Menu Close
Page Title

దేవుడే దిగివస్తే 'పరమాచార్య' అవుతారేమో!

10. ఉప్పులా కరిగిపోయిన కష్టం

పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడైన ఒక జమీందారు ఒకరు ఉండేవాడు. పురాతన శిథిల ఆలయాలలో ఎంతో సేవ చేశాడు. అనుకోకుండా వచ్చిన పెద్ద ఆపద వల్ల చాలా నష్టపోయి డీలా పడిపోయాడు. భగవంతుడు తనను ఇలా కష్టానికి గురిచేశాడని బాధతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం కూడా మానేశాడు. ఆ సమయంలో పరమాచార్య స్వామివారు కుంభకోణంలో మకాం చేస్తున్నారు. అది తెలుసుకుని, ఆ జమీందారు తనకు జరిగిన అన్యాయం గురించి అడగదలచి మహాస్వామి వారిని కలవాలని నిశ్చయించుకుని వెంటనే వచ్చాడు. స్వామివారి దర్శనార్థం ఒట్టి చేతులతో రావడమే, అతని నిరాశ ఎటువంటిదో అర్థం అవుతోంది. ఎప్పటిలా కాకుండా విరిగిన మనస్సుతో స్వామివారికి సాష్టాంగం చేశాడు. కానీ స్వామివారు మాత్రం జమీందారు పద్ధతిలో వచ్చిన మార్పును గమనించనట్టుగా జమీందారుని చూస్తూ, “చూడబోతే నాతో ఏదో అడగాలని వచ్చినట్టుందే! ఏం ఆగడాలనుకుంటున్నావు?” అన్నారు. “స్వామి నేను చెయ్యని దానం లేదు, ఎన్నింటినో పునఃప్రారంభించాను, నేను ప్రార్థించని దైవం లేదు. కానీ భగవంతుడు నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చాడు. ఇక నేను దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు?” అని స్వామివారికి చెబుతూ మరికొన్ని కఠిన మాటలను కూడా అన్నాడు. మహాస్వామి వారు మౌనంగా అంతా విని, “నువ్వు ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు నీకు సలహాలు ఇస్తే, అవి అంతగా పనిచెయ్యవు. కనుక నీకు ఒక కథ చెబుతాను విను” అన్నారు. స్వామివారు ఆ జమీందారుకి ఉప్పు వ్యాపారి కథ చెప్పారు. స్వామివారు కథం చెప్పడం ఆపగానే, జమీందారు తన తప్పును తెలుసుకున్నాడు. తనకు ఇప్పుడు కలిగిన కష్టం కూడా ఒక మంచికే అయివుంటుందని మనస్సును స్థిమితపరచుకున్నాడు. స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ప్రసాదం తీసుకుని వెళ్లిపోయాడు.కొద్దికాలం తరువాత మహాస్వామి వారి దర్శనం కోసం వచ్చాడు ఆ జమీందారు. “స్వామీ నమస్కారం, క్రితంసారి నేను మీవద్దకు వచ్చినప్పుడు నా ఆస్తి మొత్తం పోగొట్టుకునే స్థితిలో ఉన్నాను. కానీ ఈరోజు ఆ ఆస్తి మొత్తం నాకు తిరిగొచ్చింది. మా పూర్వీకులు సేవ చేసే ఒక పురాతన దేవాలయంలో వాటికి సంబంధించిన దస్త్రాలు లభించడంతో న్యాయంగా ఆస్తి మొత్తం నా పరమైంది. అప్పుడు నేను బాధలో మాట్లాడాను. మిమ్మల్ని పరమేశ్వరునిగా భావించి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు. “మహాస్వామివారు నీటిలో కరిగిపోయిన ఉప్పు కథ చెప్పి మన కష్టాలు కూడా అలా కరిగిపోతాయి అని సూచిస్తున్నారు” అని అక్కడున్నవారందరూ అనుకున్నారు.

