మహా భాగవతంలో కధ ఇది. కృష్ణుడు తన మనుమడైన అనిరుద్ధుణ్ణి రక్షించడానికి శోణపురంలో ఉన్న బాణాసురుడిమీదకి దండెత్తి వెళ్తాడు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు. ఆ యుద్ధంలో వైష్ణవ జ్వరం అనేదాన్ని కృష్ణుడు ప్రయోగిస్తాడు, బాణాసురుడు వేసిన శివజ్వరం అనే అస్త్రానికి ప్రతిగా. ఈ కధ, జ్వరం అనే అస్త్రాలు ఎందుకు గుర్తొచ్చాయంటే గత ఏడాది చివర్లో ప్రపంచం మీద విరుచుకుపడిన ఇటువంటి అస్త్రమే కరోనా. ఇది ఎలా మొదలైంది అనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియకుండా ఉంది. వచ్చినది ప్రయోగశాలలోంచి కావొచ్చు, లేదా మాంసం విక్రయించే చోటు కావచ్చు అంటున్నారు. నిజంగా ప్రయోగశాలలోంచి వస్తే అదెలా తయారు చేసారో, దేనికోసం తయారు చేసారో అవన్నీ చెప్తే, భంగపాటూ, ఇటువంటి జీవ మారణాయుధాలు తయారుచేస్తున్నారేమో అని ప్రపంచం అనుకోవచ్చు.
ఈ కరోనా సోకిన మొదటి పేషెంట్ జీరో ఎవరో తెలిస్తే – అంటే మొట్టమొదట ఎవరు ఏమి చేస్తే – ఈ వైరస్ పశుపక్ష్యాదులలోంచి మనిషి మీదకి పాకిందా, లేబ్ లో తయారు చేయబడినదా, అనేది తెలిస్తే మరింత సులభంగా దీనికి నివారణ కనిపెట్టవచ్చుట. ప్రస్తుతానికి వస్తే ఓ రెండు మూడు టీకాలు వచ్చాయి మరికొన్ని వస్తున్నాయి. అయితే ఆ టీకా ఎంతమందికి నచ్చుతుంది, నచ్చినా, నచ్చచెప్పినా వేయించుకుంటారో, మామూలు జనాల దగ్గిరకొచ్చేసరికి ఎంతకాలం పడుతుందో తెలియదు. చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు మన కర్మానికి మనని వదిలేసి ఈ రాజకీయ నాయకులు వాళ్ల ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ, కరోనా ఇంతింతై వటుడింతయై అంటూ విజృంభించడం మానలేదు. వేసవిలో తగ్గిపోతుందిలే, దానికదే పోతుందిలే అనే పెద్దమనుషులకి నోటమ్మట మాటలేదు. అయితే ఇప్పటికీ ఎవరూ కూడా ఈ కరోనాని అంత పెద్ద రోగంగా పరిగణించినట్టూ కనిపించదు. టివిలో వీరూ, వారూ, గవర్నమెంట్ వారూ ఎంత మొత్తుకున్నా “నేను మాస్క్ కట్టేసుకున్నాను కనక ఎలా వెళ్ళినా ఫర్వాలే”దనుకునే జనం కోకొల్లలుగా ఉన్నారు. వీళ్లలో మరి కొందరు ఘనాపాఠీలు మాస్క్ వేసుకోరు, ‘మా ఇష్టం, నీ చేతనైంది చేసుకో’ అనే టైపు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు కదా, అందువల్ల వీళ్లని మనం ఏమీ చేయలేం; వాళ్లతో దూరంగా మసులుతూ మన జాగ్రత్తలో మనం ఉండడం తప్ప. సామాజిక బాధ్యత అనే పదానికి మనం కట్టుబడి ఉన్నాం మరి.
అన్నట్టు అసలు కధ చెప్పలేదు కదూ, నేను అక్టోబర్ చివరి వారంలో (29 న) కరోనా వాత పడ్డాను. దీని సంగతి చెప్పేముందు కొన్ని వివరాలు. మేము ఉండేచోటూ, పనిచేసే పనీ వల్ల మాకు కరోనా అంటుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని మొదటినుండీ అనుకుంటున్నదే. అయితే మార్చ్ 2020 నుండీ ఇంట్లోంచే పని. రోజూ చేతులు కడుక్కోవడం, బయటకి వెళ్తే చేతులకి, శానిటైజర్ రాసుకోవడం అదీ తప్పనిసరిగా చేస్తూనే ఉన్నాం. ఏ నాడూ అజాగ్రత్తగా లేము. అయితే ఈ కరోనా నేను, ఇంట్లో మిగతా వారికి లేక ఎవరు ఎవరికి అంటించారు అనేది మాకు ఇతమిత్థంగా తెలియలేదు. ఓ సారి అంటుకున్నాక తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా అనేది అనవసరం కదా? నా/మాకు మ-కీ-ర అనే వ్యాధులు కానీ మరోటి కానీ లేవు. మ-మధుమేహం, కీ-కీళ్లనెప్పులు, ర-రక్తపోటు. ఉన్నంతలో వ్యాయామం చేయడం, కాస్త సరైన ఆహారం తీసుకోవడం అలవాట్లు. కరోనా వచ్చినప్పటి నుండి ఏమి జరిగిందనేది రాసి ఉంచాను ఏ రోజుకారోజు ఎవరికైనా పనికి వస్తుందేమో అని; ఈ వ్యాసం అలా రాసి ఉంచిన దాన్నుంచి తయారు చేసినదే.
