Menu Close
దేవత (కథ)
-- రాయవరపు సరస్వతి --

"ఆదిత్యగారూ మీకు కవలలు పుట్టారంట కదా కంగ్రాట్స్, అందులోకి ఇద్దరూ అబ్బాయిలేనట కదా" అన్నారు ఆఫీసు స్టాఫంతా.

“థాంక్సండీ ఇన్నాళ్లూ లీవులో ఉండటం వలన మీకీ విషయం చెప్పలేక పోయాను"

"విషయం చెప్పడం కాదండోయ్ మా అందరికీ మంచి పార్టీ ఇవ్వాలి ఆదిత్యగారూ" అన్నారు స్టాఫ్ మెంబర్స్ అంతా ఏకగ్రీవంగా.

"తప్పకుండా ఇస్తాను రేపు ఎవరూ కేరియర్స్ తెచ్చుకోకండి నేను మంచి లంచ్ ఏర్పాటు చేస్తాను" అన్నాడు ఆదిత్య సంతోషంగా.

మండల డెవలప్ మెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఆదిత్య. అతనికి వివాహం జరిగిన అయిదేళ్ల అనంతరం అతని భార్య సుమిత్ర ఒకేసారి అతనికి ఒకే కాన్పులో ఇద్దరు అబ్బాయిల్ని బహుమతిగా ఇచ్చి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

మర్నాడు ఆఫీసులో స్టాఫ్ మెంబర్స్ కు చికిన్ పలావుతో భోజన ఏర్పాట్లు చేసాడు ఆదిత్య. అతని ఏర్పాట్లకు స్టాఫ్ అంతా సంతోషించారు.

ఏడాది కాలం గిర్రున తిరిగి కాలగర్భంలో కలిసిపోయింది. సుమిత్రకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారికి రవీంద్ర, సురేంద్ర అన్న పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకో సాగారు.

నాలుగేళ్లు పూర్తవడంతో ఇంగ్లీషు మీడియం కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు. పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లడానికి సాయంత్రం తీసుకురావడానికి ఒక ఆటోను ఏర్పాటు చేసాడు ఆదిత్య.

ఒకరోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు దేవుడి దగ్గర పెట్టిన అరటి పండును తీసి ఇచ్చి ఇద్దర్నీ పంచుకోమంది సుమిత్ర.

"అమ్మా ఇది నాకే కావాలి తమ్ముడికివ్వను" అన్నాడు రవీంద్ర.

"అమ్మా అది నాకూ కావాలి. అరటిపండు అంటే నాకు ఇష్టమే" అన్నాడు సురేంద్ర అన్నయ్య చేతిలో పండును లాక్కుంటూ.

"ఇలా గొడవలు పడకూడదు నాన్నా మీరిద్దరూ అన్నదమ్ములు ఒక తల్లి పిల్లలు. ఏదైనా సమానంగా పంచుకోవాలి, చూడండి నేనిస్తాను" అంటూ రవీంద్ర చేతిలోనున్న అరటి పండును తీసుకొని రెండుముక్కలు చేసి ఇద్దరికీ చెరోముక్క ఇవ్వడంతో వాళ్లిద్దరూ నవ్వు ముఖాలతో తీసుకొని,

"మా మంచి అమ్మ" అంటూ తల్లికి రెండు చెంపల మీద ముద్దులు పెట్టేసారు.

పిల్లలిద్దరూ తెలివైనవారు కావడంతో చెప్పిన మాటను వెంటనే అర్ధంచేసుకుంటారు. స్కూల్లో కూడా అంతే. క్లాస్ లో వీళ్ళిద్దరికే ఫస్ట్, సెకెండ్ మార్కులు వస్తుంటాయి. ఇద్దరూ సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ రాసారు.

తండ్రి ఆదిత్య పిల్లలు చిన్నప్పటి నుంచీ ఇద్దరికీ ఒకే రకం దుస్తులు కొనివ్వడం అలవాటు చేసుకున్నారు.

"ఏంటి నాన్నా ఈ సంక్రాంతి కైనా మాకు వేరు వేరు రంగుల బట్టలు కొనివ్వొచ్చుగా ఎప్పుడూ ఒకటే కలర్ తెస్తారేంటి?" అన్నాడు చిరాగ్గా సురేంద్ర.

"అవునురా నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. మీరు నన్ను ప్రశ్నించకూడదు. మిమ్మల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు, మీరు నేను చెప్పిన మాట వినాలి ఎదురు చెప్పకూడదు, ఏదైనా ఇద్దరికీ సమానమే ఆహారమైనా, దుస్తులైనా, ఆస్థులైనా. ఇందులో తేడా ఏమీ ఉండదు" అన్నాడు ఆదిత్య వివరిస్తూ.

"సరే నాన్నా మీరూ, అమ్మా ఒకేలా మాట్లాడుతారు అలాగే మీరు చెప్పినట్లే వింటాము" అన్నాడు సురేంద్ర.

పదవ తరగతి పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఇద్దరికీ ఒకే స్కూటీ కొనిచ్చాడు ఆదిత్య.

"ఇదెవరికి నాన్నా?" అన్నారు రవీంద్ర, సురేంద్ర ఒకేసారి.

"ఇంకెవరికీ మీకేరా కాలేజీ లో జాయిన్ అయ్యారు కదా! ఇక నుంచీ ఇద్దరూ కలిసి దీనిమీదే కాలేజీకి వెళ్ళండి" అన్నాడు ఆదిత్య.

"అదేంటి నాన్నా ఇద్దరికీ చెరొకటి కొనివ్వొచ్చుగా ఇదికూడా ఒకటే అంటే ఎలా?"అన్నాడు రవీంద్ర.

"మీరిద్దరూ కలిసి వెళ్ళేది ఒకే కాలేజీకి కదరా రెండు బళ్ళెందుకు? పెట్రోల్ ఖర్చు దండగ. కాలేజీ దూరం కాబట్టి ఆటో కోసం వెయిట్ చేయడం ఎందుకని ఈ స్కూటీ కొన్నాను" అన్నాడు ఆదిత్య.

"సరేలేరా! ఇద్దరం దీనిమీదే వెళదాంలే, నేనొకరోజు, నువ్వొక రోజు డ్రైవ్ చేద్దాము" అన్నాడు రవీంద్ర.

"సరే అన్నయ్యా నువ్వెలా చెబితే అలా" అన్నాడు సురేంద్ర.

కాలేజీ చదువులు కంప్లీట్ అయ్యాక మరో నాలుగేళ్లకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యారు ఇద్దరూ.

తమ పుత్ర రత్నాల ప్రగతిని చూసి తల్లిదండ్రులుగా తెగ మురిసిపోయారు. ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు.

రెండేళ్ల కాలం గిర్రున తిరిగి కాలగర్భంలోకలిసిపోయింది.

పిల్లలిద్దరికీ యుక్త వయస్సు రావడంతో వారికి వివాహం చేయదలచారు తల్లిదండ్రులు. వీళ్ళల్లాగే కవలలను చూసి వివాహం చేయాలని నిశ్చయించారు. అప్పటి నుంచీ ఆదిత్య బంధువులకు, తమకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం చెబుతూ పెళ్లి సంబంధాలు చూడమని చెప్పారు.

ఆరుమాసాలుగడిచిపోయాయి. ప్రక్క ఊళ్ళో విశ్వనాథం మాస్టరు గార్కి ఇద్దరమ్మాయిలూ కవలలని అరవింద్ చెప్పడంతో భార్యతో సహా ముందుగా వాళ్ళింటికి వెళ్ళాడు ఆదిత్య.

విశ్వనాథం గారి భార్య అన్నపూర్ణమ్మ కాస్త మెతక మనిషి. "మా పెద్దమ్మాయి రాణి కూడా తల్లి లాగే మెతకగా కనిపిస్తుంది. ఆమెకు పెద్దగా చదువు అబ్బక పోవడంతో ఇంటర్ చదివి ఆపేసింది. ఆమె కాస్త నెమ్మదిగా ఉన్నా చెప్పినవన్నీ అర్ధం చేసుకుంటుంది, ఇక చిన్నమ్మాయి వాణి ఓ కంపెనీలోఇంజనీరుగా చేస్తోంది" అన్నారు విశ్వనాధం గారు.

"ఓ కే మాస్టారు! ఓ మంచిరోజు చూసి అబ్బాయిల్ని తీసుకు వస్తాము. ఇద్దరూ ఇంజనీర్లుగా జాబ్చేస్తున్నారు, పెళ్లయ్యాక మా కోడళ్లు జాబ్ చేయనవసరం లేదు. మా పిల్లలు మా మాట కాదనరు. ఏదో ఫార్మాల్టీ కోసం పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దాము" అని చెప్పి ఆదిత్యదంపతులు నిష్క్రమించారు.

మరో పది రోజుల్లో పిల్లలిద్దర్నీ తీసుకొని విశ్వనాథం మాస్టారు గారింటికి పెళ్లి చూపులకు బయలుదేరారు ఆదిత్య దంపతులు. పెళ్లి చూపులనంతరం "అమ్మాయిలిద్దరూ ఎలా ఉన్నారు మీకు నచ్చారా నచ్చకపోతే ముఖమాటం లేకుండా చెప్పేయండి ఇంకో సంబంధం చూస్తాము" అన్నారు ఆదిత్య దంపతులు.

"మాకైతే అభ్యంతరమేమీ లేదు బాగానే ఉన్నారు" అన్నారు ఇద్దరూ ఒకేసారి.

"సరే ఇకనుంచి నా ప్రయత్నాల్లో నేనుంటాను" అన్నాడు ఆదిత్య.

అందరూ విశ్వనాథం మాస్టారుగారి వద్ద శలవు తీసుకొని ఇల్లు చేరారు. మరో నెలరోజుల్లో ఓ శుభ ముహూర్తాన బంధుమిత్రుల సమక్షంలో పిల్లల వివాహాలు అంగరంగ వైభవంగా జరిపించారు ఆదిత్య దంపతులు.

కోడళ్లిద్దరూ అత్తగారింటికి కాపురానికి వచ్చేసారు.

ఇద్దరూ అత్తగారి మాటకు జవదాటక పోవడంతో సుమిత్ర మనసు కుదుట పడింది. వంట పనిలో అత్తగారికి సహాయ పడటం ఇంట్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా చూసుకోవడంతో ఇంటిల్లిపాది ప్రశాంతంగా ఉండసాగారు.

మూడుమాసాలు గిర్రున తిరిగి కాలగర్భంలో కలిసిపోయాయి.

రాణి నెల తప్పడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. పెళ్లయిన ఏడాదికల్లా మగ శిశువుకు జన్మనిచ్చింది రాణి.

దానితో చిన్నకోడలు వాణి కూడా పిల్ల తల్లి అవ్వాలన్న కోరిక సుమిత్రలో బలీయంగా ఏర్పడింది.

మరో మూడేళ్ళ కాలం కాల గర్భంలో కలిసిపోయింది.

పెళ్లయింది మొదలు చిన్న కొడుకు సురేంద్ర భార్యతో ముభావంగా ఉండటం గమనించిన సుమిత్ర కారణం తెలియక మదనపడసాగింది. కోడల్ని అడిగినా ఏమీచెప్పక పోవడంతో లోలోన ఆలోచించసాగింది.

