గాన గంధర్వుడు "ఘంటసాల వెంకటేశ్వరరావు"
వందేళ్ల క్రితము గాంధర్వ లోకాలనుండి భూమి మీదకు దిగి వచ్చి సినిమా పాటల తోటలో విరబూసిన పసిడి పంట ఘంటసాల వెంకటేశ్వర రావు గారు. తెలుగు వీర లేవరా వంటి విప్లవ గీతాలు, ఏడుకొండలస్వామి ఎక్కడున్నావయ్యా వంటి భక్తి గీతాలు, జగమే మాయ వంటి విషాద గీతాలు, చిటపట చినుకులు పడుతూ ఉంటె వంటి శృంగార గీతాలు, కరుణశ్రీ గారి పుష్పవిలాపము, భగవద్గీత వంటి గీతాలు అనేకము సందార్భాను సారముగా రాగయుక్తముగా భావ యుతముగా పాడి తెలుగు వారి మదిలో శాశ్వత స్థానాన్ని పొందిన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు. ఎన్ టి రామారావు, అక్కినేని వంటి అగ్రహీరోలకు తన పాటలతో గుర్తింపు తెచ్చిన గాయకుడు ఘంటసాల. తెలుగు పద్యాలకు సినిమాలలో గుర్తింపు తెచ్చిన ఘనత కూడా ఘంటసాలదే. సందర్భానుసారంగా తెలుగు సగటు ప్రేక్షకుడు పాడుకోవటానికి వీలుగా ఎన్నో పాటలు పాడిన వ్యక్తి ఘంటసాల. తెలుగు జాతి ఉన్నంతకాలము ఈ పాటలు, ఆయన స్వరము ప్రతి ఒక్కరి చెవులలో మారు మ్రోగుతూ ఉంటాయి. ఖంగుమని మోగే అయన గళము వినని తెలుగు వారు లేరనే చెప్పవచ్చు. జీవించినన్నాళ్లు సంగీతము పాడాలని, పాడినన్నాళ్లు జీవించాలని ఘంటసాల అంటూ ఉండేవారట. తాను జీవించింది సంగీతము కోసమే అని నిరూపించుకున్న మహానుభావుడు ఘంటసాల, మూడు దశాబ్దాల పాటు 13 వేలకు పైగా పాటలు పాడి సంగీతాభిమానులను ఓలలాడించిన గాన గంధర్వుడు.
ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు తండ్రి మరణానంతరము ఘంటసాల మేనమామ పిచ్చయ్య సంరక్షణలో పెరిగాడు. తండ్రి కోర్కె ప్రకారము ఎలాగైనా సంగీతము నేర్చుకోవాలని పట్టుదలతో తన చేతి ఉంగరాన్ని ఇంట్లో తెలియకుండా అమ్మి విజయనగరం చేరాడు. అక్కడ పట్రాయని సీతారామ శాస్త్రి గారి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణ సంగీతాధ్యాయనము చేసాడు. జన్మతః వచ్చిన గంభీరమైన స్వరం, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాయి. ఆ విధముగా ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో, సంగీత దర్శకులలో ఒకరుగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
మొదట్లో సంగీత గురుకులాల్లో చేరి అక్కడి కట్టుబాట్లకు తట్టుకోలేక వెనక్కు వచ్చేసాడు. ఒకసారి సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీ పడి నవ్వులపాలు అయినాడు. అప్పటి నుండి పట్టుదల పెరిగి సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతము నేర్చుకున్నాడు. విజయనగరం వచ్చి సంగీత కళాశాల్లో చేరి వారాలు చేస్తూ సంగీతము నేర్చుకొనేవాడు. కొన్ని కారణాల వల్ల గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. అప్పుడు ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చు కొనేవాడు. ఆ విధముగా చాలా కష్టాలకు ఓర్చి గురువు గారి శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసి కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు.
