Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట

తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన శైలి గురించిన సమాచారం అందించడమే ఈ ‘ఆదర్శమూర్తులు’ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంచికలో తమ తమ రంగాలలో నిష్ణాతులై, నిస్వార్ధంగా నివసించి అందరికీ మంచి మార్గాన్ని చూపించిన ఒక మహానుభావుడి గురించిన సమాచారం క్రోడీకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము.

మన సిరిమల్లె పంచమ వార్షిక ప్రత్యేక సంచిక సందర్భంగా సెప్టెంబర్ 2019 నుండి జూలై 2020 సంచిక వరకు ప్రచురించిన ఆదర్శమూర్తుల జీవిత గాథలు మరొక్కసారి సంగ్రహంగా మీకు అందిస్తున్నాం.

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2019 - శ్రీ గిడుగు వెంకట రామమూర్తి

మన తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది. అయినను నేటికీ ఎనిమిది కోట్లమంది తెలుగు ప్రజలలో ఎంతమందికి తెలుగు భాష మీద పట్టు లభించి తెలుగు పదాలతోనే ముచ్చడించుకొనే స్థాయిలో ఉన్నారని ప్రశ్నించుకొంటే ఆ శాతం బహు తక్కువే. అందుకు కారణము సామాజిక జీవన శైలిలో నిత్యం సంక్రమిస్తున్న మార్పులు మరియు పరభాషా ప్రమేయాలు. ఆదికవి నన్నయ్య మొదలు బ్రిటిష్ వారు మనలను పరిపాలించే సమయం వరకూ ఉన్న తెలుగు భాష రీతి వేరు. ఆంగ్లేయుల పరపతితో మన బడులలో ఆంగ్ల భాష బోధించే ప్రక్రియ మొదలైనప్పటి నుండీ మన తెలుగు భాష మరీ అధ్వాన్నంగా తయారైంది.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-gidugu-venkata-ramamurthy/

అక్టోబర్ 2019 - శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహాద్భుతాలు సృష్టించవచ్చు. దానికి త్రికరణశుద్ధి గా అంకితభావం కూడా జోడైతే ఇక ఆ మనిషి చేసే ప్రక్రియలన్నీ మానవాళికి ఎంతో మహోన్నత మేలు చేసేవే అవుతాయి. అటువంటి మేధస్సుతో, ఎన్నో వినూత్నమైన ప్రక్రియలతో సాంకేతిక రంగంలో ముఖ్యంగా జలనియంత్రణ సమస్యలకు అతి సులువుగా పరిష్కారం చూపి, ఇబ్బందులను అధికమించి ఆద్యుడై నిలిచి, నేటికీ ఎంతో మంది ఇంజనీర్లకు స్ఫూర్తిని అందిస్తున్న భారతరత్న సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మన తెలుగువాడు, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-mokshagundam-visweswarayya/

నవంబర్ 2019 - సంగీత బ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి

బంటు రీతి కొలువీయ వయ్య రామ…..
సామజవరగమనా.. సాధుహృత్..సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత....
సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి....
నగుమోము గనలేని నా జాలి తెలిసి....

మనలోని మానసిక రుగ్మతలను, వత్తిడులను రూపుమాపేందుకు సంగీతం ఒక దివ్యౌషధం గా పనిచేస్తుందని మహాయోగుల మొదలు నేటి సద్గురువుల వరకూ అందరూ నిరూపించారు. సంగీతం అంటే ఇష్టపడని వారు బహుశా ఎవ్వరూ ఉండరు. ఈ సంగీతానికి రాగాలు కట్టి, ఎంతో శ్రావ్యంగా, ఖచ్ఛితమైన  శ్రుతిలో వినడానికి కృషి సల్పిన ఎంతో మంది వాగ్గేయకారులు ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు మనం ఇప్పుడు వింటున్నాం, మన తరువాతి తరానికి కూడా నేర్పిస్తున్నాం. కాని వాటి వెనుక తమ జీవితాలను ధారాదత్తం చేసిన త్యాగయ్య, పురందరదాసు, ముత్తుస్వామి, ఇలా ఎందఱో మహానుభావులు వున్నారు.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sangeetha-brahma-srithyagarajaswami/

