సర్వాంతర్యామి!
ఒక రోజు, మధ్యాహ్నవేళ భోజనాలయ్యాక వాలు కుర్చీలో తీరిగ్గా కూర్చున్నాడు సుందరం.
అప్పుడు కృష్ణానంద సుందరం దగ్గరకు వచ్చి, "తాతా! నాకొక సందేహం. నా పేరుకి అర్ధం ఏమిటీ?", అని అడిగాడు.
అందుకు సుందరం నవ్వి, "అది దేవుడి పేరురా!", అన్నాడు.
"దేవుడంటే ఎవరూ?", అడిగాడు కృష్ణానంద.
"ఈ సమస్త సృష్టి ఎవరివల్లనైతే జరిగిందో, ఈ సృష్టిలోని జీవరాసులన్నిటికీ ఎవరైతే ఆధారమో, ఈ లోకాలన్నిటినీ ఎవరైతే నిరాటంకంగా సమర్ధవంతంగా నిరంతరం నడిపిస్తున్నారో, ఆ అద్భుత శక్తినే మనం దేవుడు అని అంటాంరా కృష్ణా!", చెప్పాడు సుందరం.
"ఓహో అలాగా! అయితే తాతా! ఆ దేవుడు ఎక్కడుంటాడూ?", అడిగాడు కృష్ణానంద.
"దేవుడు ఈ సృష్టిలోని అన్ని ప్రాణులలోనూ ఉంటాడు! అందుకే మనం ఎవ్వరినీ బాధ పెట్టకూడదు. చివరికి జంతువులనైనా సరే!", అన్నాడు సుందరం.
"ఓ! అంటే దేవుడు ప్రాణులలో ఉంటాడన్నమాట! మరి మొన్న దసరా పండక్కి నా సైకిల్ కి అమ్మ పూజ చేసింది. ఎందుకని?", అడిగాడు కృష్ణానంద.
"దేవుడు ఒక్క ప్రాణులలోనే కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ ఉంటాడు. ఆయన లేని చోటే లేదు!", చెప్పాడు సుందరం.
అప్పుడు కృష్ణానంద తన చుట్టూ కలియ చూస్తూ, "తాతా! దేవుడు ఏడీ? ఎక్కడున్నాడూ? నాకైతే ఇక్కడెక్కడా కనపడట్లా!", అన్నాడు.
"ఆనందా! నువ్వు ఒక పని చెయ్యరా! బామ్మకి దేవుడంటే భక్తి కదా?! కాబట్టి బామ్మకు ఆ దేవుడు అన్నిచోట్లా కనపడుతూ ఉంటాడు. రేప్పొద్దునే నువ్వు బామ్మతోపాటూ నిద్ర లేచి బామ్మ ఎక్కడెక్కడ ఎవరెవరికి దణ్ణం పెడుతోందో చూడు. ఆ ప్రదేశాలన్నిటిలో నీ కళ్ళకు కనపడకపోయినా దేవుడున్నట్లేరా! దేవుడెక్కడున్నాడో తెలుసుకున్నాక నువ్వు నా దగ్గరకొచ్చి చెప్పు. సరేనా?", అని అన్నాడు.
కృష్ణానందకి తన తాత ఇచ్చిన ఆలోచన నచ్చింది.
మర్నాడు ప్రసూనాంబతోపాటే నిద్ర లేచాడు కృష్ణానంద. ప్రసూనాంబ ముఖం కడుక్కుని కాఫీ తాగి పనులు మొదలుపెట్టింది. తనని గమనిస్తూ కృష్ణానంద తన వెంటే తిరగటం ప్రసూనాంబకి ఎంతో మురిపెంగా అనిపించింది. సుందరం ప్రసూనాంబకి కృష్ణానంద విషయం ముందే చెప్పి ఉంచడంతో ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకునిపోతూ స్నానం ముగించి దేవుడి సన్నిధిలో దీపం వెలిగించింది ప్రసూనాంబ. ప్రసూనాంబ పూజ చేసుకునేటంత సేపూ ఆమె పక్కనే కూర్చున్నాడు కృష్ణానంద. ఆ తర్వాత ప్రసూనాంబ సుందరానికి కావలసినవన్నీ అమర్చి పూలబుట్టను తీసుకుని గుడికి వెళ్లి వచ్చింది. వంట, భోజనం కార్యక్రమాలయ్యాక మీనాక్షితో కలిసి వంటిల్లు సద్ది నడుం వాల్చింది ప్రసూనాంబ.