స్వాతంత్రపోరాటంలో భాగముగా ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొని 16 మాసాలు అలీపూర్ జైల్లో జైలు శిక్ష అనుభవించాడు. తన శ్రావ్యమైన స్వరముతో దేశభక్తి గీతాలను పాడుతూ ప్రజలలో దేశభక్తిని పురిగొల్పుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించేవాడు. ఈయన పాటలు విన్న హరికధ పితామహుడు అదిభట్ల నారాయణ దాసు గారు తంబురాను ఈయనకు బహుమతిగాఇచ్చాడు. సంగీత విద్యలోనే కాకుండా నాటకాలలో కూడ స్థానము సంపాదించారు. ఆనాటి ప్రముఖ రంగస్థల కళాళారులైన సూరిబాబు, పులిపాటి వంటి వారితో కలిసి పలు నాటక ప్రదర్శనలు కూడ ఇచ్చారు. మొదట్లో ఘంటసాల స్వరము సినీ గీతాలకు పనికి రాదనీ సినీ సంగీత దర్శకులు కొంతమంది ఘంటసాలను నిరాకరించారు. 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. 1944 లో ప్రముఖ చలన చిత్ర నిర్మాత బి ఎన్ రెడ్డి గారు సుమంగళి చిత్రము ద్వారా ఆయనకు చలన చిత్ర రంగ ప్రవేశము కల్పించారు. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డ క్రమముగా చిత్ర సీమలో నిలదొక్కుకొని అయన స్వరానికి సంగీత పరిజ్ఞానానికి ఎదురు లేదు అని నిరూపించుకున్నారు. అనేక చిత్రాలకు పాటలు పాడుతూ సంగీత దర్శకత్వము వహిస్తూ సొంత ఊరు, పరోపకారం, భక్త రఘునాధ్ వంటి చిత్రాలను కూడా నిర్మించాడు.
1951లో పాతాళభైరవి, తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు, 1953లో వచ్చిన దేవదాసు,1955లో విడుదలైన అనార్కలి చిత్రం, 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయినాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేష శైలావాస శ్రీ వేంకటేశా పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే. ఏనోట విన్నా అతను పాడిన పాటలే. ఆ విధముగా ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది తెలుగు సినీచరిత్రలో అయన పాడిన పాటలు అగ్రతాంబూలం అందుకున్నాయి.
చిన్న పెద్దా అందరిని బాబు అని పలకరిస్తూ అందరి చేత మాష్టారు అని పిలిపించుకోవటం అయన వ్యక్తిత్వానికి నిదర్శనము తనను కష్టకాలం ఆదుకున్న ఎవరిని మరచిపోకుండా వారి గురించి నలుగురిలో ప్రస్తావించేవారు "నాడు ఏ తల్లి మొదటి కబళము నా జోలిలో వేసిందో ఆమె భిక్ష నాకు అష్ట ఐశ్వర్యాలను తెచ్చి పెట్టింది"అని చెప్పుకొనేవాడు. అలాగే తనకు సంగీతము నేర్పిన గురువుగారి కొడుకును తన దగ్గర ఉంచుకొని ఆదరించేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే వారికి భోజన సదుపాయాలు చూసేవాడు తన దగ్గరకు వచ్చే యువతి యువకులను బాగా చదువుకోమని సలహా ఇస్తూ ఉండేవాడు. కులమత భేదాలు పట్టింపులు ఎక్కువగా ఉండే ఆరోజుల్లో హిందుస్తానీ విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీ బృందానికి తన ఇంట్లో వసతి ఏర్పాటు చేసి వారితో సహపంక్తి భోజనాలు చెసిన మహనీయుడు ఘంటసాల. బడేగులాం ఆలీ గారు ఘంటసాల శ్రీమతి గారిని 'బడే బహూ' అని పిలిచేవారు. జాషువా తానూ వ్రాసిన పద్యాలను ఘంటసాల తో పాడించటానికి ఆయనను అడగటానికి ఘంటసాల ఇంటికి వచ్చి బయటే నుంచున్నాడుట. ఘంటసాల సాదరముగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకువెళ్లాడు.
ఘంటసాలది అమోఘమైన వాక్కు. దాసరి నారాయణ రావును మంచి దర్శకుడివి అవుతావు అంటే అన్నట్టుగానే ఆయన ప్రముఖ దర్శకుడు అయినాడు అలాగే తన తరువాత ఎవరు అని అడిగితే ఎస్.పి. బాల సుబ్రమణ్యం అని చెప్పేవారు. అలాగే చిత్తూరులో ఒక కుర్రవాడిని బాగా చదువుకో కలెక్టర్ అవుతావని దీవించాడు. అన్నట్టుగానే ఆ కుర్రవాడు కలెక్టర్ అయినాడు ఆ వ్యక్తి, కె చంద్రమౌళి గారు. తోటి గాయకులను ప్రోత్సహిస్తూ నిర్మాతలకు సిఫార్స్ చేసేవారు."సినిమాకు చేసే సంగీతము జనము కోసము తప్ప మన ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకోవటానికి కాదు అని నిరూపించి నాకు ఒక దారి చూపించిన గురువు ఘంటసాల"అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఘంటసాలను పొగిడేవారు.
మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను అన్నా అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.
ఘంటసాల జీవిత చరిత్ర ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా వచ్చింది. దీనికి ఆయన అభిమాని సి.హెచ్ రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో గాయకుడు కృష్ణచైతన్య, అతని భార్య మృదుల జంటగా నటించారు. కానీ ఈ చిత్రం ఘంటసాల కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదు.
