Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 19
సత్యం మందపాటి

స్పందన

1995లో నా మొట్టమొదటి ‘అమెరికా తెలుగు డయాస్పొరా’ పుస్తకం “అమెరికా బేతాళుడి కథలు” విడుదల అయినప్పుడు, మా ఆస్టిన్ న్యూస్ పేపర్ రిపోర్టర్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘మీరు కథలు వ్రాయటం ఏ స్కూల్లో చదువుకున్నారు?’ అని అడిగింది. అవును మరి! అమెరికాలో స్టోరీ రైటింగ్ మీద క్లాసులూ ఉన్నాయి, డిగ్రీలూ సర్టిఫికేట్ కోర్సులూ ఉన్నాయి. ఆమెకు నేనిచ్చిన సమాధానం, ‘ఆరోజుల్లో భారతదేశంలో కథలు, నవలలు, నాటికలూ వ్రాయటంలో కాలేజీ కోర్సులు లేవు. పెద్ద రచయితలు కూడా కథలు, నవలలు, నాటికలు వ్రాయటంలో వారి బాణీలు, స్వతంత్రంగానూ, పుస్తకాలు చదవటం ద్వారాను నేర్చుకున్నారు. నేనూ అంతే. తెలుగులో గొప్ప సాహిత్యమున్నది. నా చిన్నతనంనించీ పత్రికలూ, పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని. అప్పుడే నాకు వ్రాయాలనే కోరిక వచ్చి, వ్రాయటం మొదలుపెట్టాను. నా రచనలు వారికి నచ్చి ప్రచురించి వివిధ పత్రికలు ప్రోత్సహించాయి. అలా ఎందరో మహానుభావులే నాకు పరోక్షంగా రచనలు చేయటం నేర్పించారు’ అని. అలా నేర్చుకున్న వారిలో మధురాంతకం రాజారాం, త్రిపురనేని గోపీచంద్‍, బుచ్చిబాబు, కొడవటిగంటి, రావిశాస్త్రి మానసిక విశ్లేషణతో రచనలు చేయటం నన్ను ఆకర్షించింది. తర్వాత ఎన్నో సైకాలజీ పుస్తకాలు చదివి, మనిషితో మనసు ఆడే ఆటల మీద కొన్ని కథలూ వ్యాసాలూ వ్రాశాను. అలాటి మానసిక విశ్లేషణతో ఆనాడు నేను వ్రాసిన కొన్ని కథలలో ఒక కథే ఈ ‘ఎర-చేప’. చదివి ఎలా ఉందో చెబుతారు కదూ!

‘ఎర – చేప’

(ఈ కథ ‘ఆంధ్ర సచిత్రవారపత్రిక’ ఏప్రిల్ 9, 1976 సంచికలో ప్రచురింపబడింది.)

Era Chepa story image

సుబ్బలక్ష్మి కళ్ళు టపటపా ఆర్పి చూసింది. ఎత్తయిన బుగ్గల మీద ఎగురుతున్న కురులను ప్రక్కకు సర్దుకుని మళ్ళీ చూసింది. అతను తెల్లగా, పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. మెల్లగా తనవేపే నడుస్తూ వస్తున్నాడు.

౦ ౦ ౦

అప్పారావు కళ్ళెత్తి సుబ్బలక్ష్మిని సూటిగా చూశాడు. ఆమె కనురెప్పలు సిగ్గుతో క్రిందకు వాలిపోయాయి.

అప్పారావు నడుస్తూనే ఆమెను కళ్ళతో త్రాగేస్తున్నాడు. అరచేయంత విశాలమైన కళ్ళు. కళ్ళ మధ్య నుంచి క్రిందకు సూదంటురాయిలాంటి ముక్కు. ఇంకా కొంచెం క్రింద మెరుస్తున్న పెదవులు.

వెనుక కారు హోరన్ గట్టిగా మ్రోగటంతో ఉలిక్కిపడి, రోడ్డు ప్రక్కకు తప్పుకుని చకచకా నడవసాగాడు అప్పారావు.

౦ ౦ ౦

అతను తనకు దగ్గరగా వస్తున్నాడు.

సుబ్బలక్ష్మి ఆత్రంగా అతన్ని చూస్తున్నది.

అతను తని దాటి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి అతను మళ్ళీ తనని చూస్తాడా?

చూశాడంటే అతను తన ఉనికిని గుర్తించినట్టే!

ఇంతకీ అతను చూస్తాడా? సస్పెన్స్!

సుబ్బలక్ష్మి ఆత్రంగా చూస్తున్నది.

అతని విశాలమైన భుజాల మీదున్న తల మెల్లగా తన వేపు తిరిగింది.

అతను ఆగాడు. వెనక్కి తిరిగాడు.

అమ్మయ్య! చూసేశాడు. అతను వెనక్కి తిరిగి తనని చూసేశాడు.

సుబ్బలక్ష్మికి మహదానందమయింది.

౦ ౦ ౦

అరె! ఆమె కూడా తననే చూస్తున్నది.

అప్పారావు కొంచెం కంగారుపడ్డాడు.

తను చూడాలనే ఆమె ఎదురు చూస్తున్నట్టుంది. అంటే తనని గుర్తించిందన్నమాట!

హాయ్... స్వీట్!

అప్పారావు చిన్నగా నవ్వాడు.

ఆమెకు కనపడేట్టుగా!

ఆమె హృదయాన్ని తాకేట్టుగా!

ఆమె మనసులో కలకాలం ఇంకిపోయేలా!

౦ ౦ ౦

ఓ దేవుడా… అతను తనని చూసి నవ్వేశాడు.

సుబ్బలక్ష్మి హృదయం సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిరిపడింది. ఎడం చేతిని గుండెల మీద వేసుకుని, కుడి చేతిని పైకెత్తి సుతారంగా ఇటూ అటూ ఊపింది. సాధ్యమైనంత అందంగా చిరునవ్వు నవ్వింది.

౦ ౦ ౦

గాడ్… తనని చూసే చేయి ఊపింది.

అప్పారావు గుండె ఒక్క క్షణం ‘లబ్ డబ్’ అనటం మానేసింది. మానేసి ఊరుకోక అప్పారావు మనసుని గిలిగింతలు పెట్టింది.

అప్పారావు కూడా చేయి పైకెత్తి, సున్నితంగా అటూ ఇటూ ఊపాడు.

“హాయ్” అందామనుకుని, అనలేక ఊరుకున్నాడు.

౦ ౦ ౦

“అబ్బ… ఎంత అందంగా ఉందో!” అనుకున్నాడు అప్పారావు. “అబ్బో… ఎంత చక్కగా ఉన్నాడో” అనుకుంది సుబ్బలక్ష్మి.

౦ ౦ ౦

నాన్న పెళ్ళి చేయడు. కట్నం ఇచ్చుకోలేడు కదా మరి!

రెండేళ్ళ నించీ జీతాలివ్వని స్కూల్లో నలభై ఏళ్ళనించీ పని చేస్తున్నాడు అలుపెరుగని నాన్న.

సుబ్బలక్ష్మి ఉబ్బిన ఎర్రటి నున్నటి బుగ్గల మీద అరిచేతులు ఆనించుకుని ఆలోచిస్తున్నది.

ఎంతోమంది పిల్లల్ని ధైర్యగా కనగలిగిన నాన్న, (అంటే నాన్నే పిల్లల్ని కన్నాడని కాదు), వాళ్ళని పెంచటానికి భయపడిపోతున్నాడు. భయపడీ, పడీ, పడీ ఇప్పుడు మంచాన పడ్డాడు.

ఇంట్లో మిగతా అందరూ సరిగ్గా తిండి కూడా లేకుండా నానా అవస్థలూ పడుతున్నారు.

అందుకే సుబ్బలక్ష్మి ఆలోచిస్తున్నది.

మరి సుబ్బలక్ష్మి పుట్టి ఇప్పటికి ముఫై ఏళ్ళు దాటింది.

రోజూ గులాబీలు పూస్తున్నాయి. మల్లెలు గుబాళిస్తున్నాయి.

చందమామ వెన్నెల విరజిమ్ముతున్నాడు.

అందుకే సుబ్బలక్ష్మి ఆలోచిస్తున్నది.

కుర్రవాడు ఎర్రగా, బుర్రగా, కాస్తో కూస్తో ఉన్నవాడిలాగానే ఉన్నాడు.

దానికితోడు, తనని చూసి హాయిగా నవ్వాడు కూడాను.

కట్నం ఖర్చు, పెళ్ళి ఖర్చులు తప్పుతాయి.

ఈ దెబ్బతో నాన్న కన్నీటి కష్టాలూ, తన తీరని బాధా రెండూ తీరతాయి.

అందుకే సుబ్బలక్ష్మి ఆలోచిస్తున్నది.

అప్పారావుని అలవోకగా చూసి హరివిల్లులా నవ్వింది సుబ్బలక్ష్మి.

౦ ౦ ౦

తనకి ఉద్యోగం ఇక రాదు. వచ్చే అవకాశాలూ లేవు.

మూడేళ్ళ డిగ్రీ చదువూ, ఆరేళ్ళ నిరుద్యోగం తనకి జీవితంలో పాఠాలు నేర్పాయేగానీ, కడుపు నింపలేదు.

అప్పారావు దుబ్బుగా పెరిగిన క్రాఫులో, తన పొడవైన చేతివేళ్ళు ఉంచి ఆలోచిస్తున్నాడు.

ఏదో నాలుగు రాళ్ళు సంపాదిస్తాడని (ఇప్పుడతను రోడ్డు మీద తిరుగుతూ, ఆ రాళ్ళనే సంపాదించగలడు), అతని నాన్న ఉన్న రెండెకరాల పొలం తెగనమ్మి తనని చదివించాడు.

చదివించాడేగానీ, అతనికే ఉద్యోగమూ ఇప్పించలేకపోయాడు.

అంతేకాదు, ఆ బాధతో ఈ లోకమే వదిలి వెళ్ళిపోయాడు.

ఇంట్లో అందరూ అక్కడా ఇక్కడా చిల్లర పనులు చేస్తూ నెట్టుకొస్తున్న తన మీదే ఆధారపడి ఆకలి అరుపులు అరుస్తున్నారు.

అందుకే అప్పారావు ఆలోచిస్తున్నాడు.

తను పుట్టి ముఫ్ఫై ఐదేళ్ళ పైనే అయింది.

రోజూ పిల్లగాలులు వీస్తున్నాయి.

ఆడపిల్లల కళ్ళు కవ్విస్తున్నాయి.

నరాలు నమిలేస్తున్నాయి.

కడుపు ఆకలేసి కేకలేస్తున్నది.

అందుకే అప్పారావు ఆలోచిస్తున్నాడు.

పిల్ల కూడా అందంగా, కవ్వింపుగా ఉంది.

కాస్తో కూస్తో ఉన్నవారి అమ్మాయిలాగానే ఉంది.

దానికితోడు తనని చూసి చిరునవ్వు నవ్వింది కూడాను.

ఈ దెబ్బతో తన కష్టాలూ, బాథా కూడా తీరతాయి.

అందుకే అప్పారావు ఆలోచిస్తున్నాడు.

సుబ్బలక్ష్మిని వాడిగా చూసి, వేడిగా నవ్వాడు అప్పారావు.

౦ ౦ ౦

చేపను చూసి “ఇదో వెర్రిమాలోకం. తనని తినటానికి వచ్చి, గాలానికి తగులుకుని తనే ఆహారమైపోతున్నది. ఒక ఆలోచనా లేదు, పాడూ లేదు” అనుకుంటుంది ఎర.

ఎరని చూసి “ఇదో పిచ్చిమాలోకం. కదలకుండా గాలానికి తగిలేస్తే, అలాగే నిస్సహాయంగా కొనవూపిరితో నా వేపే చూస్తున్నది. దీన్ని తినేసి నా కడుపు నింపుకోవాలి” అనుకుంటుంది చేప.

Posted in March 2024, కథలు

8 Comments

  1. Sreeni

    బాగుందండి. నిజమేకదా ఎర చేప గురించి. చేప ఎర గురించి అనుకునేది. ఈనాటికి కూడా చూస్తున్నాం అలాంటివి. చాల బాగుంది.

    • సత్యం

      ధన్యవాదాలు శ్రీని. ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషం.

  2. కుమారి సామినేని

    అప్పటి రోజుల్లో మధ్య తరగతి వారి వాంఛలూ, వాస్తవాలూ! 👏🏼👏🏼💐💐

  3. Anil అట్లూరి

    ఇదివరలో ఈ కథ చదివిన గుర్తుంది. చి న
    పేర్లు కొంత పరిసర వాతావరణం మార్పులతో సమకాలీన సాహిత్యంలో చోటు సంపాదించుకోగలదు ఈ కథ.

    • Satyam

      ఈ కథని ఆరోజుల్లో ఆంధ్ర సచిత్రవార పత్రికలోనో, తర్వాత 1996లో విడుదలైన నా పుస్తకం “చెట్టు క్రింద చినుకులు” కథల సంపుటిలోనో చదివి ఉంటారు. ధన్యవాదాలు మిత్రమా!

  4. భాస్కర్ పులికల్

    ఆ కాలానికి మీరు ఎంచుకున్న కథా వస్తువు, కథా శిల్పం, పదాల పొందిక కొత్తవే అనుకుంటాను. ఆ విధంగా మీరు trail blazer లే. ఈ కాలంలోనూ ఇలాంటి ఆలోచనలు యువ తరంలో వస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఈ కథ ఎప్పటికీ అన్వైస్తుందనే నా అభిప్రాయం. అభినందనలు.

    • సత్యం

      మనుష్యులూ మారరు. స్వతహాగా వచ్చిన వారి మనస్తత్వాలూ మారవు. అవి కాలాతీతమైనవి. మీకీ కథ నచ్చినందుకు ధన్యవాదాలు భాస్కర్!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!