నేను తప్పునో ఒప్పునో..
అజ్ఞానపు తుప్పునో నాకే తెల్వదయ్యా..
నిన్నే నమ్మా.. నీ పాదాలనే పట్టా
లేపతవో పండబెడతవో నీ ఇష్టమయ్యా
నీ ఆటకు నీవె భళా సదాశివా...!
ఏనుగులు దోమల కుత్తుకజేరుట
కురు వీరులు పసి వాడిని పొడుచుట
ధర్మం దగాకోరుల చేతిలో దగా పడుట
నీ ఆట గదయ్యా...
నీ ఆటకు నీవె భళా సదాశివా...!
ఏ గుడిలో చూసిన రాతివయ్యా
కదిలే గుడిలో జ్యోతివయ్యా
రాతికి జ్యోతికి భేదము లేదా
నీ ఆటకు నీవె భళా సదాశివా...!
బ్రహ్మణుడినని ఒకడు బలిసి వాగుతాడు
క్షత్రియుడినని ఒకడు చేతలు చూపుతాడు
వైశ్యుడనని ఇంకొకడు వేగిపోతడు
క్షూద్రుడునని మరొకడు క్షోభ పడతాడు
ఎవడైనా నీ కంటి మంట ముందు ఒకటే కదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నేనూ... భిక్షగాడినే...!
నువ్వూ భిక్షగాడివే...!
అందుకే నీకు నాకు పొత్తు కుదిరెనయ్యా
ఈ పొత్తు నోర్వని తొత్తుగాళ్ళు
పిల్లగాడివి ముసలోడితో నెయ్యమేందని
చిత్తుమాటలు చల్లుతుండ్రూ...
నువ్వు తాండవం ఆడవయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నేను పుస్తకాన్ని
నువ్వు అందున సారానివి
పుస్తకం లేనిదే సారము లేదు
సారము లేనిదే పుస్తకం లేదు
నీకు నాకు భేధమేమిటయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
చిన్నప్పుడు పిల్లవాడివి నీవే
పెరుగుతున్నప్పడు కుర్రవాడివి నీవే
యవ్వనమున లింగాకార రసికుడివి నీవే
పోయేకాలమున ముసలోడివి నీవే
పోయాక మసిపూసుకుని మంకీలు గొట్టే మాయగాడివి నీవే
ఏడురోజుల వలలో ఈ ఏడుపుగొట్టు ఆట చిత్రమయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నేను గతిలేని వాడినయ్యా
నువ్వే 'యతి'వై
మతినిచ్చి నీ గణములో
గళముగా మార్చుకోవయ్యా....
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
రక్షించే కన్ను నీదంట
శిక్షించే కన్ను నీదంట
భక్షించే కన్ను నీదంట
మరి మన్నులోన కలిసే నా కన్ను ఏమిటో...?
ధన్యోస్మి సదాశివా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
శ్రీశైలాన మల్లన్నవి
తిరుమలన వెంకన్నవి
కందిమల్లయ్యపల్లిన బ్రహ్మన్నవి
నా గుండెలోనే *"లింగ"న్న*వి
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!