Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
వరాహస్వామి
శ్లో. శ్వేతక్రోడ మనన్యగర్వితహిరణ్యాక్షాన్తకం భాసురం
   దంష్ట్రోద్ధారితసాగరామ్బర(1)ధరం సప్తాచలాధీశ్వరమ్
   శ్రీనారాయణవాసభూమివరదం శేషాద్రిశృఙ్గే సదా
   వామోత్సఙ్గవిరాజితావనిసతీవీక్షావిలోలం భజే II				                53
      (1) భూమి

శ్రీవరాహనృసింహుఁడు
శ్లో. ఉత్సంగస్థితసింధుజా(1)ప్రియకరద్వంద్వావృతం శ్రీహరిం
   అశ్రాంతశ్రితకామితార్థఫలదం షడ్వైరిసంహారకమ్
   ప్రహ్లాదాభయదం సురారిదమనం భృత్యోగ్రశాపాపహమ్ (2)
   దంష్ట్రాచ్ఛిన్నమహాఘవృక్షనివహం (3) లక్ష్మీనృసింహం భజే II				54	        
     (1) ఒడిలో ఉన్నలక్ష్మి (2) ద్వారపాలకుని ఘోరశాపమును పోగొట్టిన
     (3) ఘోరపాపములనే వృక్షముల సమూహాన్నికోరలతో చీల్చిన

సీ. శ్రీవరాహనృసింహచిన్మయరూపంబుఁ
        గాంచిన కనుదోయి కన్నుదోయి;
   ప్రహ్లాదవరదుని వరగుణంబుల నెంచి
        ప్రస్తుతించి తరించు రసన (1) రసన;	
   చందనలేపితసుందరాకృతికి వం
        దన మొనరించెడి తనువు తనువు;
   హరికథాసారామృతాస్వాదనమ్ముచే
        కృతలక్షణంబులౌ శ్రుతులు (2) శ్రుతులు;

తే.గీ. సింహగిరిఁ దాఁకి ధన్యతఁ జెందు నంఘ్రు (3)
     లంఘ్రు; లా స్వామికరుణాప్త మైన కవిత
     కవిత; దాని రచించెడి కరము కరము;
     చిరతరాశీస్సు లొందెడి శిరము శిరము						                 55
       (1) నాలుక (2) చెవులు (3) పాదములు

ఉ. భక్తుని మాట నిల్పఁగను భాసురమౌ నరసింహరూపమున్
   వ్యక్తము సేసి కంబమున నద్భుతమౌ విధి నుద్భవించి నీ
   శక్తినిఁ జూపి దానవుని శస్త్రము లేకయె సంహరించి ని
   ర్ముక్తునిఁ జేసి తీ దినము మ్రొక్కిన వారిదె భాగ్య మో హరీ!				          56
Posted in May 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!