ఎందుకో?
ఎదురుగా నువ్వున్నంతవరకు
బెదురుగా ఉన్ననేను,
వట్టి వెదురులా ఉన్ననేను
నీ నిష్క్రమణ అనంతరం
కుదురు నౌతాను,
వేయి రాగాల వేణువు నౌతాను.
నువ్వున్నంత వరకు
ఎందుకా మౌనమో,
నువ్వు వెళ్ళాక ఎందుకీ గానమో?
నాకు అంతు చిక్కడం లేదు.
నీకైనా తెలుసునా?
నీ సాహచర్యంలో
నిద్రాణమై ఉన్న స్పందనలు,
నీ హృదయం నుండి
వెలువడే అభిజాత్యం లేని అభినందనలు,
నీ ప్రేమ తరంగాలు విహ్వల విహంగాలై
నీ ఎదుట నన్ను మూగవాణ్ణి చేస్తున్నాయి.
కానీ, నీవు నన్ను వదిలివెళ్ళిన మరుక్షణమే
నీపై ఏర్పడిన నాలోని శతకోటి భావాల శృతి
కోటివరాల ఉద్ధృతై, శతకోటి స్వరాల ఉత్పాతమై
మూకుమ్మడిగా నన్ను చుట్టుముట్టి,
పట్టుపట్టి నన్ను సంగీత భావరిలో
ముంచి ఆశ్చర్యపరుస్తున్నాయి
నీ దూరంలోని దగ్గరితనాన్ని
అవి తెలియజేస్తున్నాయి.
బహుశా అది నీపై నాలో ఏర్పడిన
ప్రేమతరంగాల భావఝారులు
అయి ఉండవచ్చు ప్రేయసీ!!