--- పి. రామకృష్ణన్, “కుముదం భక్తి” పత్రిక నుండి

11. రెండువందల యాభై బియ్యం బస్తాలు

పరమాచార్య స్వామివారు రామేశ్వరంలోని శ్రీమఠం శాఖకి బియ్యాన్ని పంపమని 1964 ప్రారంభం నుండే బియ్యం దాతలకు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా తోచి మేనేజరు . కూడా ఎక్కువ బియ్యం నిల్వకి ఏర్పాట్లు చేసాడు. కాని అతను ఈ విషయంలో చాలా అసహాయతతో అప్పుడప్పుడు తన అసహనాన్ని స్వామివారికి గట్టిగానే వినిపిస్తున్నాడు.  కాని పరమాచార్య స్వామివారు ఈ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించి రామేశ్వరంలోని వారి శాఖామఠంలో 250 బస్తాల బియ్యం నిల్వచేసేట్టు చర్యలు తీసుకున్నారు. 1964 డిసెంబరు మాసంలో పెద్ద తుఫాను రామేశ్వరంని తాకింది.  ఆ తుఫాను దెబ్బకి రామేశ్వరం చేరడానికి ఉన్న ఒక్క మార్గం పంబన్ వారధి ధ్వంసమైంది. ధనుష్కోటి పట్టణం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. సముద్రుని అలల ఆవేశం వల్ల రామేశ్వర ద్వీపానికి ఆహారం పంపించడం జరగని పని. పరమాచార్య స్వామివారు ముందుచూపుతో రామేశ్వరంలోని మఠంలో నిల్వచేయించిన 250 బియ్యం బస్తాలే ప్రకృతి విలయం దెబ్బకి సర్వం కోల్పోయిన రామేశ్వరంలోని వేలాదిమంది ప్రజలకి ఆహారమై వారి కడుపు నింపింది.

12. బాదంపప్పు - భిక్ష

మేము తంజావూరులో ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు నా కలలో కనపడ్డారు. వారు నన్ను “నాకు బాదంపప్పు తేగలవా?” అని అడిగారు. వెంటనే మేము బాదంపప్పు కొని కాంచీపురం దగ్గర్లోని ఒరిక్కై అనే పల్లెటూరికి వెళ్ళాము. అప్పుడే పరమాచార్య స్వామివారు అన్నభిక్ష మాని కేవలం పేలాలు మాత్రమే తినడం మొదలుపెట్టారు. మేము తెచ్చిన బాదంపప్పు మహాస్వామి వారి భిక్షకు ఉపయోగించాలంటే ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు. ఒకావిడ మమ్మల్ని ఉగ్రాణం గోపాలయ్యర్ గారి వద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు అతను ఆత్రుతతో ఏదో వెతుకుతూ కనిపించాడు. మమ్మల్నిచూడగానే “ఇప్పుడు నన్ను మాట్లాడించకండి. పెరియవ భిక్షకు సమయం అయ్యింది” అని చెప్పాడు.  మేము అతనితో, “ఏమిటి మీరు వెతుకుతున్నారు? మేమైనా కొనితేగలమా?” అని అడిగాము. అతను బాధతో, “ఇప్పుడు బాదంపప్పు ఎక్కడ దొరుకుతుంది. ఒక్కరాత్రిలో మొత్తం ఉన్నదంతా చీమలు తిన్నాయి. ఈ విషయం మేనేజరుకు తెలిస్తే నామీద కోప్పడతారు. మీరు కాంచీపురం వెళ్తేనే అవి దొరుకుతాయి. కాని అప్పటికి స్వామివారి భిక్ష పూర్తి అయ్యుంటుంది” అని చెప్పారు. మా ఆనందానికి అవధులు లేవు. మేము కొని తెచ్చిన బాదంపప్పు అతనికి ఇచ్చాము. వాటిని చూడగానే గోపాలయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు. పరమాచార్య స్వామివారికి సంబంధించిన విషయాలు ఎవరి ప్రమేయము లేకుండా సాఫీగా సాగిపోతాయి. మావల్లే అవి జరిగితున్నాయి అనుకోవడం మన అతిశయం మాత్రమే. వారు ఆడించే ఆటలో మనం కేవలం పావులం మాత్రమే.

--- జయలక్ష్మి అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్

13. తిరుమల జోలికి వెళ్లొద్దు

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు.

మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమందపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటినుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సులోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే,“ ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రిగారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేలఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రంలో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారికోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షంలో వేంకటేశ్వర స్వామివారి పవిత్రత, శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేదిలేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటినుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువెక్కగా అక్కడినుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామివారి వద్దకు పరుగులు తీసాడు.

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించాగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామివారు వేళ్ళను నుదుటిపై మూడు నామాలవలె చూపిస్తూ, “అక్కడి(తిరుమల) నుండే వస్తున్నావా?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు. “అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమకంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామీ వారి కరుణ మాత్రమె. ఎందుకంటే ఆ తల్లిప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠసేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపునిండా ఆహారం పెట్టించు” అని స్థపతితో పాటు పంపారు. ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు.

paramacharya-swamiతిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామి వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని, “అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?” అని అడిగారు.

“తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కాని ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు” అని పరమాచార్య స్వామి వారిని ప్రార్థించాడు.

మానవజాతినే ఉద్ధరించడానికి ఈ భువిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడినుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్రలేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా అనిపించసాగింది.

భయంతో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తిరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరిగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమిటని అడిగాడు. వెంటనే తాను ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు.

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్తమయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు, వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో, స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే?” అని అడిగి, లోపలి రమ్మన్నారు.

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పిందంతా విన్న తరువాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమలలో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.

ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమె?” ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,

“ముందు నేను చెప్పేది విను. వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామీవారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి. తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంట పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకురావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారు ఆశీస్సుల వలన మాత్రమె అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

14. డా. రాధాకృష్ణన్ గణేష్, ఈవిధంగా వ్రాసారు:

రుద్రాక్ష స్ఫటిక మాల

మా గురువుగారు మహారాజపురం సంతానం కంచి పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. వారు శ్రీవారిపై ఒక థిల్లానా, మూడు సంకీర్తనలు కూడా స్వరపరిచారు. వాటిని చాలా కచేరిలలోనూ, క్యాసెట్టు రికార్దింగుల్లోనూ పాడారు.

ఆగస్ట్ 87 నుండి జూన్ 92 దాకా మా గురువు గారికి గాత్ర సహాయకునిగా పాడడం నా పూర్వజన్మ సుకృతం. వారితో పాటుగా మహాస్వామివారిని దర్శించుకుని, వారి ముందు పాడి, స్వామివారి నుండి ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం నాకు చాలాసార్లు దొరికింది. మా గురువుగారికి స్వామివారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందులో చాలాసార్లు నాతో పంచుకున్న అనుభవం యిది: శ్రీ మహారాజపురం విశ్వనాథ అయ్యర్ నుంగంబాక్కంలో నివసించేవారు. ఒకసారి మహాస్వామివారు వారి ఇంటిపక్కన బస చేశారు. అప్పుడు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. ఒకరోజు సాయింత్రం యం.వి అయ్యర్ గారు ఇంట్లో కూర్చుని “వినాయకుని”, “అనాధరక్షకి శ్రీకామాక్షి” కీర్తనలు పాడుతున్నారు. వెంటనే మహాస్వామివారు లేచి బయటకు వచ్చి యం.వి అయ్యర్ గారి ఇంటి లోపలకు వచ్చారు. అయ్యర్ లేచి నమస్కారం చేసి నిలుచున్నారు. “నీ ఆలాపన నన్ను నీ ఇంటికే కాకుండా మౌనవ్రతాన్ని వీడివచ్చేలా చేసింది” అన్నారు మహాస్వామి. యం.వి అయ్యర్ గారికి ఎప్పటి నుండో ఒక కోరిక అలాగే ఉండిపోయింది. పరమాచార్య స్వామివారు ధరించే రుద్రాక్షలు స్ఫటికలు కలిసున్న మాలను ఆశీర్వచనంగా పొందాలని. కాని వారి జీవితకాలంలో అది పొందలేక పోయారు. ఒకనాటి సాయంత్రం మా గురువు గారు (మహారాజపురం సంతానం) సతారాలో మహాస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారు మోహన రాగాన్ని పూర్తిగా పాడమన్నారు. మా గురువు గారు స్వామివారి నుండి సెలవు అడుగగా, ఆ రాత్రికి అక్కడే ఉండిపోమ్మన్నారు.