ఇంట్లో ఈ విషయంపై అందరూ గుసగుసలాడుకోవడంతో వాణి మనసు వేదనకు గురయింది. పెళ్లయ్యాక ప్రతీ స్త్రీ తల్లినవ్వాలనే కోరుకుంటుంది, అలాగే తానూ కోరుకుంది, కానీ తన మనసును ఎవ్వరికి విప్పి చెప్పాలో అర్థంకాక సతమతమవుతోంది వాణి. భర్తతో సంతోషంగా ఉంటున్నట్లు అందరిలో నటించసాగింది. ఆమెకు తమ తొలిరాత్రి కనుల ముందు తారాడింది.

###

అది శోభనం గది. ప్రతి ఆడపిల్ల కోటి ఆశలతో ఆ గదిలోకి అడుగుపెడుతుంది. అందరిలాగే తానూ ఆశగా పాల గ్లాస్ తో గదిలోకి వెళ్ళింది. కానీ భర్త ఎంతకీ దగ్గరకు రాకపోవడంతో ఆమె సిగ్గు విడిచి అతని కోసం చుట్టూ చూసింది. కిటికీ దగ్గర సిగరెట్ కాల్చుతూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నట్లనిపించింది. గడియారంవైపు తొంగిచూసింది అది పదకొండు గంటల సమయాన్ని చూపిస్తోంది. ఇక నిలవలేక తన ఉనికిని అతనికి తెలియజేయడం కోసం చిన్నగా దగ్గింది.

అతను తిరిగి చూశాడే గానీ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. అగరొత్తులు కాలినుసి అయ్యాయి, సెంటు గుభాళింపు గదిలో నుంచి ఎప్పుడో ఎగిరిపోయింది. చేతి గ్లాసులో నున్న పాలు ఎప్పుడో చల్లారిపోయాయి. స్వీట్స్ మీదకు చీమలు చేరాయి. భర్త రాకకోసం గంటల తరబడి నిలబడిపోయింది వాణి.

ఆకాశంలో నక్షత్రాలు వింత కాంతులతో మెరిసిపోతున్నాయి. వాటిని అందుకోవడం ఎవరికి సాధ్యం? అనుకున్న సురేంద్ర మరో సిగరెట్  వెలిగించాడు. అది చూసిన ఆమె ముఖం చిన్నబోయింది. ఆమె కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. పెళ్లికి ముందు భవిష్యత్తు లో తనకు కాబోయే భర్త గురించి ఓ కన్నెపిల్లగా ఎన్నోకలలు కన్నది. అంతెందుకు ఈ గది లోకి వచ్చే ముందు కూడా భర్త గురించి, అతనితో గడపబోయే తీయని అనుభూతి గురించి తీయని కలలు కన్నది. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం తన ఊహకందనిది. ఒకవేళ అతనికి నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా లేక పెళ్లికి ముందే ఇంకెవరినైనా ప్రేమించారా? 'ప్చ్’ ఏమీ తెలియటం లేదే నిరాశతో ఆమె ఒడలంతా కంపించింది. మనసు నిస్సహాయంగా మూల్గింది. భర్త నిరాదరణతో అనుకోకుండా ఆమె కళ్ళు వర్షాన్ని కురిపించాయి.

కాసేపటికి చేసేది లేక మనసును తమాయించుకొని అడుగులో అడుగు వేసుకుంటూ భర్త దగ్గరకు వెళ్లి భుజం పై చేయి వేసింది. దానితో అతను తన చేతిలోనున్న సిగరెట్ ను కిటికీలోంచి బయటకు గిరాటేసేసాడు.

భార్య వైపు తిరిగి "హలో" అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూడలేక కళ్ళుదించుకుంటూ. ఆమె పలకరింపుగా జీవం లేని నవ్వు నవ్వింది.

'అబ్బా తన భార్య ఎంత అందాల రాశి' అనుకున్నాడు మనసులో. ఆమె వైపు తేరిపార జూస్తూ ఇంత అందం తన ముందు రాశి పోసి ఉన్నా తానందుకోలేని దురదృష్టవంతుడు.

ఆమె కళ్ళతోనే ప్రశ్నించింది. అందుకు బదులుగా తన భుజంపై నున్న ఆమె చేతిని సున్నితంగా తొలగించాడు.