అక్టోబర్ 29 గురువారం – పొద్దున్నే తెల్సిన విషయం. మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పారు, “అమ్మా మీకు పాజిటివ్ వచ్చింది. కావాలిస్తే మరో రెండు గంటల్లో మరో సారి రాపిడ్ టెస్ట్ చేసి చెప్తాం.” నేను మా అబ్బాయిని స్కూల్లో దించడానికి బయల్దేరుతున్నాను. కాస్త మనసులో సంఘర్షణ. ఇప్పటికే కుర్రాడికి పాజిటివ్ అయితే స్కూల్లో అందరికీ అంటుకోవచ్చు. రెండో టెస్ట్ లో మా ఆవిడకి నెగటివ్ అయితే? సరే ఏదైతే అదే అవుతుంది. మొదట కుర్రాణ్ణి స్కూల్లో దించుదాం. రెండో టెస్ట్ లో మా ఆవిడకి పాజిటివ్ అయితే వెంఠనే వాణ్ణి వెనక్కి తీసుకురావొచ్చు. 10 గంటలకి చెప్పిన విషయం. రెండో టెస్ట్ లో కూడా మా ఆవిడకి పాజిటివ్. ఒక్కసారి ఉరుకులు పరుగులతో స్కూల్ కి బయల్దేరి కుర్రాణ్ణి అమాంతంగా బయటకి తీసుకొచ్చాను, కారణం చెప్పకుండా. తర్వాత చేయాల్సిన పని వెంఠనే నేనూ, కుర్రాడు కల్సి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం. అన్నింటికీ కంగారు, ఇదంతా ఎటు తిరిగి ఎటు వస్తుందో అని.
ఓ గంట గూగిలమ్మ మీద వెదికాక తెల్సిన విషయం – ఒక మైలు దూరంలో క్లినిక్ ఉంది. వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. ఓ అరగంట తంటాలు పడ్డ తర్వాత ఇద్దరం కల్సి బయల్దేరాం. టెస్ట్ 11:30 గంటలకి. వెళ్ళాక తెల్సిన విషయం – నన్ను ముట్టుకోకు నా మాలకాకీ - అన్నట్టూ కార్లోంచి బయటకి వెళ్ళరాదు. మా ఆఫీసులోకే రావద్దు. అక్కడే కూర్చోండి మేమే వస్తాం టెస్ట్ కిట్ పట్టుకుని మీ దగ్గిరకి. మీకు ఏదైనా కావాలిస్తే ఇదిగో ఫలానా నెంబర్ కి మెసేజ్ పంపండి. 12, 12:30, ఎవరూ పత్తా లేకపోయేసరికి మరోసారీ, మరోసారీ, మరోసారీ మెసేజీలు పంపిస్తూనే ఉన్నాం. హమ్మయ్యా, వచ్చినావిడ టెస్ట్ చేసేస్తుందనుకునేలోపు మీ పేరు ఇదేనా, మీరు పుట్టిన తేదీ ఇదేనా, అంటూ సవా లక్ష ప్రశ్నలయ్యాక మరో హామీ – ఒక్క క్షణం అగండి, ఇప్పుడే టెస్ట్ కిట్ పట్టుకుని వస్తాను.
మరో అరగంటకి సమయం 2:30. పొద్దున్న 11:30 వచ్చిన మేము మూడు గంటలు అలా కుస్తీ పడుతూ కూర్చుని లోలోపల ఏడుస్తూ కూర్చున్నాం. అప్పటికి బయటకొచ్చిన నర్సమ్మ గారు మరో పదిహేను నిముషాలకి టెస్ట్ అయిందనిపించాక చెప్పిన విషయం. ఈ కాయితం మీద రాసి ఉన్న వెబ్ సైట్ లో మూడు నుంచి అయిదు రోజుల్లో మీ టెస్ట్ రిజల్ట్స్ చూసుకోండి. మా క్లినిక్ ని వాడుకున్నందుకు ధన్యవాదాలు.
అక్టోబర్ 29 సాయంత్రం – కాళ్ల నెప్పులు, చలి చలి చలి చలి చలి. జ్వరం లేదు. మోకాళ్లలో సూదులు గుచ్చినట్టూ నెప్పులు. మోకాళ్ల కింద నుంచి పాదాల దాకా సలుపు. గొంతులో గర గర. ఓ బనియన్, పైన రెండు చొక్కాలు, ఆ పైన ఒక స్వెటర్, వేసుకున్నా చలి చలి చలి వణికిచ్చేస్తోంది. ఇది కరోనాయేనా లేదా మూడూ గంటలు చలిలో కార్లో వెయిట్ చేసినందుకా? ఇంట్లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ మీటర్ లో లెవెల్ 97, 99 చూపిస్తోంది. కరోనా కాకపోవచ్చులే అనే ఆనందం. సంతోషం ఏమిటంటే కుర్రాడికి ఏమీ లేదు. అయినా స్కూల్ కి పంపడానికి లేదు. వచ్చే వారానికి ఎలాగా ఎలక్షన్లు వస్తున్నాయి కనక స్కూల్ మూసేస్తారు.
అక్టోబర్ 30 శుక్రవారం – పొద్దున్నే లేచేసరికి జ్వరం లేదు. కొంచెం దగ్గు. వదలని చలి; దాని వల్ల స్నానం చేసే సీన్ లేదు. ఇంట్లోంచి పని. మధ్యాహ్నానికి మరింత చలి. ధర్మామీటర్ 98 చూపిస్తూనే ఉంది. ఆక్సిజన్ 98. కరోనా కాదేమో అని అనుమానం. సాయంత్రానికి కాస్త శ్లేష్మంతో కూడిన దగ్గు. కరోనా అయితే జ్వరం, నీరసం, పొడి దగ్గు రావాలే? ఇంట్లో ఉన్న ఒక ఎమోక్సిసిలిన్, రెండు టెలెనాల్ టాబ్లెట్లు మింగడం.
అక్టోబర్ 31 శనివారం – పొద్దున్నే క్లినిక్ వారిచ్చిన వెబ్ సైట్ చూస్తే తెల్సిన విషయం. నా టెస్ట్ పాజిటివ్. కుర్రాడిది నెగటివ్. ఇప్పటినుండీ జాగ్రత్తగా ఉండాలి. ఊపిరి తగ్గుతుందా, హార్ట్ ఎటాక్ వస్తుందా? రుచీ పచీ వాసనా పోతాయా అనే వన్నీ ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలు. అసలీ టెస్ట్ ఫాల్స్ పాజిటివ్ అవ్వొచ్చా, నాకు నిజంగా ఏమీ కారణం లేదు పాజిటివ్ రావడానికి అనే ఊహలు. ఎక్కడి కెళ్ళినా జాగ్రత్తగా ఉన్నానుగా అనే మనసులో ధీమా. సాయంత్రానికి దగ్గు; జ్వరం మాత్రం లేదు. వదలని చలి మాత్రం ఏడిపిస్తూనే ఉంది. కాలెండర్ చూసుకుంటే తెలిసిన విషయాల ప్రకారం 14 రోజులు గడవగానే కాస్త తెరిపిన పడినట్టే. మళ్ళీ ఒక ఎమోక్సిసిలిన్, రెండు టెలెనాల్ టాబ్లెట్లు.
నవంబర్ 1, ఆదివారం – ఈ రోజు కాస్త తెరిపి ఇచ్చాక నిర్ణయించుకున్న విషయం - ఇంక మందులు వాడరాదు. శరీరం దాని శక్తిని పెంచుకోనివ్వడమే ఉత్తమం. మహా అయితే బాగా తట్టుకోలేనప్పుడు మాత్రలేసుకోవచ్చు తర్వాత. ఇంట్లో హీటింగ్ ని 72 డిగ్రీలకి పెట్టినా నగ్నంగా ఐసు మీద పడుకున్నంత చలి. దగ్గు అప్పుడప్పుడూ. గొంతు నెప్పి కొత్తగా. వాసనా, రుచీ అన్నీ బాగానే ఉన్నై.
నవంబర్ 2 సోమవారం – పొద్దున్నే రొంప కొత్తగా వచ్చి చేరింది. అయిదు నిముషాలకోసారి చీదడం, టిస్యూ వాడకం. అది ఎవరికీ అంటుకోకుండా చూసుకోవడం. సాయంత్రానికి రోజూ వంటినెప్పులూ, నీరసం. మామూలుగా భోజనం. తాగేది మాత్రం వేడి నీరు మాత్రమే. డోకులూ, డైయేరియా, జ్వరం అటువంటివేమీ లేవు. కింది దవడ, ఎడమచేయి కొంచెం వాపు, నెప్పి. ఇది హార్ట్ కి సంబంధించినదా అనే అనుమానం. మధ్యాహ్నం 12 కి విపరీతమైన నీరసం. అర్ధరాత్రి వచ్చిన మెలుకువలో డోకు వచ్చే స్థితి ఓ పది నిముషాలు. డోకు మాత్రం రాలేదు.
నవంబర్ 3 మంగళవారం – ఎలక్షన్ల రోజు. జ్వరం వచ్చినట్టే ఉంది ఈ రోజు. వంటి నెప్పులూ మిగతా బెల్స్, విజిల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. వదలని రొంప. చీదితే కాస్త రక్తంతో శ్లేష్మం. కుర్రాడికి కరోనా అంటుకున్నట్టే – జ్వరం 102, 103 చూపిస్తోంది ఈ రోజు. టెలెనాల్ వాడాము వాడికి. రాత్రి చలికి తట్టుకోలేక హీటెడ్ బ్లాంకెట్ వాడటం; అదీ ఐదు రకాల బట్టలూ కోటూ వేసుకున్నాక కూడా అంటార్కిటికాలో వంటిమీద బట్టల్లేకుండా ఐసు మీద పడుకున్నంత చలి.
నవంబర్ 4 బుధవారం – తలనెప్పి, సైనస్ నెప్పులు, వదలని అంతులేని వణుకు. ఫ్రీజర్ లో పెట్టినట్టూ చలి; అయిదు పొరల బట్టలూ కోటు వేసుకుని చుట్టూ దుప్పటి కప్పుకున్నా సరే చలి. తగ్గిపోయిందనుకున్న గొంతుక నెప్పి మళ్ళీ వచ్చింది. దగ్గినా మాట్లాడినా గొంతుకలో మొత్తం 360 డిగ్రీలలో నెప్పి. గొంతులో గర గర గర. అసలు నాకు వచ్చింది మామూలు ఫ్లూ, స్ట్రెప్ త్రోట్ ఇన్ఫెక్షన్ అయిండొచ్చేమో? కరోనా వస్తే ఈ పాటికేదో అయిండాలి కదా అనే వదలని అనుమానం.
నవంబర్ 5 గురువారం – నిజంగా కరోనా వచ్చినట్టు తెల్సింది ఈ రోజు రాత్రి నిద్రలో. పడుకున్న చోట కంపు – మొహం తడిసిన గుడ్డలో పెట్టినట్టూ, నాచు వాసన. ఈ వాసన తలగడ మీదనుంచా, లేదా పక్కనే పెట్టిన నీళ్ళ బాటిల్ వలికిపోయి వచ్చిందా అనేది లేచి చుట్టూ చూస్తే అటువంటివి ఏదీ లేదు. వాసన అలాగే ఉంది. మరో పక్కకి దుప్పటి లాగి పడుకున్నా అదే వదలని వాసన. ఈ వాసన వదిలించుకోవడానికి తల దగ్గిరే ఉంచుకున్న అమృతాంజనం మూత తీసి వాసన చూస్తే తెల్సిన విషయం. వాసన పూర్తిగా పోయింది. లేచి బాత్రూం లోకి వెళ్ళి అక్కడున్న గిల్లెట్ వారి ఆఫ్టర్ షేవ్ సీసా మూత తీసి వాసన చూసాను. ఏమీ తెలియడం లేదు. ఆ పక్కనే ఉన్న వెనెగర్ బాటిల్ మూత తీసి ముక్కు దాని మీద పెడితే? ఏమీ వాసన లేదు. గుండె గుభేల్! రాబోయేది రుచి పోవడమా? లేదా ఇప్పటికే పోయిందా? వదలని నాచు వాసన. ఇప్పటికి తెల్సినదేమంటే ఆ వాసన వస్తున్నది నా ఊపిరి తిత్తుల్లోంచి కనక అప్పుడే వదలదు. అమృతాంజనం వాడడం అనవసరం, వాసనే తెలియట్లేదు కనక. కుర్రాడు, మా ఆవిడా మరో సారి రాపిడ్ టెస్టింగ్ కి వెళ్ళారు. కుర్రాడికి ఇప్పుడు పాజిటివ్, మా ఆవిడ కి నెగటివ్. ఆవిడ కోలుకున్నట్టేనా?
నవంబర్ 6 శుక్రవారం – పొద్దున్నే జ్వరం, దగ్గూ, చలీ లేవు. వాసన ఏమీ లేదు. రెండో స్టేజ్ లోకి వచ్చి ఉండొచ్చు. మధ్యాహ్నానికి మళ్ళీ చలి, నీరసం. ఆక్సిజన్ మాత్రం 99, 100 దగ్గిర ఉంది. కుర్రాడికి జ్వరం మాయం. గొంతు నెప్పికి వాడికి డే క్విల్ అనే మందు రెండుసార్లు. పొద్దున్నే కాఫీ తాగుతుంటే తెల్సిన విషయం, కాఫీ కి వాసన లేదు. రుచి తెలుస్తోంది.
నవంబర్ 7 శనివారం – చలి తగ్గుతున్నట్టే; వాసన పూర్తిగా లేదు. దూరంగా ఉండే బాత్రూంలో ఎవరైనా ఆఫ్టర్ షేవ్ వాడితే వేరే గదిలో వాసన పట్టగలిగే నాకు, అమృతాంజనం సీసా ముక్కుకి మిల్లీమీటర్ దగ్గిర్లో పెడితే ఏమీ వాసన లేదు. రాత్రి మాత్రం పడుకున్నప్పుడు నాచు వాసన వదలడం లేదు. అది బయటనుండి వచ్చే వాసన కాదు కనక చేసేదేం లేదు. గూగిలమ్మ చెప్పడం ప్రకారం మరో రెండువారాలక్కానీ వాసన మళ్ళీ తెలియకపోవచ్చు. కాఫీ తాగుతుంటే వేణ్ణీళ్ళు తాగుతున్నట్టు అనిపించడం. కుర్రాడికి జ్వరం, దగ్గూ ఏమీ లేవు. కరోనా పిల్లలని ఏమీ చేయదని చెప్తున్నట్టూ వాడికి బాగానే ఉన్నట్టుంది.
నవంబర్ 8, ఆదివారం – సాయంత్రానికి మామూలుగా వ్యాయామం చేయగలిగాను. జ్వరం, చలి లేవు. గొంతులో గర గర తగ్గలేదు. ఊపిరితిత్తులలో ఏదో కుళ్ళి తడిసిన గుడ్డ, లేదా నాచు వాసన అలాగే ఉంది.
