ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి మాటల్లో "శాస్త్రిగారి పాట సంప్రదాయ కీర్తన కాదు. సంగీతం మీద -అంటే రాగ సౌందర్యం మీద- ఎక్కువగా ఆధారపడి పొడి పొడి మాటల కూటమిగానో, భగవన్నామాల సంబోధనల సంపుటిగానో ఉండదు. తీర్పుగా పాటకు ఆకారం యిస్తూ, మనస్సు మీద ప్రభావం చూపే ఒకానొక భావం మీద ఆయన దృష్టి కేంద్రీకరించడం ఆయన పాటలోని సాధారణ ధర్మం. బాహ్యమూర్తి చిత్రణం కంటే అంతరంగానుభం చిత్రణం ద్వారా శ్రోత మనస్సును చూరగొనడం ఆయన రచనా విధానంలో మరొక విశేషం."
పాటకు కావలసినది పాడడానికి అనుకూలంగా ఉండే పద సౌలభ్యం, భావ లాలిత్యం, అనుప్రాసలు. అలాగని కవి తన పాండిత్యాన్నంతా పాటలో ప్రదర్శించబోతే రసవాహిని సన్నగిలుతుంది. అతడు ఎంతవరకు నిగ్రహించుకుని భావ స్ఫూర్తి కలిగించగలడో అంతవరకే తాను పాండిత్య ప్రతిభని వాడుకోవాలి. అవి పాటిస్తూనే అన్నమయ్య, త్యాగరాజు వాగ్గేయకారులు అయ్యారు.
కృష్ణశాస్త్రి అలవోకగా వ్రాసిన ప్రేమగీతం, విరహ వేదనని ప్రతిబింబిస్తూ..
ఏమోనే ప్రియా!
ఈ నా మనసు నిలువదే
నిముసమైన నిలువదే
నీ కన్నులు చూడనేని ...
అటు చూచును ఇటు చూచును
ఆగి ఆగి అటె నిలుచును
అటు ఊగును యిటు ఊగును
అలయిక నా ఎద తూగును
లోల మధుకరాళులౌను
నీలోత్పల మాలలౌను
నీకన్నుల వెంట వెంట
నాకన్నుల డోలలౌను …
మరొక స్వేచ్చాగానం:
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
నాయిచ్ఛఏ గాక నాకేటి వెరపు?
కల విహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
మొయిలు దోనెలలోన పయనం బొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుచు చినుకునై పడిపోదు నిలకు
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
శీకరంబులతోడ చిరుమీలతోడ
నవమౌక్తికములతో నాట్యమ్ములాడి
జలధి గర్భమ్ములోపల మున్గిపోదు
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
పరువెత్తి పరువెత్తి పవనునితోడ
తరుశాఖ దూరి పత్రములను జేరి
ప్రణయ రహస్యాలు పల్కుచునుండు;
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
నాయిచ్ఛ పక్షి నయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను
మధుప మయ్యెద చందమామ నయ్యెదను
మేఘమయ్యెద వింత మెరుపు నయ్యెదను
అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను
పాట నయ్యెద కొండవాగు నయ్యెదను
పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను
ఎలకో ఎప్పుడో ఎటులనో గాని
మాయమయ్యెద నేను మారి పోయదను
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు?
ఆవిధంగా సాగిపోయే స్వేచ్ఛగానికి మరొక విరుపు...
ఆకులో ఆకునై పూవులోపూవునై
కొమ్మలోకొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా
నిచటనే ఆగిపోనా?
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెలపాటలో తేటనై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా
నిచటనే ఆగిపోనా?
పగడాల చిరాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా
నిచటనే ఆగిపోనా?
తరులెక్కి యల నీలగిరి నెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా
నిచటనే ఆగిపోనా?
ఆకలా దాహమా చింతల వంతలా
ఈ కరణి వెఱ్ఱినై యేకతమ తిరుగాడ
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా
నిచటనే ఆగిపోనా?
శివ క్షేత్ర యాత్ర లో కృష్ణ శాస్త్రి భక్తి రసాన్ని ఎంతగా గుప్పించ్చారో, పాడిన శ్రీరంగం గోపాల రత్నం కూడా అదే స్థాయిలో గొంతును ద్రవింపచేశారు.
శివ శివ అనరాదా, శివనామము చేదా!
శివ పాదము మీదా - నీ
శిరసు నుంచరాదా!
భవసాగర మీదా దు
ర్భర వేదన కాదా
కరుణాళుడు కాడా ప్రభు
చరణ ధూళి పడరాదా
హర హర అంటే - మన
కరువు తీరిపోదా!
కరి, పురుగూ పాము బోయ
మొరలిడగా వినలేదా?
కైలాసము దిగివచ్చీ
కైవల్యము ఇడలేదా?
మదనాంతకు మీదా-నీ
మనసెన్నడు పోదా
మమకారపు తెరస్వామిని
మనసారా కననీదా ...
పదములె చాలు రామా
నీపద ధూళులే పదివేలు
నీ పదమంటిన పాదుకలు
మమ్మాదుకుని ఈ జగమేలు
నీదయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నాబ్రతుకొక నావ
దానిని నడిపే తండ్రివి నీవు కావా
కోవెలలోనికి రాలేను
నువుకోరిన కానుక తేలేను
నినుగానక నిముషము మనలేను
నువ్వు కనబడితే నిను కనలేను
నీ పదములె చాలు రామ
నీపద ధూళులే పదివేలు.
ఆ ఆర్ద్రత ప్రవహించి ప్రవహించి మనల్ని ముంచేస్తుంది.