ఆమె అతని ప్రవర్తనకు అయోమయంగా చూసింది. ఆమె అందించిన పాల గ్లాసు ను టేబుల్ మీద పెట్టి ఆమెకు పందిరి మంచం చూపించి తను మాత్రం ఒక దిండు తీసుకొని సోఫాలో నడుం వాల్చాడు. ఆమె పిచ్చిదానిలా అతని వైపు చూసింది. ఆమెకు భోరున ఏడవాలనుంది. ఇక చేసేది లేక నిరాశా నిస్పృహలతో మంచంపై వాలిపోయి కరువుతీరా ఏడ్చింది. ఎప్పటికో నిద్ర లోకి జారుకుంది.

సురేంద్రకు కంటి మీదకు కునుకురాలేదు. భార్య గంపెడాశతో గదిలోకి వచ్చి ఉంటుంది. తాను బ్రతికి ఉండిమాత్రం ఏం లాభం? అతని కనుకొలకుల్లో నుంచి నీరు చెంపల మీదకు జాలు వారింది.

తన భార్య దృష్టిలో తానొక అసమర్థుడిగా నిలిచిపోయుంటాడు. తను వివాహం చేసుకొని ఎంత పొరపాటు చేసాడు?

అతని మనసు గతంలోకి వెళ్ళిపోయింది.

"నేను పెళ్లి చేసుకోను" అన్నాడు సురేంద్ర తండ్రితో.

"ఈ పిల్లను చేసుకోవా లేక అసలు పెళ్లే చేసుకోవా?" అన్నాడు ఆదిత్య.

"నిజం నాన్నా నేనీ జన్మలో పెళ్లి చేసుకోను"

"కారణం?" నిలదీసాడు ఆదిత్య.

"పెళ్లంటే నాకిష్టం లేదు"

"నీకిష్టం లేకపోతే చెప్పవలసింది ఇప్పుడు కాదు అసలు పెళ్లి చూపులకే రాకూడదు. పోనీ వచ్చావు అయినా అప్పటికీ నీకిష్టం లేకపోతే నిశ్చితార్ధానికి ముందే చెప్పాలి" అన్నాడు ఆదిత్య.

"ఇప్పటికీ మించిపోయింది లేదు నాన్నా నాకిష్టం లేదని చెప్పేయండి" అన్నాడు సురేంద్ర.

"అది జరిగే పని కాదు నేను మాటిచ్చానంటే అది జరిగి తీరాలి" హూంకరించాడు ఆదిత్య.

"నేనూ పట్టుదలలో మీ కొడుకునే, నేను ససేమిరా చేసుకోనంటే అర్ధం చేసుకోరేం?"

"నూరు ఆరైనా, ఆరు నూరైనా ఈ రెండు పెళ్ళిళ్ళూ జరగవలసిందే, మళ్లీ ఇలాంటి కవలలు దొరకడం కష్టం, నీకంటే పెద్దవాడు చేసుకోగా లేంది నీకేమైందిరా ఇలాంటివన్నీ ముందే అనుకోవాలి. ఇలా పెళ్లిపీటల వరకూ వచ్చాక కాదు" అంది తల్లి సుమిత్ర.

"అదికాదమ్మా! మీకెలా చెప్పాలో నాకైతే అర్ధంకావటం లేదు. నాకు మాత్రం తెలియదా అమ్మా కానీ నాకీ పెళ్లి ఎంత మాత్రం ఇష్టం లేదు, ఆ తరువాత జరిగే అనర్ధాలకు నేను బాధ్యుడ్ని కాను ఇంతకంటే నేనేమీ చెప్పలేను ఇక మీకెలా ఇష్టమైతే అలా చేసుకోండి" అన్నాడు సురేంద్ర కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ.

గదిలోకి వెళ్లి మంచం మీద చిరాగ్గా వాలిపోయాడు సురేంద్ర అసహనంతో.

