Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
చం. తిరుమలవేంకటేశపదదివ్యమయూఖము నా శిరంబుపై
      స్థిరముగ నున్నఁ జాలుఁ గద తృప్తిగ వాలి నమస్కరించెదన్
      కరములు ధన్యమౌ గతిని; కల్మషకిల్బిషవృత్రహారి శ్రీ
      కరసరసీరుహోద్భవ మఖండకృపాకర మా కరంబె(1) యౌ 121 
          (1) కిరణమే

మానిని. తత్తఱ మొందుచుఁ దండ్రివి నీవని తప్పక తెల్పఁగ మా వెతలే
         చిత్తగు; సత్తరివాణము(1) వేడిమి చెంతను రుత్తగునట్లె వెసన్
         బత్తులకెల్లను సత్తువ నీవెగ బంగరుదేవళరాయనివై
         సత్తెముగాఁ గడగండ్లను గొట్టుచుఁ జట్టుల(2) నేడిఁటి నేలు దొరా! 122
            (1) సత్తుగిన్నె (2) కొండలు

పంచప్రాసకందము
      గోవిందా! యనఁగా నది
        గో విం దాయెనుగఁ జెవులకును మఱిమఱి మా
        భావిం దాయనగతి(1) నిడ
        మా విం దా(2)యనగఁ దలఁచి మాధవుఁ గొలుతున్ 123
            (1) తాయనగతి = వృద్ధిగతి (2) విందు= చుట్టము

ఉ. చాలదు నాదు వాఙ్మయము; చాలదు నా కవితాపటుత్వమున్
     చాలదు బుద్ధికౌశలము; చాలదు జ్ఞానదృగంతసీమయున్
     చాలును నీ కృపామృతకణం బొకటైన; సువర్ణనామమే
     చాలును వేంకటేశ! కవి చక్కఁగఁ దాల్ప రసాగ్రమందునన్ 124

శా. సాలగ్రామశిలాస్వయంభువుగ నర్చామూర్తివై నిల్చి యీ
      శైలాగ్రంబున సేవలందుకొన నిచ్చల్ చక్షురానందకృ
      ల్లీలావైభవదర్శనం బిడి నతక్లేశాఘసంఘాంతకృ
      ల్లోలాలోకనప్రాప్తి నీయఁగదె నాలో భక్తి సంధిల్లఁగన్ 125
Posted in March 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!