Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
ద్విత్వాక్షరసేవ
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
ద్విత్వమైన అక్షరములతో సేవ/
ద్విత్వములతో అక్షరుని (శాశ్వతమైన వాని) సేవ
వేంకటేశ్వరుఁడు

మ.కో. దిక్కు చిక్కక బిక్కుబిక్కని దీను లెక్కడ స్రుక్కినన్
         దిక్కు తా నయి ప్రక్కఁ బ్రేమయె దృక్కులన్ మఱి వాక్కులన్
         బిక్కటిల్లఁగఁ జక్కదిద్దెడు పెక్కు వేల్పులె యొక్కటై
         పక్కి నెక్కిన చక్కనయ్యగఁ(1) బక్క(2) మయ్యెడు నిక్కడే(3)
         (1) పక్షివాహనుడైన విష్ణువు (2) పక్కము=తోడు (3) తిరుమలలో

సూర్యుఁడు

మ.కో. వెచ్చవెచ్చని నీ కరమ్ముల విచ్చివిచ్చని రేకులన్
          నచ్చి విచ్చఁగఁ దట్టుచున్ దొగనాథ!(1) నెచ్చెలి కచ్చమౌ
          నిచ్చకంబు(2) మెయిన్ బ్రచోదన మిచ్చి యచ్చటముచ్చటన్
          బచ్చపచ్చని జిక్కి(3)తేరున వచ్చి తీర్పఁగ మ్రొక్కెదన్
          (1) పద్మవిభుడు (2) ఇచ్చ(1)కంబు=వలపు (3) గుఱ్ఱము

ఈశ్వరుఁడు

ఉ. గట్టులఱేనిపట్టి(1) కయి(2) గట్టిగఁ బట్టిన దిట్ట మా కయిన్(3)
      జట్టులఁ(4) బోలు రట్టులనుఁ(5) జట్టన(6) మట్టము చేసి తానె యి
      క్కట్టులఁ గట్టిపెట్టి కనుఁ గట్టును(7) గిట్టగు(8)నట్టి ప్రేమ చూ
      పట్టఁగ నెట్టిపట్టులను(9) బట్టుల(10) పట్టులఁ(11) బట్టుపట్టుచున్
	    (1) కొండలరాజుకూతురు  (2) చేయి  (3) మాకొఱకు
	    (4) పర్వతముల (5) ఆపదలను (6) శీఘ్రముగా
	    (7) కట్టును= మిక్కిలియు  (8) కిట్టగు= అనుకూలమగు
	    (9) వేళలందు (10) పిల్లల (11) పట్ల 

కృష్ణుఁడు

మ.కో. కన్నవారలకన్న మిన్నయి కన్నడింపఁగ(1) నేల? నీ
	కన్న మిన్నన సున్న, యెన్నఁడుఁ గ్రన్ననన్ గృపఁ గన్న నీ
	సన్నిధే కద ఖిన్నజీవుల చాటు(2) పెన్నిధి, యీవెగా
	మన్నుఁ దిన్నను నోటఁ గన్నది మాత యన్నియుఁ గన్నఁడా!(3)
		(1) ఉపేక్షింపగా (2) వెనుక నుండు (3) కృష్ణుడా

పార్వతీదేవి

మ.కో. అమ్మ లందఱి యమ్మ నమ్మిక(1) నమ్మగా మది నమ్మికన్(2)
	సమ్ముఖమ్ముగ సమ్ముదమ్ముగ సంతతమ్ము భజింతు, లో
	కమ్ము లిమ్మెయి(3) నుండ నమ్మయె కారణమ్మని దివ్యు(4) లే
	కమ్ముగాఁ బడి యజ్జతమ్ములఁ(5) గావు మమ్మని వేఁడరే?
		(1) అమ్మిక=పార్వతి  (2) నమ్మకముతో (3) ఈ విధముగా
		(4) దేవతలు/ తత్వవేత్తలు  (5) పాదకమలముల
Posted in March 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!