###

అందరిలో ఉన్నపుడు భర్తతో సంతోషంగా ఉంటున్నట్లు నటించిన వాణి ఒంటరిగా ఉన్నపుడు కుమిలిపోసాగింది.

ఒకరోజు పడక గదిలో తన భర్త తనతో "నేను నీకు జీవితంలో ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేను. నాకు సంసార సుఖం మీద వ్యామోహం లేదు నన్నర్ధం చేసుకో, ఇప్పటికైనా మించిపోయింది లేదు నాకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకో " అన్నాడు సురేంద్ర.

'ప్చ్' అలా మాట్లాడకండి. నేను మిమ్మల్ని అర్ధం చేసుకోగలను. పెళ్లికి ముందే మీరు వేరే అమ్మాయిని ప్రేమించి ఉంటారు ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో ఇంత నిరాశకు గురవుతున్నారు. ఈ పెద్దలు అంతేనండి పిల్లల్ని అర్ధం చేసుకోరు, సాంప్రదాయాలు, చట్టుబండలని పట్టుకొని వ్రేళ్లాడతారు వీళ్ళు ఎప్పటికి మారుతారో కానీ నేనైతే మీకు డైవర్స్ ఇవ్వలేను. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నన్ను ఎప్పటికీ భార్యగా అంగీకరించకపోయినా నేను మీ భార్యగానే ఉండిపోతాను" అంది వాణి.

"అది కాదు మన విషయం తెలిస్తే నా తల్లిదండ్రులు తట్టుకోలేరు" అన్నాడు సురేంద్ర.

"మీకేనా ఉన్నది తల్లిదండ్రులు నాకూ ఉన్నారు వాళ్ళు బాధపడితే నేనూ తట్టుకోలేను, కూతురు జీవితం ఇలా అయిందని తెలిస్తే వాళ్ళూ తట్టుకోలేరు. ఈ విషయం ఎవరికీ తెలియనీయకుండా మన మధ్యే గుట్టుగా ఉండాలి" అంది.

"మరి నీకు మాతృత్వం మీద మమకారం లేదా?"

"ఎందుకుండదూ అది ఆడదాని జన్మహక్కు దానికో ఉపాయం ఉంది చెబుతాను అదీ మీకు సమ్మతమైతే" అంది వాణి.

"ఏంటదీ?"కుతూహలంగా అడిగాడు సురేంద్ర.

"మీ అన్నయ్యగారి పిండోత్పత్తి కణాలు నా గర్భాశయంలోకి ఇంజక్ట్ ద్వారా ప్రవేశపెడితే నేను తల్లిని కావచ్చు. అదీ డాక్టర్ ద్వారానే సాధ్యం" అంది వాణి.

"నిజంగానా! అయితే అన్నయ్యతోను, అమ్మా నాన్నలతోనూ మాట్లాడుతాను. ఇది మనింట్లో తప్పితే లోకానికి తెలియదు, తెలియకూడదు" అన్నాడు సురేంద్ర.

"నేనొకమాటాడగనా?" అంది వాణి.

"ఏంటదీ?"

"మీకు బదులు నాలోనే పిల్లలు పుట్టే యోగం లేదనుకోండి. అప్పుడు మీరు నాకు విడాకులిచ్చేసి మరో వివాహం చేసుకునేవారా?" అంది వాణి.

"లేదు వాణీ, నేనెప్పటికీ అలా చేయను. నీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. నీ మనసు చాలా పెద్దది, యోగ్యుడైన  భర్త ఉండగానే అతని కళ్ళు గప్పి పరాయి వాళ్ళతో తప్పుదారి పట్టే భార్యలున్న నేటిసమాజంలో నీలాంటి ఉత్తమురాలు నా భార్యగా లభించడం నా పూర్వజన్మసుకృతం. నిజంగా నువ్వు నా పాలిట దేవతవు" అంటూ సురేంద్ర భార్యను బిగియారా తన కౌగిలిలో బంధించాడు.

********

Posted in May 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!