ప్రభో! ఈ యాంత్రిక ప్రపంచంలో
జన సందోహ విఫణి వీధుల్లో
రేయింబవళ్ళు
మా దోసిళ్ళ
వ్యాపార లాభాలు
జీవన భృతులు నిండిన కొద్దీ
మేమేమి విలువైనది
పొందలేక పోతున్నామో
మానవులం
మాకింకా అర్థం కాలేదేమీ!
మా జీవితాలలో
మధురానంద వాయిద్యాలు మ్రోగినప్పుడు
మాలో సుఖ సంతోషాల నవ్వులు పూచినప్పుడు
నిన్ను మా యింటికి ఆహ్వానించమైతిమేమి?
మా స్వప్నాలలో
భయంకర సత్యాలు కలవరం రేపినప్పుడు
మా జీవితాలలో
అశాంతి బాధావలయాలు అలముకొన్నప్పుడు
మా మానవ పౌరుషాలతో
మా విజ్ఞాన శాస్త్రాలతో
మాకు శాంతి రానప్పుడు
మనశ్శాంతి లేనప్పుడు
మాకొక్క సారిగా గుర్తొస్తావు!
తస్మాత్ జాగ్రత్తని మనసు కొస్తావు
నాకు మాత్రం
ఈ జీవితంలో
నిను కలుసుకునే భాగ్యం కలుగకపోతే
నీ దర్శనానందాన్ని పొందలేకపోతే
ఆ తీరని వాంఛను
నా నుంచి దూరం చేయకు
నన్నొక నిమిషం మరచిపోనీకు
ఆ తీయని తీరని బాధను
నా గుండె పొరలలో విడువక
నన్ను భరించనీ!
నిను వలచుతూనో
వగచుతూనో
ఈ జగతిలో
ఆ ధూళిలో పడి
నిద్రించినప్పుడు
నా స్వాప్నిక జగత్తులో సైతం
నన్నొక నిమిషం మరచిపోనీకు!!!