చూడ చక్కంగా ఉన్నవయ్య
చూసిన కొద్ది చూడబుద్ధి అయితదయ్యా
ఎంతసేపూ నేను నిన్ను చూసుటేగానీ..
నువ్వు నన్ను చూసి చక్కంగా చేయవా...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా....
వెర్రోడొకడు నువ్వు లేవని వాగెనయ్యా
అంతటితో చాలక నిరీశ్వరయాగం చేసెనయ్యా
నువ్వు ఉన్నావో..లేవో...తెలియని ఆటలో వాడైనా..ఎవడైనా
అరటిపండే కదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
క్రిములను పురుగులు తింటవయ్యా
పురుగులను చేపలు తింటవయ్యా
చేపలను మనుషులు తింటరయ్యా
మనుషులను కాలం తింటదయ్యా
కాలాన్ని నువ్వు తింటవయ్యా
నీ ఆకలి తీరిందో లేదో...ఎవడికెరుకా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
ప్రాణాలను దోచి కాట్లో దాచే
దొంగవి నీవు
నీ లింగాన్ని దోచి యెదగూట్లో దాచిన దొంగని నేను
నువ్వు దొంగవే...నేనూ..దొంగనే
దొంగల మధ్య దోబూచూలాట దేనికయ్యా
జర కనిపించరాదా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
ఆమె చేతిలో చిల్లిగవ్వ లేదు
గుడిసె బోన్లో మెతుకు బువ్వలేదు
ఖాళీ కంచాల్లో ఆకలిని ఏపుగ పండించిన ఘనత నీదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
ఆకలి పురుగు కొరుకుతున్నదయ్యా
నీరు ఆ పురుగును తోలలేక నిండుకుంటున్నదయ్యా
నీ లింగానికి పెడుతున్న ఆవేదన పువ్వు
దయచేసి నాకు చావునివ్వు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
నువ్వేమో రాతిలో ఉండి ఖ్యాతి పొందితివి
మమ్ము ఖ్యాతిలో ఉంచి రాతిని జేస్తివి
జ్యోతికి విభూదినిచ్చి బూదిచేస్తూ
జగతితో ఆడుకుంటుంటువి
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
శిలనైయ్యా నేను
నాలో ప్రతిష్టించబడవెందుకు
నీ స్పర్శలేని ఇల ఎందుకు..?
శిల బ్రతుకెందుకు...?
నా తల తీసి నీ కపాలమున వేసుకోవా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
నటనలోనే నవ్విస్తవు
నటనలోనే ఏడ్పిస్తవు
నటనలోనే నన్ను మన్నులో కలిపి నిన్ను చూడమంటవు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
గాలిని మాకు ఇస్తవు
గాలిలో నువ్వు ఉంటవు
గాలిగాళ్ళను మమ్ము చేసి
గాలిని జాలే లేక తీస్తవు
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా....