అనుకోలేదు
ఆశలు అపోహలై పడతోస్తాయని
పొరపాట్లు నులిమేస్తాయని
నిజం మౌనంగా నమిలేస్తుందని
నమ్మకం తెరవాలుతుందని,
అనుకోలేదు
మనసులో పురివిప్పిన
అందమైన ఆలోచనలు
పెడరెక్కలు విరచపడి ఆవేదనకు చిక్కి
కుములుతుంటాయని,
అనుకోలేదు
మది గదినిండా జ్ఞాపకాలు
ఎడతెరపక పులకించే ప్రవాహాలు.
ఓ అడ్డుమాటకు దారితప్పి చేదుగా
తలపుకొచ్చి బీడుగా మారతాయని,
అనుకోలేదు
రహస్య సంచారంలో
కలగుహలో చేసిన తపస్సుకు వరమివ్వాలిసిన దేవత
ఒంటరితనాన్ని విసురుతుందని,
అనుకోలేదు
పారే కమ్మని ఆ గొంతు, ఆగిన జలతో
కన్నీటి చెలమను చూపి
దప్పిక తీర్చికోమంటుందని,
అనుకోలేదు
మనసు పుస్తకంలో
"తొలిఅడుగు"కు కట్టిన శీర్షికతో
హుందాగా పూజించే ఓ పుటలో
నా అక్షరాలే విభేదిస్తాయని,
అనుకోలేదు
చీకటిని తాగే త్రాగుబోతుగా
నిద్రబలాన్ని, కల బలగాన్ని పోగొట్టుకొని
పగటి కునుకుకు ఊపిరి
వ్రేలాడుతుందని,
అనుకోలేదు
బతుకును ఉన్నది ఉన్నట్లుగా
తెరచిన పుస్తకంలా చదివించి
హృదయమంతా తిప్పి చూపించి
లేమివాడిగా కానివాడినౌతానని,
అనుకోలేదు
మనసున క్షణం క్షణాన మెదిలిన
ఇష్టాలను దాపరికం లేకుండా
పూజించాలనుకున్న పాదాలు
వెనుతిరుగుతాయని
అనుకోలేదు
కన్న కలలే పేనిన ఉరితాళ్ళని
రాసిన లేఖలే వెతలై
విధిరాతలై వెక్కిరిస్తాయని,
హత్యకు గురవతానని,
అనుకోలేదు
నిజం ఓడిపోయి
నమ్మకం మోడువారి
మనసు బీటబారి
మనిషి తనకు తాను దూరమౌతాడని.