గాంధీజీ ఒక కర్మయోగి. గాంధీ తత్త్వం ఒక జీవన దృక్పథం మరియు జీవన విధానం. దేవుడు కాబాలోనూ లేడు, కాశీలోనూ లేడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ఎవరు భగవంతుడన్న ప్రశ్నకు ఎన్నో సమాధానాలు, నిర్వచనాలు వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన రూపాలు కూడా అనేకం కాబట్టి! అని గాంధీజీ భావం. సత్యమే దైవమన్నది గాంధీజీ నమ్మిక. గాంధీజీ దృష్టిలో సత్యమంటే అసత్యాన్ని ఉచ్ఛరించకుండా ఉండటం కాదు, సత్యమంటే వాస్తవికమైనది, ఈ విశ్వానికంతటికీ మార్పులేని పునాది. సత్యసంధత అంటే ఆలోచనకు, వాక్కుకు మరియు చర్యకు మధ్య కచ్చితమైన సమన్వయం ఉండటం.
ప్రజా పోరాటాలకు గాంధీజీ నిర్మించుకున్న ఆయుధం సత్యాగ్రహం. యుద్ధానికి, సత్యాగ్రహానికి చాలా తేడా ఉంది. సత్యాగ్రహంతో ప్రత్యర్థిని కాదు, వారిలోని దుర్మార్గాన్ని మాత్రమే మట్టుబెడతారు. సత్యాగ్రహి అహింసామార్గంలో, తాను సత్యమని నమ్మిన సిద్ధాంతంపై తీవ్రమైన పట్టుదల, దీక్షతో, లక్ష్య సాధనలో నిమగ్నమవుతాడు. గాంధీజీ దృష్టిలో అహింస అంటే కేవలం 'హింస కానిది' మాత్రమే కాదు. ఆయన దృష్టిలో అహింస అంటే కరుణ, ప్రేమతో కూడిన అవ్యాజమైన మానవ భావన. మనస్సే అహింసకు పీఠం.
గాంధీజీ దృష్టి లో సర్వమతాల సారం ఒక్కటే. అన్ని మతాలూ దైవదత్తమైనవే. ఏయే జాతుల వారి కోసం, ఏయే మతాలు పుట్టాయో, వారికి సంబంధించినంత వరకు అవి సత్యమైనవి, అవసరమైనవని ఆయన విశ్వసించారు. ఒక యూదు మహిళ, గాంధీజీని కలిసినపుడు, తాను హిందూమతాన్ని స్వీకరించాలనుకుంటున్నట్లు తెలియజేసింది. గాంధీజీ వద్దని వారిస్తూ, నీవు నీ మతం ద్వారా దేవుణ్ణి దర్శించలేకపోతే, వేరే మతం ద్వారానూ దర్శించలేవు అని అన్నారు. అలానే జీవాత్మ పరమాత్మను చేరటానికి కోరే కోరికే ప్రార్ధన అని గాంధీజీ అభిప్రాయం. సాధుత్వం, నిశ్చలత్వం అలవడటానికి ప్రార్ధన ఉద్దేశించబడిందని, నిత్యం ప్రార్ధించేవాడికి ప్రశాంత చిత్తం అలవడుతుందని గాంధీజీ నిరూపించారు. సర్వభూతహితత్వాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరటం ఉత్తమోత్తమమైన ప్రార్ధన అని, భగవంతుడు తమతోనే నివసిస్తున్నాడనుకునే వారు చేసే ప్రతి పనీ ప్రార్ధనే అవుతుందని గాంధీజీ భావం. ప్రార్థనకు రామ శబ్దోచ్చారణను, భగవద్గీత పఠనాన్ని, పూర్వకాలం నుండీ ఉన్న మంత్రాలను, శ్లోకాలను గాంధీజీ సూచించారు.
రాజకీయంగా గాంధీజీ కేంద్రీకరణలో ప్రజాస్వామ్యం ఉండదని, గ్రామ స్థాయిలో పంచాయతీలు అధికార కేంద్రంగా పరిపాలన సాగాలని భావించారు. గాంధీజీ పార్టీల స్వామ్యం కాకుండా అసలైన ప్రజాస్వామ్యం నెలకొనాలని అభిలషించారు. ప్రజలు ప్రజాస్వామీకరించబడ్డప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
మనుషులు ప్రజాస్వామీకరించబడాలంటే ఆధునిక మనిషికి మూడు లక్షణాలు ఉండాలని గాంధీజీ ప్రతిపాదించారు:-
- సంపద పట్ల దురాశ లేకపోవడం,
- స్వచ్చందంగా జీవితాన్ని సరళంగా ఉంచుకోవడం. అంటే, సంక్లిష్ట జీవితానికి బానిసగా మారకపోవడం,
- జీవితాన్ని నెమ్మదింపజేసుకోవడం. అంటే, జీవనమార్గంలో కనిపించే వారిని పట్టించుకోవడం.