అప్పుడు కృష్ణానంద సుందరం వద్దకు వెళ్లి, "తాతా! దేవుడెక్కడున్నాడో తెలిసిపోయింది!", అన్నాడు హుషారుగా.
"అరె! అప్పుడే కనిపెట్టేశావా?? ఎక్కడున్నాడేమిటీ దేవుడూ?", కృష్ణానందను నవ్వుతూ అడిగాడు సుందరం.
అప్పుడు కృష్ణానంద కళ్ళు పెద్దవి చేసి, "నువ్వు చెప్పినట్లు నేనీరోజు బామ్మతోపాటూ లేచి, బామ్మ ఎక్కడెక్కడ దణ్ణం పెట్టుకుంటోందో జాగ్రత్తగా గమనించాను. బామ్మ ముందు మనింట్లో ఉన్న దేవుడికి దణ్ణం పెట్టింది. ఆ తర్వాత సూర్యుడికి దణ్ణం పెట్టింది. ఎందుకూ అని అడిగితే, అన్ని ప్రాణులకీ ఆధారం సూర్యుడే కదా అంది! మా స్కూల్లో సైన్స్ టీచర్ కూడా ఒకసారి అదే విషయం చెప్పారు! కాబట్టి సూర్యుడిలో దేవుడున్నాడని తెలుసుకున్నాను. ఆ తర్వాత బామ్మ తులసి మొక్కకు ప్రదక్షిణ చేసి దణ్ణం పెట్టింది. మొక్కల్లో ప్రాణముంటుంది కదా. అంటే వాటిలో కూడా దేవుడున్నాడన్నమాట! అక్కడినుండి గుడికి వెళ్ళినప్పుడు బామ్మ గుళ్లో దేవుడితోపాటుగా అక్కడున్న ఆవులకీ నమస్కారం చేసింది. ఆవులో అన్ని దేవతలూ ఉన్నారని అమ్మ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత బామ్మ గుళ్లోని పూజారి గారికీ, మాకెదురొచ్చిన పెద్దమనుషులందరికీ దణ్ణం పెట్టింది. వారిలోని జ్ఞానం భగవంతుడని చెప్పింది బామ్మ. మేము ఇంటికి వస్తూ ఉంటే నీళ్లు లేకుండా ఏ ప్రాణీ జీవించి ఉండలేదని చెప్పి, మన ఊళ్లోని నదికి కూడా బామ్మ దణ్ణం పెట్టింది. దీనిబట్టి దేవుడు అన్నిచోట్లా ఎలా ఉంటాడో నాకు అర్ధమయ్యింది తాతా!", అన్నాడు.
“మంచిది! చక్కగా తెలుసుకున్నావు ఆనందూ!! మరి నీ సందేహం తేరినట్లేగా?”, కృష్ణానందను మెచ్చుకుంటూ అడిగాడు సుందరం.
"ఓ!", ఆనందంగా సమాధానం ఇచ్చాడు కృష్ణానంద.
వీరి సంభాషణను విన్న ప్రసూనాంబ, “ఒరేయ్ కృష్ణా! విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టే దేవుడిని ‘సర్వాంతర్యామి’ అని అంటారురా! ఆ విషయాన్ని మనము ఎల్లవేళలా గుర్తుంచుకుని, మనవల్ల ఎవ్వరికీ కష్టం కలుగకుండా చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న అందరినీ గౌరవించాలి. జంతువులపట్లా, ఇతర ప్రాణులపట్లా దయ కలిగి ఉండాలి. మన మనుగడకు కారణమైన ప్రకృతికి హాని కలిగించకుండా ఉంటూ, ఆ ప్రకృతిని సంరక్షించే ప్రయత్నం చెయ్యాలి. అసలు ‘ప్రకృతి’ అంటే శ్రీమహాలక్ష్మి స్వరూపమేరా కృష్ణా!", అంటూ, తన ‘మనసు’లోని దేవుడికి భక్తితో దణ్ణం పెట్టుకుంది.