అనంతమైన ప్రేమగా...-అమ్మ
అవని అంత ఓర్పుని
గగనమంత హృదయాన్ని
కలిపి మలచాడు ఆ బ్రహ్మ అమ్మని.
ఊపిరితో అల్లుతుంది బంధాన్ని
ఉలిదెబ్బైనా తగలకుండా
అపరంజి బొమ్మను
చెక్కుతుంది తన ప్రతిరూపంగా..
చనుబాల అమృతధారతో
బంధానికి ప్రాణం పోసి
తనువంతా దారపోస్తుంది.
మమకారపు మాధుర్యాన్ని
పంచుతూ.. అలసిపోదు
ఆటుపోటుల తీరంలా..
రెప్పవాల్చని చూపు తో
మేలుకొనే ఉంటుంది.
బిడ్డల తప్పటడుగులకు
మడుగులు ఒత్తుతూ
ఒడినే ఊయల చేసి ఊపుతూ..
తన ఎదసడితో జోల పాడుతూ..
అనంతమైన ప్రేమగా ..