తెల్లవారుఝామున పక్క గది నుండి ఏవో మాటలు వినబడడంతో లేచి చూసారు. మహాస్వామివారు ఉంటున్న గదిని స్వామివారే స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు. కిటికీ నుండి చూస్తున్న మా గురువుగారిని స్వామివారు చూసి రమ్మని పిలిచి, మరలా మోహన రాగంలో “ఎవరురా నినువినా!” పాడించుకున్నారు. పాట పూర్తైన తరువాత ప్రసాదం ఇచ్చి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు. తమ తండ్రి గారు పరమాచార్య స్వామి వద్ద నుండి ఆశించిన బహుమానం తనకు కూడా అందకపోవడంతో మా గురువు గారు భారమైన హృదయంతో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే మహాస్వామివారు పిలిచారని మఠం ఉద్యోగులు చెప్పగా, మా గురువుగారు స్వామీ వద్దకు పరిగెత్తారు. మహాస్వామివారు మెడలోని రుద్రాక్ష స్ఫటిక మాలను తీసి మా గురువుగారికి బహూకరించారు. వారు సంతోషంతో ఆందభాష్పాలు రాలుస్తూ స్వామివారికి సాష్టాంగం చేశారు. బహుశా వారి గౌరవాల పరంపర అక్కడితోనే మొదలయ్యిందేమో.

--- డా. రాధాకృష్ణన్ గణేష్,

15. నాదస్వర చక్రవర్తి తో ఆధ్యాత్మిక చక్రవర్తి

అది 1950 ప్రారంభంలో పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పర్యటిస్తున్న సమయం. మాయవరం ప్రజలు మహాస్వామివారి పట్టణ ప్రవేశ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు. అటువంటి సమయంలో స్వామివారు పల్లకిలో ఏనుగులు, గుర్రాలు మొదలగు పీఠ లాంఛనాలతో పురః ప్రవేశం చేసేవారు. మహాస్వామి వారి పల్లకి ధర్మాపురం మఠం సమీపానికి వస్తుండగా, పండర సన్నిధి స్వామివారిని తగు మర్యాదలతో ఆహ్వానించి శ్రీవారివెంటే వస్తున్నారు. మహాస్వామివారి ఊరేగింపుగా మాయవరం పట్టణంలోకి ప్రవేశిస్తోంది. అప్పుడు నాదస్వర సామ్రాట్టుగా ఖ్యాతి గడించిన శ్రీ టి.యన్. రాజరత్నం పిళ్ళై దగ్గర్లో ఏదో కచేరి ముగించుకుని తిరువడుత్తరైలో ఉన్న తమ స్వగృహానికి వెళ్తున్నారు. ఆయన కేవలం పేరులోనే కాదు నిజజీవితంలో కూడా రారాజు లాగానే బ్రతికేవారు. వారి లెటర్ ప్యాడ్ లో కూడా “ప్రపంచ నాదస్వర సామ్రాట్ తిరువడుత్తరై రాజారత్నం పిళ్ళై” అని రాసుకున్నారు. వారు తమ పేరుప్రతిష్టలకు తగ్గట్టుగా పెద్ద పడవలాంటి స్టూడ్ బేకర్ కారులో ప్రయాణించేవారు. కలైక్కుడి హోటల్ దగ్గర్లో ఉన్న గడియార స్థంభం వద్ద నుండి వెళ్తుండగా అక్కడున్న జనసమూహాన్ని చూసి “ఏమిటి ఈ కోలాహలం?” అని అడిగారు. కంచి పరమాచార్య స్వామివారు మాయవరం వచ్చారని పక్క వీధిలో ఉత్సవం సాగుతోందని చెప్పారు. ఈ విషయం విన్న వెంటనే కారు పక్కన ఆపమని చెప్పి, క్రిందకు దిగి చొక్కా విప్పి, అంగవస్త్రాన్ని నడుముకు చుట్టుకుని గడియార స్థంభం వద్ద నుంచొని నాదస్వరం వాయించడం మొదలుపెట్టారు. శంకర! ఏమి ఆ అద్భుత సన్నివేశం. అటుగా వెళ్తున్న స్వామివారు నాదస్వరం వినబడగానే, “టి.యన్.ఆర్ నాదస్వరం వాయిస్తున్నట్టు ఉన్నాడు. పదండి అటు వెళ్దాం” అని అటు బయలుదేరారు. పట్టణ ప్రవేశ ఉత్సవం గడియార స్థంభం వద్దకు బయలుదేరింది. టి.యన్.ఆర్ కోరుకున్నది కూడా ఇదే! అక్క్కడ నిలబడి టి.యన్.ఆర్ ఎంతో ఉత్సాహంతో, పారవశ్యంతో దాదాపు గంటన్నర పాటు నాదస్వరం వాయించారు. అది వినడానికి మొత్తం మాయవరం అక్కడకు చేరింది. మహాస్వామి వారు కూడా ఆ నాదస్వర విన్యాసానికి ముగ్ధులై పరవశించిపోయారు. టి.యన్.ఆర్ ను ఆశీర్వదించి కమలా పండును ప్రసాదంగా ఇచ్చారు స్వామివారు. టి.యన్.ఆర్ వెంటనే నేలపై పడి సాష్టాంగం చేసి లేచి నిలబడి, “నా జన్మకు ప్రయోజనం కలిగింది” అని అన్నారు.

