11. పచ్చని రాళ్ళలో ప్రకృతి పరవశాలు
ఈ జగత్తులో కనబడే అనేక అద్భుతాలు, వింతలు, అనాదిగా మానవుణ్ణి ఆశ్చర్య పరస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్నిటికి శాస్త్రజ్ఞులు కారణాలు వివరించ గలిగినా, ఇప్పటికీ తమ శాస్త్రజ్ఞానంతో అన్నిటికీ కారణాలు వివరించ పోతున్నారు. బహుశా ముందుముందు మానవుని విజ్ఞాన అవధులు పెరిగి మరింతగా లోతుల్ని తరచి చూడగలిగిననాడు ప్రతిదానికి మూలకారణాలు వివరించ గలుగుతాడేమో! 1872 లో ప్రారంభింపడి 3500 చదరపుమైళ్లు విస్తీర్ణం గల అతి పెద్ద 'పసిడి రాళ్ళ ఉద్యాన వనం' (ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్) అమెరికాలోనే మొదటి జాతీయ ఉద్యానవనం. దేశ విదేశాల పర్యాటకులచే ఎక్కువగా ఆదరింపబడుతున్న ఈ పార్క్ విజ్ఞాన, వినోద కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. శాస్త్రీయంగా పరిశోధించి వివరించగలిన ఈ ప్రకృతి అద్భుతం అమెరికాలో వయమింగ్, ఐడాహో మరియు మౌంటనా, రాష్ట్రాల పరిధుల లో విస్తరించి కొండలు, గుట్టలు, వనాలతో నిండి ఈ నాటికీ సంపూర్ణ పరిశోధనకు, అన్వేషణకు నోచుకోని ఎన్నో వింతలు, అబ్బురాలు ఈ 'పసిడి రాళ్ళ ఉద్యాన వనం' లో చూడవచ్చు. ఇది ఒక సజీవ అగ్నిపర్వతం. నివురుకప్పిన నిప్పులా ఉన్న ఈ అగ్నిపర్వతం ఎప్పుడో అంతర్విస్ఫోటనం తో నోరు తెరుచుకుని ఆ ప్రాంతాన్ని మరుగుతున్న లావాతో ముంచెత్తవచ్చు అంటారు శాస్త్రజ్ఞులు. చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేమిటంటే, కుతకుత లాడుతూ ఉడుకుతున్న మట్టి చెరువులు ఒకవైపు అక్కడి వాతావరణాన్ని వేడెక్కిస్తుంటే, మరోవైపు అయిదారు అడుగుల ఎత్తైన చల్లని మంచుతో (శీతాకాలంలో) కప్పబడ్డ కొండ చెరియలలో అడవి దున్నలు (బైసన్స్) ఇదేమి పట్టనట్లు ఆహారంకోసం వెదుకుతూ కనిపిస్తాయి. ఒకవైపు భూమిలోని రసాయనాలలో కరిగి రంగులమయమైన చెరువులు కళాకారుని అద్భుత కళా ఖండంలాగా గోచరిస్తుండగా, మరోవైపు జలపాతాలు, నీటి తుంపరల తో మేఘాలని రేపగా ఆ పైకెగసిన మబ్బు తునకలు, ఎత్తయిన వనాలతో కొండ అంచుల్ని పరదాకప్పినట్లు కప్పివేసి ఆకాశరేఖని అస్పష్టాకృతితో కనువిందు చెయ్యడం సౌందర్య పిపాసి అయిన పర్యాటకునికి ఒక అనిర్వచనీయ అనుభవం. ఈ విశాల సుందరవనంలో అనేక భౌగోళిక వింతలున్నాయని శాస్త్ర పరిశోధన లో తేలింది. శిలాజ సంపదలుగల వనాలు, ఎన్నడో ప్రవహించి ఆగిపోయిన లావా ప్రవాహచారికలు, పలుచని లావా జనిత (గవ్వలాంటి పదార్ధంతో) నల్లని పారదర్శక పలకలతో నిండిన గుట్టలు, ప్రపంచంలో వేరెక్కడా కనుపించని రంగుల