రసాంకురాలు కారము కోరగ నోరూరగఁ
నూరి కోరిక తీరగ ఆస్వాదించునదే పచ్చడి భోజనం
కాంచిన తక్షణమే తీవ్ర బుభుక్ష కలుగగ
భుజించునదే జనరంజక తెలుగు సవ్యంజనం
ఒకటా రెండా రుచికర తెలంగాణ తొక్కులు
బండెడైనా రుచించు సీమ ఊరుబిండిలు
రారాజులూ దిగివచ్చు తినగ ఆంధ్రా ఊరగాయలు
మహారాజులూ ఎగబడు బండ పచ్చడి మెతుకులు
లేనివాడి ఇంట ప్రతిపూట ఇదే పసందైన విందు
కానీ కలవాడూ ఎంగిలి పడగ ఉండు ఇదే ముందు
తెనుగు ఠీవి పీవీ అంగిలికి చింతకాయ మహా ప్రియం
తెలుగు ధ్వజములు మన మాగాయావకాయ ద్వయం
రుచి చెడిన నోటికి పచ్చడిని మించి లేదు వేరేదీ సాటి
తెలుగు వేడుకలన్నింటిలోనూ పచ్చడి వాడుక పరిపాటి
వంకాయ, అల్లం, పండుమిరప, ఉసిరి, కొబ్బరి పచ్చడులు
చవిచూచిన వారికవి అదుపు తప్పిన మది గిచ్చుడులు
ఏమాటకామాట తక్కువేమీ కావు దోస, ఉల్లి, టమాటా
ఉగాదిపచ్చడి లేక పండుగనేది ఉండునా తెలుగునాట
కమ్మని రోటి పచ్చడనిన పుదీనా, కొత్తిమిర, కరివేపాకు
పోటీ ఎరుగని వంటకం పచ్చడొక్కటి చాలుగా మనకు
అన్నము తోడ కంది, పెసర, మినుముల చింతపండు
ఘృతము కలిపి తినిన ఆ అమృతస్వాదము భలేగుండు
తెలుగువారి సొత్తుగ ఆంధ్రమాతది వీడని సాంగత్యం
పచ్చడి గొప్పతనము ఒక్క తెలుగు రసనకే విదితం!