Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

Gadicharla Harisarvothama Rao

తనను విమర్శించిన హరిసర్వోత్తమ రావును గురించి యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ అన్న మాట: "ది బ్రేవ్ సర్వోత్తమ రావ్". ఈ ఒక్క మాట చాలు అయన వ్యక్తిత్వాన్ని తెలియ జేయటానికి. పత్రికా రంగములో అడుగు పెట్టి నిర్భయముగా, నిర్మొహమాటముగా ఏ స్థాయి వారినైనా విమర్శించిన పత్రికా సంపాదకుడు హరి సర్వోత్తమరావు గారు.  ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు ‘సంపాదకుడు’ అనే తెలుగు పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయనే. అంతే  కాకుండా ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ కూడా ఈయనే. స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా (1936 నుండి జీవితాంతము ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు), తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా వేత్త హరి సర్వోత్తమ రావు గారు.

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 1883 సెప్టెంబర్ 14 న కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు కడప జిల్లా, సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. ఫలితముగా వీరికి నాయకత్వము వహించిన  సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ఆనాటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టి "స్వరాజ్య" అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై ఘాటైన విమర్శనాత్మక సంపాదకీయాలు ప్రచురించేవాడు. 1908లో తిరునెల్వేలిలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించినపుడు క్రూరమైన "విదేశీ పులి” అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ఆగ్రహించిన ప్రభుత్వము ఈయనకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయి వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో బందీగా ఉండి శిక్ష అనుభవించాడు. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఈయనపై ప్రభుత్వ నిఘా ఉండటం వలన ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.

1914లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. 1916 నుండి 1918 వరకు ఆయన ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు. ది నేషనలిస్ట్, మాతృసేవ, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు. మహిళల సమస్యల పరిష్కరం కోసం "సౌందర్యవల్లి" అనే పత్రిక నడిపాడు. మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నాడు. జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాసాడు. ఆ విధముగా పత్రికా రచయితగా, సంపాదకుడిగా, ఆయన విశేషమైన కృషి చేసారు.

పుస్తక రచయితగా స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం, శ్రీరామ చరిత్ర (ఈ పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది). పౌరవిద్య (ఈ పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది), ఆబ్రహాము లింకను చరిత్ర (1907) (ఈ పుస్తకాన్ని కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.), వయోజన విద్య లను రచించారు.

వయోజన విద్య మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ వారు 1941, 1953లలో ముద్రించారు. ఆయన సాహితీ వ్యాసంగం జీవితాంతం కొనసాగింది. వయోజన విద్యా శాఖ డైరెక్టర్ గాను, దక్షిణ భారత వయోజన విద్యా సంఘము అధ్యక్షుడిగా పనిచేశారు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో అప్పటి వరకు దత్తమండలం (Ceded) అని పిలవబడే నేటి రాయల సీమ ప్రాంతానికి చిలుకూరి నారాయణ రావు గారు సూచించిన రాయల సీమ పేరును ఆనాడు ప్రతిపాదించి ఆమోదింప జేసిన వ్యక్తి హరి సర్వోత్తమ రావు గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.

1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. గ్రంధాలయ సర్వస్వము, ఆంధ్ర గ్రంధాలయము పత్రికలకు సంపాదకత్వము వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. 1955లో హైదరాబాద్ లోతెలుగు భాష సమితిని ప్రారంభించాడు. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు పోటీ చేసి అధిక మెజారిటీ తో గెలిచారు. కర్నూల్ జిల్లా మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్య మృగ సంరక్షణ ప్రాంతముగా ప్రకిటించేందుకు గాడిచర్ల కృషి చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.

గాడిచర్ల గురించి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చెప్పిన చిరు కవిత:
"వందేమాతరమనగనే వచ్చి తీరు ఎవని పేరు?
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎవని పేరు?
గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి?
అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?
అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?తన బరువును మోయలేని తనువును
చాలించెనెవడు?
తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?
అందరికెవనితొ పొత్తు - అఖిలాంధ్రంబెవని సొత్తు? ఏస్థాన కవిని నేనో, ఆ
స్థానాధీశుడెవడు?
వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది హరిసర్వోత్తముడాతడు,
ఆంధ్రులపాలిటి దేవుడు"

********

Posted in May 2023, వ్యాసాలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *