Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

విశాలమైన ఆవరణ.. రెండు వైపులా లాన్.. అందమైన పూల మొక్కలు ఒక వైపు, క్రోటన్స్ మరో వైపు, లాన్ మధ్యలో పాండ్..పాండ్ మధ్యలో ఒకమ్మాయి రెండు చేతులూ చాచినట్టు ఉన్న శిల్పం లో నుంచి జల్లులుగా పడుతున్న ఫౌంటెన్..అడుగడుగునా పనివాళ్ళు..అతని అడుగులకు మడుగులొత్తుతూ ఉంటే, మహారాజులా ఠీవిగా నడుస్తున్న మాధవన్ ని చూస్తుంటే స్మరణ కి మూర్చ వచ్చినంత పనైంది.. ఇల్లు అంటే మహా అంటే తన ఇంటి కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంది.. ఇది ఇల్లు కాదు పాలస్...ఇంత వైభోగమా! ఆశ్చర్యంతో మతి పోతోంది ఆమెకి. ఆరు మెట్లు ఎక్కి ఒక వరండాలోకి వెళ్ళిన మధుని అనుసరించింది. ఓపెన్ వరండా.. విశాలంగా ఉంది. ఒకవైపు కెన్ కుర్చీలు, మరోవైపు విజిటర్స్ కూర్చోడానికి ప్లాస్టిక్ కుర్చీలు వరసగా వేసి ఉన్నాయి. రెండు వైపులా బుక్స్ రాక్ వాటి మీద రక,రకాల మేగాజైన్స్..

“కం ఇన్” మధ్యలో ఉన్న ద్వారం దాటి లోపలకి వెళ్లి, స్మరణ వైపు చూస్తూ కుడిచేత్తో లోపలికి రమ్మన్నట్టు అభినయించాడు.

అత్యంత ఆధునికంగా, అందంగా ఉన్న హాలులోకి అడుగుపెట్టి ముగ్దురాలు అయినట్టు నిలబడిపోయింది.

“ఏంటి నిలబడ్డావు.. రా లోపలకి” అన్నాడు.

“ఇంటికి తీసుకువేడతా అని ఇక్కడికి తీసుకువచ్చావేంటి” అడిగింది.

“ఏం ఇది హాస్టల్ లా అనిపిస్తోందా..”

“కాదు మహారాజా పాలెస్ లా అనిపిస్తోంది.”

సన్నగా శబ్దం చేస్తూ నవ్వి “అప్పుడే ఒక అభిప్రాయానికి రాకు” అంటూ చేయి అందుకుని లోపలికి తీసుకువెళ్ళి  సోఫా చూపిస్తూ “కూర్చో” అన్నాడు. ఓపెన్ కిచెన్... మధ్యలో ఐలాండ్.. ఓ వైపు డైనింగ్  ఏరియా, మరో పక్క సోఫాలు టి వి ... ఫ్యామిలీ ఏరియా..

“అమ్మా!” పిలిచాడు.

స్మరణ వెనక్కి తిరిగి చూసింది.. ఎవరూ కనిపించలేదు. డైనింగ్ ఏరియా వైపు ఉన్న ఫ్రెంచ్ విండో లో నుంచి బాక్ యార్డ్ కనిపిస్తోంది.. పచ్చని చెట్లతో, చెట్ల మీద పక్షుల కల,కలా రావాలతో అద్భుతంగా, ఆహ్లాదంగా ఉంది. స్మరణ అటువైపు నడిచింది.

మెత్తటి అడుగుల శబ్దం, “వచ్చారా” అనే మాట వినిపించి వెనక్కి తిరిగింది.

క్రీం కలర్ గద్వాల చీరకి రాణి పింక్ జరీ  బోర్డర్.. కళ్ళద్దాలు, మెడలో చంద్రహారం, ముత్యాల గొలుసు, చెవులకి డైమాండ్ దిద్దులు, రెండు చేతులకి రెండేసి డైమండ్ గాజులు, ఆరోగ్యంగా, లోకంలో ఉన్న ఆనందం అంతా స్వంతం చేసుకున్నట్టు..ఈవిడ పేరు... స్మరణ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించింది..

“ఏమ్మా... బాగున్నావా” నవ్వుతూ అడిగింది.

స్మరణ ఒక్క క్షణం ఉలిక్కిపడి “మీరు నన్ను గుర్తు పట్టారా“ అంది.

“మర్చిపోతేగా గుర్తు పట్టడానికి.. నువ్వు నా కళ్ళ ముందు మెదలని రోజు లేదు.. అమ్మ, నాన్న ఎలా ఉన్నారు.. తాతగారు బాగున్నారా?” ఆవిడ అందరినీ పేరు, పేరునా అడుగుతుంటే విస్మయంగా చూసింది స్మరణ.

మాధవన్ ఇద్దరినీ చిరునవ్వుతో చూస్తూ ఆవిడ వైపు తిరిగి “బ్రేక్ ఫాస్ట్ రెడీ నా... ఆకలేస్తోంది” అన్నాడు.

ఆవిడ నవ్వి “రండి” అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచింది.

మాధవన్ స్మరణ చేయి పట్టుకుని “రండి మేడం” అన్నాడు.

స్మరణకి అంతా అయోమయంగా ఉంది. ఇదంతా నిజంగా జరుగుతోందా లేక కలనా అర్థం కావడం లేదు. అతని మొహం లోకి అపనమ్మకంగా చూసింది. ఆమె చూపు అర్థం అయినట్టు గట్టిగా భుజం మీద గిల్లాడు.  కేవ్వుమనబోయి గబుక్కున నోరు చేత్తో మూసుకుని కోపంగా చూసింది.

“ఇప్పడు కన్ఫర్మ్ అయిందా ?” అల్లరిగా నవ్వాడు.

స్మరణ మాట్లాడలేదు. కుర్చీ లాగి కూర్చుంటూ “కూర్చో” అన్నాడు.

పింగాణీ ప్లేట్స్ లో వేడి, వేడి ఇడ్లి, చట్నీ, బౌల్స్ లో సాంబారు, నెయ్యిలో తడిపిన ఇడ్లి పొడి వంట మనిషి అన్నీ సిద్ధంగా అమర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

“అమ్మా! ఇప్పుడు ఈవిడకి నోట్లో నుంచి మాటలు రావడం లేదు అలా అని మితభాషి అనుకోకు.. సాయంత్రానికి నీకే తెలుస్తుంది అసలు స్వరూపం..”

అతని మాట పూర్తీ కాకుండానే అంది స్మరణ... “ఆంటీ! మీకు మేమంతా అలా ఎలా గుర్తున్నాము? మా పేర్లు కూడా గుర్తున్నాయా..మీ పేరు మీనాక్షి ఆంటీ కదూ..”

“మీనాక్షి ఆంటీ కాదు.. మీనాక్షి నా పేరు.. ఆంటీ నీ పిలుపు” అంది ఆవిడ.

“అదేలెండి.. మా అమ్మ పేరు చెప్పండి..”

“మొదలైంది... ఇంకా సాయంకాలం వరకూ కాస్త సైలెంట్ గా ఉంటావు అనుకున్నా” ఇడ్లి సాంబారులో ముంచి తింటూ అన్నాడు.

“అది నీ తప్పు...” అని అతని వైపు కోరగా చూసి “చెప్పండి మా అమ్మ పేరేంటి...” అంది కొంచెం గారంగా.

“సంధ్య .... మీ ఫాదర్ దీపక్.. తాతగారు ఆంజనేయ ప్రసాద్ గారు.. రాజమండ్రిలో ఉంటూ అప్పుడప్పుడూ మీ దగ్గరకు వస్తూ ఉంటారు ఆయన... మీ అమ్మగారు చాలా ట్రెడిషనల్... అవునా.!”

స్మరణ కళ్ళు విశాలం చేసి ఆవిడ వైపు విస్మయంగా చూస్తూ “భలే గుర్తుంచుకున్నారే” అంది.

ఆవిడ నవ్వి “మీ కుటుంబంతో ఏడాదిన్నర అనుబంధం ఉంది... ఎలా మర్చిపోతాను? ఒకవేళ నేను మరచిపోవాలని అనుకున్నా వీడు మర్చిపోనిచ్చాడా.. ముఖ్యంగా నిన్ను... నీ పేరులోనే ఉంది కదమ్మా మిరకిల్ అంతా.. మా వాడు నిన్ను స్మరిస్తూనే ఎదిగాడు..”

అప్రయత్నంగా మధువైపు చూసిన ఆమె కళ్ళు అతని కళ్ళలో చిక్కుకున్నట్టు అయ్యాయి. బలవంతంగా చూపులు మరల్చుకుంది. కనురెప్పలు సిగ్గుతో బరువుగా వాలిపోయాయి. ఆ క్షణంలో అతను నవ్విన  నవ్వు ఆమె గుండెల్లోకి మిస్సైల్ లా దూసుకుపోయి కాసేపు అక్కడ పులకింతల గందరగోళం సృష్టించింది. నోట్లో పెట్టుకున్న ఇడ్లి గొంతులోకి దిగలేదు.. వేలితో ప్లేట్ లో సున్నాలు చుట్టసాగింది.