గాంధీజీ ఆర్ధిక సిద్ధాంతాలు సర్వోదయం మరియు స్వదేశీ. గాంధీజీ దృష్టిలో ఆర్ధిక సమానత్వమంటే ప్రపంచంలోని వస్తువుల్ని ప్రజలందరూ సమానంగా పంచుకోవాలని అర్ధం కాదు. ప్రతి ఒక్కరికీ ఇల్లు, తినడానికి సరిపడా సమతుల్య ఆహారం, కట్టుకోవడానికి ఇంత ఖద్దరు బట్ట ఉండాలని దాని అర్ధం. ప్రతి ఒక్కరూ అక్షరాలా ఒకే మొత్తాన్ని కలిగి ఉండాలనేదే ఆర్ధిక సమానత్వమని గాంధీజీ ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరికీ తమ అవసరాలకు సరిపడా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న వస్తు సేవల్ని కాకుండా, తమ చుట్టు ప్రక్కల ఉండే సేవల్ని ఉపయోగించడమే స్వదేశీ. గాంధీజీ స్వదేశీ అత్యావశ్యకమని, అందరూ మనసారా ఈ పద్దతిని అనుసరించాలని కోరారు. ఇండియాలో లభ్యం కాని వస్తువుల్ని వాడటం మానివేసి, స్వదేశీ ఉత్పత్తుల్ని, వృత్తి నిపుణుల్ని ప్రోత్సహించమని గాంధీజీ సూచన.
అలానే 1921లో ఆంధ్ర ప్రాంత పర్యటనకు వచ్చిన గాంధీజీ ఏప్రిల్ 6న గుడివాడ పట్టణంలో చేసిన ప్రసంగంలో అంటరానితనం తన దృష్టిలో ఎంత పాపమో విశదీకరించారు.
"తోటి మానవులను అంటరానివారిగా చూడడం కంటే మహాపాతకం, దైవ ద్రోహం మరోటి ఉండదు. నేను సనాతన ధర్మానుష్టానపరుడినే. హిందూ ధర్మ శాస్త్రాలను కొంత వరకూ పరిశోధించిన వాడిని కూడా. కానీ మానవుడిని అస్పృశ్యుడిగా చూడమని ఎక్కడా విధించి లేదు. మత ధర్మాల పేరుతో జరిగే మహా దుష్టకార్యాలన్నిటినీ సమర్ధించటానికి ఏ మూలనో ఒక శ్లోకాన్ని వెదికి పట్టుకోవడం మనకు ఆచారమైపోయింది. ఇది సమర్ధనీయం కాదు. చిన్నతనంలో సంస్కృతం చదువుకునేటప్పుడు ఓ చిన్న శ్లోకాన్ని బోధించారు. అందులో గోమాంస భక్షణ ప్రస్తావన ఉంది. అంత మాత్రాన అది హిందూ మతసమ్మతమని ఎవరు చెప్పగలరు? అహంకారపూరితమైన అస్పృశ్యతా పాపం చేస్తున్న అగ్రకులంలో పుట్టడం కంటే రోగిష్ఠిగా పుట్టడానికే నేను ఇష్టపడతాను. మోక్షం సిద్ధించటానికి మరో జన్మ ఎత్తాలంటే నన్ను పంచమునిగానే పుట్టించమని భగవానుడిని ప్రార్దిస్తా."
గాంధీజీ స్వరాజ్య సంగ్రామానికి స్వదేశీ ఉద్యమం గుండెకాయ అని నమ్మి దానికి రాట్నాన్ని చిహ్నంగా స్వీకరించారు. ఖద్దరు ధరించటాన్ని ఉన్నత ఆదర్శంగా మార్చారు. గాంధీజీ దృష్టిలో ఖాదీ స్ఫూర్తి అంటే అనంతమైన సహనం, అపారమైన ఓర్పు. రాట్నం వడికే వారు ఎంత సహనంతో, మగ్గం నేసేవారు ఎంత ఓర్పుతో పని చేస్తారో అవగాహన చేసుకుని, అదే స్ఫూర్తిని దేశంలోని కోట్లాది ప్రజల్లో నింపగలిగితే, భారత భూమి అద్భుతంగా అలరారుతుందని గాంధీజీ బలంగా నమ్మారు.
గాంధీజీ మానవుడి సమగ్ర వికాసానికి ఏడు రకాల పాపాలు ఆటంకం కలిగిస్తాయని ఉద్భోధించారు :
౧. విలువలు లేని రాజకీయాలు
౨.పని చెయ్యకుండా లభించే ఆస్తులు
౩.అంతరాత్మ ఒప్పుకోని విలాసాలు
౪.వ్యక్తిత్వాన్నివ్వని జ్ఞానము
౫.నైతిక విలువలు లోపించిన వ్యాపారము
౬.త్యాగం లేని మతము
౭.మానవత్వానికి ప్రాముఖ్యతనివ్వని మతము
అన్నిటికంటే ముఖ్యంగా, గాంధీజీ తత్వాన్ని, ఆయన రచనలను చదివి అర్ధంచేసుకునాలనుకునే వారు, ఏప్రిల్ 29, 1933న హరిజన్ పత్రికలో గాంధీజీ తన రచనల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాన్ని తప్పక చదవాలి. To The Reader పేరిట ఉన్న ఆ రచనను ఆంగ్లంలోనే గాంధీజీ మాటల్లోనే క్రింద ఉటంకిస్తున్నాను:
“I would like to say to the diligent reader of my writings and to the others who are interested in them that I am not at all concerned with appearing to be consistent. In my search after truth I have discarded many ideas and learnt many new things. Old as I am in age, I have no feeling that I have ceased to grow inwardly or that my growth will stop at the dissolution of flesh. What I am concerned with is my readiness to obey the call of truth, my god, from moment to moment, and therefore, when anybody finds any inconsistency, between any two writings of mine, if he has still faith in my sanity, he would do well to choose the later of the two on the same subject”.
గాంధీ తత్వాన్ని స్థూలంగా ఒకే వాక్యంలో కూర్చి చెప్పాలంటే:
"ఉన్నతంగా ఆలోచించడం, సాధారణ జీవితం గడపడం".