అమ్మంటే....
నీకు జోలపాడి నిద్ర పుచ్చేదే కాదు...
నీ మనోవేదనను తీర్చగలిగే
మంచి ఔషధం కూడా.
అమ్మంటే....
నీకు గోరుముద్దలు తినిపించేదే కాదు...
నీ మనసెరిగిన
మంచి స్నేహితురాలు కూడా.
అమ్మంటే....
అమృత వర్షిణీయే కాదు...
నీ సమస్యల సుడిగుండాలను
పరిష్కరించి ఒడ్డుకు చేర్చగల నేర్పరి కూడా.
అమ్మంటే....
నీకు తొలిమాటను నేర్పడమే కాదు...
సమాజంలో నీవు ఏ తీరున
మాట్లాడి గెలవాలో నేర్పే గురువు కూడా.
అమ్మంటే....
నీకు తొలి అడుగు వేయించేదే కాదు...
నీ జీవనయానంలోని సుడిగుండాలను
ఎదుర్కొని ఎలా ఒడ్డుకు చేరాలో నేర్పగల జ్ఞానశీలి కూడా.
అమ్మంటే...
ప్రాణదాత మాత్రమే కాదు...
సమాజంలో నీకు సమస్యలు ఎదురైనప్పుడు
నీ రక్షణార్ధం అవసరమైతే దుష్టుల ప్రాణాలను కొల్లగొట్టగల ధైర్యశాలి కూడా.
అమ్మంటే....
పిల్లలకు చదువు నేర్పడమే కాదు...
సమాజాన్ని కూడా క్షుణ్ణoగా చదివి
సరైన సమయంలో తగిన సలహాలను అందించగల విజ్ఞాని కూడా.
అమ్మంటే....
వంటచేసి కుటుంబ ఆకలి తీర్చడమే కాదు...
అనాథులను, అభాగ్యులను
ఆదరించి ఆశ్రయం కల్పించగల మానవతావాది కూడా.
అమ్మంటే.... భూదేవంతటి సహనశీలి మాత్రమే కాదు
అవసరార్ధం అపరకాళి అవతారం కూడా అమ్మంటే.