ఈ క్షణాలు
ఇన్ని క్షణాల్ని ముత్యాల్లా
వొంపుకుని
చిన్ని కిటికీలోంచి
ప్రపంచాన్ని తెరుచుకుని సమయాల్ని అలంకరించుకుంటాను.
జ్ఞాపకాలు పావురాల్లా వాలతాయి.
మంచు దృశ్యాలు పరచుకుంటాయి.
రాత్రులు వేలాడుతూ
స్వప్న లోకంలో
ఆశల్ని రుచి చూపుతాయి.
మౌన క్షేత్రాలు
మనసుని తేలిక పరుస్తాయి.
ప్రణాళికలు
మనిషిని క్రమబద్ధీకరిస్తాయి.
ఉత్సాహాలు మేల్కొని
ఆరోగ్యమయ ప్రపంచంలో
విజయ తీరాలని చేరుస్తాయి.
నిరంతర శ్రమ
పరిశ్రమ ఆత్మ విశ్వాసాన్ని నిలిపి
చెదిరిపోని కలల్ని
దృశ్యాలుగా ఆవిష్కరించి నిలుపుతుంది.