్మని ప్రయాణానికి సిద్ధం చెయ్యి” అన్నాడు చెల్లెలితో రమాపతి.

“సరే” నన్నట్లుగా తలూపి, గబగబా జొన్నన్నం తినసాగింది సీతమ్మ. ఆపై ఇంకెవ్వరూ మాటాడలేదు. భోజనం మీదే దృష్టిపెట్టి చకచకా తిని లేచారు అందరూ.

చేతులు కడుక్కుని, ఆ తడిచేతులు  తుడుచుకుంటూ, “నాన్నా! ఇది నిజమేనా!” అన్నాడు ఆశ్చర్యంగా, రమాపతి కొడుకు గోపాలం.

అతని కింకా తండ్రి జవాబు చెప్పనే లేదు. అంతలో మండువా చావడిలో ఆడుకొంటున్న పిల్లలు పెద్దగా కేకపెట్టారు,"తాతయ్యా! మండువాలోకి నీళ్ళు వస్తున్నాయి" అంటూ.

హఠాత్తుగా పెద్ద చప్పుడు వినిపించేసరికి అందరూ ఉలిక్కిపడ్డారు.

రమాపతిగారి కుటుంబం ఉంటున్న ఇల్లు, రమాపతీ వాళ్ళ ముత్తాత కట్టించినది. ఇల్లు పాతబడిపోయింది. అయినా, పెద్దలు కట్టించిన ఇంటిని తను పడగొట్టడం ఎందుకు, దానంతటది కూలడం మొదలుపెట్టాకే దానిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవచ్చులెమ్మని, అందులోనే కుటుంబంతో సహా నివాసముంటున్నాడు రమాపతి. తాటిచేవ స్తంభాలతో, పాటిమట్టి గోడలతో, టేకుచెక్క సరంబీతో, తలుపులకి, ద్వారబందాలకి చేవగల టేకుకలప వాడి పటిష్టంగా కట్టిoచిన నాలుగంకణాల మండువా లోగిలి అది.

వసారాగోడ కూలడంతో రమాపతి మనసులోకి మెరుపు వేగంతో ఒక ఆలోచన వచ్చింది, “ఇంక జాగుచెయ్యాల్సిన పనిలేదు. కాస్త వానలు వెనకట్టగానే కొత్తింటి పని మొదలెట్టించాలి. ఎత్తైన అరుగులతో ఉన్న మిద్దె ఇల్లు ఐతే బాగుంటుంది. మిద్దె(డాబా)మీదకూడా రెండు గదులు ఉంటే వరదొచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడవలసిన పని ఉండదు. మళ్ళీ వరదలు రాకముందు ఇంటిపని పూర్తయిపోయి, గృహప్రవేశం కూడా జరిగిపోతే, ఇక ఇలా పారిపోయి తలదాచుకోవలసిన అవసరం ఉండదు. నేనే మిద్దెపై మరి నలుగురికి ఆశ్రయం ఇవ్వగలను. వరదకు బెదరకూడని విధంగా పటిష్టంగా పునాదులు తీయించాలి” అనుకున్నాడు.

దొడ్డి వాకిలిదాకా ఉన్న మండువా తూముద్వారా నీరు ఇంట్లోకి తోసుకు వచ్చింది. మండువా చావడిలో ఆడుకుంటున్న పిల్లలు భయంతో గగ్గోలుపడుతూ, "కెవ్వు కెవ్వు"న అరుచుకుంటూ పరుగున వచ్చి పెద్దవాళ్ళను కౌగిలించుకున్నారు.

ఆ రోజుల్లో, ఏటికి ఏపాటి వరద వచ్చిందన్నా కోణసీమలో చాలాభాగం ముంపుకు గురవ్వడం ఖాయం. కాని ఎత్తుగా ఉండేలా కట్టుకున్న ఇళ్ళల్లోకి నీరురావడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. నేలబారుగా ఇళ్ళు కట్టుకున్న వాళ్లకి, పాకఇళ్ళల్లో ఉండేవాళ్ళకి, గుడిసెల్లో ఉండే బీదాబిక్కీ జనాలకి మాత్రం ఏటా వరదనీటితో గొండాడక తప్పదు. ఇక ఉధృతంగా వరద వచ్చినప్పుడు పాతిళ్ళు కూలిపోడం, కొన్ని చెట్లు కూకటి వేళ్ళతోసహా పెకలించబడి నిలివునా పడిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అటువంటి సమయాల్లో పాతకొంపల్ని ఖాళీ చెయ్యడం తప్పనిసరి ఔతుంది. ఇల్లు గట్టి దన్న భరోసా ఉన్నవాళ్ళు వరద ఎక్కువై, ఇళ్ళలోకి నీరు వస్తే కూడా, అది తగ్గేవరకూ అటకలమీద కాపరాలు పెట్టుకుంటారు. లేదా, ఇళ్ళ పైకప్పులమీదికి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటారు. క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనిషి బ్రతికి బట్ట కట్టాలంటే, ఎంతటి వాళ్ళకైనా ఏ ఎండ కా గొడుగు పట్టక తప్పదు కదా! ఏరు ఊరుమీద విరుచుకు పడ్డప్పుడల్లా జన నష్టం, ధన నష్టం, ప్రాణి నష్టం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాంతంలో అది పరిపాటే!

****కథ ఇంకా ఉంది****

Posted in July 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!