మొదట్లో ఘంటసాల గారు వరుసలు కూర్చిన పాటలు పక్కా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నాయి. ఆ తరువాత నెమ్మదిగా లలిత లలితంగా తనదైన బాణిలో పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఆయన ఒక్క త్యాగారాజ కృతిని కూడా సినిమాల్లో పాడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా నిర్మాతలకు, దర్శకులకు ఆయనచేత ఆ కృతులను పాడించే అవకాశం దొరకలేదేమో! అయితే ఘంటసాల గారు తన తృష్ణను అమెరికా పర్యటనలో ఉండగా 'మరుగేలరా రాఘవా!' అనే త్యాగరాజ కృతిని పాడి తీర్చుకున్నారు. ఘంటసాల గాయకుడు, సంగీత దర్శకుడు మాత్రమే కాదు, చక్కని రచయిత కూడా! స్వీయ రచనలో ఆయన పాడిన ప్రైవేటు గీతం 'బహుదూరపు బాటసారి' విపరీతమైన ప్రజాదరణ పొందటమే కాకుండా నేటికీ సంగీత ప్రియులను అలరిస్తుంది. అమెరికా పర్యటను విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత తన అనుభవాలను 'భువన విజయం' పేరిట ఒక గ్రంధంగా వెలువరించారు. సముద్రాల గారికి అతి సన్నిహితుడైన శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో వీరికి కూడా సాన్నిహిత్యం ఉండేది. నాటకాల పద్యాల వరవడికి అలవాటుపడ్డ తెలుగు ప్రజలకు, తన పద్య గానంతో ఆకట్టుకున్నారు ఘంటసాల. లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల మొదలైన సినిమాలలో ఆయన పాడిన పద్యాలు ఆయా పాత్రలు పోషించిన వ్యక్తుల పాత్రలను elevate చేసాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం,కుంతీ కుమారి ... మొదలైన గీతాలను పాడి వాటికి ప్రాణం పోసారు. అలాగే శ్రీ జాషువా గారు వ్రాసిన శిశువు(పాపాయి) అనే గీతాన్ని భావగర్భితంగా పాడి సంగీత సాహిత్యప్రియులను ఓలలాడించారు. సింతసిగురు సిన్నదానా లాంటి జానపదగీతాలను కూడా చక్కగా పాడారు. వీరికి వెంకటేశ్వరస్వామి వారంటే విపరీతమైన భక్తి. వెంకటేశ్వరస్వామి వారి మీద అనేక ప్రైవేటు గీతాలను పాడారు. ఒకసారి జాషువా గారు ఘంటసాల వారి ఇంటికి వచ్చారు.ఆయన వ్రాసిన 'శిశువు' అనే పద్యం ఘంటసాల గారికి బాగా నచ్చింది.దాన్ని పాడటానికి, జాషువా గారి సహాయం కోరారు. జాషువా గారు వచ్చి, ఘంటసాల వారి ఇంటిబయట ఒక అరుగు మీద కూర్చున్నారు. అది చూసి ఘంటసాల గారు విస్మయం చెందారు. "నేను అంటరాని వాడినిగా! అందుకే మీ ఇంట్లోకి రాలేదు!" అని జాషువా గారు అనగానే ఘంటసాల గారి కళ్ళంబడి నీళ్ళు జలజలా కారాయి.అప్పుడు ఘంటసాల వారు జాషువా గారితో - మీరు అంటరాని వారైతే, సరస్వతీదేవి కూడా అంటరానిదే! అని నచ్చచెప్పి, ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళారు.
1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. 1970లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు.
ఎందరో సంగీతాభిమానులను తన సంగీతము, పాటలతో ఓలలాడించిన ఘంటసాల గళము 1974లో ఫిబ్రవరి 11న శాశ్వతముగా మూగ బోయింది. మనిషి భౌతికముగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాటల ద్వారా, సంగీతము ద్వారా తెలుగువాడి మదిలో నిత్యము మెదిలే అమరగాయకుడు ఘంటసాల. ఆయన పొందిన సన్మానాలు సత్కారాలు అనేకము. పద్మశ్రీ బిరుదు మరియు ఆయన గౌరవార్థము భారత ప్రభుత్వము పోస్టల్ స్టాంప్స్ విడుదల చేసింది. ఆయన పేరుతొ ప్రభుత్వ సంగీత కళాశాలను విజయవాడలో నెలకొల్పారు.
తెలుగువారికి చాలామంది వాగ్గేయకారులు ఉన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, బాలమురళీకృష్ణ...కానీ ఘంటసాల లాంటి గాయకుడు మళ్లీ పుట్టడేమో? ఘంటసాలకు సాటి ఘంటసాలే! ఘంటసాలకు మరణం లేదు, ఆయన చిరంజీవి!