4. వెంకట లక్ష్మీ గాయత్రి రేగులగడ్డ
అంశం: మొదలు మేమిస్తా ముగింపు మీరివ్వండి; శీర్షిక: అడవిలో అక్క
డ్రైవర్ బస్సు ఆపేసాడు. బస్ అద్దాలన్నీ మూసుకుని సీట్లలో నుంచి కిందికి జరిగి కూర్చోమన్నాడు. బస్ లో జనాలు కొందరు నిద్ర లోనించి లేచి ఏమయ్యింది? అని పెద్ద గొంతుతో అడగసాగారు. నోరు తెరవకుండా కింద కూర్చోండి అని డ్రైవర్ సీటులోనుంచి డ్రైవర్ కూడా నెమ్మదిగా సీటులోంచి కిందకి జారాడు. బయట కాల్పుల శబ్దం పెరిగింది. అరణికి తన బాల్యంలో జరిగిన తుపాకుల గూడెం బస్సు పేలుడు ఘటన గుర్తుకు వచ్చింది.
'ఆ రోజు తుపాకుల గూడెంలో సంత ముగించుకుని ఏటూరునాగారం పోవడానికి తన తల్లితండ్రి ఆర్.టి.సి. బస్సు ఎక్కారు. అప్పటికి తను చిన్న పిల్ల. ఆ రోజు బస్ లో పోలీసులు వస్తున్నారని అన్నలకు కబురు అందింది. వాళ్ళు పోలీసులని చంపడానికి మందు పాతర ఏర్పాటు చేసారు. ఆరోజు పోలీసులు ఎక్కిన బస్సు ఏ కారణం చేతో వెనక బయలుదేరింది. వాళ్ళు అమర్చిన మందు పాతర పేలి ముందు బస్సులో ఉన్న సామాన్య ప్రయాణీకులు చచ్చిపోయారు. ఆ చచ్చి పోయిన వాళ్ళలో తన తండ్రి ఉన్నాడు. తన తల్లి, తను బయట పడ్డారు. అప్పట్నించి తన తల్లి తనని కష్టపడి పెంచింది. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం వచ్చి తిరిగి హైదరాబాద్ కు తను బయలుదేరుతుంటే...ఆఖరి బస్సు లో వెళ్ళు బిడ్డా! అంది అమ్మ. ములుగు దాటే లోపే బస్సు సడన్ బ్రేకు పడితే ఏదో అడవి జంతువు అడ్డు వచ్చింది అనుకున్నా. ఇప్పుడు ఈ పేలుళ్లు ఏమిటి. అన్నలు దాదాపుగా ఒక దశాబ్ద కాలంలో ఏరివేయబడ్డారు కదా. ఇప్పుడు వారి కదలికలు మహా అయితే ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పేలుళ్లు ఏమిటి?' అని మనసులో అనుకుంది అరణి.
కాసేపటి తరువాత పేలుళ్ల శబ్దం ఆగింది. బస్ తలుపు ఎవరో తట్టారు. కండక్టర్ బస్సులో లైట్ వేశాడు. నెమ్మదిగా డోర్ తీశాడు. బయట కొందరు పోలీసులు గాయాలు తగిలి ఉన్నారు. వీరిని లోపలకి ఎక్కించి ముందు ఆస్పత్రికి చేర్చు అని ఎస్. ఐ. చెప్పాడు డ్రైవర్ తో.
వారిని బస్సులో ఎక్కించుకున్నాక బస్సు కదిలింది. "మీలో ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ చేయగలరా! మా కానిస్టేబుల్ కి ఒకాయనకి రక్తం బాగా పోతోంది" అని అడిగాడు ఒక కానిస్టేబుల్ బస్ లో పాసింజర్లను. తను ఒక నర్స్ ని అని, తను సాయం చేయగలను అనీ చెప్పింది అరణి. బస్సును ఒక టీకొట్టు పక్కన ఆపించి వేడినీళ్లు తీసుకుని అందులో కత్తెర బాగా ముంచి దానిని ఆల్కహాల్ లో ముంచి కానిస్టేబుల్ భుజం లో దిగబడిన గుండును బయటకి తీసేసి బస్సులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లోంచి గాజు గుడ్డ, కాటన్ తీసి కానిస్టేబుల్ చేతికి గట్టిగా కట్టు కట్టింది. మిగతా వారికి కూడా కొంతవరకు వైద్య సహాయం అందించింది. ఈ లోపు అడవిలో ఏమయ్యింది అని బస్ లో ఉన్నవాళ్ళు కానిస్టేబుళ్లను అడిగారు. టేకు స్మగ్లింగ్ అవుతోందని తెలిసి తాము పట్టుకుందికి వచ్చామని ... ఆ ముఠా తమపై కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో తమకి గాయాలు అయ్యాయని చెప్పాడు కానిస్టేబులు. కాల్పులు జరుపుతూ లారీ దిగి దుండగులు పారిపోయారని తమ వాళ్లలో కొందరు అక్కడే ఉన్నారని ఒక కానిస్టేబుల్ చెప్పాడు. బస్ హన్మకొండకు చేరుకునే సరికి అంబులెన్స్ వచ్చి క్షతగాత్రులను తీసుకుని వెళ్ళింది. అరణి మొత్తానికి క్షేమంగా హైదరాబాద్ చేరుకుంది. మరునాడు పేపర్లలో *అడవిలో అరణి సహాయం* అన్న శీర్షికన జరిగిన సంఘటన రాసారు. తరువాత అరణికి ప్రయాణం అంటే భయం పోయింది.