తుది పలుకు

'ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ' సంపాదకుడు ఏ స్ రామన్ నాలుగు రోజుల నిరీక్షణ తరువాత మహాస్వామి ఇచ్చిన ఎట్టెదుటి సంభాషణ సారాంశము 'ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ' లో చేసిన ప్రచురణ మహాస్వామి ముందు ఉంచుతూ సంతకం పెట్టమని కోరారు. దానికి ఆయన "సన్యాసులు సంతకం పెట్టరు, నారాయణా!" అన్నారు, మహాస్వామి. భక్తులపట్ల వ్యవహరించేతీరు వారు ఆయనలో చూసే అసాధారణ వ్యక్తిత్వం రామన్ ఈవిధంగా వివరించారు.

“పరమాచార్య ప్రతి ఒక్క భక్తుడిని ప్రత్యేకంగా తననే కరుణిస్తుండేటట్లు మాటలలో, చేతలతో ప్రవర్తించేవారు. అయన బలహీనపు భుజాలపై సున్నితంగా స్థిరంగా నిలబడిన అద్భుత పాండిత్యం, అయన తీవ్ర మానవత్వపు విలువల అనుపాలన, కనులలోను మాటలలోనే నిబడని కరుణ, ముద్దుగా ఎదుటివాళ్లను నిరాయుధుణ్ణి చేసే ఆ దీనత్వం, ఆలోచనలో మాటలలోని స్పష్టత భక్తుల్ని మానసికముగా వారికి దగ్గర చేరుస్తుంది. ఆయన జే ఎం కీన్స్ వృత్తి పై సాధారణ సిద్ధాంతాన్ని గాని, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని గాని చిన్నపిల్లవానికి కథ చెప్పేటంత సుళువుగాను స్పష్టంగానూ, వివరంగాను చెప్పగలరు”-- అంటారు రామన్ గారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

-o0o- సమాప్తం -o0o-

Posted in January 2022, సాహిత్యం

2 Comments

  1. రవి కుమార్ యాదాటి

    మహాస్వామి దర్శన, అనుగ్రహ సౌభాగ్యానికి నోచుకున్న వారు ఎంతో అదృష్టవంతులు. వారి స్వయం అనుభూతి వివరణలు మనసుకు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తాయి.

  2. GSS Kalyani

    మహా పెరియవ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి భక్తులకు, ఆయనవల్ల కలిగిన దివ్యానుభవాలను ఈ శీర్షిక ద్వారా చాలా చక్కగా మాకు తెలియజేసారు. ధన్యవాదాలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!