నవంబర్ 9, 10, సోమ, మంగళ వారం – కొంచెం చలి గొంతు గర గర అలాగే ఉన్నై. మాట సరిగ్గా రావడం లేదు గొంతు గర గర వల్ల. గొంతు నెప్పి అలాగే ఉంది. మరో రెండు రోజుల్లో వచ్చే ఏకాదశి కి 14 రోజులు పూర్తవుతాయి. తగ్గినట్టేనా? లేదా తగ్గినట్టే తగ్గి తిరగబెడుతుందా?
నవంబర్ 11 – 15 బుధవారం/ఆదివారం – మరోసారి గొంతునెప్పి, మళ్ళీ ఒక ఎమోక్సిసిలిన్, రెండు టెలెనాల్ టాబ్లెట్లు. రొంప వచ్చినట్టే వచ్చి పోతున్నట్టే పోతోంది. రాత్రి మళ్ళీ అదే కంపు. వాసన ఏమీ తెలియడం లేదు. రుచి మాత్రం తెలుస్తోంది. బయటకి వెళ్ళే స్థితి ఇంకాలేదు.
నవంబర్ 16 కార్తీక సోమవారం – కొంచెం గా వాసన తెలుస్తోంది కుడివైపు. ఎడమ వైపు బాగా సైనస్ నెప్పులు, రాత్రి అమృతాంజనం బాటిల్ వాసన చూస్తే బాగానే ఉంది. తగ్గుతున్నట్టే అని సంతోషం.
నవంబర్ 17-19 మంగళ – గురువారాలు – జ్వరం లేదు, వంటి నెప్పులూ, మోకాళ్ల, కాళ్ల నెప్పులూ అన్నీ పోయినట్టే. సైనస్ నెప్పులూ లేవు, వాసన దాదాపు 70 శాతం వచ్చినట్టే. ఆఫ్టర్ షేవ్ బాటిల్ శానిటైజర్ వాడితే, ఆవకాయ సీసా దగ్గిరా వాసన బాగా తెలుస్తోంది. సంతోషం. అప్పుడప్పుడూ వచ్చే రెండు మూడు క్షణాల తడి వాసన మాత్రం వదలడం లేదు. శుక్రవారం మరో సారి టెస్టింగ్ కి వెళ్తున్నాం. జ్వరం ఒకరోజు, మరో రోజు గొంతుక నెప్పి తప్ప ఇంకేమీ లేవు కుర్రాడికి. ఏ రోజునైతే వాణ్ణి స్కూల్లోంచి బయటకి తీసుకొచ్చానో (అక్టోబర్ 29) ఆ రోజునుండీ అందరికీ ఆన్ లైన్ లోనే పాఠాలు చెప్తున్నారు.
నవంబర్ 20 శుక్రవారం – టెస్టింగ్ చేసారు. మూడు రోజులకి రిజల్ట్స్ వస్తాయిట. గొంతు గర గర ఇప్పటికీ తగ్గలేదు.
నవంబర్ 23, సోమవారం – టెస్ట్ చేసినవాళ్ళ దగ్గర్నుంచి ఏమీ సమాధానం లేదు. జ్వరం, గిరం, ఏమీ లేవు. రాత్రికి కొంచెం చలి మరోసారి; ఒక టెలెనాల్ తో తగ్గింది. రోజువారిగా హాల్స్ టాబ్లెట్ చప్పరిస్తున్నాం, గొంతుక నెప్పికి. తగ్గినట్టే ఉంది.
నవంబర్ 24 మంగళవారం – ఈ రోజు ఫోన్ వచ్చింది. నాకూ మా ఆవిడకి ఇంకా పాజిటివ్ ట. ఇదెక్కడి గోల. CDC వారు చెప్పడం ప్రకారం 14 రోజుల తర్వాత తగ్గినట్టే, ఇతరులకి అంటిండం కుదరకపోవచ్చు. అప్పటికి పూర్తి స్వస్థత. మరి మాకు అక్టోబర్ 29 న వచ్చిన కరోనా 27 రోజులకి ఇంకా పాజిటివ్ అని ఎలా వచ్చింది? మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? ఇంతకీ ఇప్పుడు మేము నిజంగా పాజిటివ్ లేదా నెగటివ్ అనేది ఎలా తెలుస్తుంది? మరోసారి హాల్స్ టాబ్లెట్ గొంతుక నెప్పికి.
నవంబర్ 25-27 బుధ-శుక్రవారం – వదలని గొంతుక నెప్పి, ఆవిడకి కొన్ని వంటి నెప్పులూ, దగ్గు. థేంక్స్ గివింగ్ కి మామూలుగా ఉన్నట్టే లెక్క. ఆవిడ పనిలోకి వెళ్తోంది.
నవంబర్ 28 శనివారం – మరోసారి అర్జంట్ కేర్ కి వెళ్ళాం. ఎక్స్-రే ఇసిజి తీసి అంతా బాగానే ఉందని చెప్పారు. వంటిమీద నెప్పులూ, దగ్గు ఎక్కడనుంచి వస్తున్నాయో తెలియదు(ట). ఊపిరి తిత్తులలో, గుండెలో ఏమీ లోపం కనబడలేదని కొంతవరకూ మనఃశ్శాంతి.. నాకు వాసన బాగా వచ్చినట్టే – 90% వరకూ.