“అమ్మా! నాకు అల్లం చట్నీ కావాలి” అన్నాడు మధు...

“ఇప్పుడే తెస్తాను” అంటూ ఆవిడ లేచి కొంచెం ఎడంగా ఉన్న షెల్ఫ్ దగ్గరకు వెళ్ళింది. మధు చప్పున ఫోర్క్ తో ఇడ్లి తుంచి స్మరణ నోటికి అందించాడు. అనుకోని ఆ చర్యకి స్మరణ ఉలిక్కిపడి అతని వైపు చూసింది. పెదవుల మధ్య ఉన్న ఇడ్లి ఫోర్క్తో లోపలికి తోసి “మింగు” అన్నాడు.

“ఇప్పుడా రోమాన్స్ ...” చిరుకోపంగా అంది అల్లం చట్నీ జార్ తో వస్తున్న మీనాక్షి వైపు సైగ చేసి చూపిస్తూ.

మీనాక్షి చట్నీ జార్, స్పూన్ మధు ప్లేట్ దగ్గర పెట్టి “జ్యూస్ తెస్తాను” అంటూ వెళ్ళింది.

“అమ్మ ఎందుకు వెళ్లిందో తెలుసా!” అడిగాడు స్పూన్ తో జార్ లో ఉన్న చట్నీ తీస్తూ..

“తమరేదో ఫర్మాయించారు కదా! అయినా వంటావిడ ఉందిగా.. ఆంటీ ఎందుకు వెళ్ళారు?” ప్రశ్నార్ధకంగా చూసింది.

వేలితో చట్నీ తీసి “ఇందుకు” అంటూ ఎడం చేత్తో ఆమె మెడ మీద చేయి వేసి కొద్దిగా ఆమె మొహం ఒంచి, పెదాలకు లిప్ స్టిక్ లాగా రాసాడు.

“మైగాడ్ .... వాట్ ఈజ్ దిస్.. పిచ్చెక్కిందా నాకీ పచ్చడి ఇష్టం లేదు..” అతని చేతుల్లో ఉన్న మొహం పక్కకి జరుపుకోడానికి పెనుగులాడుతూ అంది.

“నిన్ను తినమనలేదుగా” కొంచెం ఆమె వైపు ఒంగాడు.

అతని చేతుల నుంచి విడిపించుకుని కుర్చీ దూరం జరుపుకుంటూ “ఇదేనా నీ హుందాతనం” అంది కోపం బిగపట్టి పెదాలు నాప్ కిన్ తో తుడుచుకుంటూ.

“చట్నీ టేస్ట్ పెరిగింది తెలుసా” అన్నాడు చప్పరిస్తూ.

“నువ్వింత చిల్లర అనుకోలేదు... టైం సెన్స్, స్పేస్ సెన్స్ లేదా” కోపంగా అంది.

“అలా అన్నావంటే మన ఫస్ట్ నైట్ కూడా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తా నీ ఇష్టం” బెదిరిస్తూ అన్నాడు.

“అంతకన్నా నేనేం ఎక్స్పెక్ట్ చేయనులే” రెచ్చగొడుతున్నట్టుగా అంది.

ఆమెకి మాత్రమె వినిపించేలా అన్నాడు “అఫ్కోర్స్ అది వేరే ప్రాజెక్ట్ అనుకో...ఎంతమంది పిల్లలను కనాలి... ఎప్పుడు కనాలి... ఎలా కనాలి..”

“ఆవిడ వస్తున్నారు.. షట్ అప్ యువర్ మౌత్” అంది గుండెల్లో సన్నాయి మోగుతున్నా పైకి మాత్రం మరింత కోపం ప్రదర్శిస్తూ.

మీనాక్షి వచ్చింది ఆవిడ చేతిలో ఉన్న ట్రే లో రసమలై బౌల్స్ ఉన్నాయి.

అవి చూడగానే అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు మెరిసింది... ఆవిడని అక్కడి నుంచి మరోసారి పంపించడానికి మార్గం అన్వేషిస్తూ “అమ్మా! ఇంకో బౌల్ కావాలి” అన్నాడు.

ఆవిడ నవ్వి తిరిగి కిచెన్ వైపు వెళ్ళింది.