డిసెంబర్ 2019 - శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తి

ప్రతి మనిషి పుట్టుకకు ఒక నిర్దిష్టమైన కారణముంటుంది. ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసినప్పుడు మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందంటారు. కొందరి జీవితాలలో అదృష్టం కూడా తోడై వారు చేసిన మహాత్కార్యాలకు మంచి గుర్తుంపు లభించి సమాజంలో వారికంటూ ఒక ఉనికి ఏర్పడుతుంది. మరికొందరు ఎటువంటి గుర్తింపుల గురించి గానీ, వచ్చే అవకాశాల అదృష్టాన్ని పరీక్షించుకోవడం గానీ చేయక, ఆ సమయాన్ని కూడా విలువకట్టలేని అమూల్యమైన విషయాలను భావితరాలకు విశ్లేషణ రూపంలో అందించాలని ‘నివురుగప్పిన నిప్పు’ వలె తమ వృత్తి, ప్రవృత్తి నిష్ఫలాపేక్షతో చేసే అక్షరోపాసన అయి, తమ జీవితాలను నిత్యం సమాజ శ్రేయాస్సు కు సహకరించే విషయాల మీద కేంద్రీకరిస్తారు. ఆ కోవలోకే చేరిన  మితభాషి, మననశీలి, అనాసక్త తత్వాన్వేషి, ఋషితుల్యులు శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తి నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/suraparaju-radhakrishna-murthy/

జనవరి 2020 - శ్రీమతి సావిత్రిబాయి ఫూలే

మనుషులందరిలో ప్రవహించేది ఒకే రక్తమైననూ మానవ సమాజంలో జాతి విభేదాలు ఒకప్పుడు మెండుగా ఉండేవి. నేడు కూడా అక్కడక్కడా కనపడుతున్నాయి. అటువంటి జాతి వైషమ్యాలను తొలగించేందుకు ఎందఱో మహానుభావులు ఎంతో అభ్యుదయ సామాజిక స్పృహతో, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి అదే నిజమైన మానవత్వమని నిరూపించారు. అటువంటి వారు కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించి సమాజంలో మార్పు కొరకై శ్రమించారు. అటువంటి మహోన్నత సంఘ సంస్కర్త మరియు మంచి రచయిత్రి అయిన శ్రీమతి సావిత్రి బాయి ఫూలే నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/savithribhayi-phoole/

ఫిబ్రవరి 2020 - సంగీత కళానిధి శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ

సంగీతమే తమ జీవితంగా బతికిన మహానుభావులు ఎందఱో ఉన్నారు. వారి జీవన కాలంలో ఎన్నో కృతులకు, రాగాలకు, స్వరకల్పనలకు జీవం పోశారు. కొంతమంది మాతృ భాషలోనే రచనలు చేసి రాగాలను సృష్టిస్తే మరికొంత మంది ఇతర భాషలలో కూడా తమ పాటవాన్ని చూపారు. అటువంటి వారిలో కర్నాటక సంగీతంలో నిష్ణాతుడు, ప్రాకృత, సంస్కృత, కన్నడ, మరియు తెలుగు బహు భాషాకోవిదుడు, మధుర గాయకుడు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-rallapalli-ananthakrishna-sharma/

మార్చి 2020 - శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు

సాహిత్య తేజోమూర్తి (23 నవంబర్1931 - 9 జులై 2002) శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు నిన్నమొన్నటివారు. ఇంచుమించుగా ఇరవయ్యో శతాబ్దం కాలయవనిక వెనక్కు వెళుతూండగా వీరు ఆంధ్ర సారస్వత రంగం నుంచి తన పాత్రను నిశ్శబ్ద మౌన సుందరోజ్జ్వలంగా నిర్వహించి నిష్క్రమించినవారు. లోకంలో పరమ భావుకత, పరిపూర్ణ పాండిత్యం ఎక్కడైనా లోచన గోచరం కావచ్చు. కానీ దానిని అనుభవించడానికి ఎంతో గొప్ప సాహిత్య సంస్కారం కావాలి. జపంలా, తపంలా, మంత్ర సాధనలా దానిని పొందడం అందరికీ సాధ్యమా! నిజానికి కవికంటే వ్యాఖ్యాత, భావుకత-సహృదయతలలో గొప్పవాడని చెప్పాలేమో. కవి ప్రతిభలోన రసము వేయిరెట్లు గొప్పది అని విశ్వనాథవారంటారు. కానీ రసోపాసన సాహిత్య ప్రీతిచిత్తులందరికీ సాధ్యమా జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారివంటివారికి తప్ప.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-jonnavitthula-ramakrishna-sharma/

ఏప్రిల్ 2020 - డా. లూయీ పాశ్చర్

నిజజీవిత సమస్యల సుడిగుండాలలో చిక్కుకున్నప్పుడు మానవ మేధస్సులో ఆ సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనేందుకు వీలైన ఆలోచనలు, ఆవిష్కరణలు ఉద్భవిస్తుంటాయి. ఆ ఆవిష్కరణలు కొంతమంది మహామహుల విశేష కృషి వల్ల వెలుగులోకి వచ్చి అదే సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది జీవితాలలో ఆ గ్రహణం వీడి వెలుగులు నింపడానికి దోహదపడుతుంది. అటువంటి సమస్యల పరిష్కారానికి సరికొత్త నిర్దేశాలను నిర్వచించడానికి తమ జీవితాలను అంకితం చేసే వారినే ‘మార్గదర్శకులు’, ‘ఆదర్శమూర్తులు’ అంటారు. ఆంత్రాక్స్, రబీస్ తదితర వ్యాధులకు మందులను కనిపెట్టడంలో మూలపురుషుడై అవిరళ కృషి సల్పిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ (Louis Pasteur) నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/louis-pasteur/

మే 2020 - శ్రీ దేవరపల్లి ప్రకాశ్‌ రావు

ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి, ప్రాధాన్యత కలిగిన వస్తువుల మూలాలన్నీ ఈ మట్టిలో నుండి ఉద్భవించినవే. బంగారం, ప్లాటినం, మణులు అన్నీ భూమినుండి లభిస్తున్నవే. కానీ తమ స్వయం ధర్మాల ఆధారంగా వాటికి గుర్తింపు లభిస్తుంది. అలాగే, నివసిస్తున్న పరిసరాలు, చుట్టుప్రక్కల సమాజం అపరిశుభ్రంగా ఉండవచ్చు. నివసిస్తున్న ప్రదేశాలు చాలా ఇరుకుగా ఉండవచ్చు. కానీ సాటి మనిషి కష్టాన్ని గుర్తించి మానవత్వంతో ఆదుకొంటూ, మానవజన్మ సార్థకత విలువలను గుర్తించిన సగటు మనిషి యొక్క  మనసు ఎంత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, విశాలంగా, పవిత్రంగా ఉంటుందో తమ కర్తవ్యాలతో ఎందఱో మహానుభావులు నిరూపించి మనకు ఆదర్శమూర్తులుగా, స్ఫూర్తి దాతలుగా నిలుస్తున్నారు. అటువంటి కోవలో నిలిచి తన దైనందిన జీవన కర్తవ్యాలతో ఎంతో పరిణితి సాధించిన మహానుభావుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, శ్రీ దేవరపల్లి ప్రకాశ్‌ రావు నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/devarapalli-prakash-rao/

జూన్ 2020 - శ్రీ ఆర్యభట్ట

భూమి గోళాకారంలో ఉండి ఒక నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుందని, మిగిలిన గ్రహాలను కలుపుకొని సౌరకుటుంబం ఏర్పడిందని, ఈ విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రమని మనకు తెలుసు. కానీ ఒకప్పుడు, భూమి బల్లపరుపుగా ఉంటుందని, సూర్యుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ పగలు రాత్రి ఏర్పడుతుందని నమ్మేవారు. ఆ అపోహను తొలగించి ఐదవ శతాబ్దంలోనే వాస్తవాలను కనుగొని అంతరిక్ష శాస్త్రంలో భారతదేశానికి ఉన్నత స్థానాన్ని కల్పించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మన భారతీయుడు ‘ఆర్యభట్ట’ నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-aryabhatta/

జూలై 2020 - శ్రీ పి వి నరసింహారావు

క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్తుల కాలంలో ‘చాణుక్యుడు వ్రాసిన అర్థశాస్త్రమే నేటి రాజకీయ పరిపాలనా విధానాలకు మూలం. ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మంది రాజులు ఈ అర్థశాస్త్రాన్ని అవపోసనపట్టి తమ రాజ్యాలను ఎంతో జనరంజకంగా పరిపాలించారు. కాలానుగుణంగా ఆ పరిపాలనా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ మూలం మాత్రం అట్లాగే వుంది.

20 వ శతాబ్దంలో అటువంటి చాణుక్యుడే మన తెలుగునాట జన్మించి భారతదేశ ఆర్ధికరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొనివచ్చి, అంతర్జాతీయంగా భారతదేశ ఎగుమతుల దిగుమతుల వాణిజ్యవిధానాలలో పెనుమార్పులకు ఆద్యుడయ్యాడు. అతనే తెలుగువాడైన మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రపంచం గుర్తించాకా గానీ భారతీయులు గుర్తించని జాతి వజ్రం! భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు, ప్రపంచ భాషాకోవిదుడిగా పొరుగుదేశాల మన్ననలు పొందిన మన పాములపర్తి వెంకట నరసింహారావు మనందరం గౌరవంగా పిలిచే పి వి నరసింహారావు.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/pv-narasimhaarao/

Posted in August 2020, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!