పూర్వం అవంతి రాజ్యం లో రామానందుడు అనే సాధు పుంగవుడు వుండేవాడు. అతడు సకల వేద, శాస్త్ర పారంగతుడు. పురాణేతి ఇతిహాసాలను ఔపోసన పట్టిన దిట్ట. ఊరికి నాలుగు క్రోసుల దూరంలో ఒక నది ఒడ్డున చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తుండే వాడు. రామానందుడు మహా విష్ణు భక్తుడు. వేకువజామునే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, స్వయంగా గోవు పాలు పితికి విష్ణువుకి అభిషేకం గాని పచ్చి గంగయినా ముట్టేవాడు కాదు. శివ భక్తియే కాక రామానందుడు గొప్ప మానవతా విలువలు మూర్తీభవించిన నిర్మల హృదయుడు. తన గుమ్మం లోకి ఎవరు వచ్చినా సరే, తనకు మిగిలిందా లేదా అని కూడా చూసుకోకుండా దానధర్మాలను చేస్తుండేవాడు.
ఒకసారి శ్రీ మహావిష్ణువు రామానందుని భక్తి, విశ్వాసాలను పరీక్షించదలిచాడు. రామానందుని ఆశ్రమ ప్రాంతం లో తీవ్రమైన కరువు కాటకాలను సృష్టించాడు. ఆ ప్రాంతంలోని ప్రజలు దేశం లోని ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిపోసాగారు. ఆశ్రమానికి వచ్చి కానుకలను సమర్పించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సరైన పోషణ లేక ఆవు కూడా కొద్ది రోజులకే మరణించింది. ఎన్ని ఇబ్బందులు ఏకకాలం లో ఎదురైనా సరే రామానందుడు తన విష్ణువు ఆరాధనను మానలేదు. పాలు లేకపోయినా, స్వచ్చమైన నదీ జలంతో నిత్యం తన ఇష్టదైవానికి అభిషేకం జరుపుతుండే వాడు. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అనే చందాన తనను సృష్టించిన ఆ విష్ణుభగవానుడే తన పోషణ భారం కూడా చూసుకుంటాడన్న ధృఢమైన విశ్వాసంతో వున్నాడు రామానందుడు .
ఇదిలా వుండగా ఒకసారి ఆశ్రమం లో బియ్యపు గింజలు పూర్తిగా నిండుకున్నాయి. తోటలో ఫలాల చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయాయి. కటిక ఉపవాసం చేయవలిసి వచ్చింది. అయినా కేవలం మంచి నీరు త్రాగుతూ, నారాయణ మంత్రం జపిస్తూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు రామానందుడు.
నాలుగు రోజులు అలాగే గడిచాయి. తీవ్రమైన నీరసం ఆవహించినా నమో నారాయణ మంత్ర జపం ఆపలేదు రామానందుడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి కొంచెం బియ్యం సమర్పించి వెళ్ళాడు. "నారాయణార్పణమస్తు" అని ఆ బియ్యాన్ని పులగం వండి నారాయణుడికి నైవేద్యం అర్పించాడు రామానందుడు. అతి పవిత్రమైన ఆ భుక్తా హారాన్ని స్వీకరించే తరుణం లో "తండ్రి, ధర్మం చెయ్యండి" అనే అతి దీనమైన పిలుపు ఆశ్రమ ప్రాంగణం లో వినిపించింది. వెంటనే బయటకు వెళ్ళి చూస్తే ఒక ముసలి వ్యక్తి చేతిలో కర్రతో వణుకుతూ నిలబడి వున్నాడు. ముఖమంతా మడతలు పడి వుంది. శరీరం వార్ధకం తో నిండి వుంది."స్వామీ! వారం రోజుల నుండి తిండి లేదు. ఆకలితో చచ్చిపోతున్నాను. తినడానికేమైనా ఇచ్చి కాస్త పుణ్యం కట్టుకో. ఏ క్షణాన్నైనా నా ప్రాణం పోయేట్టు వుంది" అని అతి దీనంగా విలపించాడు ఆ ముసలి వ్యక్తి.
రామానందుని హృదయం ఆ మాటలకు పూర్తిగా ద్రవించింది. తన ఆకలి కంటే ఆ ముసలివాని ఆకలి మరింత తీవ్రమైనది. తాను అదృష్టం చేసుకోబట్టే ఆ ముసలి వాని ఆకలి తీర్చే భాగ్యం తనకు కలిగింది అనుకుంటూ ఆ ముసలిని "అతిథి దేవో భవ" అంటూ సాదరంగా ఆహ్వానించి, కాళ్ళు చేతులు కడిగి ఒక ఆసనంపై కూర్చోబెట్టి తాను వండిన అన్నం మొత్తమును ఆ ముసలి వానికి వడ్డించేసాడు. భోజనానంతరం త్రాగడానికి స్వచ్చమైన నీరు ఇచ్చి "మీరు అలసట తీరే వరకు ఇక్కదే విశ్రమించండి" అని అతనిని తన ఆశ్రమం లోపల పరుండబెట్టాడు. అంతే కాక తానే స్వయంగా అతనికి సపర్యలు చేసాడు. సాయంత్రానికి సేద తీరి తిరిగి శక్తి సంపాదించుకున్న ఆ ముదుసలి తనకు జరిగిన అథిధి సత్కారానికి ఎంతో ఆనందించి రామానందుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తినడానికి ఏ మాత్రం భోజనం మిగలనందుకు రామానందుడు కించిత్ కూడా బాధ పడలేదు. పైగా వాకిట్లో నిలచిన అతిధికి తాను చేతనైనంతగా సత్కారం చేయగలిగినందుకు ఎంతో సంతోషించాడు. ప్రాణాలను నిలుపుకునేందుకు నారాయణ అష్టాక్షరీ మంత్ర జపమునే సాధనంగా ఎంచుకున్నాడు.
ఆ ముదుసలి రూపం లో వచ్చి తన భక్తుడిని పరీక్షించిన మహా విష్ణువు తన అగ్ని పరీక్షలో నెగ్గినందుకు రామానందుడిని ఆశీర్వదించాడు. జీవితపు అంతిమ ఘడియలలో అతనికి శాశ్వత వైకుంఠ లోక ప్రాప్తి ప్రసాదించాడు. భగవంతుడు పెట్టే వివిధ రకములైన పరీక్షలకు తట్టుకొని, ఆత్మ విశ్వాసం తో సహనం పట్టుదలతో ఆ భగవంతుని పాదాలను చివరి వరకు విడువని వారే అధ్యాత్మిక జీవితంలో విజయం సాధిస్తారు అనడానికి రామానందుడి జీవితమే ఒక నిదర్శనం.