రసమలై స్పూన్తో తీస్తూ “రసమలై తో అయితే మన డైనింగ్ టేబుల్ రోమాన్స్ ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా!” అతని మాట పూర్తి కాకుండానే గబుక్కున కుర్చీ లోంచి లేచి దాదాపు పరిగెత్తుతున్నట్టు మీనాక్షి వెళ్ళిన వైపు “ఆంటీ” అని పిలుస్తూ వెళ్ళింది. మధ్యలో వెనక్కి తిరిగి మధు వైపు చూసి ఒక నవ్వు విసిరింది.

“మై గాడ్” కుర్చీలో వెనక్కి వాలాడు మధు. అతని చేతిలో ఉన్న ఫోర్క్ జారి టేబుల్ మీద పడింది. ఆ నవ్వు విరిబాణం లా అతని గుండెల్లో మెత్తగా గుచ్చుకుని అలజడి రేపింది.

ఏ. సి. హాల్లో వేదిక మీద కూర్చున్న మాధవన్ వైపు పరవశంగా చూస్తూ కూర్చుంది స్మరణ. ఆమె మొహంలో వెలుగుతున్న నియాన్ లైట్ల కాంతి చూసి  “లవ్ మేక్స్ మిరకిల్స్” అనుకున్నాడు మీనన్ ఆమె పక్కనే కూర్చుని. పోడియం దగ్గర చెన్నై నుంచి వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ తన ప్రెజెంటేషన్ సమర్పిస్తున్నాడు. అద్భుతమైన యాక్సెంట్ తో అతను ఇంగ్లిష్ లో చెప్తోంటే అందరూ ముగ్ధులై వింటున్నారు.

మీనన్ అటూ, ఇటూ చూసి వాట్స్ ఆప్ లో స్మరణకి మెసేజ్ పెట్టాడు. “నెక్స్ట్ నువ్వే... బి కేర్ ఫుల్.. అందరిలోకి మన ప్రెజెంటేషన్ బాగుండాలి...”

స్మరణ థంబ్ ఇమోజి పెట్టింది.

సరిగ్గా అరగంట తరవాత చెన్నై వ్యక్తీ పోడియం దగ్గర నుంచి కదిలి కిందకు వచ్చేసాడు. చప్పట్లు లయ బద్ధంగా మోగాయి.

మైక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చేతికి వెళ్ళింది..

“మనకి ఏడాదికి కనీసం రెండు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒక్కోసారి మూడు కూడా వస్తాయి.. దీని వెనుక మిస్టర్ మాధవన్ చేస్తున్న కృషి చాలా ఉంది. పైగా మనకి వచ్చేవి సాధారణ మైనవి కూడా కావు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అది చైనాలో ఆల్రెడీ మొదలైంది. మన అందరికీ తెలుసు ఇప్పుడు చైనా ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని.. అందుకు కారణం వాళ్ళు మనకన్నా మేధావులు అని కాదు.. కానీ మనకన్నా ఎక్కువగా కష్టపడే తత్త్వం, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవాలన్న పట్టుదల, స్ఫూర్తి వారిలో ఎక్కువ. చైనా, జర్మనీలో వారానికి కేవలం 35 మాత్రమే పని గంటలు.. యావరేజ్ గా వారానికి 48 గంటలకన్నా ఎక్కువ సమయం పని చేయడం చట్టానికి వ్యతిరేకం.... కానీ అదే జపాన్ లో జర్మనీ కన్నా 22 శాతం ఎంప్లాయిస్ ఎక్కువ పని గంటలు చేస్తారు. ఓవర్ టైం ఉంటె 100 గంటలు కూడా చేస్తారు. అయితే దీని అర్ధం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు గొప్పవాళ్ళు ఇతరులు సోమరులు అని కాదు..ఆ ప్రాంతం లోని సంస్కృతీ, వాతావరణం పరిస్థితులు, వంటివి కూడా పరిగణలోకి తీసుకుంటే పని చేయడానికి సమయం కన్నా సమయస్ఫూర్తి ముఖ్యం అని అర్థం అవుతుంది. ఒక ప్రాజెక్ట్ ని డీల్ చేసే విధానంలో మాత్రమే తేడా..  ఎంతో మెలకువ తో, కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలు కనిపెడుతూ మరింతగా ఎలా ప్రోగ్రెస్ అవాలి అని తనదైన పంథాలో అలోచించి, తను పని చేస్తున్న కంపెనీ అభివృద్ధికి తోడ్పడడం ఇందులో భాగస్తులుగా మీ అందరి బాధ్యత .. ఆ బాధ్యత ని సక్రమమైన రీతిలో నిర్వర్తించి, తనకి అసైన్ చేసిన వర్క్ అద్భుతంగా చేసారు మిస్టర్ మణినాథ్ .. మరోసారి మనం అతనిని అభినందిద్దాం... ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్..” మరోసారి చప్పట్లు సముద్రంలో కెరటాల హోరులా వినిపించాయి.

చప్పట్లు ఆగిన వెంటనే మేనేజర్ స్వరం వినిపించింది. “నౌ మిస్ స్మరణా ఫ్రొం హైదరాబాద్ విల్ టాక్ అబౌట్ హర్ ప్రాజెక్ట్. “

స్మరణ ఉలిక్కిపడింది..

“గెట్ అప్” నెమ్మదిగా అన్నాడు మీనన్.

స్మరణ లేచి నిలబడింది.. ఆమె ఒడిలో ఉన్న హ్యాండ్ బాగ్ కింద పడింది. ఒంగి అది తీసుకుని తడబడుతున్న అడుగులతో వేదిక వైపు నడిచింది. నడుస్తూ ఒక్కసారి మాధవన్ వైపు చూసింది. అతను పక్కన ఉన్న డైరెక్టర్ తో మాట్లాడుతున్నాడు. స్మరణకి మొహం మీద చిరు చెమటలు పోశాయి. కాళ్ళు సన్నగా కంపిస్తుంటే పోడియం దగ్గరకు వచ్చింది. మేనేజర్ మైక్ ఆమెకి అందేలా అడ్జస్ట్ చేసాడు.

“ప్లీజ్ క్యారీ ఆన్” అన్నాడు కొంచెం ఎడంగా జరిగి నిలబడి.

ఎస్.... తలాడిస్తూ అనవసరంగా నవ్వి తిరిగి మాధవన్ వైపు చూసింది. అతనితో పాటు పక్కన ఉన్న ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. స్మరణకి కాళ్ళ నుంచి వణుకు తలదాకా పాకింది. ఇప్పుడు ఆమె కి తను ఒక మేధావి అయిన హెడ్ ఆఫ్ కంపెనీల మనస్సులో ఒక ముద్ర పొందాలి అంటే తన ప్రెజంటేషన్ మీద తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ తానిప్పుడు సరిగా మాట్లడలేకపోతే నిర్దయగా తీసిపారేస్తాడు మాధవన్.. ఈ విషయంలో అతనికి తన, పర భేదాలు లేవు... బంధాలు, బాంధవ్యాలు అసలే లేవు... ఒకటే అతని లక్ష్యం.. పాలసీ... తన పాలసీ కి, తన అంచనాలకి ఏ మాత్రం సరితూగకున్నా కంప్రమైజాషన్ సమస్యే లేదు.. ఆమె తాత్సారం చేయడం చూసి మేనేజర్ సున్నితంగా, మర్యాదగా హెచ్చరించాడు... “ప్లీజ్ మీరు ప్రారంభించండి.”

ఉలిక్కిపడిన స్మరణ చూపులు మరోసారి మాధవన్ వైపు తిరిగాయి.. అసహనంగా చూస్తున్నాడు. ఆ ఎక్స్ ప్రెషన్ కి ఆమె మొహం ఎర్రబడింది. వెంటనే చూపులు తిప్పుకుని గొంతు సవరించుకుంది. ఆ కదలికకి ఆమె చేతిలో ఉన్న మొబైల్ కింద పడింది. ఒంగి అది తీసుకుంది.

మాధవన్ మేనేజర్ ని దగ్గరకు పిలిచి ఏదో చెప్పాడు.. అతను తలాడించి వచ్చి, స్మరణ చేతిలో ఉన్న మొబైల్, భుజాన ఉన్న హ్యాండ్ బాగ్ అడిగి తీసుకుని ఒక పక్కగా పెట్టాడు. స్మరణకి అవమానంగా అనిపించింది.. ఆ క్షణంలో చేసేదేమీ లేక నెమ్మదిగా తన వివరణ ప్రారంభించింది.

ముందు అందరికీ అభివాదాలు చెబుతూ తడబాటుతో ప్రారంభం అయిన ఆమె స్వరంలో కొద్ది నిమిషాలు గడవగానే అప్రయత్నంగానే అంతులేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. రేడియోలో వార్తలు చదువుతున్నట్టు క్రమబద్ధమైన ఉచ్చారణతో, మధురమైన స్వరంతో చెప్పసాగింది.

****సశేషం****

Posted in June 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!