డిసెంబర్ 1 మంగళవారం – మరోసారి టెస్టింగ్ కి వెళ్ళాం. మళ్ళీ రెండ్రోజులు వేసారి చూడ్డం. ఈ సారి తప్పకుండా నెగటివ్ వస్తుందనే ధీమా.
డిసెంబర్ 3, గురువారం. మళ్ళీ పాజిటివ్ ట రిజల్ట్స్. ఇప్పుడు తెల్సిన విషయం ప్రకారం ఒకసారి కోవిడ్ వచ్చాక రోగం లక్షణాలు తగ్గాక (14 రోజులకి) మరో మూడు నెలల్లో ఎప్పుడు టెస్ట్ చేసినా పాజిటివ్ రావచ్చు. అందువల్ల CDC వారు ఉవాచ – మరో 90 రోజుల్లో టెస్ట్ చేయించ వద్దు. అదీ సంగతి.
డిసెంబర్ 4, శుక్రవారం – కుర్రాణ్ణి డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళాం ప్రతీ ఏడూ చేసే ఫిజికల్ కోసం. అంతా బాగుంది, ఫ్లూ షాట్ ఇచ్చారు. డాక్టర్ (ఈయనే ఇంతకు ముందు కుర్రాడికి కరోనా టెస్ట్ చేసాడు) అనడం ప్రకారం కరోనా వచ్చి నెలదాటింది కనక ఇంకేమీ ఆదుర్దా లేదు. అయినా జాగ్రత్తలో ఉండడం మంచిది.
మొత్తానికి ఇదీ ఇప్పటివరకూ మా ప్రహసనం. ముగించే ముందు కొన్ని విషయాలు చెప్పనివ్వండి. కరోనా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. మాకు జరిగినట్టూ మీకు జరగాలని ఎక్కడా లేదు కానీ కరోనా వచ్చినవాళ్లలో 80-90 శాతం కోలుకుంటున్నారు. కానీ కరోనా కాటు వేస్తే ఓ రెండు మూడు వారాలు ఈ నరకం అనుభవించవల్సిందే. కొంతమందికి రుచీ వాసనా పోవచ్చు. మరికొంతమందికి హార్ట్ ఎటాక్ రావొచ్చు మరి కొంతమంది కిడ్నీలు పాడవ్వొచ్చు. మరి కొంతమంది హాస్పిటల్లో జేరాక వెంటిలేటర్ మీద ఉండొచ్చు. ఎవరికి వారే యమునా తీరే. నాకు జరిగినది చూసుకుంటే మాకు “వైరల్ లోడ్” తక్కువగా తగిలి ఉండొచ్చని అనుకుంటున్నాము. నాకు వాసన పోయినట్టు మా ఆవిడకి, మా అబ్బాయికి పోలేదు. ఒకే ఇంట్లో ఉన్న మాకు ఇంత తేడాగా ఉంటే ఒకరికీ మరొకరికీ తేడా ఉండడానికి ఆశ్చర్యం లేదు కదా? అయితే కొన్ని నాకు తట్టిన విషయాలు ఇవి రాస్తున్నాను.
మొదటిది కరోనా అని తెలియగానే మరీ అంత కంగారు పడవల్సిన పనిలేదు. అది ప్రాణాంతకం కాకపోవచ్చు (అవ్వొచ్చు కూడా). చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడడం, మొహానికి మాస్క్ వాడడం తప్పనిసరిగా చేయండి. దానివల్ల కరోనా తగ్గకపోవచ్చు కానీ కనీసం అవతలి వాళ్ళకి అంటించే ఛాన్సు తక్కువ. అలా కరోనా వ్యాప్తి చెందకుండా చేయవచ్చు. కరోనా వచ్చాక 14/20 రోజులకి మామూలుగా తిరగవచ్చు అంటున్నారు. అయినా ఒకసారి వచ్చాక మరో మూడు నెలలకి మళ్ళీ రావచ్చని ఒకరూ, ఇంకెప్పుడూ రాకపోవచ్చనీ మరొకరూ అంటున్నారు. వీటి కధాకమామీషు ముందు ముందు పరిశోధనల్లో తేలేదాకా ఏమీ చెప్పలేము. రెండోది, కరోనా వస్తే తిండి విషయం లో కాస్త జాగ్రత్త అవసరం, కడుపులో 1/4 వంతు మాత్రమే తినడం మంచిది. ఒక్కొక్కప్పుడు డయేరియా, ఉబ్బరం అవీ రావొచ్చు. మీకు కానీ మ-కీ-ర అనేవి ఉంటే మరింత జాగ్రత్త అవసరం. వేడి చేసిన నీరు మాత్రమే తాగండి. అందులో తులసి ఆకులూ అవీ వేసినా మంచిదే. వాట్సాప్ లో ఇండియా నుంచి కొంతమంది కషాయాల రెసిపీ లు పంపుతున్నారు. అవి ఎంతవరకూ పనిచేస్తాయో తెలియదు. అవి మూలికలతో ఇంట్లో ఉండే పోపు సామానులతో చేసేది అయితే అపాయం కాకపోవచ్చు, ఉపయోగం కాకపోయినా. మూడోది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరెంత జాగ్రత్తగా ఉన్నా కరోనా అంటుకోవచ్చు. దానికెవరం ఏమీ చేయలేము. ఒకసారి వస్తే శరీరం మీకెమని చెప్తోందో గమనించి తీసుకోండి. మందులతో ఫలితం ఉండకపోవచ్చు ఎందుకంటే కరోనాని ప్రతిఘటించే మందు ఇప్పటివరకూ (రా)లేదు. కొంతమంది వెర్రిపీనుగులు క్లోరోక్వీన్ పనిచేస్తుందని చెప్తున్నారంటే అది అతి హేయమైన పనికిరాని సలహా మాత్రమే. ఆస్త్మా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు; దగ్గిరే పీల్చే నెబ్యులైజర్ అవీ ఉంచుకోవడం మంచిది. ఒక టెస్ట్ లో పాజిటివ్ వస్తే రెండో రాపిడ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినా రెండూ నమ్మదగినవో కాదో చెప్పలేం. అందువల్ల ఒక టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా కంగారు వద్దు.