సరస్సులు, ఆశ్చర్యంగా నిర్ణీత సమయానికే భూమిలోనించి నిరవధికంగా వంద అడుగులవరకు ఉవ్వెత్తున ఎగసిపడే ఆవిరి తో కూడిన వేలకొద్దీ నీటి ఊటలు, ఈ పరిసరాల్ని సుసంపన్నం చేస్తున్నాయి. వివిధ ఉన్నత శిఖరాలనుంచి నుంచి దుముకుతుండే జలపాతాలు, వాటి మధ్య అందమైన పక్షుల గుంపులు కేరింతలు కొడుతూ గోలచేస్తూవాటి అందాన్ని ఇనుమడింపచేస్తుంటే, అడవి దున్నలు, దుప్పులు, నక్కలు, ఎల్క్ లు, మూస్ లు మొదలైన అడవి మృగాలు తింటూ తిరుగుతూ, తమ గానాల (కూతల) తో అక్కడి ప్రకృతిని పులకింపచేస్తూ ఉంటాయి. ఇవన్నీ అనుభవించి ఆనందించి తీరవలసిందేగాని మాటలతో వర్ణించి ఆ భగవత్ సృష్టి సౌందర్యానికి న్యాయాన్ని చేకూర్చలేము. ప్రకృతి ప్రదర్శించే సౌందర్య చిత్రికలు వేసవిలో రంగు రంగుల పూలు పచ్చిక బయళ్లతో ఒక విధంగా మెరుస్తూ అద్భుతమనిపిస్తే, శీతాకాలంలో తెల్లని మంచుతో కప్పబడిన చెట్లు, కొండలతో, మంచు గుట్టలతో వేరే కోణంలో అందాలు చూపించి జనాలని అబ్బుర పరుస్తోంది ఈ పార్కు. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఒకసారి చూసి తృప్తిపడలేక మళ్ళీ మళ్ళీ వేర్వేరు ఋతువులలో దర్శించి ఆనందిస్తుంటారు. ఇంతటి సుందర ప్రకృతి ఇక్కడే తప్ప మరే దేశంలోనూ కనబడదనిపిస్తుంది! ఈ నిక్షిప్త అగ్నిపర్వత ఉపరితలం పైన మరుగుతున్న 'మట్టి సరస్సులు', నిర్ణీత కాలంలో సుమారు 100 అడుగుల ఎత్తువరకు నీటి ఆవిరితోకూడి ఎగసి పడుతున్న వెయ్యి దాకా వివిధ ఊటలు, అద్భుత జలపాతాలు, వాటి చుట్టూ మేత వెతుక్కుంటూ తిరిగే దున్నలు, గ్రిజ్లీ ఎలుగుబంట్లు, నక్కలు, ఎల్క్, మూస్ మరియు వివిధ రకాల పక్షులతో వన సంపదల్ని పెంచి, ప్రదర్శించి పర్యాటకుల్ని ఆనందింప చేస్తోంది. అక్కడ ఉన్న కొన్ని ముఖ్య వింతలు:
Old Faithful: 'నొర్రీస్ గెయిజర్ బేసిన్' అని పిలువబడే భూఅంతర్వుష్ణత ఎక్కువగా ఉండే చోటే అనేక ఊటలు (గెయిజర్స్) ఉన్నాయి. అక్కడున్న వింతలని శాస్త్రజ్ఞులు, గణిత శాస్త్ర మేధావులు అనేక ఏళ్ళు పరీక్షలు జరిపి ఆ కాల క్రమానికి, విరామానికి కారణం ఇంకా ఇదమిద్ధంగా నిర్ణయించ లేకపోయినా, వందలసంఖ్యలో ఉన్న ప్రతి ఒక్క ఊట వివిధ నిర్ణీత కాలాల్లో భూమి రంధ్రాలలోంచి పెల్లుబికి వచ్చి కొన్ని దాదాపు వంద అడుగులదాకా (ఓల్డ్ ఫైత్ఫుల్) లేస్తుంటే మరికొన్ని కేవలం మనిషి ఎత్తు వరకే లేస్తాయి. కొన్ని రెండు నిముషాలే ఎగసి పడితే మరి కొన్ని ఎక్కువ సేపు స్థిరంగా ఎగసి నిలబడతాయి. ఇవి అక్కడ వచ్చి పోతుండే భూకంపాల తీక్ష్ణత వల్ల ఈ కాల పరిమితిలో మార్పు కనబడుతుంటుంది అంటారు ఈ పార్క్ అధికారులు.