కన్నె మనసు
చెరకు గడవంటి కన్నె వయసులోని మనసు తియ్యదనాన్ని తరుచుతూ ..
తలపు లూరే కన్నె మనసు
వలపు లేరే కోడె వయసు
ఎంత లాగిన ఆగునా, అవి
ఎంత దాచిన దాగునా?
ఎవరుచెప్పే రామనిని సరి
కొత్త కోర్కెలు తెమ్మని -
ఎవరు కోరిరి తుమ్మెదనని విరి
కొమ్మ కెదురుగా రమ్మని!
ఎవరు తప్పని మనసు లాగిన
ఎంత లాగిన ఆగునా, అవి
ఎంత దాచిన దాగునా?
తెలివి మాలిన వారు, పాపం
తెలియ దనుకుంటారు, గాని -
మనసు లోపలి వేడి తలపులు
మరుగు చూపులు పట్టి ఇస్తాయ్
కనులు మూసుకు వారు లోకం
కాన దనుకుంటారు గాని,
మవ్వపున్ మమకారములు, చిరు
నవ్వు దివ్వెలు పెట్టుకొస్తాయ్!
దేశానికి దిశని చూపే నాయకులు ఏ ఆదర్శాల ఎంచుకోవాలో, అవి ఎలా ఉండాలో కృష్ణశాస్త్రి పాటలో...
భాగ్యాలు పండాలి
అన్యోన్య ముండాలి
మోసం అసూయా ద్వేషము పోవాలి
వాదము భేదము పోవాలి
స్వార్ధం మాని సమరము మాని
చల్లని సమహితమూని
పూని కరుణ ధర్మము వీడని
నాయకులుండిన నవయుగ మందున
అగును అందాల మన దేశము
కృష్ణశాస్త్రి వ్రాసిన 'అభినవ వేమన' వ్యంగ్య పద్యాలు కొన్నిటిలో హాస్యపు తుంపరులు విదజల్లుతూ ....
మర ఫిరంగి బట్టి మహతి గా వాయించు,
చీమజూచి పరుగు చిత్తగించు -
అతడుకాక ఎవ్వ డతివాస్తవిక కవి?
విశ్వదాభిరామ వినుర వేమ!
జిగురు, ప్రత్తిమర, సిసింద్రి, సోడా పొంగు,
పేకజువ్వ, ధూళి, ఊకదంపు
కలిపి కొట్టి వాడు ఘనవక్త యైనాడు
విశ్వదాభిరామ వినుర వేమ!
మెరుగు కంటి జోళ్ళు, గిరజాలు, సరదాలు
భావకవికి లేని వేవి లేవు -
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినుర వేమ!
వీటి లోని మేటి విస్వస్త లందరు
గొప్పసభలు చేసి గోలపెట్టి
వెధవపేట నొకటి వేరె యిమ్మన్నారు
విశ్వదాభిరామ వినుర వేమ!
వేద విద్య నాటి వెలుగేళ్ల నశియించె
గారే, బూరె పప్పు చారు మిగిలె;
బుర్ర కరిగి కరిగి బొర్రగా మారెరా!
విశ్వదాభిరామ వినుర వేమ!
సంధ్య వార్చి వార్చి శాస్త్రికి విసుగయి,
బూబు మీద మనసు పోయి పోయి-
తురక మతము పొంది దూదేకులాయెరా!
విశ్వదాభిరామ వినుర వేమ!
భాగ్య రేఖ లో 'నీవుండే దా కొండపై, నేనుండేది నేలపై', రాజమకుటంలో 'సడిసేయకో గాలి', భక్త శబరిలో 'ఏమి రామకథ', సుఖదుఃఖాలలో' ఇది మల్లెల వేళయని', ఉండమ్మా బొట్టు పెడతా లో 'అడుగడుగున గుడి ఉంది', బంగారు పంజరం లో 'పదములె చాలును రామా', ఏకవీరలో - 'ప్రతి రాత్రి వసంత రాత్రి', సంపూర్ణ రామాయణం లో 'ఊరికే కొలని నీరు', భక్త తుకారాం లో 'ఘనా ఘన సుందరా', బలిపీఠంలో 'కుశలమా, మీకు కుశలమేనా', శ్రీరామ పట్టాభిషేకం లో 'ఈ గంగ కెంత దిగులు', సీత మహాలక్ష్మి లో 'మావిచిగురు తినగానే' ఇలా ఎన్నో, ఎన్నెన్నో కృష్ణ శాస్త్రిగారి తీపిగురుతులు.
కృష్ణ శాస్త్రి అత్యుత్తమ గీత రచయితగా 1978 లో 'సీతామహాలక్ష్మి'కి, 1982 లో 'మేఘసందేశా'నికి పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన సాహిత్య కృషికి విలువకట్టలేక 'కళాప్రపూర్ణ' బిరుదాన్నిచ్చి గౌరవించింది. ఆ సాహిత్యకృషే ఆయనికి 1976 లో 'పద్మభూషణ్', 1978 లో భారత ప్రభుత్వపు సాహిత్య అకాడెమి పురస్కారం తెచ్చిపెట్టాయి.
కృష్ణశాస్త్రి ఎంత గొప్ప కవో, అంతటి షోకిలా పురుషుడు కూడా. అలంకరణ లేకుండా బయటికి కదిలే వాడు కాదట. 1953 లో ఆయన గొంతు పోవకముందు తన పద్యాలు పాటలు ఆయనే పాడుతూ ఉంటే వినగలగడం నా అదృష్ఠంగా భావిస్తాను.