వందేళ్ల క్రితం వచ్చిన ఈ కరోనా లాంటి స్పానిష్ ఫ్లూ తగ్గి శాంతించడానికి మూడు నుంచి నాలుగేళ్ళు పట్టిందంటున్నారు. ఇప్పుడు కాస్త టెక్నాలజీ అదీ బాగా పుంజుకున్నా ఇప్పటికీ ప్రపంచంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఉన్నారు సూటూ బూటూ వేసుకుని కొత్త టెక్నాలజీ వాడుతూ. వీళ్ళు అప్పుడే కొత్త టీకా ఫార్ములా దొంగతనం చేయడానికి ఇంటర్నెట్ మీద ప్రయత్నాలు చేస్తున్నారుట. పాలిచ్చే బంగారంలాంటి ఆవు చచ్చిపోయిందని ఏడుస్తుంటే, తిండి దొరుకుతోందని రాబందుల రెక్కల చప్పుడు. హతోస్మి!
ఈ వైరస్ ఎంత కాలం మనమీద ఉంటుందో, దాని దారి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనమీద మరింకెంతకాలం ఆడుకుంటూ ఉంటుందో తెలియదు. లేదా ప్రతీఏడూ వచ్చే ఫ్లూ జ్వరంలాగా ప్రతీ ఏడూ ఒక టీకా వేయించుకోవాల్సి రావొచ్చు. ముందున్నది ముసళ్ల పండగ అని ఎప్పటినుంచో – ఈ వ్యాధులు రాకుండా ఉండడం కోసం బిలియన్ల డాలర్లు ఖర్చుపెడుతున్న - బిల్ గేట్స్ వంటి మహామాహులందరూ చెప్తూనే ఉన్నారు. వెనక్కి చూసుకుని ఆలోచిస్తే ఇదంతా మనం స్వకపోల కార్యం. మానవుడనేవాడు తానొక్కడే గొప్పవాడనీ మిగతా ప్రకృతిని ఎలాగైనా మార్చి దానిమీద అధికారం చలాయించవచ్చనీ అనుకుంటూ చేసుకున్న కర్మ. ఈ ప్రపంచం అందరిదీను. మానవుడు అందులో బతికే ఒకానొక ప్రాణి మాత్రమే, మిగతా ప్రాణుల మీద, ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించడం కుదరదు అని తెలుసుకోనంతకాలం ఇలాగే అనుభవించడం తప్పనిసరి. ఈ విషయం జురాసిక్ పార్క్ సినిమా చూసిన అందరికీ గుర్తుండి ఉండవచ్చు.
వ్యాసం ముగించే ముందు మరోమాట. ఎప్పుడో జరిగిన మహాభారత యుద్ధం ముందు అది జరగకుండా ఉండడానికి తన వంతు సహాయంగా కృష్ణుడు కౌరవుల దగ్గిరకి వెళ్తాడు రాయబారానికి. అలా వెళ్లడం ఎందుకంటే, “తాను భగవంతుడై ఉండీ ఏమీ చేయలేదు, చూస్తూ కూర్చున్నాడు,” అనే నిందా వాక్యం తనమీదకి రాకుండా ఉండడం కోసం. ఆ రాయబారంలో కృష్ణుడు సదస్యులతో చెప్పేది తిక్కన అద్భుతంగా రాసిన పద్యంలో చూడండి.
ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచే
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్ (ఉద్యోగ పర్వం తృతీయాశ్వాశం)
సారమైన ధర్మం, సత్యం అబద్ధాలచేతా, పాపం చేతా చెడిపోయే స్థితికి వచ్చిన దశలో ఏదైనా చేయగలిగిన సమర్ధులు ఉపేక్ష చేసి ఊరుకుంటే, అది ఆ ఉపేక్ష చేసేవాళ్లని కాటు వేసి తీరుతుంది కానీ ధర్మానికీ సత్యానికీ ఎటువంటి ఆపదా రాదు, ఎందుకంటే సత్యం, ధర్మం రక్షించడం కోసం భగవంతుడెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఓ సారి ఇది మనకి అన్వయించి చూసుకుందాం. ప్రకృతిని ప్లాస్టిక్ సంచీల తోనూ, సముద్ర జలాలని మరో విధంగా, నదులలో మురికీ, వ్యర్ధాలు కలిపేసీ పాడుచేసుకుంటున్నాం. వాహనాలు ఎక్కువగా నడిపితే శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యం అని చదివినా ‘నేనేం చేయగలనోయ్’ అని ఊరుకుంటున్నాం. పెద్ద పెద్ద నాయకులు చేతనై ఉండీ ఏమీ చేయడం లేదు. స్వీడన్ నుంచి గ్రెటా థన్ బర్గ్ అనే ఒక పదహారేళ్ళ పాప “ఒరే బుద్ధిలేని నాయకుల్లారా, మా పిల్లలకి మీరిచ్చే సంపద ఇదేనా రాబోయే కాలంలో?” అని బల్ల గుద్ది, అరిచినా ఈ నాయకులు ఏమీ చేయలేదు. ఇదే కృష్ణుడు చెప్పినది, గమనించండి – ‘దక్షులెవ్వారలుపేక్షచేసి రది వారల చేటగు గాని’. ఈ కరోనా ఇప్పుడిలా విజృంభించడానిక్కారణమే మనమే. ఈ దరిద్రానికి మనందరం సమాన భాగస్వాములం, మనం ఒప్పుకున్నా లేకపోయినా.
ఈ కరోనా వచ్చాక నదులు కాస్త తేటాపడ్డాయనీ, వాతావరణం (ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాల్లో) బాగుపడుతోందనీ అంటున్నారు. కానీ, ఎప్పుడైతే ఈ కరోనా కనుమరుగైపోతుందో అప్పుడు మనం కుక్కతోకలాగా తయారై మళ్ళీ మళ్ళీ పీకలమీదకి తెచ్చుకుంటాం. అందువల్ల ఇప్పుడున్న ఈ కరోనా మానవాళికి ఒక వార్నింగ్ మాత్రమే. ముందున్నది ఇంకా పెద్ద ముసళ్ల పండగ. ఇప్పటికీ మించిపోయింది లేదు, మనం మారితే. కానీ బద్దెన చెప్పినట్టూ, “…ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ” మనం మారం. అయితే భగవంతుడిలా మనకి పాఠం చెప్పడానికి ఇటువంటి వైరస్ లు సృష్టించాడేమో అనిపిస్తోంది నాకు. దీనిక్కారణం కూడా చెప్తాను. కరోనా వచ్చినప్పటినుండీ, ఎవరైతే దీన్ని “అతి సులువుగా పోతుంది, ఏమీ కంగారు లేదు, మాస్క్ అక్కర్లేదు, ఇదేమీ ప్రమాదం కాదు” అనే చౌకబారు కబుర్లు చెప్తున్నారో వాళ్ళని పగబట్టి, దారి కాచి కొట్టినట్టూ కరోనా కాటు వేస్తోంది, వార్తలని బట్టి. అలా కరోనాని వెక్కిరించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో చర్చ్ ఫాదర్ లూ, రాజకీయనాయకులూ ఉన్నారు; దీనికెవరూ మినహాయింపు లేదు. ఇందులోంచి ఏవైనా పాఠాలు నేర్చుకుని మానవాళి బాగుపడుతుందా, లేకపోతే మళ్ళీ మొదటికి వస్తామా అనేది వేచి చూడాల్సిందే. సామ భేధాలు పనికిరానప్పుడు దండోపాయం ఒకటే పనిచేస్తుందని అంటారు కదా? ఇప్పుడిలా ప్రజలు చావడం దండోపాయం కాదూ? ఎవరైనా/ఏ దేశమైనా “మాకేం నష్టం లేదు, మేము దాన్ని కట్టడి చేసాం,” అనుకుంటూ ఉండవచ్చు కానీ ప్రపంచం కరోనా వల్ల అతలాకుతలం అవుతోంది కనక ఇదే పరిస్థితి వాళ్ళ మీద పడి ఛిన్నాభిన్నం అవడడానికి పది రోజులు చాలు. అలా ఆశ్వత్థామ ముందూ వెనకా చూసుకోకుండా వదిలిన బ్రహ్మశిరోనామకాస్త్రం లాగా ఈ కరోనా కాటు మరో విధంగా/రూపంలో వెనక్కి వెళ్ళి అందర్నీ సర్వనాశనం చేయడానికి, కబళించడానికీ వెనుకాడదు. కనుక మనం నిర్వర్తించ వలసిన కనీస జీవన ధర్మాలను ఖచ్చితంగా పాటించవలసిన సమయం ఆసన్నమయింది.
మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇది ముగింపు. మీకు ఇంకా ఏమైనా విషయాలు కావాలిస్తే ఇక్కడ ప్రశ్నలు అడగవచ్చు, లేదా నేరుగా నాకు మెయిల్ పంపవచ్చు. వీలున్నంతలో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హాట్ మెయిల్ లో d_danturthi అనే దానిక్కానీ జిమెయిల్లో danturthi అనే దానిక్కానీ మెయిల్ పంపవచ్చు.