Mammoth Hot Springs: మరుగుతూ కొండలపైనుండి ఆవిర్లతో పొర్లుతుండే చిన్న చిన్న తొట్టెలలోంచి జాలువారే జలపాతాలు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. భూమి ఉపరితలం క్రింద సగం కరిగిన 'మాగ్మా గది' లో మరుగున్న నీరు సున్నపురాళ్లు ఈ వింత ఉపరితల రూపకల్పనాక్రమానికి కారణం కావచ్చు అంటారు అక్కడి వారు.
Grand Prismatic Spring: 'పట్టకం లోంచి వచ్చే జల ధారా?' అనిపించి ఆశ్చర్యపరిచే రంగు రంగుల నీటి ధారలతో ముచ్చటగొలిపే కొండలు, అందాల చిత్రాలు. వివిధ వర్ణ సమ్మిళిత బాక్టీరియా అక్కడి భూమిలోని ఖనిజ పొరల్ని పట్టుకుని అక్కడి నీటిలో పెరిగి ఇంద్రధనస్సు వలె రంగులు దిద్దుకుని నీటితో బయపడి చూపరులకు ఒక వింత దృశ్యాన్ని ప్రదర్శిస్తాయి.
Morning Glory: ముఖ్యంగా 'అప్పర్ గైసేర్ బేసిన్' లో ఉండే 'ఓల్డ్ ఫైత్ఫుల్', గైన్ట్స్ గైసేర్, బీహైవ్ గైసేర్, కాసిల్ గైసేర్, "గ్రాండ్ గైసేర్', ప్రసిద్ధములు. 'మార్నింగ్ గ్లోరీ పూల్' కూడా ఈ కోవకి చెందినవే.
Mud Volcano: భూమి అంతర్భాగంలో ఉన్న ఉష్ణోగ్రతవల్ల పైన తడిసిన మట్టి కుతకుత ఉడుకుతూ వింత అనుభవాన్ని అందిస్తుంది. ఉడుకుతున్న మట్టి బుడగలు పక్క ఫొటోలో చూడవచ్చు. ఈ ప్రాంతంలో సంచరిస్తుంటే నేలలోనుంచి విడుదలయ్యే రసాయన వాయువులు ప్రమాదకరం కాకపోయినా, వాసనలతో కొందరిని ఇబ్బందికి గురిచేస్తాయి.
మరొక సుందర దృశ్యం 'యెల్లో స్టోన్' నది పై ఉన్న రెండు (పైన, క్రింద) సుందర జల పాతాలు. పర్యాటకులు పిల్లలతో ఆనందంగా గడిపేది ఇక్కడే.
ఇక్కడి అడవి జంతువులని దూరంనుంచే చూస్తూ గడపాలిసిందే తప్ప ఫోటోలు తీసుకోవడానికని దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. అల్లాగే కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా నిర్మించబడ్డ చెక్క దారులపైనే నడవాలిగాని, 'బాగానే ఉంది పరవాలేద'నుకుని నేలమీద కాలు పెడితే ప్రమాదంలో పడ్డట్టే. అనేకమంది అటువంటి సాహసం చేసి ప్రాణాలు కోల్పోయారట, ఈ పార్కులో చీకటి పడేవరకు మాత్రమే తిరగవచ్చు. మొత్తానికి ఇక్కడి పర్యటన మరుపురాని వింత అనుభవాన్ని ఇస్తుంది. ఈ వ్యాసం ఉద్దేశ్యం ఆ జాతీయోద్యానవనాన్ని గురించి సంపూర్ణంగా తెలియచేయడం కాదు, స్థలాభావం వల్ల వీలూ పడదు, కానీ దీన్ని చదివిన వాళ్లకి ఆ అద్భుతాన్ని చూసి తమ పిల్లలకి చూపించి వారికి విజ్ఞానాన్ని అందించాలనే ప్రేరణ కలిగిస్తే కృతకృత్యుడనయినట్లే..
-o0o-
Quite interesting to know. Thank you for sharing