Menu Close
Page Title

అన్నమయ్య పదార్చనలలో సాహితీ స్రవంతి

గతసంచిక తరువాయి »

సౌందర్య వర్ణనలలో అన్నమయ్య అసమాన్యుడు. వివిధ రాసుల నాపాదిస్తు అలిమేలు మంగ సౌందర్య వర్ణన:

అన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి // పల్లవి //కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మినాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి // అన్నిరాసుల //

చిన్నిమకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి // అన్నిరాసుల //

ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమూల సతి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కొమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి // అన్నిరాసుల //

శ్రీ కృష్ణ లీలలను నవరత్నాలతో పోలుస్తూ ..

ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడుఅంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు

వాడి అల్లరి యింత అంత కాదు ..

వాడే వాడే అల్లరివా డదివో
నాడు నాడు యమునా నదిలో ||కాంతలు వలయపు కంకణ రవముల
సంతంత గోలాట మాడ గను
చెంతల నడమను శ్రీరమణుడమరె
సంతతపుజుక్కలలో చంద్రునివలెను ||

మగువలు ముఖ పద్మములు దిరిగిరా
నగపడి కోలాట మాడ గను
నిగిఢీ నడుమ నదె నీల వర్ణుడు
పగటుతో గమల బంధుని వలెను ||

మరొక వైవిధ్య సాహిత్య ప్రక్రియ:

అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ।ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే
మూక మూడు విధము లాయరా - ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ।

అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే
వొల్వలెల్ల మల్ల్యెలాయే - ఓ వేంకటేశా
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా।

పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా।

చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే
కాళ్ళులేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేనివాడు చిలుక తినేరా ఓ వేంకటేశా।

గుంట యెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే
కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయా!
తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ!
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ!

ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా!
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!

ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఒ వేంకటేశా।

పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।

అర్థరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని
నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా - ఓ వేంకటేశా।

దేహముపై మొహంతో దిగజారుతున్న మానవుని దీన స్థితిని తెలిసిన నీవు వానిని ఉద్ధరించుమని ప్రాధేయపడుతూ:

అయ్యో మానుపగదవయ్య మనుజుడు తన
కయ్యపుగంట గానడు // పల్లవి //పాపపుణ్యలంపటుడైనా దుష్ట
రూపుడూ జన్మరోగి యటుగాన
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి
యేపొద్దు వొడలెరగడు // అయ్యో //

నరకభవనపరిణతుడైనా కర్మ
పురుషుడు హేయభోగి యటుగాన
దురితపుణ్యత్రిదోషజ్వరము వట్టి
అరవెరమాట లాడీనీ // అయ్యో //

దేహమోహసుస్థిరుడై నా
నిర్వాహుడు తర్కవాది యటుగాన
శ్రీహరి వేంకటశ్రీకాంతుని గని
వూహల జేరనొల్లడు // అయ్యో //

అదే ధోరణిలో మరొక పదం :

అమ్మెడి దొకటి ఆశించే దొకటి
బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా // పల్లవి //సంగము మానక శాంతియు గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటిపెద్దలమయ్యా // అమ్మెడి//

కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువమనసు
క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు
పేరడి నేమిటిపెద్దలమయ్యా // అమ్మెడి//

ఫలము లందితే బంధము వీడదు
ఫలములో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశుదాసులము
పిలువగ నేమిటిపెద్దలమయ్యా // అమ్మెడి//

మరొకటి:

ఇంతయు నీమాయామయ మేగతి దెలియగవచ్చును
దొంతిబెట్టినకుండలు తొడరినజన్మములు ||కలలోపలి సంభోగము ఘనమగు సంపదలిన్నియు
వలలోపలి విడిపరుపులు వన్నెల విభవములు
తలపున గలిగియు నిందునే తగులక పోదెవ్వరికిని
తెలిసిన దెలియదు యిదివో దేహరహస్యంబు ||

అద్దములోపలినీడలు అందరిదేహపు రూపులు
చద్దికివండిన వంటలు జంటగర్మములు
పొద్దొకవిధమయి తోచును భువి నజ్ఞానాంబుధిలో
నద్దినదిది దెలియగరా దంబుదముల మెఱిగు ||

మనసున దాగినపాలివి మదిగలకోరిక లిన్నియు
యిసుమున నిగిరిన నీళ్ళు యిల నాహారములు
పనివడి శ్రీ వేంకటగిరిపతి నీ దాసులివిన్నియు
కని మని విడిచిన మనుజుల కాయపుమర్మములు ||

మరొక ఆణిముత్యం:

ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లుకొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు
అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు

సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని
యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు

ఓ వేంకటేశా! మేము ఏ యే నిస్సహాయ స్థితులలో నిన్ను తలచి రక్షింపమని ప్రాధేయ పడుతామో నీకు తెలుసుగదయ్యా …

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదుకొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

వేంకటపతి అలమేలు మంగల శృంగార చేష్టలను తనదైన శైలి లోని పదంలో గుప్పిస్తూ:

ఇద్దరి తమకము నిటువలెనె
పొద్దున నేమని బొంకుదమయ్యాలలి నాకథరము లంచమియ్యగా
పలు సోకులయి పరగెనవే
పిలువగరాగా బెరసి నిందవడె
పొలతికి నేమని బొంకుదమయ్యా

అడుగుకొనుచు నిన్నంటి పెనగగా
తడయక నఖములు తాకెనవే
తొడుకొనిరాగా దూఱు మీదబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా

పెక్కులు చెవిలో ప్రియముగ చెప్పగ
ముక్కున జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవేంకటేశుడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా

వేరొక శృంగార పదం:

ఇద్దరు జాణలేమీరు యెంచి చూచితే
పొద్దులు గడుపుదురా పొరుగునను ||దిగ్గన సరసమున దిట్టులెన్ని దిట్టినాను
యెగ్గులు వట్టుదురా యింతలోననే
వెగ్గళించి చనవున వెస మర్మము లంటితే
సిగ్గులు వడుదురా జిగిమించను ||

జవ్వనపాయముతోడ సారె సారె జెనకితే
నవ్వులు నవ్వుదురా నట్టనడుమ
నివ్వటిల్లు సన్నలెల్లా నెట్టుకొన జేసితేను
రవ్వలు సేయుదురా రచ్చలోనను ||

సమ్మతించి కాగిళ్ళను సమరతి బెనగితే
బొమ్మల జంకింతురా పూచిపట్టుక
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె మీరు గూడితిరి
దొమ్ములు సేయుదురా తోడదోడను ||

--ముగింపు వచ్చే సంచికలో--

Posted in July 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!